శ్రీకాకుళంలో లాక్ డౌన్ విజయవంతం..


Ens Balu
1
శ్రీకాకుళం
2020-09-13 17:30:53

శ్రీకాకుళం పట్టణంలో ఆదివారం అమలుచేసిన లాక్ డౌన్ పూర్తిస్థాయిలో విజయవంతం అయింది. శ్రీకాకుళం పట్టణంలో కేసులు రోజు రోజుకు అధికంగా పెరుగుతు న్న దృష్ట్యా నగరంలో ఆదివారం పూర్తిగా లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ పిలుపునిచ్చిన సంగతి విదితమే. అందులో భాగంగా  గత మూడు వారాలుగా శ్రీకాకుళం పట్టణంలో లాక్ డౌన్ కు ప్రజలు మంచి సహకారం అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే  సెప్టెంబర్ 13 ఆదివారం కూడా సిక్కోలు ప్రజలు నగరంలో అమలుచేసిన లాక్ డౌన్ కు తమ పూర్తి మద్ధతుని ఇస్తూ ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. దాంతో నగరంలోని ప్రధాన రహదారులైన ఆర్.టి.సి. కాంప్లెక్స్, డే అండ్ నైట్ జంక్షన్, ఏడు రోడ్ల జంక్షన్, జి.టి.రోడ్, పాలకొండ రోడ్, కిమ్స్ ఆసుపత్రి రోడ్ నిర్మానుస్యంగా మారిపోయాయి. కాయగూరల మార్కెట్లు, చికెన్, మటన్, చేపల మార్కెట్లు, వివిధ రకాల వర్తక, వాణిజ్య వ్యాపారాలు కూడా తెరవకూడదని జిల్లా కలెక్టర్ ప్రకటించడంతో నగరంలో ఎటువంటి షాపులు తెరుచుకోక పోవడం ముదావహం. అంబులెన్సులు, వైద్య వాహనాలు, అత్యవసర పరిస్థితుల్లో వైద్యం నిమిత్తం వెళ్ళే సొంత వాహనాలు, మందులు, పాలు, బ్రెడ్  కొరకు వచ్చే ప్రజలకు జిల్లా కలెక్టర్ వెసులుబాటు కల్పించడంతో వారు మాత్రమే అక్కడక్కడా కనిపించారు. అంతకుమించి శ్రీకాకుళం నగరంలో ఏ ఒక్కచోట కూడా ప్రజలు బయటకు రాకపోవడం గమనార్హం. దీంతో శ్రీకాకుళం పట్టణంలో లాక్ డౌన్ సంపూర్ణంగా విజయవంతం అయింది. ఇదేస్పూర్తితో మున్ముందు కూడా ఫేస్ మాస్కులు ధరిస్తూ, శానిటైజర్లను వాడుతూ , సామాజిక దూరం పాటిస్తూ సిక్కోలు ప్రజలు సహకరిస్తే కరోనాను అతిత్వరలోనే నియంత్రించవచ్చు.