అభ్యర్ధులు ఖర్చుల వివరాలు చెప్పాల్సిందే..
Ens Balu
2
Anantapur
2021-02-05 20:52:44
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చు వివరాలను ప్రతిరోజు తప్పనిసరిగా నమోదు చేయాలని గ్రామ పంచాయతీ ఎన్నికల ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ రామకృష్ణ (ఐఎఫ్ఎస్, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, కర్నూలు) పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని జిల్లా పరిషత్తు కార్యాలయం సమావేశ మందిరంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆడిట్ ఆఫీసర్ లకు అభ్యర్థుల ఎన్నికల ఖర్చు పై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు నిర్ణయించిన ఖర్చు కన్నా అధికంగా ఎన్నికల్లో సర్పంచ్, వార్డు మెంబర్లకు పోటీ చేసే అభ్యర్థులు ఖర్చు చేయకుండా చూడాలన్నారు. సర్పంచ్ అభ్యర్థి 10 వేల ఓటర్లు పైగా ఉండే పంచాయతీలో 2 లక్షల 50 వేల రూపాయలను, 10 వేల కన్నా తక్కువ మంది ఓటర్లు ఉన్న పంచాయతీలో ఒక లక్షా 50 వేల రూపాయలు ఖర్చు చేసేలా, వార్డ్ మెంబర్ కు సంబంధించి 10 వేల మంది ఓటర్లకు పైగా ఉండే చోట 50 వేల రూపాయలు, 10 వేల మంది ఓటర్ల కన్నా తక్కువ ఉన్న చోట 30 వేల రూపాయలు ఖర్చు చేయాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించిందని తెలిపారు. అభ్యర్థులు ఎవరు నిర్ణయించిన ఖర్చు కన్నా అధికంగా ఖర్చు పెట్టకుండా చూడాలన్నారు. అభ్యర్థుల ఖర్చుల వివరాల నమోదుకు సంబంధించి ప్రతి ఒక అభ్యర్థికి ఒక రిజిస్టర్ ను ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల్లో పోస్టర్స్, బ్యానర్స్, వెహికల్స్, మీటింగులు లాంటివి ఏర్పాటుచేసిన వాటిని ప్రతి ఒక అభ్యర్థి కి ఒక రిజిస్టర్ ని ప్రారంభించి, అన్ని రకాల ఖర్చు వివరాలను నమోదు చేయాలన్నారు. ఎవరు ఎంత ఖర్చు చేశారో తప్పనిసరిగా రిజిస్టర్ లో రాయాలని, అభ్యర్థులెవరూ ఓటర్లను ప్రలోభపెట్టకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిజాయితీగా జరిగేలా చూడాలన్నారు. ఎన్నికల్లో సమర్థుడినే గెలిపించేలా చూడాలని, అధికారులంతా జోనల్, రూట్ ఆఫీసర్లను, ఫ్లయింగ్ స్క్వాడ్లను మానిటర్ చేసుకుని పని చేయాలన్నారు.
ప్రతి ఒక్కరూ ఎన్నికల కమిషన్ నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల ఖర్చుపై ప్రతి ఒక్కరికి క్లారిటీ ఉండాలని, ప్రస్తుతం మొదటి విడత ఎన్నికల పోలింగ్ కు సమయం తక్కువగా ఉందని, కేటాయించిన బాధ్యతలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా సక్రమంగా నిర్వహించాలని సూచించారు. అభ్యర్థి నామినేషన్ వేసినప్పటినుంచి కౌంటింగ్ జరిగే వరకూ జాగ్రత్తలు తీసుకోవాలని, అభ్యర్థుల ఖర్చు కు సంబంధించి అన్ని రకాల రిపోర్టులను పక్కాగా నమోదు చేయాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తో సమావేశం ఏర్పాటు చేయాలని, ఎన్నికల కమిషన్ సూచించిన ఖర్చునే ఖర్చు చేసేలా వారికి తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ లు వెంకట్రాముడు, సుబ్బారావు, లైజన్ ఆఫీసర్ వెంకటశివారెడ్డి, ఆడిట్ ఆఫీసర్ లు పాల్గొన్నారు.