జమ్మూలోని మజీన్ గ్రామంలో తావి(సూర్యపుత్రి) నది ఒడ్డున టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం సాయంత్రం శ్రీవారి కల్యాణం వేడుకగా జరిగింది. ముందుగా వేద పండితులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణవేదిక వద్దకు తీసుకొచ్చారు. అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవా యిద్యా ల నడుమ విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహాసంకల్పం, మంగళసూత్రధారణ ఘట్టాలతో వేదమంత్రాలు పఠిస్తూ శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. చివరిగా నక్షత్రహారతి, మంగళహారతి కార్యక్రమంతో కల్యాణం దిగ్విజయంగా ముగిసింది. శ్రీవా రు, అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని నేత్రపర్వంగా తిలకించిన జమ్మూ భక్తులు భక్తిపారవశ్యంతో పులకించారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవోలు గుణభూషణ్ రెడ్డి, శివప్ర సాద్, ఇఇ సుధాకర్, డెప్యూటీ ఇఇలు రఘువర్మ, చెంగల్రాయలు, ఏఈవో కృష్ణారావు, సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం, టెంపుల్ ఇన్స్పెక్టర్ సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.