పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సహకాలు..
Ens Balu
2
Anantapur
2020-09-25 21:00:27
అనంతపురం జిల్లాలో వివిధ రంగాల్లోని పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతుభరోసా) నిశాంత్ కుమార్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై పలు నిర్ణయాలను ఆమోదించారు. ఈ సందర్భంగా పారిశ్రామిక అభివృద్ధి పథకం (2015 -2020) 31 -3 -2020 నాటికి ముగిసినందున కొత్త ఐ.డి.పి ద్వారా పరిశ్రమల స్థాపనకు సంబంధించి 2020-23 సంవత్సరంలో ఇవ్వబోయే రాయితీల గురించి జాయింట్ కలెక్టర్ అధికారులతో చర్చించారు. అలాగే జిల్లా వ్యాప్తంగా నూతనంగా పరిశ్రమలకు అనుమతులకు సంబంధించి పలు అంశాలపై సమీక్షించారు. ముఖ్యంగా డా. వైఎస్ఆర్ నవోదయం పథకం( ఓ టి ఆర్ )మరియు పిఎంఈజి పి తదితర పథకాలపై చర్చించారు. అనంతరం ఐ డి పి 2015-20 పాలసీలో 81 యూనిట్లు, 114 క్లైమ్ లకు గాను రూ.6 కోట్ల 95 లక్షలు మంజూరు కొరకు నిర్ణయించి కమిటీ ఆమోదించింది. అలాగే నియమ నిబంధనల ప్రకారం సరైన డాక్యుమెంటేషన్ లేని కారణంగా 36 క్లెయిమ్ లకు సంబంధించి 1 కోటి రూపాయలు విలువ కలిగిన 36 యూనిట్లను తిరస్కరించారు. కోవిడ్- 19 నేపథ్యంలో లాక్ డౌన్ తర్వాత పరిశ్రమలను తిరిగి ప్రారంభించడం కొరకు ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించి చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించిన 844 యూనిట్లకు రూ .13 కోట్ల 36 లక్షల రూపాయలను మంజూరు చేయడానికి తదుపరి చర్యల నిమిత్తం ప్రభుత్వానికి సిఫారస్ చేసేలా కమిటీ నిర్ణయించి ఆమోదించింది. సమగ్ర పరిశ్రమ సర్వేలో కమిటీలోని సభ్యులు అందరూ సమన్వయ సహకారాలతో 2020,అక్టోబర్ 15 వ తేదీలోగా సర్వేను పూర్తి చేయాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.
ప్రస్తుతం ఉన్న జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ పేరును జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ గా మార్పు చేసినట్లు జెసి తెలిపారు. భవిష్యత్ లో ఎగుమతులకు సంబంధించి ప్రభుత్వం కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జెసి (ఆసరా మరియు సంక్షేమం) గంగాధర గౌడ్, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సుదర్శన్ బాబు, ఉపసంచాలకులు నాగరాజారావు, ట్రాన్స్ కో ఎస్ ఈ వరకుమార్, ఏడి అన్వర్ ఉల్లా, ఐపీఓ ప్రవీణ్ కుమార్, ఎల్ డిఎం మోహన మురళి, అగ్నిమాపక శాఖ అధికారి శరత్ బాబు, తదితరులు పాల్గొన్నారు.