గ్రామాల్లో నీటి ఎద్దడి రాకుండా చూడాలి


Ens Balu
3
Makkuva
2022-05-06 09:18:49

నీటి ఎద్దడి సమస్యపై వెంటనే స్పందించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. మక్కువ మండలం వెంకట బైరి పురం, కాశీ పట్నం గ్రామ సచివాలయాలను జిల్లా కలెక్టర్ శుక్ర వారం తనిఖీ చేశారు. వేసవి తీవ్రత, నీటి ఎద్దడిపై ఆరా తీశారు. వేసవిలో మంచినీటి ఎద్దడి లేకుండా సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్యపై ఫిర్యాదులు  గూర్చి అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సమస్య రాకూడదని అవసరమైన చోట్ల బోర్ల మరమ్మత్తులు జరిపించాలని అదేశించారు. సచివాలయాల స్థాయిలో పర్యవేక్షణ చేయాలని ఆయన ఆదేశించారు. గ్రామాల్లో తాగు నీటి పరిస్థితిని గూర్చి సమాచారం ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఏ గ్రామంలోనూ తాగు నీటి సమస్య తలెత్తరాదని ఆయన స్పష్టం చేశారు. గ్రామ సచివాలయంలో సిబ్బంది బయో మెట్రిక్ హాజరు పరిశీలించారు. సిబ్బంది విధులకు సకాలంలో హాజరు కావాలని ఆయన అదేశించారు. సచివాలయంలో అందిస్తున్న సేవలు,  సర్వే నిర్వహణ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.  ప్రజలకు సకాలంలో సేవలు అందించాలని, ప్రజల దరఖాస్తులు, స్పందన అర్జీలు వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతను ఇచ్చి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిందని, గ్రామాలలో  సచివాలయ వ్యవస్థ ఉన్నందున ప్రజలకు కావలసిన అన్ని  సేవలు సకాలంలో అందించాలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల వివరాలు సచివాలయంలో అందుబాటులో ఉండాలని, సామాజిక తనిఖీ పక్కాగా జరగాలని ఆయన ఆదేశించారు. 

సిఫార్సు