'అనంత' జర్నలిస్టులకు 17న శిక్షణా తరగతులు..


Ens Balu
2
Anantapur
2020-11-15 14:44:11

జర్నలిస్టులు వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు వీలుగా ప్రెస్ అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాకు చెందిన జర్నలిస్టులకు ఈనెల 17వ తేదీన ( మంగళవారం) శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ తెలిపారు. ఉదయం   9: 30 గంటల నుంచి మధ్యాహ్నం 1: 00 గంట వరకు ఆన్ లైన్ లో తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. అనంతపురం జిల్లాలోని జర్నలిస్టులు అందరూ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రారంభ సమావేశంలో రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి మాల గుండ్ల శంకర్ నారాయణ ముఖ్య అతిధిగా పాల్గొంటారని తెలిపారు. జాతీయ మీడియా, అంతర్రాష్ట్ర వ్యవహారాల ప్రభుత్వ సలహాదారులు దేవులపల్లి అమర్ ప్రారంభోపన్యాసం చేస్తారని, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు కూడా పాల్గొంటారని వివరించారు. నెల్లూరు లోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డా. ఎల్. విజయకృష్ణారెడ్డి సమన్వయకర్తగా వ్యవహరిస్తూ తరగతులు నిర్వహిస్తారని తెలిపారు. ఈ తరగతుల్లో ' వార్తలు సేకరించడంలో మెలకువలు, వార్తల్ని పసిగట్టడం ఎలా' అనే అంశంపై జర్నలిజంలో అపారమైన అనుభవం ఉన్న ఆంధ్రప్రదేశ్ పత్రిక మాజీ ప్రధాన సంపాదకులు జి.వల్లీశ్వర్, రచన స్కూల్ ఆఫ్ జర్నలిజం ప్రిన్సిపాల్ గా, అధ్యాపకులుగా వందల మందిని జర్నలిస్టులుగా తీర్చిదిద్దిన ఉమామహేశ్వరరావు ' వార్తల రచనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు' అనే అంశంపై ఉపన్యసిస్తారని వివరించారు. శిక్షణ తరగతుల సందర్భంగా జర్నలిస్టులు ఆన్ లైన్ లోనే తమ అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. ఆన్ లైన్ లింక్ అనంతపురం జిల్లాలోని జర్నలిస్టులందరికీ 16వ తేదీన సాయంత్రమే పంపుతామని తెలిపారు. ఆన్ లైన్ లో స్టడీ మెటీరియల్ : జర్నలిస్టులకు ఉపయుక్తం గా ఉండేందుకు స్టడీమెటీరియల్ ఆన్ లైన్ ద్వారా పంపుతామని దేవిరెడ్డి శ్రీనాథ్ వెల్లడించారు. వార్త అంటే ఏమిటి, కథనాలు రాయడం ఎలా, టీవీ రిపోర్టర్ ఎలా ఉండాలి, క్రైమ్ బీట్ పై ఫోకస్, తప్పులు రాయవద్దు తదితర పది అంశాలపై రూపొందించిన బుక్ లెట్ పిడిఎఫ్ మెటీరియల్ మెయిల్ ఐడి లకు పంపుతామని వివరించారు. తరగతులకు హాజరైన జర్నలిస్టులకు అదేరోజు సాయంత్రం ఆన్ లైన్ లో సర్టిఫికెట్లు కూడా పంపుతామని ఆయన తెలిపారు.