ఇక కరోనా పరీక్షల ఫలితాలు 24గంటల్లోనే..జిల్లా కలెక్టర్
Ens Balu
3
Srikakulam
2020-07-27 18:40:24
ప్రజలు కరోనా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి ప్రజలనుద్దేశించి సందేశాన్ని విడుదల చేస్తూ జిల్లాలో 4,687 కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. కొత్త ప్రాంతాలనుండి కేసులు వస్తున్నాయని, దీన్ని ప్రజలు గమనించి జాగ్రత్తలు వహించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో నమూనాల పరీక్షల సామర్ధ్యాన్ని పెంచడం జరిగిందని ఆయన అన్నారు. సోమ వారం (జూలై 27) నుండి రోజుకి నాలుగు వేల నమూనాలు పరీక్షించడం జరుగుతుందని ఆయన చెప్పారు. జిల్లాకు 7 వేల రాపిడ్ కిట్లు కూడా సోమ వారం వస్తున్నాయని కలెక్టర్ అన్నారు. ప్రజలు అందించిన విరాళాల సహకారంతో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పీపుల్స్ ల్యాబ్ ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. ఈ లాబ్ వల్ల అదనంగా 2 వేలు పరీక్షలు నిర్వహించగలమని స్పష్టం చేశారు. గతంలో నమూనాలు తీసిన తర్వాత ఫలితాలకు కొంత సమయం పట్టేదని ఇకపై 24 గంటల్లో ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నమూనాలు ఇచ్చిన ప్రతి ఒక్కరూ ఫలితాలు వచ్చే వరకు ఇంట్లోనే ఉండాలని ఆయన కోరారు. ఫలితాలు వచ్చే వరకు ఎవరూ బయటకు రావద్దని ఆయన కోరారు. ఒక వ్యక్తి ఇంట్లో ఐసోలేషన్ లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులంతా విధిగా ఐసోలేషన్ పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులు బయటకు తిరగరాదని తద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని గ్రహించాలని అన్నారు. అదేవిధంగా జిల్లాలో అన్ని ప్రాంతాల నుండి కేసులు పెరుగుతున్న దృష్ట్యా వివిధ ప్రాంతాల్లో వివాహాలు, వేడుకలు ఎవరూ నిర్వహించరాదని ఆయన కోరారు. ప్రజలు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఉన్న స్నేహితులు, బంధువుల వద్దకు రాకపోకలు సాగించ వద్దని తద్వారా కరోనా భారీన పడే అవకాశం ఉందని గ్రహించాలని చెప్పారు. కంటైన్మెంటు జోన్ లో ఉన్న కుటుంబాలు కూడా బయటకు రాకపోకలు చేయవద్దని ఆయన సూచించారు. కంటైన్మెంటు జోన్ లో ఉన్న కుటుంబాలను పరీక్షించిన అనంతరం 60 శాతం మందికి పాజిటివ్ నిర్ధారణ జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. లక్షణాలు ఉన్నవారు వెంటనే వచ్చి ఆసుపత్రుల్లో చేరాలని ఆయన కోరారు. ఆసుపత్రిలో వచ్చి చికిత్స పొంది ఇంటికి వెళ్ళేటప్పుడు ముఖ్య మంత్రి ఆదేశాల మేరకు రూ.2 వేల రూపాయలను అందిస్తామని అన్నారు. సప్త వార ప్రక్రియలో భాగంగా ఆరోగ్య బృందాలు ఇంటింటి సర్వేకు వచ్చినప్పుడు పక్కా సమాచారం అందించాలని కోరారు. లక్షణాలు ఉన్నప్పటికి దాచి పెట్టరాదని ఆయన కోరారు. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాలలో స్వచ్చందంగా పరీక్షలకు వచ్చే వారికి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. రోజుకు 150 మందికి పరీక్షించుటకు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.
తహశీల్దారు అధీనంలో అంబులెన్సు : ప్రతి తహశీల్దారు అధీనంలో ఒక అంబులెన్స్ ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ నివాస్ చెప్పారు. మండల పరిధిలో ఎక్కడైనా కేసులు సమాచారం అందితే వెంటనే ఆసుపత్రులకు, కోవిడ్ కేర్ సెంటర్లకు అంబులెన్సులో తరలించడం జరుగుతుందని ఆయన చెప్పారు. అదేవిధంగా ఆస్పత్రిలో సేవలు ఎక్కువ చేయుటకు సిబ్బందిని నిర్మిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.
పేషెంటు సేవలు మెరుగుకు చర్యలు : ఆసుపత్రుల్లో కరోనా చికిత్స పొందుతున్న వారికి మరింత మెరుగైన వైద్య చికిత్సను అందించుటకు, పర్యవేక్షణకు వైద్యులను, సిబ్బందిని నియమిస్తున్నామని, నోటిఫికేషన్లు జారీ చేసామని, కొన్ని పోస్టులకు భర్తీ ప్రక్రియ పూర్తి అయ్యాయని కలెక్టర్ చెప్పారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి వివరాలు తెలుసుకోవడానికి జెమ్స్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసామని అన్నారు. జెమ్స్ లో కంట్రోల్ రూమ్ 1800 425 6625 నంబరుకు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చని అన్నారు. కరోనా వ్యాధిగ్రస్తుల సమస్యలను తెలియజేయుటకు జిల్లా కంట్రోల్ రూమ్ నంబరు 08942 240605, హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారి సమస్యలకు కంట్రోల్ రూమ్ 08942 240615 ను ఏర్పాటు చేసామని కలెక్టర్ చెప్పారు. వీటితోపాటు జిల్లాలో 104 కాల్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
వివక్ష చూపే వారిపై కేసులు : కరోనా కారణంగా వివక్ష చూపే వారిపై ఎపిడమిక్ చట్టం క్రింద కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. కరోనా ఎవరికైనా సోకవచ్చని ప్రతి ఒక్కరూ గ్రహించాలని ఆయన అన్నారు.