ఇంటింటికీ సరుకులు పక్కాగా అమలు చేయాలి..
Ens Balu
3
Vizianagaram
2021-02-05 20:16:06
మీ రేషన్- మీ ఇంటికే కార్యక్రమం క్రింద జిల్లాలో ప్రారంభించిన ఇంటింటికీ రేషన్ సరుకుల సరఫరా సజావుగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్ ఆదేశించారు. ఈ కొత్త విధానం అమల్లో ఏమైనా సమస్యలు తలెత్తినట్లయితే, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రేషన్ సరఫరా వాహనాల యజమానులు (ఎండియు), రేషన్ డీలర్లు, పౌర సరఫరాల అధికారులతో తొలి సమన్వయ కమిటీ సమావేశం జాయంట్ కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం జెసి ఛాంబర్‌లో జరిగింది. ముందుగా ఎండియు ప్రతినిధులు మాట్లాడుతూ తమ సమస్యలను వివరించారు. రేషన్ డిపోలనుంచి సరుకులను తూకం వేయడం, వాటిని తమ వాహనాల్లో లోడ్ చేసుకోవడం, ఇంటింటికీ వెళ్లి తూకం వేసి ప్రజలకు పంపిణీ చేయడం చాలా కష్టంగా ఉందని చెప్పారు. ఇంతా చేసినా, తమ కష్టానికి తగిన వేతనం గిట్టుబాటయ్యే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లేబర్ ఛార్జీల రూపంలో ఇస్తామన్న రూ.3వేలు ఏమాత్రం సరిపోవని చెప్పారు.
రేషన్ డీలర్ల సంఘం నాయకులు బుగత వెంకటేశ్వర్రావు, సముద్రాల రామారావు మాట్లాడుతూ, తమకు అంతంత మాత్రపు ఆదాయమే వస్తోందని, చాలామంది పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ఇలాంటి స్థితిలో తాము కూలీలను పెట్టుకొనే స్థోమత లేదని అన్నారు. కేవలం గౌరవం, గుర్తింపు కోసమే చాలామంది రేషన్ డిపోలను నిర్వహిస్తున్నామని చెప్పారు. తమకు ప్రభుత్వం నుంచి కోట్లాదిరూపాయల కమిషన్ బకాయి రావాల్సి ఉందని అన్నారు. కరోనా కాలంలో 18 విడతలుగా ఉచిత రేషన్‌ను సరఫరా చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
అనంతరం జెసి కిశోర్ మాట్లాడుతూ, కొన్నిచోట్ల ఎండియు వాహనాలను ఆపివేయడం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏ కొత్త వ్యవస్థను ప్రారంభించినా, మొదట్లో కొన్ని సమస్యలు ఉత్పన్నం అవుతాయని, అవన్నీ క్రమక్రమంగా సమసిపోతాయని చెప్పారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, సమస్యలు ఉత్పన్నం అయినా వ్యవస్థ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎండియు ఆపరేటర్లు, రేషన్ డీలర్లు సర్దుకొని పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు. కొత్తలో కష్టమైనా, ఆ తరువాత పని సులువుగా ఉంటుందన్నారు. ఎండియు వాహనాల యజమానులకు భవిష్యత్తు బాగుంటుందని భరోసానిచ్చారు. ఏదైనా సమస్యలు ఉంటే, తమకు తెలియజేయాలని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని జెసి హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరా అధికారి ఏ.పాపారావు, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ వరకుమార్, విజయనగరం తాశీల్దార్ ఎం.ప్రభాకరరావు, తూనికలు కొలతల శాఖాధికారులు పాల్గొన్నారు.