ఎన్నికలు సజావుగా నిర్వహించండి..


Ens Balu
2
Srikakulam
2021-02-01 20:31:45

రాష్ట్రంలో జరగనున్న పంచాయతీ ఎన్నికలు సునిశితమైనందున ఈ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ముఖ్యంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై దృష్టి సారించాలని, సమస్యాత్మక ప్రాంతాలు కలిగిన జిల్లాల్లో శ్రీకాకుళం కూడా ఉందన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి , కమీషనర్  ఎం.గిరిజాశంకర్ తో కలిసి సోమవారం జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రతీ అంశం సునిశితమైందని, కావున పక్కాగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు ఎన్నికల ప్రవర్తన నియమాలకు అనుగుణంగా పనిచేయాలని అన్నారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో ఓటర్ల జాబితా , బ్యాలెట్ బాక్సులు ( అదనపు బాక్సులతో సహా ), బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. పోలింగ్ మెటీరియల్ ను సరఫరా చేసేందుకు అవసరమైన నాలుగు చక్రాల వాహనాలను సిద్దం చేసుకోవాలని సూచించారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్ ఏర్పాటుచేయాలని ఆదేశించారు. కౌంటింగ్ సమయంలో ఓట్లు ప్రాతిపదికన అవసరమైన కౌంటింగ్ టేబుళ్లను సిద్ధం చేసుకోవాలని, రిటర్నింగ్ అధికారి కొరకు ప్రత్యేకంగా ఒక టేబుల్ ను ఉంచాలని చెప్పారు. ఇందుకు ప్రత్యేకంగా గదిని సిద్ధం చేసుకొని ఉంచుకోవాలని, ప్రతీ పోలింగ్ కేంద్రం, కౌంటింగ్ కేంద్రాలలో అవసరమైన లైటింగును ఏర్పాటుచేసుకోవాలని,  ఏజెంట్లకు అనుమతిని ఇవ్వాలని చెప్పారు. 5వేల నుండి 10వేల ఓటర్లు కలిగిన ప్రాంతాల్లో ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని, అలాగే కౌంటింగ్ రాత్రి 10గం.ల వరకు జరిగే అవకాశం ఉన్నందున అధిక సంఖ్యలో పోలీసులు, అధికారులను ఏర్పాటుచేసి అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ఎన్నికలు పద్ధతి ప్రకారం, ఎన్నికల సరళి మేరకు పోలీసుల సహకారంతో సజావుగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.         జిల్లా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ జిల్లాలో బ్యాలెట్ బాక్సులను పరిశీలించి సిద్ధం చేయడం జరిగిందన్నారు. స్టేజ్ -1 మరియు 2లకు సంబంధించి ఆర్.ఓలను నియమించడం జరిగిందని, స్టేజ్ -2 ఆర్.ఓలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు చెప్పారు. పి.ఓలు, ఓ.పి.ఓలకు రెండు దశలలో మండలస్థాయి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని చెప్పారు. ఓటర్ల జాబితా పరిశీలించడం జరిగిందని, ప్రతీ గ్రామ పంచాయతీలో సంబంధిత ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తునట్లు చెప్పారు. మోడల్ బ్యాలెట్ పేపర్లను కూడా పరిశీలించడం జరిగిందని, ఆ మేరకు బ్యాలెట్ పేపర్లను సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మండల, గ్రామస్థాయిలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని అమలుచేస్తున్నామని వివరించారు.కోవిడ్ మెటీరియల్ కూడా సిద్ధం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, పోలింగ్ కేంద్రాలను పరిశీలించి సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు రూట్ అధికారులను కూడా ఏర్పాటుచేసినట్లు కలెక్టర్ తెలిపారు.         ఈ వీడియో సమావేశంలో సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు, సహాయ కలెక్టర్ యం.నవీన్, జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.