కోవిడ్-19 వేక్సినేషన్‌కు సిద్దం కావాలి..
Ens Balu
2
విజయనగరం
2021-01-02 13:53:21
విజయనగరం జిల్లాలో కోవిడ్ 19 వేక్సినేషన్‌కు అన్నివిధాలా సిద్దం కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ అధికారులను ఆదేశించారు. వేక్సిన్ పంపిణీ విషయంలో ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలను పాటిస్తూ, ఆదేశాలను తూచత ప్పకుండా అమలు చేస్తూ, అత్యంత పకడ్భంధీగా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో కోవిడ్ 19 వేక్సిన్ డ్రైరన్ శనివారం విజయవంతంగా నిర్వహించారు. జిల్లా కేంద్రాసుపత్రి, రాజీవ్‌నగర్ కాలనీలోని అర్బన్ హెల్త్ సెంటర్‌తోపాటు, వెంకటపద్మ ప్రయివేటు ఆసుపత్రిలో కూడా డ్రైరన్ నిర్వహించారు. ప్రతీచోటా 25 మందికి తక్కువ కాకుండా వేక్సినేషన్ చేశారు. ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ముందుగా పేర్లు రిజిష్ట్రేషన్ చేశారు. అనంతరం వారికి వేక్సినేషన్ చేశారు. వారిని సుమారు 30 నిమిషాలపాటు పరిశీలనలో ఉంచారు. ఈ సమయంలో వారికి రక్తపోటు, ఇతర పరీక్షలు చేశారు. అసలైన వేక్సిన్ వేసినప్పుడు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను, కోవిడ్ నిబంధనలను పాటిస్తూ, డ్రైరన్ నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని మూడుచోట్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ పరిశీలించారు. అన్ని నిబంధనలను పాటిస్తున్నదీ, లేనిదీ తనిఖీ చేశారు. పేర్లు రిజిష్ట్రేషన్‌కంటే ముందు వేచిఉండేందుకు గదులను ఏర్పాటు చేయాలని, చేతులు కడుగుకొనేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే వేక్సిన్ ఎట్టి పరిస్థితిలోనూ వృధా కాకుండా చూడాలని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ రిజిష్ట్రేషన్, వేక్సినేషన్, అబ్జర్వేషన్ విభాగాలుగా వేక్సినేషన్ ప్రక్రియ జరుగుతుందన్నారు. కోవిడ్ వేక్సిన్ విషయంలో రిజిష్ట్రేషన్ అత్యంత కీలకమన్నారు. అవసరమైనవారిని కేంద్రాలకు సకాలంలో రప్పించి, వారికి వేక్సినేషన్ చేయాల్సి ఉందన్నారు. వేక్సినేషన్ అనంతరం, వారి ఆరోగ్య పరిస్థితిని తనిఖీ చేసేందుకు సుమారు 30 నిమిషాలపాటు వారిని అబ్జర్వేషన్ రూములో ఉంచుతామన్నారు. దీనికోసం ఆయా గదుల్లో పడకల సంఖ్యను పెంచి, అవసరమైన డాక్టర్లు, సిబ్బందిని, మందులు, ఇతర పరికరాలను కూడా అందుబాటులో ఉంచడానికి చర్యలను తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే వేక్సినేషన్ ప్రక్రియలో పాల్గొనే సిబ్బంది మధ్య సమన్వయం, అవగాహన కూడా కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ డ్రైరన్ ప్రక్రియను జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్, జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్‌కుమార్, జాయింట్ కలెక్టర్ (ఆసరా) జె.వెంకటరావు ఆయా ఆసుపత్రుల్లో పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జెసి కిశోర్ కుమార్ మాట్లాడుతూ, ఇన్నాళ్లూ కోవిడ్ పేరు వింటేనే వణికిపోయే పరిస్థితి నుంచి, ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో కోవిడ్ వేక్సినేషన్‌కు యంత్రాంగం సిద్దమవుతోందన్నారు. దీనిలో భాగంగా డ్రైరన్ నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా ఎదురయ్యే అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, భవిష్యత్తులో చేపట్టబోయే వేక్సినేషన్‌కు తగిన జాగ్రత్తలను తీసుకుంటామని అన్నారు.
ఈ డ్రైరన్‌లో జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ ఎస్‌వి రమణకుమారి, డిసిహెచ్ఎస్ డాక్టర్ జి.నాగభూషణరావు, డిప్యుటీ డిఎంఅండ్‌హెచ్ఓ డాక్టర్ చామంతి, కేంద్రాసుపత్రి సూపరింటిండెంట్ డాక్టర్ సీతారామరాజు, జిల్లా ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ డాక్టర్ ఎం.నారాయణ, డిఎల్ఓ డాక్టర్ రవికుమార్, డిపిఎం సూర్యనారాయణ, యుఎన్‌డిపి కన్సల్టెంట్ కమలాకర్, అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ సిహెచ్‌విఎస్ లావణ్య, వెంకటపద్మ ఆసుపత్రి ఎండి డాక్టర్ వెంకటేశ్వర్రావు తదితరులు, సిబ్బంది పాల్గొన్నారు.