పార్వతీపురం మన్యం జిల్లా లో ఏపీ సార్వత్రిక విద్యా పీఠం (ఓపెన్ స్కూల్ సొసైటీ) ద్వారా టెన్త్, ఇంటర్మీడియెట్ లలో ప్రవేశాలకు ప్రభుత్వం గడువు పెంచినట్లు, ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈనెల 25వ తేదీ వరకు గడువు పొడిగించినట్టు జిల్లా విద్యాశాఖాధికారి డా.యస్.డి.వి.రమణ, ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ డి. సూరపునాయుడు తెలిపారు. 2022 ఆగస్టు 31 నాటికి 14 ఏళ్లు వయస్సు పూర్తయినవారు పదో తరగతిలో ప్రవేశాలకు అర్హులని, పది ఉత్తీర్ణులైనవారు ఇంటర్ లో ప్రవేశాలు పొందడానికి అర్హులని పేర్కొన్నారు. ఓపెన్ స్కూల్ ద్వారా రెండేళ్ల ఇంటర్మీడియెట్ కూడా ఏడాదిలోనే పూర్తిచేసుకునే సదవకాశం ఉందన్నారు. జిల్లాలోని వివిధ కారణాలతో మధ్యలో బడి మానేసినవారు, వ్యాపారులు, గృహిణులు, ఆయాలు, అంగన్ వాడి సిబ్బంది ఇలా ఎవరైనా ఓపెన్ స్కూల్ ను సద్వినియోగం చేసుకోవచ్చని వారు కోరారు. మరిన్ని వివరాలతోపాటు దరఖాస్తులను ఏపీఓపెన్ స్కూల్, ఏపీ.జీవోవి.ఇన్ వెబ్ పోర్టల్ లో పొందవచ్చని తెలిపారు.