20 నుంచి సచివాలయ సిబ్బందికి ఆన్ లైన్ శిక్షణ..
Ens Balu
3
Srikakulam
2020-08-18 20:35:39
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఆన్ లైన్ ద్వారా శిక్షణా కార్యక్రమాలను ఈ నెల 20వ తేదీ నుంచి నిర్వహిస్తున్నామని వార్డు, గ్రామ సచివాలయ విభాగం జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి పరిస్థితులలో రెండవ విడత శిక్షణా కార్యక్రమాలన్నీ "ఆన్ లైన్/అంతర్జాల శిక్షణా కార్యక్రమాలు" గా ప్రారంభించడానికి గ్రామ/వార్డు సచివాలయాల శాఖ సన్నాహాలు పూర్తి చేసిందన్నారు. మైక్రో సాఫ్ట్ బృందాల సమన్వయంతో ఒకేసారి 20 వేల మందికి ఆన్ లైన్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించే సౌలభ్యాన్ని సచివాలయ శాఖ ఏర్పాటు చేసిందని ఆయన చెప్పారు. ఈ సౌలభ్యాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ఈ నెల 20వ తేదీ నుండి శిక్షణా కార్యక్రమాలను ప్రారంభిస్తుందని పేర్కొన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో రెండు వేల మంది గ్రేడ్ -5 పంచాయతీ కార్యదర్శులకు ఆగస్ట్ 20 నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శిక్షణ ఉంటుందని చెప్పారు. ఈ శిక్షణా కార్యక్రమానికి సచివాలయ శాఖ కమీషనర్ నవీన్ కుమార్ కార్యాచరణ తయారు చేసారని తెలిపారు. త్వరలో రెవెన్యూ, సాంఘిక సంక్షేమ శాఖలకు సంబంధించిన గ్రామ సచివాలయ సిబ్బందికి కూడా శిక్షణ ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నట్లు కమీషనర్ తెలియజేసారని ఆయన చెప్పారు. ఆన్ లైన్ శిక్షణా కార్యక్రమాలలోని హాజరు, పొందిన మార్కులను ప్రొబేషన్ ప్రకటనకు ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుందని ఆయన వివరించారు. మొదటి విడతగా రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాలలోని 13 విభాగాల సిబ్బందికి, వాలంటీర్లకు క్షేత్ర స్థాయిలో శిక్షణ ఇవ్వడం జరిగిందని చెప్పారు. గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థ ఏర్పడి ఆగస్ట్ 15 నాటికి ఒక ఏడాది పూర్తి అయిందని, తాజాగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దేశంలోనే తొలిసారిగా "డిజిటల్ చెల్లింపు" వ్వవస్థను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆగస్ట్ 15న ప్రారంభించారని వివరించారు. దేశ చరిత్రలో ప్రప్రథమంగా గ్రామాలలోనే, గ్రామ సచివాలయాలలోనే ప్రభుత్వ సేవలను పొందుటకు, ఆ సేవలు పొందినందుకు గానూ సేవా రుసుమును చెల్లించుటకు సెల్ ఫోన్ ద్వారా, నగదు రహితంగా, సులభంగా, సజావుగా, తక్షణమే చెల్లించే అధునాతన డిజిటల్ చెల్లింపు వ్యవస్థను ఆవిష్కరించడం భారతావనికే గర్వకారణమన్నారు. ఈ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి గ్రామ,వార్డు వాలంటీర్లకు సమగ్రమైన, సునిశితమైన, సంపూర్ణమైన శిక్షణా అవసరాన్ని గుర్తించి గ్రామ,వార్డు సచివాలయాల ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, కమీషనరు నవీన్ కుమార్ సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు నిరంతర శిక్షణ కార్యక్రమాలను చేపట్టడం ముదావహమన్నారు.
భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, ప్రణాళికాబద్ధంగా ప్రజల ముంగిట ప్రభుత్వ సేవలను, పథకాలను చేరవేర్చే వినూత్నమైన విప్లవాత్మకమైన "గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయ" వ్యవస్థను ముఖ్యమంత్రి వర్యులు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించడం ప్రపంచ చరిత్రలో ప్రప్రథమం అన్న విషయం తెలిసినని ఆయన చెప్పారు. ఈ వ్యవస్ధ ద్వారా ఇంటి వద్దకే అన్ని శాఖలకు చెందిన దాదాపు 5 వందల రకాల సేవలను ప్రజల హర్షాతిరేకల మధ్య అందజేస్తున్న ఘనత మన ముఖ్యమంత్రికి దక్కతుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా, తెలవారకముందే తలుపు తట్టి, పింఛన్లు పంపిణీ చేస్తూ, పింఛనదారుల జీవితాల్లో పరమానందం నింపుతున్న వాస్తవం జగమెరిగినదేనని, గతంలో నాలుగైదు రోజులు పట్టే పింఛన్ పంపిణీ కార్యక్రమం, నేడు సుశిక్షితులైన వాలంటీర్లు ద్వారా నాలుగైదు గంటలలో మధ్యాహ్నం లోపలే సంపూర్ణంగా పంపిణీ అవుతున్న సత్యం చారిత్రాత్మకమని ఆయన అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు భారీ ఎత్తున లబ్ది చేకూర్చే ఎన్నెన్నో పథకాలను, "నవరత్నాలు" పేరుతో నవ లక్ష్యాల సాధనకు ప్రజా సంక్షేమ పథకాలను నవ్యరీతిన, నభూతో నభవిష్యతిగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా, వాలంటీర్ల ద్వారా అమలు చేయిస్తూ జగద్విఖ్యాతిని పొందుతున్నారని ఆయన పేర్కొన్నారు.