గీతం గుర్తింపు రద్దులో వాస్తవం లేదు..
Ens Balu
0
గీతం యూనివర్శిటీ
2020-10-08 20:17:37
గీతంతో సహ దేశవ్యాప్తంగా 123 కాలేజీలకు యూజిసి ఇచ్చిన యూనివర్సిటీ హోదాను రద్దుచేసినట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని గీతం రిజిస్ట్రార్ డి . గుణశేఖరన్ పేర్కొన్నారు . గీతం టుబీ డీమ్డ్ విశ్వవిద్యాలయం పై సోషల్ మీడియాలో తప్పుడు , నిరాధార , సత్యదూర కథనాలను ప్రసారం చేస్తున్న వారిని గుర్తించి శిక్షించాలని విజ్ఞప్తి చేస్తూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు . ఇవి తప్పుడు కధనాలని పలువురు వాటిని యధాతధంగా ఇతరులతో పంచుకోవడం వల్ల అది గీతం ప్రతిష్ఠ , గౌరవాలకు భంగం కలిగించడంతో పాటు పలువురు విద్యార్థులు , వారి తల్లిదండ్రులను అయోమయానికి గురిచేస్తోందని పేర్కొన్నారు . దీనిపై తక్షణమే సమగ్ర దర్యాప్తు జరిపి , దురుద్దేశ పూరితంగా తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి , ఐపిసి 1860 , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారం శిక్షించాలని విజ్ఞప్తి చేశారు . ఇక మీదట వారు అనవసర , తప్పుడు కథనాలను ప్రచురించకుండా , గీతం ప్రతిష్ఠను భంగపరచకుండా చూడాలని కోరారు . దేశంలోని డీమ్ విశ్వవిద్యాలయాలు తమ పేరు చివరన యూనివర్సిటీ అని వినియోగించేవి . దీనిపై గౌరవ సుప్రింకోర్టు చేసిన సూచినల మేరకు గత మూడు సంవత్సరాలుగా డీమ్ టూ బీ యూనివర్సిటీగా మార్పు చేయడం జరిగింది . గీతం జారీచేసే అధికారిక ధ్రువపత్రాలలో సయితం గీతం డీమ్ టూ బీ యూనివర్సిటీ అనే వాడటం జరుగుతోంది . పలు దినపత్రికలకు జారీచేసిన ప్రకటనలను గమనించినా ఈ వాస్తవం బోధపడుతుంది . అయితే దేశంలోని కొన్ని డీమ్ విశ్వవిద్యాలయాలు ఇంకా పాత పద్ధతినే అనుసరిస్తూ ఉండడంతో యూజిసి మరోమారు ఈ ఏడాది మే 27 న సర్క్యులర్ జారీచేసింది . దీనిని పూర్తిగా అర్ధం చేసుకోని కొందరు , ఆ సర్క్యులరను వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారు . ఈ విధమైన నిర్లక్ష్యపు , నిరాధార వార్తలను ప్రచారం చేయడం వెనుక గల దురుద్దేశాలను ప్రజలు , విద్యావంతులు అర్ధం చేసుకోగలరని భావిస్తున్నాము . ప్రతిష్టాత్మక ఉన్నత విద్యా సంస్థల పై సోషల్ మీడియాలో వచ్చే ఇటువంటి అసత్య కథనాల్లోని నిజానిజాలను నిర్ధారించుకోవడానికి యూజిసి , ఏఐసీటీఈ వంటి చట్టబద్ధ నియంత్రణ సంస్థలనో లేదా విశ్వవిద్యాలయ వర్గాలతో సంప్రదించగలరని విజ్ఞప్తి చేస్తున్నామని యూనివర్శిటీ సిబ్బంది మీడియాని కోరారు..