మౌళిక వసతుల కల్పనకు ప్రాధాన్యం..
Ens Balu
3
Andhra University
2021-02-06 19:37:11
కేంద్ర బడ్జెట్‌లో మౌళిక వసతుల కల్పనకు అధిక నిధులు కేటాయించారని ఇది శుభ పరిణామమని ఆర్‌జియుకెటి చాన్సలర్ ఆచార్య కె.సి రెడ్డి అన్నారు. శనివారం ఉదయం ఏయూ అర్ధశాస్త్ర విభాగంలో కేంద్ర బడ్జెట్‌పై ఏర్పాటు చేసిన చర్చా వేదికలో ఆయన కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆచార్య కె.సి రెడ్డి మాట్లాడుతూ మౌళిక వసతుల కల్పనలో భాగంగా రహదారులు, పోర్టుల నిర్మాణాలు జరుగుతాయన్నారు. తద్వారా పెట్టుబడులు పెరుగుతాయని, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటు శుభ పరిణామమన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా స్వదేశీ ఉత్పత్తులను ఎగుమతులు చేయడం, అదే సమయంలో విదేశీ వస్తువులను దిగుమతి చేసుకోవడం రెండూ జరగాలని సూచించారు. నైపుణ్యాభివృద్ధి, విద్య రంగాలపై సైతం కేంద్ర బడ్జెట్ దృష్టి పెట్టిందన్నారు. సాహసోపేతంగా ఈ బడ్జెట్ రూపకల్పన నిలచిందన్నారు. విశ్రాంత రెక్టార్ ఆచార్య ఏ.ప్రసన్న కుమార్ మాట్లాడుతూ అసమానతలు తొలగిస్తూ, అవకాశాలు కల్పించే విధంగా బడ్జెట్ రూపకల్పనలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు, యువతకు కేంద్ర బడ్జెట్ మరింత ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. టాక్సులకు సంబంధించిన చట్టాలలో తరచూ మార్పులు చేయవద్దని సూచించారు. అర్ధశాస్త్ర విభాగాధిపతి ఆచార్య ఎం.ప్రసాద రావు మాట్లాడుతూ దేశ ఆర్ధిక రంగం మెల్లగా పుంజుకుంటోందన్నారు. ఉపాధి పెరగాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో విశ్రాంత ఆచార్యులు సి.సాంబ మూర్తి, చార్టెడ్ అకౌంటెంట్ ఆకుల చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.