స్వామీజీల కోసం కాదు...ప్రజలకోసం పాటుపడాలి..


Ens Balu
1
విశాఖపట్నం
2020-11-15 12:35:18

విశాఖలోని శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపనందేంద్ర సరస్వతి జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 23 ప్రఖ్యాత ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అధికార మర్యాద చెయ్యాలంటూ దేవాదాయశాఖ అధికారిక ఉత్తర్వులు విడుదల చేయడం దారుణమని జనసేన నాయకులు పీతల మూర్తియాదవ్  ఆరోపించారు. ఆదివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజలకోసం పాటు పడాల్సింది పోయి.. ఈ నెల 18 న స్వామీజీ జయంతికోసం ఏకంగా ప్రముఖ దేవలయాల్లో పూజలు, మర్యాదలు చేయాలని జీఓ జారీచేయడం ఏంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కి  సన్నిహితుడు అన్న కారణంగా ఇప్పటికే ప్రభుత్వం స్వామి ముందు సాగిలపడటం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వానికి స్వామి భక్తివుంటే దానిని ప్రజలు, ఆలయాల మీదకు జీఓల ద్వారా రుద్దడం వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి పద్దతి కాదన్నారు. స్వామీజీలకు, మఠాధిపతులకు ఇచ్చే ప్రాధాన్యత ప్రజలకు పూర్తిస్థా వైద్యం అందించడంలోనూ,  పీహెచ్సీల్లో అన్నిరకాల పారామెడికల్ సిబ్బందిని నియమించడంలోనూ, చదువులు చెప్పే పాఠశాలల్లో అన్ని తరగతులకు ఉపాధ్యాయులను నియంమించడానికి, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో  కాంట్రాక్టు అధ్యాపకులు, వివిధ ప్రభుత్వ పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయడానికి వినియోగించాలని అన్నారు. అలా చేయడం ద్వారా ప్రజలు మీ మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నవారు అవుతారని అన్నారు. ఇప్పటికైనా  హిందూ ధర్మాలకి,ఆలయ సంప్రదాయాలకు విరుద్ధంగా నడిచే ఇలాంటి కార్యక్రమాలు మానుకోవాలని డిమాండ్ చేశారు.