దేశ ఆలయ శిల్పకళను సంర‌క్షించండి


Ens Balu
15
Tirupati
2022-09-22 14:56:55

దేశ సంస్కృతి సంప్ర‌దాయాల‌కు మూల‌స్తంభ‌మైన శిల్ప‌క‌ళ‌ను సంర‌క్షించి భవిష్యత్ త‌రాలకు అందించాల‌ని టిటిడి ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి విద్యార్థుల‌కు పిలుపునిచ్చారు. శ్రీ వేంకటేశ్వర సంప్ర‌దాయ శిల్ప శిక్ష‌ణా సంస్థలో నిర్వ‌హిస్తున్న వ‌ర్క్‌షాప్‌లో గురువారం ఈవో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ, ఆలయ వాస్తు, చిత్రలేఖనం, శిల్పకళా విద్యార్థులు గొప్ప ప్ర‌తిభ క‌న‌బ‌రుస్తున్నార‌ని ప్ర‌శంసించారు. విద్యార్థులు మ‌రింత నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుండి శిల్ప‌క‌ళలో ప్రావీణ్యం పొందిన స్థపతులు తమ జ్ఞానాన్ని పంచుకోవడానికి, ఆలయ శిల్పకళ నైపుణ్యాలను విద్యార్థుల‌కు అందించడానికి విచ్చేయ‌డం సంతోష‌క‌ర‌మ‌న్నారు.

        విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఉపయోగపడే వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేసిన టిటిడి జెఈవో శ్రీమతి సదా భార్గవిని ఈఓ అభినందించారు. ఈ రంగంలోని నిపుణులను తరచూ ఆహ్వానిస్తూ ఇలాంటి వర్క్‌షాప్‌లు నిర్వహించాలని సూచించారు. బ‌ర్డ్ ఆసుపత్రిలో రోగులకు శస్త్రచికిత్స చేసేందుకు ఆయా విభాగాల్లో నిపుణులైన ప్ర‌ముఖ‌ వైద్యుల‌ను ఆహ్వానిస్తున్నామ‌ని, ఇదేత‌ర‌హాలో ప్ర‌ముఖ స్థపతులు, కళాకారులను ఆహ్వానించి దేవాలయ నిర్మాణం, చిత్రలేఖనం, శిల్పకళలో విద్యార్థులకు మెళ‌కువ‌లు నేర్పించాల‌ని కోరారు.

             అనంతరం సంప్రదాయ చిత్రలేఖనంలో మెళకువలు, వివిధ శిల్ప శాస్త్రాలలో ప్రతిమా లక్షణం వివరణ, ఎపి, తెలంగాణ రాష్ట్రాల్లోని ఆలయాల్లో శైవ, వైఖానస, శక్తి ఆగమాలలోని అంశాల‌పై ఉపన్యాసాలు చేసిన‌  శేషబ్రహ్మం, డాక్టర్ పి.నాగేశ్వరరావు,  సుందర రాజన్,  బ్రహ్మాచార్యులను ఈవో సత్కరించారు.

అంతకుముందు టిటిడి ఈవో స్టాళ్ల‌ను సందర్శించారు. అక్కడ అధ్యాపకులు, విద్యార్థులు రూపొందించిన రాతి, లోహం, సుధా, చెక్క విగ్రహాలు, వివిధ చిత్రలేఖనాలను తిల‌కించారు. క‌ళాశాల అధ్యాపకుడు  జి.సాగర్ డాట్ వర్క్ ఆర్ట్‌ను, సాంప్రదాయ కలంకారి కళలో ప్రావీణ్యం సంపాదించిన విద్యార్థి వెన్నెలను ప్రశంసించారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి సిఇ  నాగేశ్వరరావు, డిఈవో  గోవిందరాజన్, ప్రిన్సిపాల్  వెంకట రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.