1 ENS Live Breaking News

ప్రజలను చైతన్య పరిచే ఫోర్త్ ఎస్టేట్ ను పట్టించుకునే నాధుడేడి..?!

ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోతే.. జర్నలిస్టులు.. మీడియాకి మన బాధలు చెప్పుకుంటేనైనా అపుడుగాని ఎవరూ దారిలోకి రారు..అని ఎంతో దైర్యంతో, నమ్మకంతో  మీడియా దగ్గరకి వస్తారు ప్రజలు.. తాము అధికారంలో ఉండగా చేసిన పనులు ప్రజలకి తెలియాలన్నా కూడా అదే ప్రజాప్రతినిధులు కూడా మీడియా ద్వారా ప్రచారం పొందుతారు.. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చేసే సంక్షేమ కార్యక్రమాలు అన్ని వార్గాలకు తెలియజేయాలన్నా ప్రభుత్వాల గొప్ప తెలియాలన్నా కూడా మీడియా, జర్నలిస్టులే అవసరం. అలాంటి మీడియాలో పనిచేసే జర్నలిస్టుల భవిష్యత్తు ఇపుడు ప్రశ్నార్ధకం అయ్యింది. అన్నివర్గాలకు అవసరాలను, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ల జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించుకోవడంలో అత్యంత దారుణంగా విఫలం అవుతున్నారు. సాధారణ ప్రజల కంటే దారుణంగా వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చుట్టూ అర్జీలు పట్టుకొని తిరుగుతున్నా నేటికీ జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. 

ఒకప్పుడు జర్నలిస్టు అంటే ఎంతో రాజభోగం, కానీ నేడు పరిస్థితి పూర్తిగా పోయింది. సాంకేతిక విప్లవం తీసుకొచ్చిన టెక్నాలజీ, సోషల్ మీడియా జర్నలిస్టుల భవితవ్యాన్ని త్రిశంఖు స్వర్గంలో పడేశాయి. ఇపుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి మీడియా కంటే సోషల్ మీడియా అంటనే మక్కువ పెరిగిపోయింది. దానితో జర్నలిస్టులు, వారి సమస్యలను పరిష్కరించడాన్ని ప్రభుత్వాలు లైట్ తీసుకుంటున్నాయి. ఒకప్పుడు ఏదైనా మీడియాలో పనిచేసే జర్నలిస్టుకి అత్యంగ గౌరవంగా ప్రెస్ అక్రిడిటేషన్ కార్డు వచ్చేది. సదరు పత్రికకు క్రమం తప్పకుండా ప్రభుత్వ ప్రకటనలు వచ్చేవి. కానీ ఇపుడు మీడియా కూడా రాజకీయం అయిపోవడంతో..ఎవరి సామాజిక వర్గం అధికారంలో ఉంటే సదరు సామాజిక వర్గం మీడియాకి అగ్రతాంబూలం ఇచ్చి స్థానిక పత్రికలను పూర్తిగా ప్రక్కన పెట్టేస్తున్నారు. దానికి ప్రభుత్వాలు చెప్పే కారణం కూడా ఒక్కటే మీ పత్రికకు డిఏవీపీలేదు, ఎంపానల్ మెంట్ లేదని.

 అలాగని ఎంపానల్ మెంట్ కి, డిఏవీపికి సరిడేంత కాలం పత్రికలు దిగ్విజయంగా నడిపి దరఖాస్తు చేసుకున్నా వాటిని పట్టించుకునే నాధుడే లేడు. ప్రభుత్వం తీవ్ర ఆర్ధిక సంక్షోభంతో కొట్టిమిట్టాడుతుందని చెప్పి ఒకసారి.. ప్రస్తుతం ప్రజల సమస్యలపై దృష్టిపెట్టామని మరోసారి.. పదేళ్లపాటు డిఏవీపీ, ఎంపానల్ మెంట్ పై బ్యాన్ విధించామని మరోసారి, మీ పత్రికకు కావాల్సిన అనుబంధ పత్రాలు సక్రమంగా లేవని మరోసారి చెబుతూ కాలం వెల్ల దీస్తున్నారు తప్పితే అన్నీ సక్రమంగా ఉన్న పత్రికలకు కూడా ప్రభుత్వ ప్రకటనలు వచ్చే ఎంపానల్ మెంట్ మాత్రం సక్రమ మార్గంలో చేయడం లేదు. మరోవైపు స్థానిక పత్రికలను పూర్తిగా పాతాలళ లోకానికి తొక్కేసే విధంగా ప్రభుత్వ జీఓలు రూపొందించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2019 జర్నలిస్టులకి ఇచ్చే ప్రెస్ అక్రిడిటేషన్లను కుదించేశాయి. ఒకప్పుడు మండల విలేఖరికి కూడా ఇచ్చే ప్రెస్ అక్రిడిటేషన్ ఇపుడు నియోజకవర్గానికి ఒకటి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. 

పెద్ద పత్రికలు, ఎడిషన్లు ఎక్కువగా వుంటే ఒకలా, స్థానిక పత్రికలు అయితే మరోలా... 8పేజీలు పేపర్ అయితే ఒకలా, నాలుగు పేజీల పేపర్ అయితే ఇంకోలా.. 12 పేజీల డమ్మీసైజ్ పేపర్ అయితే వేరే రకంగా అక్రిడిటేషన్లు మంజూరు చేసి జర్నలిస్టులకు అసలు మీడియా అంటేనే విరక్తి పుట్టేలా చేసి.. స్థానిక పత్రికలపై భారం మోపుతున్నారు. అలాగనీ చచ్చీ చెడీ పెళ్లాం మెడలో పుస్తులు తాకట్టు పెట్టి కూడా పేపర్ నిర్వహణ సక్రమంగా చేసినా కూడా సమాచారశాఖ ద్వారా ఏవేవో కొర్రీలు వేస్తూ స్థానిక పత్రిక నిర్వాహకుల ఆత్మస్తైర్యం, రెగ్యులారిటీకి గాలి తీసేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు పాటించలేని స్థానిక పత్రికలు వారంటత వారే మూసేసుకుంటున్నారు. మరికొందరు అమ్మేసుకుంటున్నారు. ఇంకా మిగిలిన వారు చచ్చీ చెడీ అప్పులు చేసి మరీ పత్రికలను నడిపిస్తున్నారు. ప్రస్తుతం ప్రధాన పత్రికల్లో కూడా జర్నలిస్టులకు పనిచేసినందుకు జీతాలు లేకుండా పోయాయి..

కనీసం ప్రెస్ అక్రిడిటేషన్ గౌరవానికైనా నోచుకుందామని నిర్వహిస్తున్న పత్రికలకు ఆర్ఢిక భారం రోజు రోజు కీ పెరిగి పోతున్నది తప్పితే మరొకటి లేదు. ఉదాహరణకు సుమారు 20ఏళ్లుగా జర్నలిస్టులు కనీసం ఇంటి స్థలాలకు నోచుకోలేదంటే అతిశయోక్తి కాదు. ఇదే సమస్యపై జర్నలిస్టులు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా కలెక్టర్లు, ఆఖరికి ముఖ్యమంత్రికి విన్నవించినా ఫలితం లేకుండా పోతున్నది. ప్రస్తుతం జర్నలిస్టులు ప్రెస్ అక్రిడిటేషన్ కూడా పొందే అవకాశం లేకుండా పోతున్నది. అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు వారికి, వారి సామాజిక మీడయాలకి అనుగుణంగా నిబంధనలు మార్చేస్తున్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కూడా స్థానిక పత్రికలకు ఎన్ని అక్రిడిటేషన్లు వస్తాయో తెలియని పరిస్థితి. అయితే గతంలో టిడిపి అధికారంలో ఉన్న సమయంలో మాత్రం మండల జర్నలిస్టుకి ఒక అక్రిడిటేషన్ మంజూరు చేసింది.

కానీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని ఏకంగా పత్రికకు కేవలం 6 అక్రిడిటేషన్లతో కుదించేశారు. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇపుడైనా జర్నలిస్టుల ప్రధార గుర్తింపు ప్రెస్ అక్రిడిటేషన్, దీర్ఘకాలికంగా పరిష్కారం కాని సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ఇంటిస్థలం మంజూరు అవుతుందా..అనే ఆశతో ఉన్న జర్నలిస్టులు లేదంటే మళ్లీ సాధారణ ప్రజానీకం మాదిరిగానే అర్జీలు పట్టుకొని కలెక్టరేట్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎం వరకూ అర్జీలు పెట్టుకోవడమే జర్నలిస్టుల కర్తం అయిపోతుంది. అయినా జర్నలిజం వర్ధిల్లాలి..జర్నలిస్టు అభివృద్ధి చెందాలి.. లాంగ్ లివింగ్ మీడియా..జైహింద్ ఫోర్త్ ఎస్టేట్..!

visakhapatnam

2025-07-29 12:33:26

ఆంధ్రప్రదేశ్ లో వర్కింగ్ జర్నలిస్టులు అదృష్టవంతులు..?!

ఆంధ్రప్రదేశ్ లో వర్కింగ్ జర్నలిస్టులు చాలా అదృష్టవంతులు.. ఏ చీకూ చింతా లేదు. పనిచేసినంత కాలం పనిచేస్తారు.. 60ఏళ్లు దాటిన తరువాత  ప్రభుత్వం నుంచి ఏవిధమైన ప్రయోజనం లేకుండా.. పొందకుండా.. పొందే వీలు లేకుండా.. ఇంటిదగ్గే రెస్టు తీసుకుంటూ రామా క్రిష్ణా అని పిల్లలు పెట్టే ఏదో నాలుగు మెతుకులు తిని బ్రతుకు ఈడ్చేస్తారు. అదే బీహార్ రాష్ట్రంలో లాగా ప్రతీనెలా రూ.15 వేలు పెన్షన్ ఏమీ తీసుకోరు. అసలు అలాంటి ఊసే ఏపీలో లేదు.. రాదు.. రాబోదు. 60ఏళ్లపాటు ప్రజలకి, ప్రభుత్వాలకి మధ్య సమాచార వారధిగా పనిచేసి కూడా కనీసం పెన్షన్ కి కూడా నోచుకోని జర్నలిస్టులన్న రాష్ట్రంగా ఏపీ కీర్తికెక్కింది. జర్నలిస్టుల కనీస అవసరాలు తీర్చలేని, తీర్చుకోలేని, ఆ దిశగా పోరాటాలు చేయని జర్నలిస్టుల సంఘాలున్న రాష్ట్ర జర్నలిస్టుల సంఘాలున్న రాష్ట్రంగా  కూడా దేశంలోనే కీర్తి పొందింది. 

అదేదో బీహార్ రాష్ట్రమట. అక్కడ మాత్రం జర్నలిస్టులు ఏదో చేశారని.. సమాజం కోసం ప్రజలు, ప్రభుత్వం కోసం పనిచేశారని గుర్తించిన అక్కడి ప్రభుత్వం రిటైర్ అయిన జర్నలిస్టులకి ఇప్పటి వరకూ రూ.10వేలు ఇచ్చేది. ఇపుడు దానిని కాస్తా రూ.15వేలకి పెంచిందట. అంతే  మన రాష్ట్రంలో ఏమీ సాధించుకోలేని జర్నలిస్టులు, జర్నలిస్టుల సంఘాలు ఆ పెన్షనేదో ఇక్కడే తీసుకుంటున్నట్టు పత్రికా ముఖంగా ప్రకటనలు ఇచ్చి మరీ తెగ ఆనంద పడిపోతున్నారు.. బహుసా జర్నలిస్టులంటే అక్కడి రాష్ట్రప్రభుత్వానికి కాస్త గౌరవం కాబోలు. లేదంటే  జర్నలిస్టులకిచ్చే పెన్షన్ ను రూ.10వేల నుంచి రూ.15కి కి పెంచడమేంటి సిరాకు కాకపోతే. అదే మన ఆంధ్రప్రదేశ్ ని చూడండి.. ఒక్కసారి సారి ఆలోచించండి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులూ.. జర్నలిస్టుల సంఘాల నేతలు. నిజంగా జర్నలిస్టులంటే మనం.. జర్నలిస్టు సంఘ నేతలమంటే మనమే.. మనకి ఏ రాష్ట్రంలోని జర్నలిస్టులతోనూ పోలిక ఉండదు. 

కనీసం వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లలేం సరికదా.. కనీసం మండల విలేఖరికి ప్రభుత్వం ఇచ్చే ప్రెస్ అక్రిడిటేషన్ కూడా సాధించుకోలేం. ఇంతలా చేయడం అంటే మాటలా చెప్పండి.  ప్రభుత్వాలంటే బీహార్, ఒడిసా లాంటి  రాష్ట్రాలవినే కాదా..? చెప్పండి..! అదే ఆంధ్రప్రదేశ్ లో అయితే వర్కింగ్ జర్నలిస్టులకి ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు అదేనండీ ప్రెస్ అక్రిడిటేషన్ పొందాలన్నా దేశంలోనే లేని నిబంధనలన్నీ వర్తింపజేస్తారు. వాటిని ప్రశ్నించలేం.. సంక్షేమ పథకాలంటారా.. అవి ఒక్కటి కూడా జర్నలిస్టులకి ఉండవు.. ఒక వేళ ప్రజలను నమ్మించడానికి ఏ రాజకీయపార్టీ అయినా మేనిఫెస్టోలో పెట్టినా కూడా వాటిని అమలు చేయలేక ప్రత్యేక సబ్ కమిటీలు వేస్తాయి. అపుడూ మాట్లాడలేం.. సబ్ కమిటీ అంటే తెలుసుకదా..వాళ్లకున్నంత బిజీ మరే కమిటీకి ఉండదు. ఇచ్చే రిపోర్టులు కూడా అంతే త్వరగా ఇచ్చేస్తారు(ఎంత లేదనుకున్నా ఆరు నెలల నుంచి ఏడాదిలోపే లేదంటే మన ప్రెస్ అక్రిడిటేషన్ లాగా మరో ఆరు నెలలు ఎక్స్ టెన్షన్ చేసుకుంటూ పోతారు)..

 ఆ తరువాత వాటిపై జీఓలు రావడానికి మరో ఏడాది. ఈ లోగా ఏ జర్నలిస్టు సంఘమైనా కోర్టుకి వెళ్లకుండా ఉంటే అదీ కూడా సక్రమంగా జీఓ రావడానికి. కానీ బీహార్, ఒడిసా లాంటి రాష్ట్రాలు అలా కాదు. జర్నలిస్టులంటే ప్రభుత్వానికి ప్రజలకి మధ్య నిరంతర సమాచార సారధులుగా గుర్తించి వారికి 60ఏళ్లు నిండన వారికి పెన్షన్లు ఇస్తున్నాయి. కనీసం దానికోసమైనా అక్కడి రాష్ట్ర ప్రభుత్వాల కోసం జర్నలిస్టులు పనిచేస్తారు.. ప్రచారం చేస్తారు.. ప్రభుత్వ సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళతారు.. ఇంకేమనా చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ లాంటి పరిరిస్థితి ఏంటి.. ఇక్కడ ప్రభుత్వాలకి జర్నలిస్టులతో పనిలేదు. ప్రభుత్వం ఇచ్చే ప్రెస్ అక్రిడిటేషన్ కి కూడా నిబంధనలు మామూలుగా ఉండవు. అవి పాటించే మీడియా సంస్థలు వారి ఆస్తులు తాకట్టు పెట్టి పత్రికలను నడుపుకోవాలి. మళ్లీ ఇక్కడ మాత్రం మరో వెసులుబాటు వుంది. అదే సదరు రాజకీయపార్టీకి అనుకూలంగా ఉన్న పత్రికలు, మీడియా సంస్థలు ఉంటే మాత్రం వందల కోట్ల రూపాయలు ఒక్క ప్రకటనల ద్వారానే వారికి కట్టబెడతారు.

 అందులో ఒక్కశాతం కూడా స్థానిక పత్రికలకి ఇవ్వాలంటే మాత్రం ప్రభుత్వాలు, రాజకీయపార్టీలు కూడా ఎక్కడలేని నొప్పులన్నీ పడిపోతుంటాయి. వాటికే అంతా నొప్పులు పడగా లేనిది.. ఇక 60ఏళ్లు దాటిన రిటైర్డ్ జర్నలిస్టులకి పెన్ష్లు ఏమిస్తారు చెప్పండి..? అసలే ఖజానాలో డబ్బులు లేవు. అలాంటి సమయంలో జర్నలిస్టులకి పెన్షన్లు, ప్రెస్ అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు, యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ లు, ఇళ్ల స్థలాలు, హౌసింగ్ స్కీములు, ఎటాక్స్ కమిటీలు అంటే అది అసలు జరిగే పనికూడా కాదు. అలాంటివేమీ అడక్కూడదు. అదే స్థానిక పత్రికలకు  ప్రెస్ అక్రిడిటేషన్లు కుదించేయడానికి, స్థానిక పత్రికలు నడవకుండా ఎక్కడలేని నిబంధనలు పెట్టడానికి, ఇచ్చే ప్రకటనలకు ఎంపానల్ మెంట్ నిబంధనల ముడిపెట్టడానికి,  జీఓలు తెమ్మంటే మాత్రం రాత్రికి రాత్రి జీఓలు వచ్చేస్తాయి. క్షణాల్లో నే అమల్లోకి కూడా వచ్చేస్తాయి. స్థానిక పత్రికలకు గుదిబండాలా మారిన ఆ నిబంధనలను అమలు చేసే వరకూ ప్రభుత్వం కూడా ఊరుకోదు. 

 సరికదా మీడియాకోసం పనిచేసే సమాచారశాఖ ద్వారా జీఓని అమలు చేసి దానిని పర్యవేక్షించి గంగ గంటకీ నివేదికలు ఇమ్మని చెబుతుంది. అదే మండలంలో పనిచేసే వర్కింగ్ జర్నలిస్టుకి కనీసం ప్రెస్ అక్రిటేషన్ ఇవ్వండని ప్రభుత్వానికి జర్నలిస్టుల సంఘాలు ఆర్జీ పెట్టాయనుకోండి.. అబ్బే ఆ ఒక్కటీ అడక్కు అంటాయి. కనీసం ఇంటి స్థలం ఇస్తే కనీసం కమ్మలతోనైనా ఇల్లు కట్టుకుంటామని అని అడిగితే.. దానికోసమే కమిటీ వేశాం.. ఆ కమిటీ రిపోర్టు రాగానే ఇస్తామని గుక్కతిప్పుకోకుండా చెబుతాయి. కాకపోతే ఆ లోగా ప్రభుత్వానికే టైమ్ అయిపోతుంది. ఎందుకంటే ఈలోగా ఐదేళ్లు గడిచిపోతాయ్ కదా.. కావాలంటే గత ప్రభుత్వ విధానాలు ఒక్కసారి గుర్తుచేసుకోండి. ఇళ్ల స్థలాలు ఇస్తామని ఎన్నికలకు ఏడాది ముందు హడావిడి చేసేస్తారు. అదిగో ఇదిగో అనేసరికి ఎన్నికలు వచ్చేసి ప్రభుత్వాలే మారిపోయాయి. ఇపుడు ప్రభుత్వం ఏకంగా జర్నలిస్టులకోసం మేనిఫెస్టోలోనే హామాలిచ్చింది. 

ఇచ్చినట్టుగానే అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తరువాత బ్యాబినెట్ సబ్ కమిటీ వేసింది. ఆ రిపోర్టు ఇంకా రావాల్సి ఉంది. అది ఆంధ్రప్రదేశ్ లోని పరిస్తితి. అదే బీహార్, ఒడిసా లాంటి రాష్ట్రాల్లో ఈ పరిస్థితి లేదు కదా.. జర్నలిస్టుగా పనిచేసి రిటైర్ అయితే చాలు బీహార్ లో ఇపుడు రూ.15వేలు పెన్షన్ ఇస్తున్నారు. అలాంటి పరిస్థితులు, అవకాశాలు, ఉపయోగాలు లేని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులు అదృష్టవంతులా కాదా చెప్పండి..పైగా మన అదృష్టం మనల్నే వెక్కిరించేలా ఎక్కడో బీహార్ లాంటి రాష్ట్రంలో జర్నలిస్టుల పెన్షన్ రూ.10 వేల నుంచి రూ.15వేలకి పెంచి అక్కడి జర్నలిస్టులకి మేలు జరిగితే ఆంధ్రప్రదేశ్ లో మన జర్నలిస్టులంతా.. యూనియన్ల పేరుతో హర్షం ప్రకటిస్తాం అదీ పత్రికా ముఖంగా?!

viskahpatnam

2025-07-27 07:38:48

రాజకీయపార్టీల మీడియా సంస్థలు.. జర్నలిస్టులే సమిథలు..!

మీడియారంగలోకి రాజకీయపార్టీల రంగ ప్రవేశంతో జర్నలిస్టులే సమిథలైపోతున్నారు.. జర్నలిజం విలువలు మచ్చుకైనా కనపించకుండా పోతున్నాయి. ఒక పార్టీ అంటే మరో పార్టీకి పడకపోవడంతో వీళ్లలో వీళ్లే ఒకరు పచ్చపత్రిక అని.. మరొకరు పచ్చకామెర్ల పత్రికలంటూ దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ తరుణంలో ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెళ్లడం మాని రాజకీయపార్టీల ముష్టియుద్ధాలకు జర్నలిస్టులు గొడవలు పడాల్సి వస్తున్నది. రాజకీయపార్టీలకోసమే జర్నలిస్టుగా పనిచేయక తప్పని దుస్థితి కూడా వచ్చేసింది. అలాగని మీడియా రంగంలో వర్కింగ్ జర్నలిస్టులకు రక్షణ అయినా ఉంటుందా అదీ లేదు. కొన్ని సంస్థలు జీతాలిస్తే.. మరికొన్ని సంస్థలు ప్రజా సేవ చేయమంటున్నాయి. జర్నలిజం ఆశక్తి ఉన్నవారు తప్పితే మరెవరూ ఈ రంగంలోకి అడుగుపెట్టడానికి సాహసం చేయడం లేదు. తెల్లవారు లెగిస్తే ప్రజా సమస్యలు ఎక్కడా పత్రిలూ టీవీ ఛానల్స్ లో కనిపించడం లేదు. ఒకప్పుడు పత్రికలంటే ప్రభుత్వాలకి రాజకీయపార్టీలకు కాస్త భయం ఉండేది. ఇపుడు అది పోయింది. కారణం రాజకీయపార్టీలకే మీడియా సంస్థలు రావడం వాటినే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకే నిధుల సర్ధుబాటు ప్రభుత్వ ప్రకటనల ద్వారా అడ్డగోలుగా చేసుకోవడం అలవాటైపోయింది.

మరికొన్ని మీడియా సంస్థలు మనుగడ కోసం అధికాపార్టీలకు తొత్తుల్లా మారాల్సి వస్తున్నది. ఎటొచ్చీ రాజకీయపార్టీల మీడియా ఆదిపత్యంలో స్థానిక పత్రికలు మట్టికొట్టుకు పోతున్నాయి. అంతేకాదు స్థానిక పత్రికలను పూర్తిగా అణగదొక్కేయడానికి రక రకాల జీఓలు తీసుకువచ్చి ఇక వారంతట వారే పత్రికలు, మీడియా సంస్థలు మూసేసుకునే చర్యలకు దిగుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఒకప్పుడు తెల్లవారుజామున లేచే సరికి బాహ్య ప్రపంచంలో ఎం జరుగుతుందనే తాజా సమాచారంతో పత్రికలు ప్రజలను చైతన్య పరిచేవి. ఇపుడు పేపర్ తిరగేస్తే మూడొంతులు రాజకీయపార్టీ ముష్టియుద్దాలకు జర్నలిస్టులు బలపోయి, పొట్టగూటికోసం ఉద్యోగాలను నిలుపుకోవడం రాసిన కథనాలే కనిపిస్తున్నాయి. మీడియా సంస్థలకు ప్రభుత్వాలు ఇచ్చే గుర్తింపు ఇస్తే ఎక్కడ ప్రయోజనాలు ఇవ్వాల్సి వస్తుందోనని కనీసం పత్రికలకు ఎంపానల్ మెంట్ చేయడం లేదు. ఉన్నవాటికి కూడా రెగ్యులారిటీ పేరుతో నిబంధనలు విధించి ప్రభుత్వ ప్రకటనలు కూడా ఇవ్వడం లేదు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం డిఏవీపీ ప్రకనటలు ఇవ్వడం తగ్గించేసింది.. కాదు కాదు ఇవ్వడమే మానేసింది. ఇచ్చినా కూడా ఇందులో కూడా అడ్డగోలు రాజకీయాలు చేస్తూ.. స్థానిక పత్రకలను ప్రక్కకు నెట్టేస్తున్నారు. ఈ విషయంలో కూడా రాజకీయపార్టీల పత్రికలే మొత్తం ప్రకటనల్లో అగ్రభాగాన్ని లాగేస్తున్నాయి.

ఒకప్పుడు జర్నలిజం అంటే ప్రభుత్వాన్ని, ప్రజలను వారి వార్తలతో చైతన్యపరచడం.. దాని ఇపుడు వాటి స్వరూపం మారిపోయి ఒక పార్టీ పేపరులో, మరోపార్టీ రాజకీయాలకే అగ్రతాంబాలం, పేజ్-1 ఆర్టికల్స్ కి ప్రత్యేక స్థానాలను కేటాయిస్తున్నారు. సమాజంలో తమవంతు పాత్ర పోషించి ప్రజలను చైతన్యం చేయడానికి జర్నలిజం, మీడియారంగంలోకి అడుగుపెడుతున్న జ్నలిస్టులు సమిధలుగా మారి రాజకీయ క్రీడలో ఆటగాళ్లు అవుతున్నారు. యాజమానం ఏం చెబితే అదే రాయాలి. ఎలా చెబితే అలా రాయాలి.. ఎక్కడా జర్నలిస్టులకి ప్రజా సమస్యలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలు రాసే స్వేచ్చ పోయి చాలా కాలమే అయ్యింది. ఆ స్వేచ్చ మళ్లీ వస్తుందనే నమ్మకం కూడా లేదు. ఉన్న కొద్దిపాటి స్థానిక పత్రికలైనా వాస్తవాలను బయటపెడితే ఆ లోకల్ పేపర్ మన పార్టీది కాదు.. ప్రభుత్వానికి అనుకూలంగా కూడా లేదు. అలాంటి వాటిని పట్టించుకోవాల్సిన పనిలేదంటూ ప్రభుత్వంలో ఉన్నవారే స్థానిక పత్రికలను ప్రక్కన పెట్టేస్తున్నారు. ఎంతదారుణం అంటే జర్నలిస్టులకి, పత్రికను అందంగా తీర్చి దిద్దే డెస్కు జర్నలిస్టులకి, వాస్తవాలను చిత్ర రూపంలో చిత్రించే ఫోటో జర్నలిస్టులకి, కదిలే బొమ్మలు వీడియోలు చిత్రీకరించే వీడియో జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చే ప్రెస్ అక్రిడిటేషన్ కి కూడా ప్రపంచంలో ఏ దేశంలో లేని నిబంధనలు భారతదేశంలోనూ, అందునా ఆంధ్రప్రదేశ్ లోనే అమలు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో.

ఇపుడు ఇంకో అడుగు ముందుకి వేసి. యావత్ మీడియానే నియంత్రించే పని ప్రారంభించారు. సోషల్ మీడియా అభివృద్ధి చెందడంతో ఏ పార్టీకి ఆ పార్టీ, కార్పోరేట్ సంస్థలు సైతం సోషల్ మీడియాని సొంతంగా ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఎంత దారుణమైన పరిస్థితులు ఇపుడు తెరపైకి వచ్చాయంటే.. సోషల్ మీడియాకి కూడా ప్రెస్ అక్రిడిటేషన్లు ఇవ్వాలనే సూచనలు ప్రభుత్వాలు చేస్తున్నాయంటే వర్కింగ్ జర్నలిస్టులకు వచ్చే ఆ కొద్దిపాటా గౌరవం కూడా ప్రెస్ అక్రిడిటేషన్ రూపంలో సోషల్ మీడియాకి వెళ్లిపోతుందనే భయానక పరిస్థితులు వచ్చాయి. మీడియా రంగంలో ఏం జరిగినా.. ఏం చేసినా రాజకీయపార్టీలు మాత్రమే శాసిస్తున్నాయి. దానికి అధికారం కూడా ఒక అవకాశం అవుతుంది. ఇప్పటికై మీడియా పతన దశకి చేరుకుంది. రానున్న రోజుల్లో మీడియా అనే పదం, వార్తలు కనుమరుగు అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే ఎవరు ఎన్ని సంస్థలు పెట్టుకున్నా అందులో పనిచేసేది.. రాసేది..రాయించేది..రాటుదేలి ప్రజలను, ప్రభుత్వాలను చైతన్య పరిచిదే జర్నలిస్టులు మాత్రమే..జర్నలిస్టులకి పూర్వవైభవం రావాలి.. జర్నలిజం వర్ధిల్లాలి..!

visakhapatnam

2025-07-24 07:45:54

ఎందుకు దండగ.. జర్నలిస్టులకెందుకు సంక్షేమ పథకాలు పెన్షను..?!

75ఏళ్ల స్వాతంత్ర్య భారత దేశంలో నేటికీ వర్కింగ్ జర్నలిస్టులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మనుషులులా కనిపించడం లేదు. వేల సంఖ్యలో ఉన్న జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఈరోజుకి ఒక్క సంక్షేమ పథకం కూడా ప్రవేశపెట్టలేదంటేనే జర్నలిస్టులంటే ప్రభుత్వాలకి ఏ విధంగా కనిపిస్తున్నారో అర్ధమవుతుంది. ప్రభుత్వం ఇచ్చే ఆ ఒక్క ప్రెస్ అక్రిడిటేషన్ పొందాలన్నా 2017 నుంచి నిబంధనలు పూర్తిగా మార్చేశారు. తల్లులకి, ఆటో, కార్ డ్రూవర్లు, రైతులు, న్యాయవాధులు, మఠాధిపతులు, మసీదు గురువులు, చర్చి ఫాదర్ లు, రజకులు, క్షరకులు, ఆఖరికి కూరగాయలు అమ్ముకునే వారికి, రోడ్డుపై తోపుడు బండి వ్యాపారాలు చేసుకునేవారికి రాష్ట్ర ప్రభుత్వంలో సంక్షేమ పథకాలున్నాయి ఒక్క జర్నలిస్టుకి తప్పా. విశేషం, విచిత్రం ఏంటంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ఈ సంక్షేమ పథకాలు, ఎన్నికల మేనిఫెస్టోలు పత్రికలు, మీడియాలోనూ ప్రచారం చేసేది మళ్లీ జర్నలిస్టులే. ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు అడుగు తీసి అడుగు వేసినా, ప్రజలకోసం ఏం చేయాలనుకున్నా.. వారికి తెలియజేయడం కోసం మళ్లీ జర్నలిస్టులే కావాలి.. 

కానీ మళ్లీ జర్నలిస్టులకు మాత్రం ఎలాంటి సంక్షేమ పథకాలు వర్తింపచేయకూడదు, ప్రభుత్వం ద్వారా ఇచ్చే ప్రెస్ అక్రిడిటేషన్ కి కూడా ఏ స్థానిక పత్రిక, టీవీలు అందుకోలేనన్ని నిబంధనలు ప్రత్యేక జీఓలతో మాత్రం అమలు చేయాలి. అదేంటో ఏ ఒక్క జర్నలిస్టుల సంఘం కూడా ఈ విషయాన్ని ప్రభుత్వాల దగ్గర ప్రస్తా వించదు. ఎప్పుడూ మీడియాలో ప్రచారాల కోసం చేసే ఉత్తుత్తి ఆందోళనలు తప్పా. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 55 వేల మందికి పైగా జర్నలిస్టులు పెద్ద పత్రికల దగ్గర నుంచి స్థానికపత్రికలు, టీవీఛానల్స్ లో పనిచేసేవారు వారుంటే వారి కుటుంబంలోని సభ్యులు ఓటు హక్కు ఉన్నవారు ఎంత మంది ఉంటారో ఒక్కసారికూడా ఆలోచన చేయడం లేదు కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు. ప్రభుత్వం మాత్రం మీడియా సంస్థల ద్వారా లేఖలు ఇస్తే...ముక్కుతూ మూలుగుతూ ఒక్క ప్రెస్ అక్రిడేషన్ మాత్రం ఇస్తుంది. దానితో ఉచితంగా బస్సుపాసు మాత్రమే వస్తుంది. అదీ కూడా రద్దీ సమయంలో కండక్లర్లే క్రిందికి దించేస్తూ ఉంటారు. ఈ విషయం తెలిసినా అధికారులూ ఏమీ అనరు. ఎందుకంటే జర్నలిస్టులంటే బాగా సంపాదించేవారని ఒక ప్రగాఢ నమ్మకం ఒకటి ఏడ్చి చచ్చింది.

 చాలా రాజకీయ పార్టీలు అధికారం కోల్పోయిన తరువాత కూడా అదే ప్రెస్, మీడియా, జర్నలిస్టులు అవసరం పడతారు. ట్వంటీస్ కి వచ్చిన తరువాత చాలా రాజకీయపార్టీలు సొంతంగానే మీడియా సంస్థలు ఏర్పాటు చేసుకున్నాయి. ఎన్నిచేసుకున్నా.. పార్టీల్లో నాయకులు వచ్చి పనిచేయరు కదా.. మళ్లీ అక్కడ కూడా వర్కింగ్ జర్నలిస్టులు లేకపోతే మీడియా సంస్థలు నడవవు. ఏం జరుగుతుందో, ఏ విషయాన్ని తెలియజెప్పాలనుకున్నామో మళ్లీ జర్నలిస్టుల ద్వారానే చేయాలి. అలా చేసిన సందర్భంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చినా.. మళ్లీ అదే నిరంకుసత్వం.. అంటరాని తనం.. బయట మీడియాని తొక్కేయాలి. సొంత మీడియాని అభివృద్ధి చేసుకోవాలి, ఆస్తులు సంపాదించాలనే తత్వం. ఈ నేపథ్యంలో సమిధలువుతున్నది ఒక్క జర్నలిస్టు మాత్రమే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జర్నలిస్టులకోసం ముసలి కన్నీరు కార్చే రాజకీయపార్టీలన్నీ, అధికారంలోకి వచ్చిన తరువాత నియంతలా వ్యవహరించడం రివాజుగా మారిపోతూ వస్తున్నది. ఇన్నేళ్ల కాలంలో జర్నలిస్టుల కోసం ఒక్క సంక్షేమ పథకం ఏ రాజకీయపార్టీ అయినా తన మేనిఫెస్టోలో పొందుపరిచిందా అనే విషయాన్ని 1920 నుంచి చూసుకున్నా 2024 వరకూ కనిపించదు. 

అదేంటి హెల్త్ కార్డులు ఇస్తున్నారు కదా అంటే.. సాధారణ ప్రజలకు  ఇచ్చే కార్డులకంటే రెండు మూడు రోగాలు పెంచి స్కీములో సగం డబ్బులు కట్టించుకొని కార్డులిస్తున్నారు. అవి ఎప్పుడు పనిచేస్తాయో.. వాటిని ప్రైవేటు ఆసుపత్రుల వాళ్లు ఎప్పుడు ఆపేస్తారో తెలీదు. కేంద్రం ఇచ్చే ఒకేఒక్క సదుపాయం 50శాతం రిబేటుతో ఇచ్చే రైల్వే పాసు. అది రిబేటు స్కీములు వర్తింపచేయలేమని చెప్పి కోవిడ్ కి ముందే తొలగించేసింది. రాష్ట్రప్రభుత్వం కూడా యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ తొలగించేసింది. జర్నలిస్టుల సంక్షేమ నిధిని రద్దు చేసేసింది. బీపీఎల్ ఫ్యామిలీలకు ఇచ్చే ఇంటి స్థలం కూడా 2015 నుంచి ఇవ్వడమే మానేసింది. 60ఏళ్లపాటు సేవలు అందించిన జర్నలిస్టులకు కనీసం పించను అందించాలనే ఆలోచన కూడా ప్రభుత్వాలకి రాలేదు. కానీ ఓట్లేసిన ప్రజలకు, 50ఏళ్లు దాటిని వారికి మాత్రం ప్రతీనెల రూ.4వేలు పెన్షన్ ఇస్తోంది. వాళ్లకి ఇవ్వడం తప్పుకాదు. ప్రభుత్వల కోసం పనిచేసే జర్నలిస్టులకి ఎందుకు ఇవ్వడం లేదనేదే ఇక్కడ ప్రశ్న. కనీసం ఆ తరహా పించనుకి కూడా జర్నలిస్టులు నోచుకోలేపోతే సమాజంలో నాల్గవ స్థంబంగా జర్నలిస్టులకు ప్రభుత్వాలు ఇచ్చే విలువ ఏంటో నేటికీ జర్నలిస్టులే గుర్తించడం లేదు. 

మాకేటి సిగ్గు అన్నట్టుగానే వ్యవహరిస్తూ.. మళ్లీ ఆహా ఓహో అంటూ ఉదయం లేచిన దగ్గర నుంచి అదే కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాల కోసం కీర్తిస్తూ, పొగుడుతూ వార్తలు రాస్తున్నాం. ఇదే వాళ్లకి జర్నలిస్టుల విషయంలో చులకనైంది. మనం పథకాలు ఇచ్చినా, ఇవ్వకపోయినా, మీడియాని తొక్కేయాలని చూసినా, సోషల్ మీడియాను పెంచుకోవాలని చూసినా జర్నలిస్టుల నుంచి అందునా జర్నలిస్టుల సంఘాల నుంచి వ్యతిరేకత రాలేదూ అంటే జర్నలిస్టులకు ఏమీ చేయాల్సిన పనిలేదు, ఒక్క స్కీము కోసం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదనే నమ్మకానికి వచ్చేశాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇంత జరుగుతున్నా.. ఇలాంటి వార్తలు చదువున్న సమయంలో కూడా జర్నలిస్టులన్నవాళ్లు వీటిని చదివి.. ఓహో మన సమస్యల కోసం ఈరోజు భలే వార్త వచ్చిందనుకుని మురిసి పోయి.. మళ్లీ అదే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోసం వార్తలు రాయడానికి ఉదయాన్నే లేచి మళ్లీ వెళ్లిపోతాం. 

అదే కదా జర్నలిస్టు అంటే.. ఇక జర్నలిస్టుల కోసం ప్రభుత్వాలు ఎందుకు ఆలోచిస్తాయి.. కాదాంటారా..? ఎపుడైనా ప్రజాప్రతినిధులనైనా జర్నలిస్టులు మనుషుల్లా కనిపించలేదా..? కనీసం ఒక్క సంక్షేమ పథకం అయినా జర్నలిస్టుల కోసం ప్రవేశాపెట్టారా అని అడిగే దైర్యం ఉందా అంటే.. ఆ ఒక్కటీ అడక్కు అంటారు..! అందుకే జర్నలిజం వర్ధిల్లాలి.. జర్నలిస్టులు జర్నలిస్టులుగానే ఉండిపోవాలి.. మన సమస్యలపై ప్రభుత్వాలు ప్రచారం చేసుకోవాలి.. కొన్ని రాజకీయపార్టీల వలన మీడియా పాతాళానికి తొక్కేయబడాలి.. జర్నలిస్టుకి భవిష్యత్తులో ఒకూ ఒక్క పథకం కాదు కదా మరేమీ అందకూడదు, దానికోసం ఏ జర్నలిస్టు సంఘంమూ అడకూడదు.. అదీ విషయం..?!

visakhapatnam

2025-07-06 15:04:52

ప్రెస్ అక్రిడిటేషన్ కోసం జర్నలిస్టులకి ఇన్ని అగచాట్లా..?!

వర్కింగ్ జర్నలిస్టుల హక్కు ప్రెస్ అక్రిడిటేషన్. అలాంటి అక్రిడిటేషన్ జర్నలిస్టులు లెక్కలేనన్ని అగచాట్లు పడుతున్నారు. దానికి తొలి కారణం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. దేశవ్యాప్తంగా ప్రధాన పత్రికలు పదుల సంఖ్యలో ఉంటే.. స్థానిక పత్రికలు వందల సంఖ్యలో ఉన్నాయి. ప్రధాన పత్రికల నుంచి స్థానిక పత్రికల వరకూ నిర్వహణ భారం ఒక్కటే. కానీ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఎక్కువ ఎడిషన్లు ఉన్న పత్రికలను ఒకలా, స్థానికంగా ఉన్న చిన్న పత్రికలకు ఒకలా గుర్తిస్తున్నది. గత ప్రభత్వంలో స్థానిక పత్రికలను నిర్వీర్యం చేసేందకు తీసుకు వచ్చిన జీఓనెంబరు 38 వలన స్థానిక పత్రికలు పిట్టల్లా రాలిసోయాయి. జిఎష్టీ, ఎనిమిదిపేజీలు, ప్రింటింగ్ ప్రెస్ ల తనిఖీ పేరుతో చిన్న పత్రికల పాతాలానికి తొక్కేసింది. కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం కాస్త వెసులుబాటు ఇచ్చినా.. గత ప్రభుత్వ విధానాలే అమలు చేస్తున్నట్టు కనిపిస్తున్నది. గతంలో టిడిపి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో స్థానిక దినపత్రికలకు నాలుగు పేజీల బ్రాడ్ షీట్ ముద్రించి పంపిణీ చేస్తే.. మండలానికి ఒక ప్రెస్ అక్రిడిటేషన్ ఇచ్చేది. 

అదే టిడిపి ప్రభుత్వం మళ్లీ నిబంధనలు కఠిన తరం చేసి వాటిని కుదించేసింది. తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం  దానిని ఆరు అక్రిడిటేషన్లకు కుదించేసింది. అదీ ఆ ప్రభుత్వానికి అనుకూలంగా రాస్తే ఒకలా.. ప్రతికూలంగా రాస్తే ఒకలా వ్యవహరించింది. కొన్ని ప్రధాన పత్రికలకు కూడా అక్రిడిటేషన్లు కోత కూడా పెట్టేసింది. ఇపుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎడిషన్లు ఎక్కువగా ఉన్న పత్రికలతోపాటు, స్థానిక పత్రికలకు కూడా ఎంపానల్ ఉంటే ప్రకటనలు ఇవ్వడం మొదలు పెట్టింది. దానివలన స్థానిక పత్రికలకు ప్రింటింగ్, పత్రిక పంపిణీ ఖర్చుల భారం కొద్దిమేర తగ్గినట్టు అయ్యింది. అయినా కూడా చాలా కాలంగా చేయని స్థానిక పత్రికల ఎంపానల్ మెంట్ విషయంలో కూడా గతంలో నిబంధనలు ఉన్నా టిడిపి ప్రభుత్వం స్థానిక పత్రికలకు చేయూత ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఎంపానల్ మెంట్ కి దరఖాస్తు చేసుకుంటే చిన్నా చితకా లోపాలున్నా ఎంపానల్ మెంట్ సమాచార పౌర సంబంధాల శాఖ ద్వారా చేసేది. 

అది చాలాకాలంగా నిలిపివేయడంతో నిరాటకంగంగా పత్రికలు నడుతుపున్న వారికి ఎంపానల్ మెంట్ లైసెన్సు రాక నిత్యం పత్రిక ముద్రిస్తున్నా ప్రభుత్వ ప్రకటనలు రావడం లేదు. అంతేకాదు.. అక్రిడిటేషన్ల విషయంలో కూడా ఎంపానల్ మెంట్ ఒకలా, లేకపోతే మరోలా ఇవ్వడం కూడా వర్కింగ్ జర్నలిస్టులకు ఇబ్బందులను తెచ్చి పెడుతున్నది. పత్రికలను ఎక్కడా ఆపకుండా నడపడానికి జర్నలిస్టులు భార్యల మెడలో పుస్తులు అమ్మి కూడా పత్రికలు నిర్వహించిన దాఖలాలు ఉన్నాయి. అయినా జర్నలిస్టుల ఇబ్బందులు ఏమీ పట్టకుండా ప్రభుత్వం ప్రెస్ అక్రిడిటేషన్ దేశంలో లేని విధంగా నిబంధనలు పెట్టి వాటిని తొలుత కుదించేసి.. తరువాత పూర్తిగా రద్దు చేసే యోచనలో ఉన్నట్టు కనిపిస్తున్నది. ఒకరకంగా పెద్ద పత్రికలతో పాటు, సమాచారశాఖ కూడా స్థానిక, చిన్న పత్రికలను అంటరానివారిగా చూడటం కూడా ఆందోళన కలిగిస్తున్నది. స్థానిక పత్రికలకైనా, పెద్ద పత్రికలకైనా ఆర్ఎన్ఐ నుంచి లెసెన్సు వచ్చి నిరాటంకంగా పత్రిక ముద్రిస్తేనే గుర్తింపు. 

అలాంటి గుర్తింపు కోసం అనాదిగా స్థానిక పత్రికలు ఇబ్బందులు పడుతూనే ఉన్నాయి. అలాగని పెద్ద పత్రికలకు సాంకేతిక ఇబ్బందులు, ప్రభుత్వ జీఓలో పొందు పరిచిన అంశాల్లోని లోటు పాట్లు లేకుండా ఉన్నాయా అంటే అక్కడ కూడా ఉన్నాయి. ఒక్కోచోట ప్రధాన పత్రికల కంటే స్థానిక పత్రికలు చక్కగా నిర్వహిస్తున్న ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు కార్డు ప్రెస్ అక్రిడిటేషన్ కి నానా పాట్లు పడాల్సి వస్తున్నది. గతంలో టిడిపి ప్రభుత్వంలో ఎన్నడూ ప్రెస్ అక్రిడిటేషన్లు జారీ ఆలస్యం కాలేదు. కానీ ఈసారి కూటమిగా వచ్చిన సందర్భంలో సోషల్ మీడియాకి కూడా ప్రెస్ అక్రిడిటేషన్లు ఇవ్వాలని నిర్ణయించి క్యాబినెట్ సబ్ కమిటీ వేయడంతో ఆ రిపోర్టుకోసం మరింత ఆలస్యం అవుతున్నది. కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలోని జీఓ నెంబరు 38 లా నిబంధనలు ఇస్తుందా.. లేదంటే గతంలో మాదిరిగా సడలింపులతో ఇస్తుందా అనే విషయం తెలియాలంటే క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్టు ఇచ్చి కొత్త ఉత్తర్వులు వచ్చే దాకా తెలీదు..!

visakhapatnam

2025-07-04 21:58:44

కూటమిలో అధికారుల కంత్రీ పనులు.. వార్డు సచివాలయ ఉద్యోగుల కౌన్సిలింగ్ లో రచ్చ..?!

గ్రామ, వార్డుు సచివాలయ శాఖ ఉద్యోగులను ముప్పుతిప్పలు పెట్టాలని చేస్తున్నారో లేక.. కూటమి ప్రభుత్వంపై సచివాలయ ఉద్యోగుల ద్వారా తిరుగుబాటు రావాలని  అధికారులు చేస్తున్నారో తెలీదుగానీ.. సచివాలయ ఉద్యోగుల బదిలీల విషయంలో కొత్త రకం విధానాలను తెరమీదకు తీసుకు వస్తున్నారు. బదిలీల కోసం ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోమని చెప్పి.. మూడు ఆప్షన్లు ఇచ్చి వెళ్లిపోమనడంతో.. మెరిట్ లిస్టులు పెట్టకుండా రూల్ పొజిషన్ పాటించకుండా బదిలీలు చేయడం ఏంటని వార్డు సచివాలయ ఎమినిటీస్ ఎదురు తిరగడంతో చేసేది ఏం లేక.. మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్పి బదిలీలు చేసే అధికారులు చెప్పుకొచ్చారు., కావాలని ప్రభుత్వం, అధికారులు సచివాలయ ఉద్యోగులకు నష్టం వాటిల్లే చేస్తున్నారంటూ అధికారులను నిలదీసిన ఉద్యోగులు విశాఖలో బాయ్ కట్ చేసి.. జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదుచేశారు.. ఒక్క విశాఖలోనే రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో చాలా చోట్ల బదిలీలు నిలిచిపోయాయి..!

గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులను కూటమి ప్రభుత్వం అంతా తిరకాసుగా చూస్తుందనే విషయం మారోమారు బదిలీల విషయంలో బయట పడింది. వాస్తవానికి ఉద్యోగులకు బదిలీలు చేయాల్సి వస్తే.. ఉద్యోగుల నియామకం సమయంలో వచ్చిన మార్కులు అధారంగా చేసిన మెరిట్ లిస్టుని బదిలీలు జరిగే టపుడు ఆన్ లైన్ చూపిస్తారు. సదరు ఖాళీలను ఉద్యోగులు వారి మెరిట్ లిస్టు ఆధారంగా ప్రదేశాలు ఎంచుకొని జాయిన్ అవుతారు. కానీ కూటమి ప్రభుత్వంలో మునుపెన్నడూ లేని విధంగా బదిలీలు ఆన్ లైన్ లో చేసుకోమని చెప్పి.. తీరా బదిలీలు జరిగే ప్రదేశానికి వెళ్లిన ఉద్యోగులకు అక్కడి అధికారులు తేడా వ్యవహారం చూసి కళ్లు బైర్లు కమ్మాయి.. ఒకఫారం ఇచ్చి అందులో మూడు ప్రదేశాలు ఎంచుకొని సంతకం చేసి ఇచ్చి వెళ్లిపోయి.. మూడు రోజుల తరువాత వస్తే మీకు బదిలీలు జరిగిపోతాయని చెప్పడంతో ఉద్యోగులంతా అధికారులపై తిరగబడ్డారు. 

తామేమీ చిన్నపిల్లలం కాదాని.. బదిలీలకు ఇతర ప్రభుత్వశాఖల మాదిరిగా మెరిట్ లిస్టు అంటూ ఉంటుందని.. దాని ప్రకారం చేయాలి తప్పితే మీకు నచ్చినట్టు చేయడం ఏంటని అధికారులను పట్టుకొని దులిపేశారు. ఆ మాటలను వీడియోలు తీసి 75 ప్రభుత్వశాఖల ఉద్యోగులు, అధికారులకు పంపడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా తెగ వైరల్ చేశారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా విశాఖతోపాటు చాలా చోట్ల బదిలీలను సచివాలయ ఉద్యోగులు బాయ్ కట్ చేశారు. అంతేకాదు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తమకు జరిగిన అన్యాయంపై మెమోరాండం కూడా సమర్పించారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులు మాట్లాడుతూ, ప్రభుత్వం తామంతట తామే ఉద్యోగాలను వదిలి వెళ్లిపోయే విధంగా వ్యవహరిస్తుందని.. దానికోసమే మునుపెన్నడూ లేనివిధంగా తేడా బదిలీలు జరుపుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కూటమి పరిపాలన వస్తే తమ బ్రతుకులు మారతాయనుకుంటే.. గత ప్రభుత్వం కంటే పరిస్థితి దారుణంగా ఉందని వాపోయారు. 

బదిలీలకంటే ముందు రేషనలైజేషన్ పేరుతో వార్డుల్లో 8 మంది ఉద్యోగులు మాత్రమే ఉండాలని కొన్ని పోస్టులు రద్దు చేశారని. వారిని ఖాళీలున్న సచివాలయాల్లో నియమించకుండా.. వారిని గాల్లోనే పెట్టి ఇపుడు సాధారణ బదిలీలు చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేస్తున్న బదిలీలు కూడా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా చేపడుతున్నారని దీనిపై డిఎస్సీ కమిటీ చైర్మన్ గా జిల్లా కలెక్టర్ కలుగజేసుకుంటే తప్పా, బదిలీల్లో జరుగుతున్న తేడా విధానానికి తెరపడేలా లేదని చెప్పుకొచ్చారు. అయితే జిల్లా కలెక్టర్లు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని కాదని ఏమీ చేయడానికి లేదు. ఇప్పటికే క్లస్టర్ విధానం కోసం జీఓలు వచ్చిన తరువాత రెండు సచివాలయాలు కలిపి ఒక సచివాలయ చేస్తూ.. రెండు సచివాలయాల్లోని సిబ్బందిని ఒక సచివాలయానికి మాత్రమే 8 మంది ఉండేలా చేసి కొందరు ఉద్యోగులను గాల్లో పెట్టారని కలెక్టర్లు, ఎమ్మెల్యేలకు వివరించారు ఉద్యోగులు. 

అంతేకాదు ఈ తేడా విధానంపై మీడియాలో పెద్ద ఎత్తు కథనాలు కూడా వెలువడ్డాయి. దానిపై స్పందించిన అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వం చేసే పనులకు వ్యతిరేకంగా తాము ఏమీ చేయలేమని చేతులు ఎత్తేశారు. ఇపుడు తీరా సాధారణ బదిలీల్లో కూడా మెరిట్ లిస్టు లేకుండా చేపడుతున్న విధానాన్ని ఉద్యోగులు వ్యతిరేకించడం, అధికారులు తేడాగా చేపడుతున్న బదిలీలను వీడియోలు తీసి మరీ వైరల్ చేయడంతో ప్రభుత్వం బదిలీల్లో చేస్తున్న తిరకాసు విధానం అందరికీ తెలిసింది. అందునా సచివాలయ ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో 15.4 గ్రామ,వార్డు సచివాలయాల్లో సుమారు 1.30 లక్షల మంది ఉండటంతో విషయం క్షణాల్లో వైరల్ అయ్యింది. ఈ విషయాన్ని అటు అధికారులు కూడా జిల్లా కలెక్టర్ కి, మీడియాకి  తెలియజేసినా ఫలితం లేకుండా పోయింది. 

బహుసా సచివాలయశాఖ రాష్ట్ర కార్యాలయం నుంచి నిర్ధిష్ట ఆదేశాలు, మెరిట్ లిస్టులపై సూచనలు వస్తే తప్పా... ఉద్యోగులు బదిలీల కౌన్సిలింగ్ లో పాల్గొనే అవకాశాలు కనిపించడం లేదు.  ఇతర శాఖల్లో వేల సంఖ్యలో రిటైర్ అయిన ఉద్యోగుల ఖాళీలను సచివాలయ ఉద్యోగులతో భర్తీచేయడం కోసం ఉద్యోగులను కుదించి.. వారిని వేరే ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేయడానికి చేపట్టిన క్లస్టర్ విధానం, ఆ పై మెరిట్ లిస్టు లేకుండా జరుగుతున్న బదిలీల ప్రక్రియ ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య ఇప్పటికే చాలా దూరాన్ని పెంచేసింది. దీని ప్రభావం రానున్న రోజుల్లో పరిపాలనపై చాలా దారుణంగా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందునా దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఒక్క ఆంధ్రప్రేదేశ్ లో మాత్రమే ఒక ప్రభుత్వ శాఖకు చట్టబద్దత లేకుండా, నిర్ధిష్టమై శాఖ లేకుండా, క్యాడర్ లేకుండా సర్వీసు నిబంధనలు , ప్రమోషన్ ఛానల్ లేకుండా నడుస్తున్న ఏకైన శాఖ గ్రామ, వార్డు సచివాలయ శాఖ మాత్రమే. 

ఇప్పటి వరకూ ఆన్ని విషయాల్లో  ఉద్యోగులనుంచి తీవ్ర వ్యతిరేకత మూటకట్టుకున్న ప్రభుత్వం ఇపుడు మెరిట్ లిస్టు లేకుండా అడ్డదారిలో వారికి కావాల్సిన వారికోసమే అన్నట్టు గా చేస్తున్న బదిలీల వ్యవహారంలో  చేస్తున్న పనులు మరింతగా సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం అంటే వ్యతిరేక కలిగేలా చేశాయి. ఇంత జరుగుతున్నా సచివాలయశాఖను ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ కిమ్మనడం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసిన తేడా విధానాల కంటే కూటమి ప్రభుత్వంలో మరింత తేడాగా వ్యవహరిస్తున్నారు అధికారులు.. ఈనేపథ్యంలో సచివాలయ ఉద్యోగుల బదిలీల విషయంలో ప్రభుత్వం ఏం క్లారిటీ  ఇస్తందనేది ఆశక్తి కరంగా మారింది..?!

visakhapatnam

2025-06-28 18:48:32

కూటమి ప్రభుత్వానికి షాక్.. రోడ్డెక్కనున్న సచివాలయ ఉద్యోగులు..?!

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు రోడ్డెక్కనున్నారు.. నిరసనలతో మొదలై.. పెన్ డౌన్ వరకూ తీసుకెళ్లే కార్యాచరణకు సిద్దపడు తున్నా రు..ఆరేన్నరేళ్లుగా కనీసం సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ ఇవ్వకపోగా.. నేడు క్లస్టర్ విధానంతో పోస్టులను కుదించి ఉద్యోగులను గాల్లోనే తమను పెట్టి నేడు సాధారణ బదిలీలు చేపడుతున్న ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు సిద్దమవుతు న్నారు..ఆంధ్రప్రదేశ్ లోని 75 ప్రభుత్వ శాఖలుంటే 74 ప్రభుత్వశాఖల ఉద్యోగులు వారికి శాఖలకు చెందిన విధులు మాత్రమే నిర్వహి స్తుంటే.. ఒక్క గ్రామవార్డు సచివాలయశాఖ ఉద్యోగులు మాత్రం మిగిలిన అన్ని ప్రభుత్వశాఖల విధులు చేయాల్సి వస్తున్నది.. ఆఖరికి కార్యాల యంలోని స్టేషనరీ ఖర్చులు, సెల్ ఫోన్లు, ఇంటర్నెట్ ఇవ్వకుండా ఒకేసారి నాలుగైదు సర్వేలు సొంత ఖర్చులతో చేయడం, వేళా పాలా లేకుండా అదనపు విధులు అప్పగించడం.. కనీసం వారంతంలో కూడా సెలవులు ఇవ్వకుండా.. ఇచ్చినా ఇంటి దగ్గర కూడా ప్రశాం తంగా లేకుండా అదనపు పనులు చెబుతున్న విధానాలపై ఉద్యోగులు ఒంటి కాలిపై లేస్తూ నేడు రాష్ట్రవ్యాప్త నిరసనకు సిద్దమయ్యారు..!

భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ చూడని ప్రభుత్వ శాఖను ఒక్క ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వంలోనే చూడవచ్చు. ఈ శాఖలో పనిచేసే ఉద్యోగులకు వారి శాఖ పనుల కంటే మిగిలిన శాఖల పనులు, సర్వేలు, ప్రభుత్వ పథకాల పంపిణీ మొత్తం వీరే చేసే విధులుంటాయి. ఇవన్నీ చేసినందకు ప్రభుత్వం అదనంగా ఇస్తున్న ప్రయోజనాలు తెలుసుకుంటే ఎవరికైనా దిమ్మ తిరిగి కళ్లు బైర్లుకమ్మాల్సిందే.. ప్రభుత్వ నిర్ధేశించిన సర్వేలు సమాయినికే చేసేయాలంటారు.. సెల్ ఫోన్లు, ఇంటర్నెట్ ఇవ్వరు..  రేషన్ కార్డులు, ఆధార్ కార్డ్, ఓటరు కార్డు, ఇతర పథకాలకు  ప్రజలచేత దరఖాస్తులు చేయించ మంటారు కార్యాలయంలో స్టేషనరీ ఇవ్వరు.. ఆ ఖర్చులనే ఉద్యోగులనే పెట్టుకోమంటారు.. కార్యాలయాల్లో పాడైన ప్రింటర్లు బాగు చేయించరు.. వాటిని కూడా ఉద్యోగుల ఖర్చుతోనే బాగుచేయించుకోమంటారు.. చీటికి మాటికి మండల కేంద్రాలు, జోనల్ కార్యాలయాల్లో సమావేశాలకు రమ్మంటారు టీఏ డీఏలు ఇవ్వరు కానీ కార్యాలయానికి పిలిచి అమ్మనా బూతులతో చీవాట్లు, తిట్ల పురాణం మొదలెడతారు..పైగా  షోకాజ్ నోటీసులు ఫ్రీ.. వార్నింగ్ లు ఆపై బోనసులే.. ప్రతీ నెలా పించన్లు ఉదయం పదగంటలకే ఇచ్చేయాలి.. అంటే ఉద్యోగులు తెల్లవారుజామున ఐదు గంటలకే విధులకు వెళ్లాలి.. సర్వేలు చేయాలి ఆ యాప్ లన్నీ విచిత్రంగా ఉద్యోగుల విధులు సాయంత్రం 5గంటలకి అయిపోతే ఆరో గంట నుంచి పనిచేయడం మొదలు పెడతాయి.. 

సమయానికి సర్వే రిపోర్టులు పర్శంటేజీలు రాకపోతే మండల అధికారులకి, జోనల్ అధికారులకి మనిషికొచ్చినంత కోపం వచ్చేస్తుంది.. ఆపై తెగ ఫీలపై ప్రెస్టేషన్ అంతా ఉద్యోగులపైనే చూపించేస్తారు.. కార్యాలయాలు చెత్తా చెదారంతో నిండిపోతే మహిళా ఉద్యోగులైతే చీపుర్లు పట్టుకొని వారే ఊడ్చుకోవాలి.. మగవాళ్లైతే చెత్తను బయట పారేయాలి.. ఆయాలు, చెత్త ఊడ్చే పనివారు ఉండరు.. మాత్రం పనులు చేసుకోలేరా.. పైగా అది మంచి ఎక్స ర్ సైజు ఉచిత సలహాలు ఇస్తారు.. పెట్టిన ఖర్చులకి బిల్లులు పెడితే  ఆ ఒక్కటీ అడక్కు అంటారు. ఇంతలా అధికారులు ప్రోత్సహించినా చచ్చో చెడో విధులు నిర్వహిస్తే వీడియో కాన్పరెన్సు, టెలీ కాన్ఫరెన్సు కాల్స్ లో పేరు పేరునా తిట్ల దండకం, పరువు తీయడం... అక్కడికీ అధికారులు జేబులో డబ్బులు జీతాలుగా  సచివాలయ ఉద్యోగులకు ఇచ్చేస్తున్నట్టు.. పాపం వారే ఉద్యోగాలు దయతలచి ఇచ్చినట్టు, ప్రభుత్వంలో ఏశాఖలోనూ లేని అధికారిగా తానే ఉన్నట్టు ఫీలైపోతుంటారు ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే..

ఇక రెండో వైపు చూస్తే.. ఆరున్నరేళ్లుగా కనీసం ఉద్యోగులకు పదోన్నతులు కల్పించని ప్రభుత్వశాఖగా గిన్నీస్ రికార్డు కూడా సంపాదించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని 75వ ప్రభుత్వశాఖ అయిన గ్రామ, వార్డు సచివాలయశాఖ. ప్రభుత్వశాఖ ఉద్యోగులకు సర్వీసు నిబంధనలు, క్యాడర్, ప్రమోషన్ ఛానల్ లేకుండా ఇన్నేళ్లు ఏ విధంగా పనులు చేయించారనే విషయం తెలిస్తే వార్త చదువుతున్నవారికే కాదు.. ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులకు కూడా గుండెళ్లో రైళ్లు పరిగెడతాయి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సర్వీసు నిబంధనలు, జ్యాబ్ క్యాడర్, ప్రమోషన్ ఛానల్, పీఆర్సీ ఫుల్ బెనిఫిట్స్ , నోషల్ ఇంక్రిమెంట్లు, సర్వీసు రెగ్యులరైజేషన్ ఇంక్రిమెంట్లు.. ఇవ్వాలంటే ముందుగా ఈ ప్రభుత్వ శాఖకు చట్టబద్ధత కల్పించాలి. అలా కల్పించాలంటే అసెంబ్లీలో ఆమోదం పొంది గెజిట్ నోటిఫికేషన్ రావాలి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అదిగో ఇదిగో అంటూ ఐదేళ్లు గడిపేసింది. రెండేళ్లు దాటినా ఉద్యోగాలు రెగ్యులర్ చేయకపోతే.. మీడియాలో వచ్చిన వరుస కథనాలతో పరువుపోతుందని భావించి రెండు సంవత్సరాల తొమ్మిదినెలలకు గానీ గత ప్రభుత్వం ఉద్యోగుల సర్వీసుని రెగ్యులర్ చేయలేదు. ఆ సమయంలో 9నెలల పేస్కేలు ఉద్యోగులకు నష్టం కలిగించి, సర్వీసు రెగ్యులర్ చేసిన తరువాత ఇవ్వాల్సిన రెండు ఇంక్రిమెంట్లు కూడా కోత విధించింది. 

అంతేకాదు పీఆర్సీ ఇస్తున్నామని చెప్పి పేస్కేలు పెంచి ఇతర ప్రయోజనాలు ఎగ్గొట్టింది.. ఆ తరువాత సచివాలయ ఉద్యోగులకు న్యాయం చేస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వ పాచికనే చక్కగా, పక్కాగా ఫాలో అవుతోంది. కనీసం సచివాలయ శాఖకు చట్టబద్దత కల్పించేందకు ఇన్నిసార్లు జరిగిన క్యాబినెట్ సమావేశాల్లో ఒక్కసారి కూడా వీరి అంశాలను చేర్చలేదు. అలా చేర్చి అసెంబ్లీలో చట్టబద్దత కల్పిస్తే ఖచ్చితంగా ఐదేళ్లు దాటిన ప్రభుత్వ ఉద్యోగులకు వీరందరికీ పదోన్నతులు ఇవ్వాలి. అలా ఇస్తే ఉద్యోగులకు రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి, పెంచిన పేస్కేలు అమలు చేయాలి. ఇవన్నీ చేస్తే ప్రభుత్వంపై అదనపు భారం పడుతుంది. దానికి బదులు సచివాలయ ఉద్యోగుల విషయంలో ఏమీ చేయకుండా ఎన్నికల హామీల్లా అది చేస్తాం.. ఇది చేస్తాం అని చేప్పి ఏమీ చేయకుండా వదిలేస్తే ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చే పనుండదు.. సరికదా ఖాళీగా ఉన్నఉద్యోగాలను భర్తీచేసే పని అసలే ఉండదు. ప్రభుత్వానికి మేలు జరగని అంశం కాబట్టి గత ప్రభుత్వంలోనూ, నేడు కూటమి ప్రభుత్వంలోనూ రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని 15 వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లోని సుమారు 1.30 లక్షల మంది ఉద్యోగులకు ప్రమోషన్ ఇవ్వకుండా, కనీసం సర్వీస్ రూల్స్ కూడా అమలు చేయకుండా అలాగే ఉంచేసింది.. 

వాస్తవానికి 2024 ఎన్నికల్లో సచివాలయ ఉద్యోగుల సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చిన కూటమి పరిపాలనలో ఏడాది పూర్తవుతున్నా వీరికోసం కనీసం పట్టించుకోకపోవడం వలనే.. ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయి సంబరాలు జరుపుతున్నవేళ ఉద్యోగులు నిరసన చేయడానికి పూనుకున్నారు. మొన్నటి వరకూ సచివాలయ మహిళా పోలీసుల అర్హతలను బట్టి వారిని సముచిత స్థానాల్లో కూర్చోబెడతామని చెప్పిన హోంశాఖ మంత్రి ప్రకటన తరువాత క్లస్టర్ విధానంతో అదే మహిళా పోలీసుల పోస్టులు రద్దు చేసి గాల్లో పెట్టినా నేటికీ హోం మంత్రి ఈ విషయంలో ఒక్క ప్రకటన కూడా చేయలేదు. రద్దు చేసిన పోస్టుల్లోని మహిళా పోలీసులను ముందుగా ఖాళీలు ఉన్న చోట భర్తీ చేయకుండానే సాధారణ బదిలీలకు తెరలేపారు. అంటే సాధారణ బదిలీలు జరిగితే.. క్లస్టర్ విధానంలో  పోస్టులు రద్దై గాల్లో ఉన్న మహిళా పోలీసులందరినీ ఎక్కడ నియమిస్తారో తెలియని పరిస్థితి. అన్ని ప్రభుత్వశాఖల్లో అటెండర్ల దగ్గర నుంచి గ్రూప్-1 అధికారుల వరకూ పదోన్నతులు కల్పిస్తున్న ప్రభుత్వం తమను మాత్రం గాలికొదిలేసి.. పదోన్నతులు, పీఆర్సీ ప్రయోజనాలు, సర్వీసు నిబంధనలు కూడా అమలు చేయకుండా వదిలేసిందని ఉద్యోగులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. 

తమ సమస్య ప్రభుత్వానికి తెలియజేసేందుకు వీలుగా నేటి నుంచి ఆందోళనకు సిద్దమవుతున్నామని చెబుతున్నారు. ప్రభుత్వానికి ఉపయోగపడేవిధానాలపై రాత్రికి రాత్రే జీఓలు ఇస్తున్నారని కానీ తమ ఉద్యోగులకు భద్రత కల్పించే విషయంలో మాత్రం ఎన్ని వినతులు సమర్పించినా కనీసం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు ఉద్యోగులు. ఈసారి ప్రభుత్వం స్పందించి పదోన్నతులు కల్పించి ఇతర 74 ప్రభుత్వ శాఖల ప్రభుత్వ ఉద్యోగుల  మాదిరిగా సర్వీసు నిబంధనలు అమలు చేయకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. కాకపోతే ఇవన్నీ గత ప్రభుత్వంలోనూ చూశాం.. మన ప్రభుత్వంలోనూ చూసి ఏవీ అమలు చేయకుండానే ఉద్యోగులతో ఇంకా అదనపు పనులు చేయిస్తున్నాం అన్నట్టుగానే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఉద్యోగులను మరింత ఆవేదనకు గురిచేస్తున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తుందా..? లేదంటే ప్రభుత్వానికి ఇష్టంలేని పనులు, నిరసనలు చేస్తున్నందుకు వీరిని టార్గెట్ చేసి జిల్లాల్లో కలెక్టర్లును, మున్సిపాలిటీల్లో కమిషనర్లను, మండలాల్లో ఎంపీడీఓలను, మున్సిపాలిటీల్లో జోనల్ కమిషనర్లు ఉసిగొల్పుతుందా అనేది వేచి చూడాలి..?!

Visakhapatnam

2025-06-22 19:12:20

కూటమి షాక్.. రద్దైన సచివాలయ మహిళా పోలీసు పోస్టులు.. మళ్లీ గాల్లోనే..?!

ఆంధ్రప్రదేశ్ సర్కారు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు చేపడుతున్న బదిలీలకు ఓ లెక్కుంది.. ఆ లెక్కలోనే కొన్ని చిక్కులు కూడా ఉన్నాయి.. ఆ చిక్కుముడులు విప్పే నాధుడు మాత్రం లేడు సరికదా.. బాధితులుగా మారిన మహిళా పోలీసులు వారి సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది.. ఐదేళ్లు దాటిన వారిని ఖచ్చితంగా స్థాన చలనం చేస్తామని ప్రకటించిన సర్కారు.. క్లస్టర్ విధానం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా కొన్ని సచివాలయాల్లో మహిళా పోలీసు పోస్టులను రద్దు చేసింది.. అలాగని వారికి ఖాళీలున్న స్థానాల్లో కూడా పోస్టింగ్ ఇవ్వలేదు.. వీరిని గాల్లోనే ఉంచి ఇపుడు సచివాలయ ఉద్యోగులకు బదిలీలు చేపడుతున్నది. ఈ నేపథ్యంలో ఉన్న స్థానాలన్నీ భర్తీ జరిగిపోతే.. రద్దైపోయిన పోస్టుల్లో ఉన్నవారిని ఎక్కడ నియమిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో ఎలాంటి విధి విధానాలు జిల్లా కలెక్టర్లకు కూడా రాలేదు. దీనితో వీరి సమస్య ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియనని పరిస్థితి నెలకొంది..!

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో ఇపుడు కొందరు మహిళా పోలీసులు గాల్లో ఉన్నారు.. రాష్ట్రప్రభుత్వం ఇటీవల క్లస్టర్ విధానం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా కొన్ని మహిళా పోలీసు పోస్టులను సచివాలయాల నుంచి తొలగించింది. ఎంతమందిని తొలిగించారో ఆ జాబితా కూడా గ్రామ సచివాలయాలకు సంంధించి ఎంపీడీఓ కార్యాలయాలకు, వార్డు సచివాలయాలకు సంబంధించి జోనల్ కార్యాలయాలకు  పంపింది. అలా రద్దైన పోస్టుల్లో ఉన్నవారికి ఖాళీలు ఉన్నట సచివాలయాల్లోనూ భర్తీచేయలేదు. అలాగని వారిని ఏ ప్రభుత్వ శాఖకు పంపిస్తారో కూడా చెప్పలేదు. ఈ లోగా వచ్చిన సాధారణ బదిలీలు వీరిని కలవర పాటుకి గురిచేస్తున్నాయి. ప్రస్తుతం రద్దైన మహిళా పోలీసులు క్లస్టర్ లో కలిసేందుకు వీలుగా కొన్ని సచివాలయాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ ప్రభుత్వం అక్కడ కూడీ వీరిని నియమించలేదు. ప్రస్తుతం ఐదేళ్లు దాటిన వారంతా బదిలీలకు దరఖాస్తులు చేసుకుంటున్నారు. అలా చేసుకున్నవారికి ఖాళీలను బట్టి ఆయ స్థానాలు ఆన్ లైన్ లో చూపించాల్సి వుంటుంది.

 అలాగని పోస్టులు రద్దు చేసిన వారిని ఏం చేస్తారో కూడా ప్రభుత్వం ప్రకటించలేదు. ఇందులో కొందరు మహిళా పోలీసులు బదిలీలపై వచ్చి విధుల్లో చేరారు. అలా చేరిన వారిలో కూడా కొంత మంది రద్దైన పోస్టుల్లో ఉన్నారు. అలాగని వీరు క్లస్టర్ లో కలిసే సచివాలయాల్లోని ఖాళీ పోస్టుల్లో బదిలీకి దరఖాస్తు చేసుకోవాలన్నా వీరికి ఆప్షన్ ఇవ్వలేదు. ఇపుడు వీరేం చేయాలో తెలియక ఆందోళన పడుతూ తమకు న్యాయం చేయాల్సిందిగా ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. అధికారుల ముందు ఈ విషయాన్ని పెడితే తమకు కూడా ఎలాంటి విధి విధానాలు లేవని.. ముందు ఐదేళ్లు దాటిన వారికి మాత్రం బదిలీలు చేస్తామని చెబుతుండటంతో మహిళా పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఐదేళ్లు దాటిన మహిళా పోలీసులందరూ బదిలీలకు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకుంటున్నారు. వీరికి బదిలీలు చేపడితే గాల్లో ఉన్న మహిళా పోలీసులకు మళ్లీ పోస్టింగ్ లు ఇవ్వడానికి కూడా ఖాళీలు ఉండవు. 

ఉన్నా ఎక్కడ ఏ జిల్లా చివరన ఉన్న స్థానాలు ఇస్తారో కూడా తెలియడం లేదని మహిళా పోలీసులు వాపోతున్నారు.  అలాగని క్లస్టర్ విధానం ఇంకా మొదలు కాలేదని చెబుతున్నా.. క్లస్టర్ పరిధిలోకి వచ్చే సచివాలయాల్లో కైనా తమకు పోస్టింగులు ఇవ్వలేదని చెబుతున్నారు. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతం అవుతున్నామని అంటున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఒక నిర్ధిష్ట సమాచారం లేకపోతే ప్రస్తుతం పోస్టులు రద్దై జాబితాలు వచ్చిన మహిళా పోలీసులకు బదిలీల అనంతరం ఎక్కడి స్థానాలు దక్కుతాయో తెలియని పరిస్థితి.  ప్రతస్తుతానికి గాల్లో ఉన్న మహిళా పోలీసులు తమ ఇబ్బందులను ప్రజాప్రతినిధులకు తెలియజేద్దామంటే విశాఖజిల్లాలో అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, జిల్లా అధికారులు అందరూ యోగాంధ్ర కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉన్నారని, తమ పరిస్థితి ఏంటో తమకు అర్ధం కవాడం లేదని వాపోతున్నారు. 

కాగా  ఈ విషయమై ఈరోజు-ఈఎన్ఎస్ విశాఖజిల్లా కలెక్టర్ ఎంఎన్.హరేంధిర ప్రసాద్ ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు. అయినప్పటికీ సచివాలయ మహిళా పోలీసులు పడుతున్న ఇబ్బందులను.. క్లస్టర్ విధానంలో పోస్టులు రద్దైన వారి సాంకేతిక సమస్యలను జిల్లా కలెక్టర్ చరవాణి దృష్టికి సమాచారాన్ని ఈరోజు-ఈఎన్ఎస్ ప్రతినిధి చేరవేశారు. విశాఖజిల్లాలో యోగాంధ్రా కార్యక్రమం పూర్తయ్యేవరకూ ఏఒక్క ప్రభుత్వ అధికారి గానీ, ప్రజాప్రతినిధిగానీ అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదు. ఈలోగా ఇప్పటికే మహిళా పోలీసులు ఇచ్చిన వినతులపై ఏమైనా ప్రభుత్వం నుంచి స్పందన వస్తుందేమోనని మహిళా పోలీసులు అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు.

visakhapatnam

2025-06-17 16:00:34

ఆదివారాల్లోనూ విధులంటే మాసిన బట్టలెవరు ఉతుకుతారు..?!

ప్రభుత్వ ఉద్యోగమంటే వారికేం.. నెల అయ్యే సరికి టంచనుగా జీతం వస్తుంది. ప్రతీ ఆరు నెలలకు ఒక ఇంక్రిమెంటు వస్తుంది.. ఆపై ఐదేళ్లకొకసారి పీఆర్సీ వచ్చి జీతం పెరుగుతంది. అసలు, సిసలు లక్ అంటే అనుకుంటారు అంతా. కానీ ప్రభుత్వ ఉద్యోగంలో వేళా పాలా లేని విధులు, కనీసం వారంతంలో ఒక్కరోజు కూడా సెలవు లేనితనం, సెలివిచ్చినా ఇంటిదగ్గర కూర్చొని కూడా చేసేంత పని ఇవ్వడం ప్రభుత్వం ఇపుడు పరిపాటి అయిపోయింది. పురుషులకైతే పెరిగిన గెడ్డం, మాసిన తల కటింగ్ చేయించుకోవడానికి ఖాళీ ఉండటం లేదు. మహిళా ఉద్యోగులకైతే ఆదివారాల్లో మాసిన బట్టలు సైతం ఉతుక్కోవడానికి సమయం దొరకడం లేదు. అదేమంటే రాష్ట్రప్రభుత్వంలో పేరుకి, పేపరు మీద మాత్రమే రెండవ శనివారాలు, ఆదివారాలు, పండుగరోజులు, ప్రత్యేక రోజులు సెలవు రోజులు. ప్రభుత్వ రికార్డుల్లో కూడా సెలవులుగానే నమోదు చేసి ఉంటాయి. 

కానీ వీరికి వారమంతా పనే వుంటుంది. ఒక్కోసారి అదనంగా పనిచేయాల్సి వస్తే ఏ సమయంలో కార్యాలయంలో కూర్చొని పనిచేయాలో వారం రోజులు ముందుగానే వీడియో కాన్ఫరెన్సు, టెలీ కాన్ఫరెన్సు పెట్టి చెప్పేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకి కుటుంబాలు, పనులు ఉండావా ఉంటాయి. కానీ ప్రభుత్వానికి, ప్రజలకి మాత్రం కావాల్సిన సమయానికి పనులు చేయాలి. ప్రజలకు నిరంతరం పనులు చేస్తూ పోతే.. వీరికెప్పుడు సెలవులు రావాలి..? అంటే వస్తాయ్ కేవలం కాగితాలపైనే. రాష్ట్రప్రభుత్వంలోని 75 ప్రభుత్వ శాఖలు, 26 జిల్లాల్లోని లక్షల మంది ఉద్యోగులను రాష్ట్రప్రభుత్వం చెప్పినట్టు చేయాల్సిందే. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం చూస్తామని ఎప్పుడూ బాకాలు ఊదే ప్రభుత్వం ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగులకు ఏం చేసిందో ఆలోచిస్తే.. అసలు విషయం తెలుసిసొస్తుంది అంటున్నారు ఉద్యోగులు. నిజంగా ప్రభుత్వం ఉద్యోగులకు సంక్షేమం చేయాలనుకుంటే.. ప్రభుత్వ సెలవు దినాల్లో పనులు పురమాయించకుండా.. అదనపు విధులు ముందుగానే అప్పగించకుండా ఉందే అదే ప్రభుత్వ ఉద్యోగులకు అసలైన సంక్షేమం చేసినట్టుగా బావిస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. 

ప్రభుత్వానికి నచ్చినట్టుగా వేళా పాలా, సెలవు దినాల్లోనూ అదిరించి, బెదిరించి పనులు చేయించుకుంటున్నా.. ఉద్యోగులకు మాత్రం వారి సర్వీసు నిబంధనల ప్రకారం పదోన్నతులు,  ఇంక్రిమెంట్లు, ఖాళీల్లో సిబ్బంది నియమాకాలు మాత్రం చేపట్టడం లేదు. పేరుకే ప్రభుత్వ ఉద్యోగి అయినా సాధారణ ప్రజలు మాదిరిగా వారి తరహాలో వారు ఆందోళన చేస్తే తప్పా వారి సమస్యలు పరిష్కారినికి నోచుకోవడం లేదు. నాల్గవ తరగతి ఉద్యోగి నుంచి ఐఏఎస్ అధికారి వరకూ ఇపుడు ఖాళీకూడా లేకుండా పనులు పురమాయిస్తున్నది ప్రభుత్వం. ఒక రకంగా ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల్లో అవినీతి పెరిగిపోవడానికి కూడా రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే అంటున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. ఇంట్లో కుటుంబాలతో వారంలో ఒక్కరోజు కూడా గడపలేని ప్రభుత్వం ఉద్యోగం చేసి ప్రజలకి ప్రభుత్వానికి ఊడిగం చేయడానికి కాదు అన్నట్టుగా చేసిన పనికి.. అందునా వేగంగా చేసే పనులకు లంచాలకు అలవాటు పడుతున్నారు. వినడానికి, చదవడానికి వింతగా ఉన్నా ఇది పక్కా నిజం. కనీసం వారాంతంలోనైనా సెలవు ఇవ్వకపోతే ఇంట్లో మాసిన బట్టలు ఎప్పుడు ఉతుక్కోవాలంటూ వాపోతున్నారు. 

అంతేకాదు  పేరుకి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ విధులు అని చెబుతున్నా, ప్రతీరోజూ ఏడు, ఎనిమిది వరకూ చేయాల్సి పనులు కార్యాలయాల్లో ఉంటున్నాయి. దానికి కారణం కూడా లేకపోలేదు. భారీగా ఏర్పడ్డ ఖాళీలను భర్తీచేయకపోవడంతో ఉన్న సిబ్బందే మిగిలిన పనులను వంతుల వారీగా వేసుకొని మరీ చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. గత ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయ శాఖను ఏర్పాటు చేసి సుమారు 1.30 లక్షల మంది ఉద్యోగులను 26 జిల్లాల్లో 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లో నియామకాలు చేపట్టినా.. ఇతర శాఖల ఉద్యోగుల కంటేవీరికి మరీ అప్పగించేస్తున్నది రాష్ట్రప్రభుత్వం. మరీ పనులు లేకుండా జీతాలు ఎలా ఇస్తారనే డౌట్ మీకు రావొచ్చు.. వీరితో విధినిర్వహణ సమయంలో పనులూ చేయించేసి.. అదనపు పని గంటలుగా సర్వేలు, ఆన్ లైన్ వివరాల నమోదులంటూ ఊరిమీదకి వదిలేస్తున్నారు. ఆ సమయంలో పనిచేసేందుకు మొబైల్ ఫోన్లు గానీ, ఇంటర్నెట్ గానీ ప్రభుత్వం ఏమీ మంజూరు చేయడంలేదు. 

అలాగని పనిచేయకపోతే బెదిరింపులు, అదిరింపులు, షోకాజ్ నోటీసులు.. ఈ మధ్య మరో అడుగు ముందుకేసి నెలలో రెండు మూడు రోజులు జీతాలు కటింగ్ చేయడం, కార్యాలయాలకి పిలిపించుకొని ప్రత్యేకంగా సమయం తీసుకొని మరీ తెలుగులో ఉన్న బూతులన్నీ తిట్టడం అబ్బో ఒకటి కాదు రెండు కాదు చాలా వ్యవహారాలే జరుగుతున్నాయంటున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. ఇవన్నీ ప్రభుత్వానికి తెలియవని బావిస్తున్నారా అంటే.. అన్నీ తెలిసే జరుగుతున్నాయి. ఇన్ని పనులు ఉద్యోగాలు తీసేస్తామని బెదిరించి చేస్తున్నారు కదా.. ఉద్యోగులకు సకాలం ఇవ్వాల్సిన ప్రయోజనాలు ఇస్తున్నారంటే.. ఇది రాష్ట్రప్రభుత్వం అలాంటివి ఉద్యోగులు అడక్కూడదు.. ఇచ్చినపుడు మాత్రమే తీసుకోవాలని మాత్రం తెలివి సమాధానమిస్తున్నది ప్రభుత్వం. పోనీ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్లు అయినా కాస్త ముందుకి వచ్చి పరిష్కరిస్తారా అంటే అవి కూడా కాగితాలకే పరిమితం అవున్నాయి.

 భారతదేశంలోనే ఏ రాష్ట్రప్రభుత్వంలోనూ లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే సర్వీసు రూల్స్, ఉద్యోగికి క్యాడర్, ప్రమోషన్ ఛానల్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారంటే ఆశ్చర్యం కలుగక మానదు.  అలాంటి నూతన సంస్క్రుతికి తెరతీసిన ఘనత కూడా గత ప్రభుత్వానికి దక్కుతుంది. దానిని కొనసాగిస్తున్న కీర్తి ప్రతిష్టలు కూటమి ప్రభుత్వానికే దక్కుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతా చేసి ప్రభుత్వ ఉద్యోగులు 12నెలల్లో ఒక నెల జీతం ఇన్కం టాక్స్ లుగా ప్రభుత్వానికే చెల్లించేస్తారనే విషయం మీలో ఎంతమందికి తెలుసు. కొందరు జిల్లా అధికారులైతే రెండు నెలల జీతం కూడా ఐటి రిటర్న్స్ సమయంలో సమర్పించాల్సి వుంటుంది.

ఇంత చేసినా, ఏడాదికి నెల, రెండు నెలల జీతం కోల్పుతున్నా, సమయానికి ఇంక్రిమెంట్లు గానీ, పదోన్నతులు గానీ రాకపోయినా.. ఖచ్చితంగా ఆదివారాలు, రెండం శనివారాలు, ఇతర ప్రత్యేక శెలవు రోజుల్లోకూడా పనిచేయాల్సిందే. మేము ఇవ్వాల్సినవి చట్టపరంగా ఇవ్వడం కుదరదు కానీ.. మేము చెప్పినట్టుగా సెలవుల్లో పనులు చేయకపోతే మాత్రం కఠిన చర్యలు తప్పవని మాత్రం ఆదేశాలిస్తున్నది రాష్ట్రప్రభుత్వం.(ఇక్కడ మహిళా ఉద్యోగుల ప్రధనా సమస్యలపై రాయకూడని విషయాన్ని ప్రస్తావించలేకపోతున్నాం.. కానీ కొందరు మహిళా ఉద్యోగులు మాత్రం బహిరంగంగానే ప్రభుత్వ తీరుని చాలా దారుణంగా ఎండగడుతున్నారు. ఈ విధానం మంచిది కాదని మండి పడుతున్నారు)        

visakhapatnam

2025-06-13 14:12:32

కూటమి ప్రభుత్వంలోనూ వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలకు ఏడాది..!

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను పట్టించుకోలేదనుకుంటే.. నేడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలు ఏడాది కాలంలో పట్టించుకున్న దాఖలాలు అయితే కపించడం లేదు. జర్నలిస్టులు ఏం పాపం చేశారనో వారికి గత ప్రభుత్వమూ.. ఈ ప్రభుత్వమూ కనీసం ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయడానికి ముందుకి రాలేదు. కానీ ప్రభుత్వాలకు ప్రచారం కల్పించడానికి, రాజకీపార్టీల నిరసనలు తెలియజేయడానికి మాత్రం మీడియా కావాలి. అదే మీడియాని అధికారంలోకి వచ్చిన తరువాత వారి కోసం కనీసం పట్టించుకోరు. ప్రతిపక్షంలో ఉన్నంత కాలం తాము అధికారంలో వస్తే ఇక చూడండి అన్నపార్టీలన్నీ తీరా అధికారంలోకి వచ్చిన తరువాత.. ఆ ఒక్కటీ అడక్కు అన్నట్టుగానే వ్యవహరిస్తున్నాయి. గత ప్రభుత్వం జీఓ నెంబరు-38ని తీసుకొచ్చి స్థానిక పత్రికలను పాతాళానికి తొక్కేసి సొంత మీడియాకి వందల కోట్ల రూపాయలు ప్రకటనలు ఇచ్చుకుంటే.. ఇపుడు కూటమి ప్రభుత్వం కూడా అందుకు తీసీపోదునా అన్నట్టుగానే వ్యవహరిస్తున్నది. 

కాకపోతే గుడ్డిలో మెల్ల ఏంటంటే ఈసారి కూటమి ప్రభుత్వంలో స్థానిక పత్రికలకు అదీ ఎంపానల్ మెంటు ఉన్న పత్రికలకు మాత్రమే కొద్దో గొప్పో ప్రకటనలు ఇస్తున్నది. మళ్లీ ఎంపానల్ మెంట్ లేని పత్రికలను పూర్తిగా పక్కన పెట్టేసింది.  ఈ పరిస్థితి గత ప్రభుత్వంలో అస్సలు లేనే లేదు. ఒక దశలో జర్నలిస్టులు అనే వారిని  లేకుండా చేయాలని కూడా ప్రయత్నించింది. కనీసం వారికి ప్రభుత్వం ద్వారా ఇచ్చే గుర్తింపు కార్డు ప్రెస్ అక్రిడిటేషన్ కూడా రాకుండా చూడాలని శక్తివంచన లేకుండా కృషి చేసి సదరు ప్రభుత్వంలో తీసుకొచ్చిన జీఓలను పక్కాగా అమలు చేసింది. ఇపుడు ఆ జీఓలకు వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వంలోనైనా జర్నలిస్టులకు, స్థానిక పత్రికలకు అనుకూలంగా కొత్త జీఓలు వస్తాయనుకుంటే వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఆది నుంచి టిడిపి ప్రభుత్వం మీడియామీద, పత్రికల మీద అంత కక్ష, కోపం అయితే పెట్టుకోలేదు. ఆ నమ్మకమే ఇంకా జర్నలిస్టుల్లో వుంది. కాని మీడియా అంటే పెద్ద పత్రికలు, శాటిలైట్ టీవీ ఛానళ్లే కాదు. స్థానికంగా ఉండే పత్రికలను కూడా పత్రికలుగా గుర్తించాలి. 

ఇక్కడ కనీసం కొలమానం దినపత్రికలను అచ్చువేసే విధానం సరిగ్గా జరుగుతుందా లేదా..? కేంద్ర, రాష్ట్రప్రభుత్వ నిబంధనల మేరకు రికార్డులు మెయింటేన్ చేస్తున్నారా..? పత్రికలు ప్రజల్లోకి వెళుతున్నాయా లేదా అనే విషయాలను ఖచ్చితంగా గుర్తించి నిబంధనలు పాటించే పత్రికలు చిన్నగా ప్రభుత్వ ప్రకటనల చేయూత అందిస్తే పత్రికల మనుగడ, జర్నలిస్టుల బ్రతుకు తెరువుకి కాస్త ఊపిరి వస్తుంది. కానీ ప్రభుత్వాలు మాత్రం ఈ విషయంలో కఠినంగానే వ్యవహరిస్తున్నాయి. 75ఏళ్ల స్వాతంత్ర్య భారత దేశంలో కేంద్రప్రభుత్వాలు మేలు చేస్తే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం రాయితీపై ఇచ్చిన రైల్వే పాసులును తొలగించింది. జర్నలిస్టులు ఒకటి అరా చేసే ప్రయాణాలకు రైల్వేకి అంతేమీ లాసు, నష్టం రాదు. కానీ ప్రజలకోసం, ప్రభుత్వ పథకాలకోసం, రాజకీయపార్టీల కోసం పనిచేసే జర్నలిస్టులకు రాయితీ రైల్వే పాసు ఎందుకు అనుకుందో ఏమో దానిని 2019లోనే తొలగించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకున్న నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్థానిక దినపత్రికలకు ప్రెస్ అక్రిడిటేషన్లు పొందకుండా దేశంలో ఎక్కడా లేని నిబంధనలు తీసుకొచ్చి.. అక్రిడిటేషన్లు పదుల సంఖ్య నుంచి నాలుగైదుకి కుదించేసింది. 

గతంలో మండల విలేఖరికి అక్రిడిటేషన్ ఉండేది. ఆ విధానాన్ని తొలగించి నియోజకవర్గ కేంద్రానికి ఒక అక్రిడిటేషన్ విధాన్నాన్ని తెరమీదకు తీసుకువచ్చారు. ఆ దెబ్బతో చాలా మంది కనీసం గుర్తింపు లేని మీడియా రంగంలో ఎందుకులే అని ఇక్కడి పూర్తిగా బయటకు వెళ్లిపోయారు. కనీసం జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ లు, 60ఏళ్లు దాటితే కనీసం పెన్షన్ వంటి చేయూతనిచ్చే స్కీములు కూడా లేవు. ప్రస్తుతం జర్నలిస్టులకు ప్రభుత్వ హెల్త్ కార్డులు ఉన్నా అదే ప్రభుత్వం నెట్వర్క్ ఆసుపత్రలుకు బిల్లులు చెల్లించకపోవడంతో అక్కడ సదరు కార్డులపై వైద్యం కూడా చేయడంలేదు. అటు జర్నలిస్టులపై దాడులను నియంత్రించడానికి గతంలో ఉండే అటాక్స్ కమిటీలు కూడా లేవు. జర్నలిస్టుల ప్రధాన సమస్యలపై జర్నలిస్టు సంఘాలను పోరాటాలు చేయమంటే..ఆయా పార్టీలకు అనుకూలంగా కేవలం ప్రచారాల కోసం మాత్రమే కార్యక్రమాలు చేస్తున్నాయి జర్నలిస్టు సంఘాలు. 

ప్రజల సమస్యలను ప్రభుత్వ కార్యక్రమాలను ఎప్పటి కప్పుడు అన్నివర్గాలకు అందించే జర్నలిస్టులు,మీడియా.. ఇపుడు వారి సమస్యలను కూడా వార్తలుగా రాసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రతిపక్షంలో ఉండగా ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అధికారంలోకి వచ్చిన తరువాత జర్నలిస్టులకోసం అమలు చేయకపోవడంతో ఇపుడు కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న సందర్భంగా పరిష్కారం కాని సమస్యలపై వార్తలు రాయాల్సి వస్తున్నది. ప్రజల్లోప్రజలుగా.. ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉన్న జర్నరలిస్టుల సమస్యలు కూడా ప్రభుత్వం.. అందునా కూటమి ప్రభుత్వం పట్టించుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 65వేల మంది జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం ప్రభుత్వానికి పెద్ద కష్టమేమీ కాదు. లేదంటే వచ్చే ఏడాది కూడా ఈ సమాయానికి జర్నలిస్టుల సమస్యలకు రెండేళ్లు అని వార్త రాసుకోవడం తప్పా వర్కింగ్ జర్నలిస్టులు ఏమీ చేసుకోలేని స్థితి నేటి జర్నలిస్టులది..?!

visakhapatnam

2025-06-04 20:13:20

సచివాలయ ఉద్యోగులకు షాక్.. నిన్న ఆప్షన్లు ఇచ్చారు.. నేడు తొలగించారు..?!

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు(GSWS) ఆశ కల్పించి.. హడావిడి చేసి.. ఏమీ చేయకుండా గత వైఎస్సార్సీపీ(YSRCP) ప్రభుత్వం కంటే తాత్సారం చేయడానికి ఒక సాకు ప్రభుత్వానికి భలే దొరికింది.. చేసేది ప్రభుత్వ ఉద్యోగమే అయినా నేటికీ ప్రభుత్వశాఖ లేని సచివాలయ మహిళా పోలీసులకు డిపార్ట్ మెంట్ స్లైడింగ్(OPTIONS) అంటూ సీఎఫ్ఎంఎస్ లాగిన్ లో ఆప్సన్లు అందుబాటులోకి తెచ్చి..  కాస్త ఊరించి మళ్లీ తొలగించేసిన ప్రభుత్వం.. ఎన్నాళ్లో వేచిన ఉదయం అంటూ.. ఆన్ లైన్ లో ఆప్షన్లు చూసుకుని ఆనంద పడిన క్షణం పాటు కూడా ఆప్షన్లు ఆన్ లైన్ లో ఉంచకుండా తీసేసి ఉద్యోగులను త్రిశంఖు స్వర్గంలో ఉంచేసింది కూటమి సర్కారు(TDP)..తలా తోకా లేకుండా సచివాలయ శాఖను ఏర్పాటు చేసి వారిని గాల్లోపెట్టి, వారి జీవితాలతో ఆడుకుందంటూ అసెంబ్లీలో చర్చకు లేవనెత్తిన కూటమి సర్కారు.. తీరా అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా  ఉద్యోగుల సమస్యను పరిష్కరించకపోగా.. ఇంకాస్త జఠిలం చేస్తున్నట్టుగానే కనిపిస్తున్నది.. కూటమి వచ్చింది కష్టాలు తొలగిపోతాయనుకుంటే.. ఉన్నబాధలు రెట్టింపై తమకు ప్రభుత్వ శాఖ కేటాయింపు మరింత ఆలస్యం అయ్యేలా వుందంటున్నారు మహిళా పోలీసులు..!

మీడియా(MEDIA)లో వార్తలు వస్తున్నాయంటే ఊరకే వస్తాయా..? ప్రభుత్వంలో తేడాగా చేసే పనులు బట్టే పత్రికలు, టీవీల్లో చేసిన పనులను ఎండగడుతూ వార్తలొస్తాయి అంటున్నారు విశ్లేషకులు.. ఇంతకీ ఏం జరిగిందని అడగరేం..? వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయశాఖను తలా తోకా లేకుండా ఏర్పాటు చేసి ఉద్యోగులకు కనీసం సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్, ప్రభుత్వశాఖ, నిర్ధిష్టమైన క్యాడర్ అంటూ ఇవ్వలేదని..ఇదేనా పరిపాలనా విధానమంటూ అసెంబ్లీ సాక్షిగా చర్చకు లేవనెత్తిన కూటమి సర్కారు గత ప్రభుత్వం కంటే దారుణంగా తాత్సారం చేస్తున్నట్టు అధికారికంగానే కనిపిస్తున్నది. దానికి ఉదాహరణ గ్రామ, వార్డు సచివాలయశాఖ మహిళా పోలీసులకు ప్రభుత్వశాఖ కేటాయించడానికి తీసుకొచ్చిన డిపార్ట్ మెంట్ స్లైడింగ్ అంశమే. కోర్టు కేసుల కారణంగా నేటి వరకూ గాల్లోనే ఉన్న సచివాలయ మహిళా పోలీసులకు డిపార్ట్ మెంట్ స్లైడింగ్ ఇస్తామని చెప్పి వారిలో ఆశలు రేపిన ప్రభుత్వం ఆన్ లైన్ లో ఐసిడిఎస్, పోలీసుశాఖ రెండు ఆప్షన్లు ఇచ్చి ముచ్చటగా మూడు రోజులు ఉంచి మళ్లీ వాటిని ఆన్ లైన్ లో ఉలుకూ పలుకూ లేకుండా చేసింది. దీనిని సాకుగా చూపి ఉద్యోగుల  సాధారణ బదిలీలను కూడా నిలిపివేసింది. డిపార్ట్ మెంట్ స్లైడింగ్ ద్వారా అయినా తమకు ఒక నిర్ధిష్ట ప్రభుత్వ శాఖ కేటాయింపు జరుగుతుందని ఆశపడిన మహిళా పోలీసులకు ఆ ఆశ కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలింది. ఇచ్చిన ఆప్షన్లు ఆన్ లో డిజేబుల్ చేసేశారు. ఇపుడు కనీసం చూడటానికి కూడా వీలు లేకుండా పోయింది.

-ప్రభుత్వశాఖలు(AP GOVT) సరే ఏ క్యాడర్ ఇస్తారు..?
సచివాలయ మహిళా పోలీసులకు రెండు ప్రభుత్వశాఖలను ఆన్ లైన్ స్లైడింగ్ ఆప్షన్లు ఇచ్చిన ప్రభుత్వం వారికి ఏ క్యాడర్ ఇస్తుందో తెలియజేయలేదు. వాస్తవానికి రాష్ట్రప్రభుత్వంలో ఒక ప్రభుత్వశాఖ ఏర్పాటు చేస్తే దానికి నాల్గవ తరగతి ఉద్యోగం నుంచి గ్రూప్-1 క్యాడర్ ఉద్యోగం వరకూ పదోన్నతులు, డైరెక్ట్ రిక్రూట్ మెంట్ విధానం అంతా ముందుగానే పొందు పరుస్తారు. కానీ విచిత్రంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రభుత్వంలోని మాతృశాఖల ద్వారా సచివాయల ఉద్యోగులను నియమించినా.. వారికి నిర్ధిష్టమైన క్యాడర్, సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయలేదు. దానితో వీరంతా ఉద్యోగాల్లోకి వచ్చి ఐదేళ్లు దాటిపోతున్నా నేటికీ పదోన్నతులు లేకుండా ఇంకా అలాగే ఉన్నారు. అందులో ఒకటి కోర్టు కేసు కారణం అయితే, రెండవది హైకోర్టుకి గత ప్రభుత్వం అఫడవిట్ దాఖలు చేయడం. గత ప్రభుత్వం చేసిన తప్పునే కూటమి ప్రభుత్వం కూడా కొనసాగిస్తున్నది తప్పితే.. చేసిన తప్పుని సరిచేసి ఉద్యోగులకు న్యాయం చేయాలనే తలంపు ఉన్నట్టు ఎక్కడా కనిపించలేదు. దానికి కారణం కూడా లేకపోలేదు. మహిళా పోలీసులకు ప్రభుత్వ శాఖ కేటాయిస్తామని రెండు శాఖల ఆప్షన్లు ఇచ్చిన ప్రభుత్వం  వారికి ఏశాఖ సర్వీసు రూల్స్ వర్తిస్తాయో చెప్పే విధివిధానాలు రూపొందించకుండా కేవలం ఆప్షన్లు మాత్రమే ఆన్ లైన్ లో పెట్టి మూడు రోజులు హడావిడి చేసి మళ్లీ వాటిని డిసేబుల్ చేసేసింది.

-ఇప్పటి వరకూ చేసిన సర్వీసు(AP GOVT SERVICE) లెక్కిస్తారా..?
గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులకు ప్రభుత్వం ఇవ్వాలనుకుంటున్న ప్రభుత్వశాఖల ఆప్షన్లలో ఏ శాఖ ఎంచుకుంటే ఆశాఖలోకి తీసుకున్న తరువాత ఇప్పటి వరకూ చేసిన సర్వీసుని లెక్కిస్తారా..? లేదంటే డిపార్ట్ మెంట్ స్లైడింగ్ ఇచ్చాం కదా మళ్లీ మరో ఐదేళ్లో, ఏడోళ్లో పనిచేయించిన తరువాత పదోన్నతి కల్పిస్తారా..? అనే విషయం మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు న్యాయం చేయాలని భావిస్తే.. ప్రస్తుతం వీరికి ఇచ్చిన రెండు ప్రభుత్వ శాఖలు ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారిని ఎంచుకో మని చెప్పిన తరువాత.. ఆ ప్రభుత్వశాఖలో ఇప్పటి వరకూ చేసిన సర్వీసును లెక్కించాల్సి వుంటుంది. ఆ తరువాత ఆ సీనియారిటీ ప్రకారం ఎంచుకున్న శాఖలో సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ అమలు చేసి దానిని పరిగణలోకి తీసుకొని వారికి పదోన్నతులు కల్పించాల్సి వుంటుంది. కానీ ప్రభుత్వం ఇపుడు వారికి కేవలం ప్రభుత్వశాఖ మాత్రమే కేటాయించి వారి సేవలను యధావిధిగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గా సచివాలయాల్లోనే వినియోగించుకుంటే మాత్రం వీరికి పదోన్నతులు రానట్టే లెక్క. అంటే కొత్తగా మళ్లీ ప్రభుత్వశాఖలోకి వస్తున్నారు కనుక సర్వీసు నిబంధనల ప్రకారం మరో ఐదేళ్లో, ఏడేళ్లో సర్వీసు చేస్తేనో తప్పా వీరికి పదోన్నతులు వచ్చే పరిస్థితి ఉందడు. ప్రస్తుతం ఇదే అంశాన్ని రాష్ట్రప్రభుత్వం కూడా చాలా లోతుగా ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తున్నది. ఆకారణంగా ఆన్ లైన్ లో డిపార్ట్ మెంట్ స్లైడింగ్ ఇచ్చిన మూడ్రోజుల్లే మళ్లీ దానిని మూసేసిందని చెబుతున్నారు. దానికితోడు సచివాలయాల రేషనలైజేషన్ ప్రక్రియ మొదలు కావడండ ఒక కారణమైంది.

-రాష్ట్రప్రభుత్వం(AP GOVT) తలచుకుంటే  అది ఒక్కరోజు పని
సచివాలయ మహిళాపోలీసులతోపాటు, నేటికీ సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్, క్యార్ అలాట్ మెంట్ లేని సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం న్యాయం చేయాలంటే అది ఒక్కరోజు పని. ఏ విధంగా, ఏ ప్రభుత్వశాఖల ద్వారా సచివాలయ ఉద్యోగులను నియమించారో ఆ శాఖల అధిపతులతో సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కానీ రాష్ట్రప్రభుత్వం ఆ పనిచేయడం లేదు. ప్రభుత్వానికి కావాల్సిన సర్వేలు, ఒక ఉద్యోగితో ఐదారు ప్రభుత్వశాఖల పనులు చేయించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు తప్పితే ఉద్యోగుల జఠిలమైన సమస్యను పరిష్కరించడానికి మాత్రం సమయం కేటాయించడం లేదు. అలాగని కొందరు మంత్రులు నేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి  సమస్యలను తీసుకెళ్లినా.. అన్ని ప్రభుత్వశాఖల నుంచి దరఖాస్తులు వచ్చిన తరువాత చేద్దామని ప్రభుత్వంలోనే కొర్రీ వేసుకొని కూర్చున్నారు. కనీసం ముందుగా కొందరు మంత్రులు(పట్టణ పురపాలకశాఖ మంత్రి నారాయణ, వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పోలీసుశాఖ అనిత) శాఖలకు చెందిన ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిశీలన చేసి  ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి ఉంటే.. వారి శాఖల ఉద్యోగుల సమస్యల సమస్యలు పరిష్కారం అయ్యాయి.. మనశాఖ ఉద్యోగుల సమస్యల ను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే తపన ఇతర శాఖల మంత్రుల్లో వచ్చి ఉండేది. కానీ ఆ ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయలేదు.

-భారీగా ప్రయోజనాలు(BENEFITS) కోల్పోతున్న సచివాలయ ఉద్యోగులు
ప్రభుత్వం చేస్తున్న ఆలస్యం కారణంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇతర 74ప్రభుత్వశాఖల(AP GOVT DEPTS) ఉద్యోగులకు వచ్చే ప్రయోజనాలను సైతం వీరు కోల్పోవాల్సి వస్తున్నది. అసలే రెండేళ్లకు జరగాల్సిన సర్వీసు రెగ్యులైజేషన్ తొమ్మిది నెలలు ఆలస్యంగా జరిగింది. అపుడు తొమ్మిది నెలలు పేస్కేలు కోల్పోయారు.. సర్వీసు రెగ్యులర్ అయిన తరువాత ప్రభుత్వం కలపాల్సిన రెండు ఇంక్రిమెంట్లు కలపలేదు.. అవి, వాటితో వచ్చే అరియర్స్ కోల్పోయారు. గత ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీలో పెంచిన జీతం తప్పా ఇతర ప్రయోజనాలు ఏమీ సచివాలయ ఉద్యోగులు పొందలేదు. దానికోసం కూడా నేటి వరకూ ఎవరూ మాట్లాడనుకూడా మాట్లాడలేదు. పేరుకి సచివాలయ ఉద్యోగుల యూనియన్లు ఉన్నా.. వారికి ప్రధాన సమస్యలపై పోరాటాలు.. ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు వచ్చే ప్రయోజనాలు తామూ పొందాలనే విషయంలో మాత్రం ముందుడుగు వేయడం లేదనేది నేటి వరకూ పరిష్కారం కాని ఉద్యోగుల ప్రధాన సమస్యలే తేటతెల్లం చేస్తున్నాయి. ఇపుడు కూడా సాధ్యమైనంత త్వరలో సచివాలయ ఉద్యోగులకు క్యాడర్, సర్వీస్ రూల్స్, మహిళా పోలీసులకు డిపార్ట్ మెంట్ అలాట్ మెంట్ కాకపోతే ఇంకెంత నష్టపోవాల్సి వస్తుందో అర్ధంచేసుకోవచ్చు. 

అంతేకాకుండా ప్రస్తుతం ఇచ్చే ప్రభుత్వశాఖల్లో నిబంధనలు అనుకూలించకపోతే మళ్లీ మరో ఐదేళ్లో, ఏడేళ్లో.. లేదంటే ప్రభుత్వం అవకాశం కల్పించే వరకో పదోన్నతుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తలా తోకా లేకుండా సచివాలయ శాఖ ఏర్పాటు చేసి ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేసిందని అసెంబ్లీ సాక్షిగా చర్చకు తెరలేపిన కూటమి ప్రభుత్వం ఇపుడు అదే సచివాలయ ఉద్యోగులకు న్యాయం చేసే విషయంలో, సమస్యలు పరిష్కరించే విషయంలో నిర్ధిష్ట విధివిధానాలు ఇంకా రూపొందించక కుండా చేస్తున్న ఆలస్యంపై ఉద్యోగుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్నది. చూడాలి గత ప్రభుత్వం మాదిరిగానే కూటమి ప్రభుత్వమూ చేస్తుందా..లేదంటే సచివాలయ ఉద్యోగులకు ఇతర ప్రభుత్వశాఖల మదిరిగా అన్నిప్రయోజనాలు కల్పిస్తుందా..? అదీ కాదంటే సేవలకు మాత్రమే సచివాలయ ఉద్యోగులను వినియోగించుకొని సమస్యల పరిష్కారానికి కాలం వెల్ల దీస్తుందా..? అనేది..!

visakhapatnam

2025-05-27 15:10:05

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మహిళా పోలీసులకు డిపార్ట్ మెంట్ స్లైడింగ్..!

ఈరోజు-ఈఎన్ఎస్ వరుస కథనాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది..! ఎట్టకేలకు కరుణించిన కూటమి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులకు శుభవార్త చెప్పింది.. కోర్టు కేసులు కారణంగా ఇప్పటి వరకూ గాల్లో ఉన్న సచివాలయ మహిళా పోలీసులకు ప్రభుత్వ శాఖ కేటాయించేందుకు నడుంబిగించింది.. దానికోసం వారికి రెండు ప్రభుత్వశాఖలు ఆప్షన్లు ఇస్తున్నట్టుగా ఆన్ లైన్ లోనే ఎంచు కునే సదుపాయం కల్పించింది. దీనితో ఇప్పటి సచివాలయాల్లో పనిచేస్తున్న వీరికి ఒక నిర్ధిష్ట ప్రభుత్వశాఖ కేటాయింపులు జరగను న్నా యి.. ప్రభుత్వశాఖ కేటాయించి, నిబంధనలు పొందుపరిస్తే తప్పా సదరు శాఖ సర్వీసు రూల్సు, ప్రమోషన్ ఛానల్ వీరికి వర్తించవు.. కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు హామీలు ఇచ్చినా వాటిని అమలు చేయడానికి మాత్రం ఏడాది సమయం తీసుకున్నది.. హామీ ఇచ్చిన దగ్గర నుంచి ఈరోజు-ఈఎన్ఎస్ ప్రత్యేక కథనాల ద్వారా సచివాలయ ఉద్యోగుల సమస్యలను ఎప్పటి కప్పుడు రాష్ట్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన ప్రభుత్వం వీరికి ఆప్షన్లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది..!

గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసుల విషయంలో ఈరోజు-ఈఎన్ఎస్ చేస్తున్న కృషికి కూటమి ప్రభుత్వం ద్వారా ఒక్కొక్కటిగా ఫలితాలు వస్తున్నాయి. సచివాలయ మహిళా పోలీసులు ఏ ప్రభుత్వశాఖ లేకుండా గాల్లో ఉన్న విషయాన్ని వరుస కథనాల ద్వారా చాలా కాలం నుంచి తెలియజేస్తున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినా కొద్దిగా తాత్సారం పరిపాలనా పరమైన సమస్యతో జరిగింది. దానితో సమస్య తీవ్రతను ఈరోజు-ఈఎన్ఎస్ వరుస కథనాల ద్వారా తెలియజేయడంతో స్పందించిన ప్రభుత్వం వారికి రెండు ప్రభుత్వశాఖల ఆప్షన్లు ఇచ్చింది. మహిళా పోలీసులు ఏ ప్రభుత్వశాఖ ఎంచుకుంటే అందులోకి వారిని పంపడం ద్వారా సమస్య పరిష్కరించడంతోపాటు సదరుశాఖల్లో ఖాళీలను భర్తీచేసినట్టుగా ఉంటుందని కూటమి ప్రభుత్వం భావిస్తున్నది. 2019లో అక్టోబర్ 1న గత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి సచివాలయ మహిళా పోలీసుల విషయంలో కోర్టులో కేసులు పడ్డాయి.

 వీరికి పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా కాకుండా ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేశారని.. దానితో పోలీసు శాఖ ద్వారానే నియామకాలు జరిగినా.. వీరికి పోలీసుశాఖకు ఎలాంటి సంబంధం లేదని పోలీసుశాఖ హైకోర్టుకి అఫడవిట్ దాఖలు చేసింది. అప్పటి నుంచి సచివాలయ మహిళా పోలీసులు కార్యాలయాల్లో మల్టీ టాస్కింగ్ స్టాప్ గానే పనిచేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎన్ని అర్జీలు పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. దానితో విషయ తీవ్రతను తెలుసుకున్న కూటమి ఎన్నికల్లోనే హామీ ఇచ్చింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయ ఉద్యోగుల సమస్యలు తీరుస్తామని హామి ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది వరకూ ఏ సమస్యా పరిష్కరించకపోవడంతో ఈరోజు-ఈఎన్ఎస్ వీరి సమస్యలను సదరు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత దృష్టికి తీసుకెళ్లడంతోపాటు, ఉద్యోగ సంఘాల వినతులతో ఈ విషయాన్ని అసెంబ్లీ, శాసన మండలిలో కూడా పెద్ద ఎత్తున ప్రస్తావించారు. అంతా సమస్య పరిస్కారం అవుతుందనుకున్నా పరిపాలనా పరమైన ఆలస్యం కావడంతో ఉద్యోగుల సమస్యలపై ఈరోజు-ఈఎన్ఎస్ సామాజిక బాధ్యత తీసుకొని వీరి సమస్య తీవ్రను వరుస కథనాల ద్వారా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లింది. 

దీనితో స్పందించిన ప్రభుత్వం వీరి సమస్యను పరిష్కరించడంతోపాటు, వేల సంఖ్యలో ఉద్యోగులు రిటైర్ మెంట్ కావడంతో భారీగా ఏర్పడ్డ ఖాళీలను భర్తీచేసుకోవడానికి వీలుగా వీరికి రెండు ప్రభుత్వశాఖల్లో ఆప్షన్లు ఇచ్చింది. మహిళా పోలీసులు విధుల్లోకి చేరినపుడే చాలా మంది తమకు పోలీసుశాఖ ఇష్టం లేదని కూడా కోర్టులో కేసులు కూడా దాఖలు చేశారు. అప్పటి నుంచి వీరి సమస్యను పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. ఆతరువాత కూటమి ప్రభుత్వం వీరి సమస్యకి ప్రాధాన్యత కల్పించింది. ప్రస్తుతం వీరికి రెండు ప్రభుత్వశాఖల అప్షన్లు ఆన్ లైన్ లో ఇవ్వడంతోపాటు, వాటి విధి విధానాలను కూడా పొందుపరిచే పనిలో పడింది రాష్ట్రప్రభుత్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తికావడానికి ఒక రెండు నెలలు సమయంల పట్టేట్టుగానే కనిపిస్తున్నది.


-ప్రస్తుతానికి ఆప్షన్లు మాత్రమే ఆన్ లైన్ లో
గ్రామ,వార్డు సచివాలయ మహిళా పోలీసులకు ఇచ్చిన రెండు ప్రభుత్వ శాఖల ఆప్షన్లు మాత్రమే ప్రస్తుతం ఆన్ లైన్ లో కనిపిస్తున్నాయి. వాటిని ఎలా ఎంచుకోవాలి, ఏ ప్రభుత్వశాఖలో ఉన్న విధి విధానాలు ఏంటి అనే సమాచారం మాత్రం ఇంకా అందుబాటులోకి తీసుకురాలేదు రాష్ట్ర ప్రభుత్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తిస్థాయిలో ఓ కొలిక్కి రావాలంటే ఇంకా సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని 15 వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమారు 14వేల మందికి పైగా మహిళా పోలీసులు పనిచేస్తున్నారు. వీరిలో కొంత మంది తమకు ఐసిడిఎస్ కావాలని పట్టు బట్టడంతో వారినే ప్రభుత్వశాఖలు ఎంచుకునేవిధంగా ప్రభుత్వం ప్రస్తుతానికి ఆప్షన్లు కల్పించింది. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు ఆన్ లైన్ లో అందుబాటులోకి వచ్చిన తరువాత ఉద్యోగులు ఆప్షన్లు ఎంచుకోవడానికి వీలుపడుతుంది. తరువాత వారంతా ఆయా ప్రభుత్వశాఖల ఉద్యోగులుగా ఉంటారా..? సచివాలయాల్లోనే పనిచేస్తారా..? శాఖలు కేటాయించిన తరువాత వారిని సదరు శాఖలకు బదిలీలు చేస్తారా అనే విషయంపై త్వరలోనే ఒక క్లారిటీ రానుంది. ప్రస్తుతానికి మాత్రం మహిళా పోలీసులకు నేటి వరకూ లేకుండా ఉన్న ప్రభుత్వశాఖ కేటాయించడానికి మాత్రం కూటమి ప్రభుత్వం ఒక రూట్ ని ఏర్పాటు చేసింది. ఆ రూటు ఏ గమ్యస్థానం చేరుకుంటుందనే విషయంపై త్వరలోనే ఒక స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. ఈ తంతు పూర్తవడానికి సమయం పట్టే అవకాశం ఉండటంతో  రాష్ట్రప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల బదిలీలు కూడా నిలుపుదల చేసింది. 


-ఇప్పటికైనా ఉద్యోగులకు  సర్వీసు రూల్స్ అమలుచేయాలి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులకు ఆప్షన్లు ఇచ్చిన ప్రభుత్వశాఖలోని క్యాడర్ ఆధారంగా సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ శాఖలోకి వచ్చిన వారికి అమలు చేయకపోతే.. ఉద్యోగులకు ప్రభుత్వశాఖ ఏర్పాటైనా ప్రధాన సమస్య మాత్రం అలాగే ఉండిపోయే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే సచివాలయ ఉద్యోగులు విధుల్లో చేరిన తరువాత గత ప్రభుత్వంలో సర్వీసు ప్రొభేషన్ సమయంలో తొమ్మిది నెలలు అధనంగా విధులు నిర్వహించాల్సి వచ్చింది. ఆ సమయంలో ఫుల్ పేస్కేలు కోల్పోయారు. తరువాత సర్వీసు రెగ్యులైజేషన్ సమయంలో పడాల్సిన మరో రెండు ఇంక్రిమెంట్లు కోల్పోయారు. కోర్టు కేసులు కారణంగా మొదటి పదోన్నతి కోల్పోయారు.. పీఆర్సీ అమలు చేసిన సందర్భంలో పెంచిన పేస్కేలు తప్పా, ఇతర ప్రయోజనాలన్నీ కోల్పోయారు. ఇలాంటి తప్పులు మళ్లీ జరగకుండా ఉండాలంటే ఆప్షన్లు ఇచ్చిన సమయంలోనే ఏ ప్రభుత్వశాఖలో ఏ సర్వీసు నిబంధనలు ఆప్షన్లు ఎంచుకున్న వారికి అమలు జరుగుతాయో ప్రభుత్వం నిర్ధిష్టంగా తెలియజేయాల్సిన  అవసరం ఎంతైనా ఉంది. లేదంటే వీరికి డిపార్డ్ మెంట్ స్లైడింగ్ ఇచ్చినా ఎలాంటి ఉపయోగం మాత్రం ఉండదు. ఏదో కంటితుడుపు చర్యగా ప్రభుత్వశాఖ కేటాయించేసి ఊరుకున్నట్టుగానే వ్యవహారం ఉంటుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాదిరిగా కాకుండా కూటమి ప్రభుత్వంలోనైనా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు అందునా మహిళా పోలీసుల విషయంలో మాత్రం కూటమి ప్రభుత్వం ఇతర ప్రభుత్వశాఖల్లోని ఉద్యోగులకి వర్తింపజేసే అన్ని రకాల ప్రయోజనాలను సచివాలయ ఉద్యోగులకు కూడా అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. లేదంటే శాఖల్లోకి వచ్చిన తరువాత కూడా వీరిని అవే సమస్యలు వెంటాడుతూనే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

-ఈరోజు-ఈఎన్ఎస్ కి సచివాలయ ఉద్యోగుల కృతజ్ఞత లు
2019 జనవరి 1 నుంచి రాష్ట్రప్రభుత్వంలో 75 ప్రభుత్వశాఖగా ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయశాఖ  ఉద్యోగుల సమస్యలను ఒక్క ఈరోజు-ఈఎన్ఎస్ మాత్రమే సామాజిక బాధ్యతగా తీసుకొని ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో కీలకం వ్యవహరించిందంటూ  సచివాలయ ఉద్యోగులు కార్యాలయానికి ఫోన్లు చేసి  కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. రాష్ట్రంలో చాలా మీడియా సంస్థలున్నా.. కేవలం తమ శాఖ ఉద్యోగులకు ఎప్పుడు ఏం జరిగినా ప్రతీ అంశాన్నీ కేవలం  ఈరోజు-ఈఎన్ఎస్ మాత్రమే వెలుగులోకి తీసుకు వస్తూ తమకు అండగా నిలుస్తున్నదని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లకు జరగాల్సిన తమ సర్వీసు ప్రొభేషన్ ను వైఎస్సార్సీపీ ప్రభుత్వం మరో తొమ్మిదినెలలు పొడిగించిన సమయంలో కూడా వరసు కథనాలు ప్రచురించి, సర్వీసు రెగ్యులైజేషన్ విషయంలోనూ సహకరించారని, తరువాత పీఆర్సీ ప్రయోజనాలు అమలు చేసే విషయంలోనూ, సర్వీసు రెగ్యులర్ చేసిన సమయంలో కలపాల్సిన రెండు ఇంక్రిమెంట్లు సమయంలోనూ, ఉద్యోగులకు సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు విషయంలోనూ,  ఉద్యోగులపై అధికారులు వేధింపులకు గురిచేస్తున్న సమయంలోనూ, తమ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్న సమయంలోనూ  బదిలీల విషయంలోనే కాకుండా అన్ని విషయాల్లోనూ సచివాలయ ఉద్యోగులకు మాత్రం ఈరోజు-ఈఎన్ఎస్ మాత్రమే మాత్రమే తోడుగా నిలిచిందంటూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఈరోజు-ఈఎన్ఎస్ ద్వారా రాష్ట్రప్రభుత్వంలో ఒకే ఉద్యోగంతో అనేక ప్రభుత్వశాఖల సేవలు చేస్తున్న ఉద్యోగుల సమస్యలపై ఎల్లప్పుడూ మీ వెంటనే ఉంటుందని కూడా యామమాన్యం తెలియజేస్తున్నది. వరుస కథనాలపై స్పందించడం పట్ల తమ హర్షాన్ని ప్రకటిస్తున్నది..!

visakhapatnam

2025-05-23 06:56:26

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకి గుడ్ న్యూస్.. దస్త్రం ఫైనాన్స్ దగ్గరకి..?!

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కష్టాలు తీరే సమయం దగ్గర్లోనే ఉన్నట్టుగా కనిపిస్తున్నది.. విశాఖలో పట్టణ పురపాలకశాఖ మంత్రి నారాయణ చెప్పిన విషయం ఆధారంగా ఉద్యోగుల సర్వీసు నిబంధనలు,  పదోన్నతుల దస్త్రం ప్రభుత్వ పరిశీలనలోనే ఉన్నట్టుగా స్పష్టమవుతున్నది.. విశాఖ పర్యటనకు వచ్చిన మంత్రి నారాయణను ఈరోజు-ఈఎన్ఎస్ ఈ మేరకు సచివాలయ ఉద్యోగుల ప్రమోషన్స్ విషయమై ప్రశ్నించగా కీలక అంశాలను ఆయన ప్రస్తావించారు.. దానిని బట్టి సచివాలయ ఉద్యోగులకు త్వరలోనే లైన్ క్లియర్ అయ్యే సూనలు కనిపించాయి. అయితే దాని కోసం ఇంకా చేయబోతున్నారో కూడా మంత్రి మీడియాకి వివరించారు.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు గత ఐదేళ్లుగా సర్వీసు ప్రభుత్వశాఖ కేటాయింపులు, సర్వీస్ రూల్స్, ప్రమోషన్స్, క్యాడర్ కూడా లేకుండా పనిచేస్తున్నారు.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆయా ప్రభుత్వశాఖల మంత్రలు ఒక్కొక్కరుగా ఉద్యోగుల సమస్యల పరిష్కారాని చొరవ చూపుపుతున్నారు. దీనితో ఈరోజు-ఈఎన్ఎస్ కథనాల స్పందన లభిస్తూ ఉద్యోగుల ప్రమోషన్స్ కి లైన్ క్లియర్ కావడానికి ఒక్కో అడ్డంగి తొలగుతూ వస్తున్నది..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వడానికి ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్నది. ఈ మేరకు పట్టణ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈ విషయాన్ని విశాఖ పర్యటన సందర్భంగా మీడియా ముఖంగా ప్రకటించారు. తమ శాఖలో చాలా ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని.. అయితే వాటిని పదోన్నతులతో భర్తీచేయడానికి అన్ని పనులూ చేసి క్యాబినెట్ లో అప్రూవల్ చేయించడానికి  దస్త్రాన్ని ఫైనాన్స్ శాఖకు పంపితే అక్కడ ఫైలు నిలిచిపోయిందన్నారు. పట్టణ పురపాలకశాఖ మాదిరిగానే మిగిలిన ప్రభుత్వ శాఖల నుంచి దస్త్రాలు వస్తే ఒకేసారి అన్నిశాఖల ఉద్యోగులకు ప్రభుత్వ నిబంధనలు ఆయా ప్రభుత్వ శాఖల్లోని క్యాడర్ ఆధారంగా పదోన్నతులు కల్పించనున్నామన్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని తాను పట్టణపురపాలకశాఖ ముఖ్యకార్యదర్శితో సమాచాలోచనలు చేశామన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోనూ ప్రత్యేకంగా చర్చించినట్టు మంత్రి నారాయణ వివరించారు. తప్పనిసరిగా సచివాలయశాఖలోని అన్ని విభాగాల ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వనున్నామన్నారు. దానికోసం మిగిలిన శాఖాధిపతులు, మంత్రుల నుంచి కూడా లేఖలు ఫైనాన్స్ కి చేరాల్సి వుందన్నారు. ఇప్పటికే కొన్ని ప్రభుత్వశాఖలు ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాయని చెప్పుకొచ్చారు.

-ప్రస్తుతానికి 4 ప్రభుత్వ శాఖలకు లైన్ క్లియర్
గ్రామ, వార్డు సచివాలయశాఖలోని పట్టణ పురపాలకశాఖ, మత్స్యశాఖ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖలకు సంబంధించిన ఉద్యోగులకు లైన్ క్లియర్ అయినట్టు కనిపిస్తుంది( పదోన్నతులు, ప్రభుత్వశాఖలకు ఉద్యోగుల విలీనానికి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదన చేశారు.. అయితే ఇంకా అనుమతులు రావాల్సి వుంది.). . ఇంకా ఇంజనీరింగ్, రెవిన్యూ, సర్వే, సంక్షేమం, ఇంజనీరింగ్,  ప్లానింగ్, ఇతర శాఖల్లో ఇంకా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నది. ఇప్పటికే వ్యవసాయశాఖలో గత ప్రభుత్వంలోనే పదోన్నతులు కల్పించారు. ఆరోగ్యశాఖలో కూడా కొన్ని సాధారణ ఇన్ ఇర్వీస్ పదోన్నతులు కల్పించారు.  మిగిలిన శాఖలకు చెందిన మంత్రులు కూడా వారి శాఖల ఉద్యోగుల విషయంలో ప్రభుత్వానికి నివేదికలు సమర్పిస్తే అవి ఫైనాన్స్ విభాగంలో క్లియర్ అయ్యి క్యాబినెట్ దృష్టికి వెళతాయి. తద్వారా ఖాళీల భర్తీతోపాటు, సచివాలయ ఉద్యోగులకు నిర్ధిష్ట్ ప్రభుత్వశాఖ కేటాయింపుతోపాటు, ఉద్యోగులకు పదోన్నతులు కూడా వచ్చే అవకాశాలున్నాయి. కాగా 2019 అక్టోబరు 1 నుంచి గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటు దగ్గర నుంచి ఉద్యోగుల విషయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు, సుమారు ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను  ఈరోజు-ఈఎన్ఎస్ ఎప్పటికప్పుడు ప్రత్యేకథనాల రూపంలో అందిస్తున్నది. ఉద్యోగుల పక్షాన నిలబడి పనిచేస్తున్నది.

-ఉద్యోగులకు గాలికి వదిలేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందనే ఆవేదన నేటికీ ఉద్యోగులను వెంటాడు తోంది. రాష్ట్రప్రభుత్వంలోని ఏ ప్రభుత్వ శాఖ తమలా ఉండదని నేటికీ కన్నీటి పర్యంతం అవుతున్నారు. దేశంలో ఎక్కడైనా ఏ ఉద్యోగికైనా ఒక ప్రభుత్వశాఖ మాత్రమే ఉంటుందని.. కానీ ఒక్క గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులకు మాత్రం ఒక ఉద్యోగం అదీ తలా తోకా లేని ఉద్యోగం, అమలు కానీ సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్, క్యాడర్ లేకుండా ఉన్నాయని. అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన విధులూ తామే చేయాల్సి వస్తున్నదని, ఐదేళ్లు ఆ విధంగానే అదనపు పనులు చేయించుకున్నా.. ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగుల మాదిరిగా ఇవ్వాల్సిన ప్రయోజనాలను మాత్రం ఇవ్వకుండా తాత్సారం చేసుకుంటూ వచ్చిందని వాపోతున్నారు. శని, ఆదివారాలతోపాటు ప్రభుత్వ సెలవు దినాల్లో కూడా ఇంటి దగ్గరుండే పనులు చేయించే అలవాటు గత ప్రభుత్వం నుంచి ప్రస్తు కూటమి ప్రభుత్వం వరకూ కొనసాగుతుం దని వాపోతున్నారు. ఇంత చేస్తున్న తమకు తమ ఉద్యోగ భద్రత విషయంలో తమశాఖల మంత్రులు, ప్రభుత్వశాఖల అధికారులకు ఆరేళ్లుగా విధి విధానాలు రూపొందించే ఖాళీ లేకుండా పోయిందని చెబుతున్నారు. ఫలితంగా ఎలాంటి పదోన్నతులు గానీ, ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగుల మాదిరిగ ప్రయోజనాలకు కూడా తాము నోచుకోలేకపోతున్నామని వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి మాత్రుశాఖల్లో విలీనం చేస్తే తమ ఉద్యోగాలకు ఒక అర్ధం వుంటుందని చెబుతున్నారు. చూడాలి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, చేసిన, చేస్తున్న పనులు ఏ మేరకు కార్యరూపం దాల్చుతాయనేది..!


visakhapatnam

2025-05-21 21:07:59

జీఓ ఇచ్చాం.. అధికారులూ ప్రజా ప్రతినిధులకి మర్యాదలివ్వండి..!

కూటమి ప్రభుత్వంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ఆఖరికి మంత్రులకి కూడా అధికారులు కనీసం మర్యాలు ఇవ్వడం లేదు. పట్టించుకోను కూడా పట్టించుకోవడంలేదు.. అసలు చంద్రబాబు సర్కారు పరిపాలనకు పూర్తిగా అధికారులు వ్యవహరిస్తున్నారు.. వినడానికి వింతగా వున్నా. ఇది ముమ్మాటికీ నిజం.  ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు కనీసం మర్యాదలు ఇవ్వడం లేదని స్వయంగా ఎమ్మెల్యేలు, ఏంపీలు, మంత్రులు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి స్పీకర్ కి ఫిర్యాదు చేయడం.. దానిని ఆయన సీరియస్ గా తీసుకొని ప్రభుత్వ సిఎస్ విజయానంద్ కి చెప్పడం.. దానిపై సీఎస్ గత 2012లోని జీఓనెంబరు 348ని ఉటంకిస్తూ.. అధికారులూ మీరు ప్రజాప్రతినిధులకు మర్యాదలు ఇవ్వాలి.. ప్రోటోకాల్ పాటించాలంటూ ఉత్తర్వులు జారీచేయడం ఇపుడు రాష్ట్రంలోనే చర్చనీయాంశం అవుతోంది. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి అంటేనే అధికారులు అగ్గగ్గలాడుతూ మర్యాదలు చేసి చేతులు కట్టి మరీ దండాలు పెడతారు.. కానీ కూటమి ప్రభుత్వంలో అంతా వ్యతిరేకంగా జరుగుతుండటంతో నేరుగా ఎమ్మెల్యేలు మాకు మర్యాదలు కావాలంటూ ప్రభుత్వానికి మొరపెట్టుకోవడం విశేషం.

కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సీఎంగా చంద్రబాబునాయుడు ఉన్నారు కనుక ప్రభుత్వంలోని అన్ని పనులు అవుతాయనుకున్నారు ప్రజాప్రతినిధులు. కానీ వారిని అధికారులు పట్టించుకోవడం మానేయడం ఒకింత ప్రజాప్రతినిధుల అహం మీద దెబ్బ కొట్టినట్టే అయ్యింది. చెప్పిన పనులు చేయకపోవడం, సిఫారసు లేఖలు బుట్టదాఖలు చేయడం, కనీసం ప్రోటోకాల్ పాటించకపోవడం, పార్టీ కార్యకర్తల పనులంటే కనీసం పట్టనట్టు వ్యవహరించడం, స్వయంగా ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి చెప్పినా అప్పటికి సరేనంటూ.. చెప్పిన తరువాతనే మరింత విషయాన్ని టైట్ చేయడం  కూటమి ప్రభుత్వంపై 75 ప్రభుత్వశాఖల సిబ్బంది సామూహిక తిరుగుబాటు చేస్తున్నట్టుగానే కనిపిస్తుందని విశ్లేషకులు బావిస్తున్నారు. ముఖ్యంగా నియోజకవర్గ పరిధిలోని కార్యాలయాల్లో అధికారులు కనీసం ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదట. చెప్పనంత వరకూ పనులు చేసి.. చెప్పిన తరువాత కావాలనే టైట్ చేసేస్తున్నారట. దీనితో ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ స్పీకర్ కి ఫిర్యాదు చేయడంతో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈ విషయాన్ని ప్రభుత్వ సిఎస్ విజయానంద్ కి దృష్టికి తీసుకెళ్లారు. 

దీనితో సిఎస్ వెంటనే గత 2012లోని జీఓనెంబరు 348ని ఉటంకిస్తూ.. ప్రభుత్వ అధికారులంతా ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వాలి.. ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటించాలి, మర్యాదగా వ్యవహరించాలి.. సిఫారసు లేఖలపై స్పందించాలంటూ ఉత్తర్వులు జారీ చేయడం ఇపుడు రాష్ట్రంలోనే చర్చనీయాంశం అవుతున్నది. అసలు ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులను పట్టించుకోకుండా సామూహిక తిరుగుబాటు చేసే వరకూ వచ్చిందంటే ప్రభుత్వం చేసిన, చేస్తున్న తప్పేంటనే  అంశంపై ప్రభుత్వంలోని పెద్దలు చాలా తీవ్రంగా ఆలోచనలు చేస్తున్నారట. వాస్తవానికి ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి చెందిన నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల మాటలకు, లేఖలకు చాలా పవర్ వుంటుంది. కానీ కూటమి ప్రభుత్వంలో ఆ పవర్ కి ప్రభుత్వ అధికారులు, సిబ్బంది గాలి తీసేస్తున్నట్టుగా కనిపిస్తున్నది. ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్యేలను, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఆఖరికి మంత్రులను కూడా పట్టించుకోకపోవడంతో దారుణమని చర్చలు మొదలయ్యాయి. దీనితో అధికారులు తమకు గౌరవం ఇస్తే తప్పా తాము ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు వెళ్లలేమని చెప్పినట్టుగా తెలుస్తుంది. వైఎస్సార్సీపీని కాదని ప్రజలు పట్టం కట్టినా అధికారులు మాత్రం అంటరాని వారిగా ప్రజాప్రతినిధులను చూడటం, వ్యవహరించడం పై సర్వత్రా ఆలోచనలు మొదలయ్యాయి.

-సామూహిక తిరుగుబాటు అధికారులు ఇందుకే చేస్తున్నారా
ఆంధ్రప్రదేశ్ లోని 75 ప్రభుత్వశాఖల్లోని అధికారులు, సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 175 మంది ఎమ్మెల్యే, 23 మంది ఎంపీలు, 24 మంది మంత్రులపై తిరుగుబాటు చేయడానికి కారణం కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చకపోవడమేనని సామాజిక మాద్యమాల్లో సీఎస్ ఉత్తర్వులు జారీ చేసిన తరువాత ట్రోలింగ్ అవుతున్నది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు చేసిన సిఫారసులు అమలు కాకపోతే వారికి ఎంత మండుతుందో.. మాకూ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే అంతే మండుతుందనే వాదనను ప్రభుత్వ అధికారులు తెరమీదకు తీసుకు వస్తున్నారట. ముఖ్యంగా సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల ను రెగ్యులర్ చేయడం, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సర్వీసు నిబంధనలు, ప్రమోషన్లు అమలు చేయడం, నిర్ధిష్టమై ప్రభుత్వ శాఖలు కేటాయించకపోవడం వంటి అంశాల్లో ప్రభుత్వం కనీసం చర్యలు తీసుకోకపోవడం వలనే ప్రభుత్వశాఖల అధికారులు, సిబ్బంది కూడబలుక్కునే ప్రజాప్రతినిధులకు మర్యాదలు తగ్గించేశారని తెలుస్తున్నది. 

అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న తరుణంలో ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి ప్రభుత్వం నుంచి ఒక్క ప్రయోజనం లేదని.. పైగా ఆదివారాలు, రెండవ శనివారాలు, సెలవు దినాల్లో కూడా ఊపిరి సలపకుండా పనులు చేయిస్తున్నప్పుడు, ప్రజలకు అవసరంలేని సర్వేలు చేస్తున్న సమయంలో ప్రజల నుంచి పడుతున్న తిట్లు, చీవాట్లకి తామెంత బాధపడతామో కనీసం ప్రభుత్వం గుర్తించకపోతే ఎలాగని అధికారులు, సిబ్బంది సామాజిక మాద్యమాల్లో చర్చించుకుంటున్నారట. ముఖ్యంగా జిల్లా అధికారులకు పదోన్నతులు,  ప్రభుత్వం ఇవ్వాల్సిన డిఏలు, వేల సంఖ్యలో ఖాళీలున్నా కొత్తగా సిబ్బందిని నియమించకపోవడం, పనిభారం మొత్తం ఉన్నవారిపైనే పడిపోవడం, ఆ సమయంలో ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు అధికం అయిపోవడం, పనిచేయకపోతే ప్రజాప్రతినిధులు కక్షతీర్చుకున్నట్టుగా వ్యవహించడం వలనే ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వడం మానేశారని చెబుతున్నారు.  అయినా గౌరవం అంటే జీఓల ద్వారా వస్తుందా..? ప్రభుత్వ సిఎస్ ఆదేశిస్తే ఇస్తారా..? అనే ప్రశ్నలు కూడా ఉద్బవిస్తున్నాయి. 

అసలు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ప్రభుత్వంపై ఈ గౌరవం ఇచ్చే విషయంలో తిరుగుబాటు చేయడానికి కారణాలు ఏంటనే విషయం ఆళోచించకుండా.. గౌరవ మర్యాదలు ఇవ్వాలంటూ జీఓ ఇవ్వడం, ప్రోటోకాల్ పాటించాలని ఆదేశించడం చర్చనీయాంశం అవుతున్నది. ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసిన ఫిర్యాదులపై స్పందించిన స్పీకర్, ప్రభుత్వ సీఎస్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కూడా అంతే వేగంగా స్పందించి ఉంటే ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదని కూడా ఉద్యోగులు సలహాలు ఇస్తున్నారు. ఏది ఏమైనా ఒక విజన్ ఉన్న పరిపాలనా దక్షుడు చంద్రబాబు సీఎంగా ఉన్న రాష్ట్రంలో అధికారులు, సిబ్బంది ప్రజాప్రతినిదులకు మర్యాదలు ఇవ్వకుండా సామూహిక తిరుగుబాటు చేస్తున్న విషయం అందరినీ ఆలోచింపచేస్తున్నది. చూడాలి ఇక ముందు ప్రభుత్వ అధికారుల, సిబ్బంది విషయంలో ప్రభుత్వ నిర్ణయం, ప్రజాప్రతినిధుల తీరు ఎలా ఉండబోతుందో..?!

visakhapatnam

2025-05-13 22:05:45

ఆంధ్రప్రదేశ్ పై కేంద్రం సవతి ప్రేమ..?! కొత్త జిల్లాలకి రాష్ట్రపతి ఆమోద ముద్ర కలేనా..?

విభజన ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం ఇంకా నాన్చుడు వ్యవహారాన్నే అవలంభిస్తూ.. సవతి ప్రేమను మాత్రమే చూపిస్తోంది.. రాష్ట్రం విడిపోయి పదేళ్లు దాటిపోయినా ఇంకా నేటికీ విభజన హామీలు నెరవేర్చలేదు. కనీసం ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటైన 13 కొత్త జిల్లాలను కూడా కేంద్ర జాబితాలోకి చేర్చలేదు. ముక్కుతూ, మూలుగుతూ మొన్న జన, కులగణన చేస్తామని ప్రకటించింది కేంద్రం. వాస్తవానికి విభజన హామీలన్నీ పదేళ్లలోగానే పూర్తిచేయాలన్నది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్నారు.  కానీ అలా చేయలేదు.. ఫలితంగా ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన చాలా విలువైన ఆస్తులు, కార్యాలయాలు, ప్రభుత్వ కర్మాగారాలు తెలంగాణలోనే ఉండిపోయాయి. అంతేకాదు.. కొత్తగా ఏర్పాటైన 13 జిల్లాలకు ఇంకా చట్టబద్దత ఇవ్వలేదు ఫలితంగా కేంద్రప్రభుత్వం దృష్టిలో ఉన్నది ఉమ్మడి 13 జిల్లాలుగా మిగిలిపోయాయి... మాట్లాడితే కూటమి ప్రభుత్వం అని ప్రకటనలు గుప్పిస్తున్న కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కొత్తజిల్లాల విషయంలో మాత్రం ఇంకా సవతి ప్రేమనే అవలంభిస్తున్నా ఆంధ్రప్రదేశ్ నుంచి అడిగే నాధుడే కరువయ్యాడు..?!

కేంద్ర జాబితా పరిధిలోకి వచ్చేవిధంగా చట్టం చేయాలని..దానిని కేంద్రానికి పంపించాలని ఆంధ్రప్రదేశ్ కేబినెట్ రాజధాని అమరావతి కోసం పడుతున్న తపన.. విభజన ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం చేయాల్సిన పనుల మీద పెట్టడం లేదని.. వీళ్లు ఎలాగూ అడగరని కేంద్రం కూడా తాత్సారం చేస్తూ వస్తున్నది. వాస్తవానికి కొత్త జిల్లాల ఏర్పాటు, మండలాలు, జిల్లా పరిషత్ లు అన్నీ కేంద్ర జాబితా పరిధిలోకి వస్తాయి. అంటే కేంద్ర క్యాబినెట్ లో ఆమోదం తెలిపి, రెండు సభల్లోనూ బిల్లు పాసైన తరువాత రాష్ట్రపతి ఆమోదంతో చట్టబద్ధత తీసుకు వస్తారు. తద్వారా కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు అఖిల భారత స్థాయి అధికారులు, కేంద్ర కార్యాలయాలు, జిల్లా పరిషత్ లు, కొత్త పంచాయతీలు, మండలాలు ఏర్పాటుకి అవకాశం వుంటుంది. ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలు 26 జిల్లాలుగా మారి ఐదేళ్లు దాటుతున్నా ఇంకా కేంద్రం కొత్త జిల్లాలకు చట్టబద్దత కల్పించలేదు. దానితో జిల్లాలను విభజన చేసిన రాష్ట్రప్రభుత్వమే మా రాష్ట్రంలో 26 జిల్లాలు ఉన్నాయని చెప్పుకుంటోంది. 

ఇదంతా ఉత్తుత్తిదే అని అధికారికంగా చెప్పడానికి ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు, నియామకాలన్నీ కూడా ఉమ్మడి 13 జిల్లాలు ప్రాతిపదికన మాత్రమే చేస్తున్నది. అలాంటపుడు కొత్త జిల్లాలకు చట్టబద్దత వచ్చినట్టా..? రానట్టా..? రానప్పుడు 26 జిల్లాలు విభజన చేసుకొని రాష్ట్రప్రభుత్వం ఏం చేస్తున్నట్టు..? అంటే.. ప్రక్కరాష్ట్రం తెలంగాణలో 32 జిల్లాలు ఉన్నప్పుడు కనీసం మనకి 26 జిల్లాలు అయినా లేకపోతే ఎలా అనుకున్న గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చింది. అధికారంలో ఉండగా కేంద్రం నుంచి చట్టబద్ధత సాధించలేకపోయింది. పోనీ కూటమిలో ఉన్న ఇప్పటి ప్రభుత్వం అయినా చట్టబద్దత కోసం అడుగుతుందా..? అదీ లేదు. ఫలితంగా  కేంద్రం ఏర్పాటుచేయాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ దక్షణాది రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. కనీసం ప్రాజెక్టులు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఆందోళన చేయగా... చేయగా వచ్చిన విశాఖ రైల్వే జోన్ కి అతీగతీ లేదు అది ఎప్పుడు పూర్తవుతుంతో తెలీదు. మరెప్పుడు ప్రారంభం అవుతుందో కూడా తెలియని పరిస్థితి. 

ఇక్కడ విశాఖకు రైల్వే జోన్ ఇచ్చి.. ఇదే విశాఖ నుంచి కేంద్రప్రభుత్వ సంస్థ  స్టీల్  ప్లాంట్ ను ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నది కేంద్రం. దీనిపై కూటమిలో ఉన్నందుకు నోరెత్తడం లేదు రాష్ట్ర ఎంపీలు. అసలు ఆంధ్రప్రదేశ్ లోని ఎంపీలకు రాష్ట్రంలోని కొత్త జిల్లాలకి చట్టబద్ధత రావాలంటే కేంద్రం, రాష్ట్రపతి ఆమోద ముద్ర ఉండాలని విషయం తెలుసో తెలియదోననే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. మన ఎంపీలు అడగలేకపోవడం, రాష్ట్రప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన కొత్తజిల్లాలు ఏర్పాటు అయినా ఇంకా కొత్త జిల్లాలకి కేంద్రం ఇచ్చే నిధులు ప్రయోజనాలు తెచ్చుకోలేకపోతున్నది రాష్ట్రప్రభుత్వం.  మాట్లాడితే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి అన్ని విధాలా సహకారం అందిస్తుందని ప్రకటించే కేంద్రం ఒక చిన్న అంశాన్ని కొత్త జిల్లాలు, నియోజకవర్గాల పునర్విభజన విషయాన్ని ఎందుకు రాష్ట్రపతి ఆమోద ముద్రకు పంపలేదు అంటే.. ఆ ఒక్కటీ అడక్కు అనే సమాధానం మాత్రమే వస్తున్నది. కేంద్రానికి ఆమాత్రం తెలియదా..? రాష్ట్రానికి అన్నీ చేయాలని.. కాకపోతే ముందు రాజధాని పూర్తయిపోయితే తరువాత విభజన జిల్లా అంశం, కొత్త నియోజకవర్గాల విషయం, కొత్త జిల్లా పరిషత్తులు, మండలాల విషయం తేల్చుకోవచ్చు అన్నట్టుగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అవలంభించిన విధానం కంటే కూటమి ప్రభుత్వం మరింతగా నాన్చుడు వ్యవహారం చేస్తున్నది.

-కొత్తజిల్లాల్లో నేటికీ అద్దె కార్యాలయాలు.. అరకొర అధికారులే
రాష్ట్రప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చినా నేటికీ ఐదేళ్లుగా అద్దె కార్యాలయాలు, అరకొర జిల్లా అధికారులతోనే కాలం నెట్టుకొస్తున్నది. దానికితోడు గత ప్రభుత్వం పెంచిన రెండేళ్ల ఉద్యోగ విరమణ వయస్సు పూర్తవడంతో రాష్ట్ర వ్యాప్తంగా 75 ప్రభుత్వ శాఖల్లో వేలాదిగా ఉద్యోగులు, అధికారులు రిటైర్ అయిపోతున్నారు. అసలే అరకొర సిబ్బంది, అధికారులతోనే కాలం వెల్లదీస్తున్న కొత్త జిల్లాలకు మూలిగే నక్కపై తాడిపండు పడ్డ చందాన మరింత సిబ్బంది, అధికారుల కొరత వచ్చి పడింది. అంతేకాదు కొత్త జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు అందరూ కూడా ఉమ్మడి జిల్లాల్లో జేసి క్యాడర్, ఏఎస్పీ క్యాడర్ ఉన్నవారే. అదే రీతిన కొత్త జిల్లాల్లో కూడా కలెక్టర్లను జూనియర్లనే నియమిస్తున్నది రాష్ట్రప్రభుత్వం. ఉమ్మడి జిల్లాల్లో మాత్రం సాధారణ బదిలీల్లో వచ్చే సీనియర్లను నియమిస్తున్నది  ఈ కారణంగా అటు అఖిల భారతస్థాయి అధికారులు కూడా ఆంధ్రప్రదేశ్ లో పనిచేయడానికి అందునా ఎలాంటి వసతి సౌకర్యాలు లేని కొత్త జిల్లాల్లో పనిచేయడానికి ఇష్టం చూపించడం లేదు. 

ఈ విషయం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకి తెలిసినా.. ఎందుకులే అన్నట్టుగా వదిలేస్తున్నది తప్పితే ప్రధాన సమస్యను తీర్చే విషయంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. కొత్త జిల్లాల్లో పనిచేసే కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు నేటికీ అద్దె కార్యాలయాలు, అద్దె ఇళ్లల్లోనే ఉంటున్నారంటే అతిశయోక్తి కాదు. గత ప్రభుత్వం ఆగమేఘాలపై కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు, అఖిలభారత స్థాయి అధికారులకు క్యాంపు కార్యాలయాలు కట్టించేస్తామని హడావిడి  చేసి భూ సేకరణ చేసినా.. అది ఒక్క అంగుళం కూడా ముందుకెళ్లలేదు. అలాగని కూటమి ప్రభుత్వమైనా చేపడుతుందా అంటే.. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏం చేయడానికైనా రాష్ట్రప్రభుత్వం దగ్గర నిధులు లేవనే పాటనే పాడుతోంది రాష్ట్రప్రభుత్వం. కానీ రాష్ట్ర రాజధాని విషయంలో మాత్రం క్యాబినెట్ లో తీర్మానాలు చేసి కేంద్ర జాబితాకి చట్టసవరణ చేసి పంపాలనే విషయాన్ని ప్రత్యేకంగా ఉటంకించింది రాష్ట్రప్రభుత్వం. 

అదే విషయం కొత్త జిల్లాలు, అఖిల భారత స్థాయి అధికారులు కార్యాలయాలు, క్యాంపు ఆఫీసులు, ప్రభుత్వశాఖలకు కొత్త భవనాలు, ఉద్యోగులు, జిల్లా పరిషత్తులు, డివిజనల్ కార్యాలయాల కోసం ఎందుకు ఆలోచించలేదో అర్ధం కాని పరిస్థితి. గత ప్రభుత్వం నాన్చిన నాన్చుడకంటే దారుణంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వంలో కూడా కొత్తగా ఏర్పడ్డ 13 జిల్లాలకు చట్టబద్ధత, విభజన హామీల్లో ముఖ్యమైన నియోజకవర్గాల పునర్విభజన, జిల్లా పరిషత్తుల ఏర్పాటు జరగుతుందంటే ఖచ్చితంగా లేదనే చెబుతున్నారు విశ్లేషకులు. చూడాలి.. కనీసం జన, కుల గణన తరువాతనైనా కేంద్రం తన సవతి ప్రమ కాకుండా రాష్ట్రంలోని కొత్తజిల్లాలకు చట్టబద్ధత, నియోజవకర్గాల పునర్విభజన, కొత్త జిల్లా పరిషత్తులు, గ్రామ పంచాయతీలు, అఖిత భారత స్థాయి అధికారుల కేటాయింపు, వారికి వసతి కోసం నిధులు విడుదల చేస్తుందా..? రాష్ట్రప్రభుత్వం ఆ విధంగా  ఏర్పాటు చేస్తుందా లేదా..? అనేది..?!

Visakhapatnam

2025-05-09 20:14:29