5ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలి..
Ens Balu
2
Vizianagaram
2021-01-30 20:15:10
పోలియో నివారణే లక్ష్యంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు నేడు జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డా.ఎం. నారాయణ పేర్కొన్నారు. పల్స్ పోలియో టీకాల పంపిణీకి పక్కా ఏర్పాట్లు చేశామని.. తగిన సిబ్బందిని నియమించామని వెల్లడించారు. ఈ మేరకు శనివారం జిల్లా వైద్యారోగ్య కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. 0-5 సంవత్సరాల వయసు కలిగిన 2.41 లక్షల మంది పిల్లలకు మొత్తం 3 లక్షల డోసులు సిద్ధం చేశామని చెప్పారు. కార్యక్రమాన్ని స్థానిక రాజీవ్ అర్బన్ సెంటర్లో కలెక్టర్ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉదయం 7.00 గంటల నుంచి సాయంత్రం 5.00 వరకు కార్యక్రమం జరుగుతుందని వివరించారు. మొదటి రోజు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1650 బూత్‌ల ద్వారా టీకా పంపిణీ చేస్తామని చెప్పారు. టీకాల పంపిణీలో మొత్తం 3300 బృందాలు పాల్గొంటున్నాయని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త తీసుకున్నామని తెలిపారు. వాటిలో 83 మొబైల్, 32 ట్రాన్సిస్ట్ బృందాలు ఉన్నాయని వివరించారు. పట్టణ, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో తగిన ఏర్పాట్లు చేశామని, గిరిజన ప్రాంతాలకు సిబ్బంది ఒక రోజు ముందుగానే చేరుకున్నారని తెలిపారు. సుశిక్షితులైన 6600 మంది సిబ్బంది సేవల్లో పాల్గొని పిల్లలకు టీకా అందజేస్తారన్నారు. మొదటి రోజు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన బూత్‌లలో సిబ్బంది టీకా పంపిణీ చేస్తారని, ఒక వేళ ఎక్కడైనా పిల్లలు ఉండిపోతే ఫిబ్రవరి 1, 2వ తేదీల్లో ఇంటింటికీ వెళ్లి టీకాలు వేస్తారని స్పష్టం చేశారు.
ప్రయాణంలో ఉన్న పిల్లలకు కూడా టీకా
బూత్‌ల వద్దకు వచ్చే పిల్లలకు టీకా వేయటంతో పాటు.. బస్సు, రైల్వే స్టేషన్‌లలో ప్రత్యేకంగా నియమించిన బృందాలు టీకాలు వేస్తాయని చెప్పారు. అలాగే ట్రాన్సిస్ట్ బృందాలు ప్రయాణించే బస్సుల్లో కూడా పిల్లలకు టీకాలు అందజేస్తాయని వివరించారు. జిల్లా నలుమూలలా వివిధ ప్రాంతాల్లో.. అలాగే జిల్లా సరిహద్దుల్లో కూడా ప్రత్యేక బృందాలను నియమించామని.. ఎలాంటి అసౌకర్యం కలగకుండా కార్యక్రమాన్ని అందరి సమన్వయంతో నిర్వహిస్తామని పేర్కొన్నారు.
కరోనా దృష్ట్యా అన్ని జాగ్రత్తలు
కరోనా నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని డిప్యూటీ డీఎం&హెచ్‌వో డా.చామంతి పేర్కొన్నారు. విధుల్లో పాల్గొనే వైద్యులు, సిబ్బంది, ఆశా కార్యకర్తలు విధిగా మాస్క్ ధరించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. సామాజిక దూరం పాటిస్తూ టీకా పంపిణీ చేస్తామని, అలాగే పరిసరాలను ముందుగానే శానిటైజ్ చేయిస్తామని వివరించారు. పిల్లలను తీసుకొచ్చే తల్లిదండ్రలు కూడా విధిగా మాస్క్ ధరించాలని, పిల్లలకు కూడా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు. సమావేశంలో డిప్యూటీ డీఎం&హెచ్‌వో డా. టి.వి. బాలమురళీ కృష్ణ, ఇతర వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.