గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి


Ens Balu
7
Tirupati
2022-08-26 16:31:50

నోడల్ గోశాలల నిర్వాహకులు తమ పరిధిలోని ఇతర గోశాలలను తరచూ సందర్శిస్తూ  రైతులు గో ఆధారిత వ్యవసాయం చేసేలా ప్రోత్సహించాలని టీటీడీ జెఈవో  వీరబ్రహ్మం పిలుపు నిచ్చారు.  టీటీడీ ఆధ్వర్యం లోని  ఎస్వీ  గోసంరక్షణ శాల ఆధ్వర్యంలో శ్వేతా లో నిర్వహించిన రెండు రోజుల శిక్షణా కార్యక్రమం శుక్రవారం సాయంత్రం ముగిసింది. ఈ సందర్బంగా వీర బ్రహ్మం నోడల్ గోశాలల నిర్వాహకులనుద్దేశించి మాట్లాడారు.  నోడల్  గో శాలలు  గో ఆధారిత పంచగవ్య ఉత్పత్తుల తయారీ మీద దృష్టి పెట్టాలని చెప్పారు. టీటీడీ పాలక మండలి చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఈవో  ఎవి ధర్మారెడ్డి  గో సంరక్షణ , గోశాలల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. గో ఆధారిత పంట ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.  గోవుల పోషణ ఇబ్బందిగా ఉన్న గోశాలల్లోని గోవులను టీటీడీ  గోశాలకు తరలించి , గో ఆధారిత వ్యవసాయం చేసే రైతులకు ఉచితంగా అందించేలా  కృషి చేయాలన్నారు . నోడల్ గోశాలల నిర్వాహకులతో ప్రతి నెల నేరుగా గానీ వర్చువల్ గా కానీ సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కార మార్గాలు ఆలోచిస్తామని  వీరబ్రహ్మం చెప్పారు.  పలువురు నోడల్ గోశాలల నిర్వాహకులు వారి సలహాలు సూచనలు సమస్యల గురించి మాట్లాడారు .  అనంతరం వీరికి  ఆయుర్వేద మందుల కిట్లు అందజేశారు. శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ కమిటీ సభ్యులు  రామ్ సునీల్ రెడ్డి , గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథ రెడ్డి  శ్వేతా డైరెక్టర్  ప్రశాంతి , పశువైద్య విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ వెంకట నాయుడు పాల్గొన్నారు.