మార్చి 21న శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా విడుదల


Ens Balu
25
Tirumala
2023-03-20 16:07:15

శ్రీవాణి టికెట్లకు సంబంధించిన జూన్ నెల ఆన్ లైన్ కోటాను మార్చి 21వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి విడుదల చేయనుంది.  తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన జూన్ నెల కోటాను మార్చి 23న ఉదయం 10 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. వీటిలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు ఉన్నాయి.  అదేవిధంగా, జూన్ నెలకు సంబంధించిన మిగతా ఆర్జిత‌సేవా టికెట్లకు ఆన్‌లైన్ ల‌క్కీడిప్ న‌మోదు ప్ర‌క్రియ మార్చి 24న ఉదయం 11 గంట‌ల‌కు మొదలవుతుంది. లక్కీడిప్ లో టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. 

 జూన్ నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మార్చి 24న ఉదయం 10 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఏప్రిల్ నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను మార్చి 24వ తేదీన మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.  భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని టిటిడి కోరుతోంది.