కరోనా లక్షణాలున్నవారు మాత్రమే పరీక్షలు చేయించుకోవాలి..మంత్రి అవంతి


Ens Balu
3
Visakhapatnam
2020-07-27 18:29:48

కరోనా లక్షణాలయిన తీవ్ర జ్వరం, జలుబు, దగ్గు, శ్వాస సంబంధ ఇబ్బందులు ఉన్న వారు మాత్రమే కరోనా పరీక్షలకు వెళ్లాలని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.  దీని మూలంగా తీవ్ర వ్యాధి తో బాధపడుతున్న రోగుల అందరికీ తక్షణ వైద్యం అందుతుందన్నారు. సోమవారం వుడా చిల్డ్రన్స్ ఎరీనా లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ     వైద్యులు పోలీసులు ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు బాధ్యతతో పాటు మానవతా దృక్పథంతో ప్రజలకు సేవలు అందిస్తున్నారని  అభినందించారు. కరోనా ని కట్టడి చేయాలంటే ముఖ్యంగా ప్రజల అందరికీ అవగాహన కల్పించాలన్నారు. ప్రతివారు మాస్కు,  శానిటేషన్,  సామాజిక దూరం తప్పక పాటించాలన్నారు.  రానున్న కాలంలో కరోనా తీవ్రతను అంచనా వేస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నామన్నారు. కరోనా లక్షణాలతో ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి వారికి వెంటనే తగిన చికిత్స అందించినట్లయితే మరణాలు తగ్గించవచ్చు అన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి సహకారంతో జిల్లాలో ఖాళీగా ఉన్న వైద్యాధికారుల పోస్టుల భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ప్రతి పౌరునికి సకాలంలో సరిఅయిన చికిత్స అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.  కరోనా చికిత్స కొరకు రోజుకు రూ. 5 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. విశాఖ నగరంలో ప్రతి వార్డు లోనూ టెస్టులు చేసేందుకు  ఏర్పాటు చేశామని, గ్రామీణ ప్రాంతంలో పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. వార్డులలో మండలాలలో వైద్యులు అధికారులు తో కూడిన కమిటీ రోగి పరిస్థితిని బట్టి తక్షణ చర్యలు తీసుకుంటుందన్నారు.  జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ మాట్లాడుతూ  కరోనా పాజిటివ్ వచ్చిన రోగులను ఐసోలేషన్ లో ఉంచి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. లక్షణాలు లేని వారిని హోమ్ కారం టైంలోనే ఉంచి చికిత్స అందజేస్తున్నారని, వారిని ప్రతిరోజు ఏఎన్ఎం పరీక్ష చేస్తారని చెప్పారు.  జిల్లాలో ఆక్సిజన్ కు ఎటువంటి కొరత లేదని  ఎన్ఆర్ఐ, గీతం ఆసుపత్రులలో 30 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకులను ఏర్పాటు చేశామన్నారు. అవసరాలకు వాడే ఆక్సిజన్  కూడా మెడికల్ ఆక్సిజన్ గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఐసోలేషన్ లో ప్రస్తుతం 4411 పడకలు ఉన్నాయని వీటిని ఏడు వేలకు పెంచుతున్నట్లు చెప్పారు., జిల్లాలో 22 జిల్లా కోవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నామని, ఇవి 'ఏ' కేటగిరి ఆసుపత్రుల ని చెప్పారు. వీటిలో ఎనిమిది ప్రభుత్వ ఆసుపత్రులు కాగా 14 ప్రైవేటు ఆసుపత్రులని, ఇవి పూర్తిగా కోవిడ్ కే కేటాయిస్తున్నట్లు   తెలిపారు. మరో 17 కోవిడ్ నాన్ కోవిడ్  ఆసుపత్రి లను కూడా  ఏర్పాటు చేస్తున్నామన్నారు. జివి ఎం సి పరిధిలోని 74 వార్డులలో ప్రత్యేక కోవిడ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి వార్డు లో అంబులెన్స్ తో పాటు మూడు ప్రత్యేక వాహనాలు కూడా ఉంటాయన్నారు. అవసరమైతే ఆర్టీసీ బస్సులను కూడా ఉపయోగిస్తారని చెప్పారు. గ్రామీణ ప్రాంతంలో 89 పీహెచ్సీలో కూడా ఆధునిక వైద్య పరికరాలను అందుబాటులో ఉంచామని, తీవ్ర కోవిడ్ లక్షణాలు ఉన్న వారిని ఆసుపత్రులకు పంపించేందుకు ఆర్డిఓ తాసిల్దారు ఎండివోలతో కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. కేజీహెచ్లో అంకాలజీ విభాగాన్ని 500 పడకలతో పూర్తిగా కరోనా రోగుల కొరకు రూ.4 కోట్లతో ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. ఆర్ సి డి ఆసుపత్రి రీజనల్ కంటి ఆస్పత్రి ఈ ఎన్ టి ఆసుపత్రి మెంటల్ కేర్ ఆసుపత్రిలో సైకాలజీ విభాగాలలో కరోనా పరీక్షలు నిర్వహిస్తారని, అయితే పూర్తి లక్షణాలు ఉన్నా  వారికి మాత్రమే రెండవ సారి నిర్వహిస్తారని తెలిపారు.   కరోనా బారిన పడిన తమ వారి సమాచారం తెలుసుకునేందుకు హెల్త్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఐసోలేషన్ కోరంటైన్ లలో ఉన్న వారికి నాణ్యమైన ఆహారం అందించేందుకు ప్రతి సెంటర్కు ఒక కాంట్రాక్టర్ ని ఏర్పాటు చేశామని చెప్పారు. త్వరలో డిజిటల్ ఎక్స్ రే సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.  ఈ సమావేశంలో పార్లమెంటు సభ్యురాలు  బి వి సత్యవతి, పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, జీవీఎంసీ కమిషనర్   జి సృజన,  జాయింట్ కలెక్టర్ పి.అరుణ్ బాబు కరణం ధర్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.