ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. త్వరగా వాదనలు ముగించాలని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం ముందు ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్పందించిన సుప్రీం ధర్మాసనం.. ఆ పిటిషన్లపై మార్చి 28న విచారణ చేపడతామని స్పష్టం చేసింది. దీనిపై గతవారం విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ రాజ్యాంగ ధర్మాసనం బుధ, గురువారాల్లో మిస్‌లేనియస్ పిటిషన్లపై విచారణను నిలుపుదల చేసిన నేపథ్యంలో అప్పుడు వాయిదా పడింది. మళ్లీ తాజాగా వాయిదా పడింది. మరోప్రక్క వైజాగ్ లో రాజధాని కార్యకలాపాలు మార్చి నుంచి చేపట్టడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. విషయం కోర్టులోనే ఉన్నప్పుడే వారంలో రెండు రోజులు వైజాగ్ నుంచి పరిపాలన సాగించే విధంగా ఏర్పాట్లు జరగుతున్నట్టు తెలిసింది.