సకాలంలో ఇళ్ల స్థలాల పంపిణీ చేపడతాం..
Ens Balu
4
Anantapur
2021-01-05 18:56:48
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న "నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు " కింద లబ్ధిదారులకు నిర్ధేశిత సమయంలోగా ఇంటి పట్టాలను వేగవంతంగా పూర్తి స్థాయిలో అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు వివరించారు. విజయవాడ నుంచి మంగళవారం ఇంటి పట్టాల పంపిణీ, ఎన్ఆర్ఈజిఎస్, నాడు - నేడు పనులు, అమ్మఒడి, వివిధ రహదారులకు సంబంధించి భూమి సేకరణ, ఇంటింటికి బియ్యం సరఫరా తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్ లతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతపురం కలెక్టరేట్ లోని ఎన్ఐసి భవనం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ (గ్రామ, వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి)ఏ.సిరి, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) గంగాధర్ గౌడ్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ "నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు " కింద జిల్లాలో పూర్తి స్థాయిలో త్వరితగతిన ఇంటి పట్టాలను పంపిణీ చేస్తామని తెలిపారు. జిల్లాలో గత నెల డిసెంబర్ 25వ తేదీన లబ్ధిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేయడం మొదలుపెట్టామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2.19 లక్షల మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేస్తున్నామని, లబ్ధిదారులకు కేటాయించిన స్థలంలోనే వారికి ఇంటి పట్టాలను అందజేస్తున్నామన్నారు. సొంత స్థలాలలోనే లబ్ధిదారుల వద్దకు వెళ్లి ఇంటి పట్టాలను పంపిణీ చేస్తున్నామని, ఇంటి పట్టాలను అందుకున్న మహిళలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఇంటి పట్టాల పంపిణీ చేస్తున్నామని, నిర్దేశిత సమయంలోగా ఇంటి పట్టాలను పంపిణీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కి జిల్లా కలెక్టర్ వివరించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సిపిఓ ప్రేమచంద్ర, డీఈవో శామ్యూల్, ఎపిఈడబ్ల్యూసి అండ్ ఎస్ఎస్ఏ ఈఈ శివకుమార్, ఐసిడి ఎస్ పిడి విజయలక్ష్మి, డిఎం హెచ్ ఓ కామేశ్వర ప్రసాద్, డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి, వ్యవసాయ శాఖ జెడి రామకృష్ణ, డిప్యూటీ కలెక్టర్ వరప్రసాద్, హౌసింగ్ పిడి చంద్రమౌళి రెడ్డి, డి ఎస్ ఓ రఘురాం రెడ్డి, ట్రాన్స్ కో ఎస్ ఈ రాజశేఖర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, అధికారులు పాల్గొన్నారు.