ఓటర్లకు ఫోటోతో కూడిన స్లిప్పులు..


Ens Balu
2
Vizianagaram
2021-02-06 15:12:51

విజయనగరం జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ సందర్భంగా ఓటర్లకు ఫోటోతో కూడిన ఓటర్ స్లిప్పులను పంపిణి చేయడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా ఎం.హరిజవహర్ లాల్ తెలిపారు. ఆయా గ్రామాల్లో పోలింగ్ కు ముందే గ్రామంలో పనిచేసే ప్రభుత్వ సిబ్బంది సహకారంతో పోలింగ్ కు ముందు రోజు వీటిని పంపిణి చేయనున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ పంపిణీ చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఫోటో ఓటర్ స్లిప్పుల పంపిణీ వల్ల ఓటర్ తాను ఏ పోలింగ్ కేంద్రంలో ఓటు వేయాల్సి వుంటుందో సులువుగా గుర్తిస్తారనీ, పోలింగ్ కేంద్రంలోని సిబ్బంది కూడా ఓటర్ స్లిప్పు ఆధారంగా ఓటర్ జాబితా లో ఓటర్ పేరును, క్రమ సంఖ్య ను గుర్తించే అవకాశం ఉంటుందనీ పేర్కొన్నారు. అయితే ఫోటో ఓటర్ స్లిప్ తీసుకు వెళ్ళడం తప్పనిసరి కాదని, ఓటరు స్లిప్ లేకపోయినా ఫోటోతో కూడిన ఓటర్ గుర్తింపు కార్డు లేదా రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచించిన ఏదైనా గుర్తింపు కార్డు ఆధారంగా ఓటు వేసేందుకు అనుమతిస్తారనీ పేర్కొన్నారు. పోలింగ్ జరిగే రోజున కూడా ఓటర్లకు పోలింగ్ స్లిప్పులు జారీ కోసం ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు.