పరిమితికి లోబడే అభ్యర్ధులు ఖర్చుచేయాలి..


Ens Balu
1
Kakinada
2021-02-05 21:14:28

గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్ధులు రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు గరిష్ట పరిమితికి లోబడి మాత్రమే ఖర్చు చేయాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు అనంత శంకర్ (ఐఎఫ్ఎస్) తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వ్యయ పరిశీలకులుగా నియమితులైన  అనంత శంకర్ కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ మరియు జిల్లా సమాచార కేంద్రాన్ని శుక్రవారం మధ్యాహ్నం సందర్శించి మండలాల వారీగా నియమింపబడిన మండల వ్యయ పరిశీలకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులందరూ తమ ఎన్నికల వ్యయాన్ని నిర్దేశించిన రేట్ల ప్రకారం స్క్రూటినికి  సమర్పించాలన్నారు. లేని పక్షంలో తదుపరి ఎన్నికల్లో పోటీ చేసేందుకు  అనర్హులౌతారని ఆయన అన్నారు. ఎన్నికలలో పోటీలో ఉన్న అభ్యర్ధులు చేసే ఖర్చు పరిశీలనకు  బృందాలనూ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అభ్యర్ధుల ఖర్చులకు సంబంధించి వివరాలను పేజీకి ఒక్క రూపాయి చొప్పున సంబంధిత రిటర్నింగ్ అధికారికి చెల్లించి ఎవరైనా పొందవచ్చన్నారు. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఓటర్లను ఎటువంటి ప్రలోభాలకు గురిచేయకుండా, ఎన్నికలు  నిష్పక్షపాతంగా జరిగేందుకు అధికారులందరూ కృషి చేయాలన్నారు. ఓటర్లకు బహుమతులు, ఇతర ప్రలోభాలు పంచకుండా కమ్యూనిటీహాల్లు, కళ్యాణ మండపాలలో తనిఖీలు నిర్వహించాలని ఆయన తెలిపారు.  అనుమతి, తగిన ఆధారాలు లేకుండా పెద్ద మొత్తంలో నగదు తరలించరాదని,  దీనిపై జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు.  అనుమతి లేకుండా ఎన్నికల ప్రచారాలకు వాహనాలు వినియోగించరాదన్నారు. ఎవరైనా ఫిర్యాదు చేయాలంటే కంట్రోల్ రూమ్ నెంబర్ కు 8106149123, 8106721345కు ఫోన్ చేసి తెలుపవచ్చన్నారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, నిబంధనల పాటిస్తూ జరిగేలా  అభ్యర్ధులందరూ సహకరించాలని వ్యయ పరిశీలకులు  అనంత శంకర్ కోరారు.  ఈ సమావేశంలో  ఆయనతో పాటు కంట్రోల్ రూమ్ ఎక్సెపెండిచర్ నోడల్ అధికారి బి.చంద్రరావు, కంట్రోల్ రూమ్ ఇన్ చార్జి కె.శ్రీరమణి ఇతర అధికారులు పాల్గొన్నారు.