రూ.834 కోట్ల‌తో గిరిజ‌న కేంద్రీయ విశ్వవిద్యాల‌యం


Ens Balu
61
Salur
2023-08-25 15:46:58

సాలూరు నియోజ‌క‌వ‌ర్గంలో రూ.834 కోట్ల‌తో ఏర్పాటు చేయ‌నున్న కేంద్రీయ గిరిజ‌న విశ్వ విద్యాల‌య నిర్మాణ ప‌నుల‌కు రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శుక్ర‌వారం శంకుస్థాప‌న చేశారు. ఈ మ‌హోత్త‌ర కార్య‌క్ర‌మంలో కేంద్ర విద్యా, నైపుణ్యాభివృద్ధి & వ్య‌వ‌స్థాప‌క‌త‌ శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ భాగ‌స్వామ్య‌మ‌య్యారు. సాలూరు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని మెంటాడ మండ‌లం చిన‌మేడ‌ప‌ల్లి వ‌ద్ద ఏర్పాటు చేసిన శిలాఫ‌ల‌కాన్ని ఆవిష్క‌రించి నిర్మాణ ప‌నుల‌కు ముఖ్య‌మంత్రి లాంఛ‌నంగా శంకుస్థాప‌న చేశారు. కేంద్ర మంత్రితో క‌లిసి కొబ్బ‌రికాయ కొట్టి ప‌నుల‌కు అంకురార్ప‌ణ చేశారు. రూ.834 కోట్ల‌తో చేప‌డుతున్న ఈ ప్రాజెక్టును మూడు సంవ‌త్స‌రాల‌లో పూర్తి చేసి గిరిజ‌న విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతామని ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో భాగంగా ముందుగా హెలికాప్ట‌ర్ ద్వారా మెంటాడ మండ‌లం చిన‌మేడ‌ప‌ల్లి చేరుకున్నారు. అక్క‌డ ఏర్పాటు చేసిన శిలాఫ‌ల‌కాన్ని ఆవిష్క‌రించి నిర్మాణ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. అక్క‌డ నుంచి ద‌త్తిరాజేరు మండ‌లం మ‌ర‌డాం వ‌ద్ద ఏర్పాటు చేసిన స‌భాస్థలికి నేరుగా హెలికాప్ట‌ర్ ద్వారా చేరుకున్నారు. అక్క‌డ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో విద్యార్థుల‌ను, ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ముఖ్య‌మంత్రి ప్రసంగించారు. 

గిరిజ‌న ప్రాంత ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అద్దంప‌డుతూ ఏర్పాటు కాబోతున్న‌ కేంద్రీయ విశ్వ విద్యాల‌యం మ‌రో మైలురాయి వంటిద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి.ఎస్ అన్నారు. దీని ద్వారా ఇక్క‌డ యువ‌త‌కు బంగారు భ‌విష్య‌త్తు ల‌భిస్తుంద‌ని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో భాగంగా మ‌ర‌డాం వ‌ద్ద ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో క‌లెక్ట‌ర్ ప్రారంభోపాన్యాసం చేశారు. విశ్వ విద్యాల‌యం ఏర్పాటులో భాగంగా చేప‌ట్టిన భూసేక‌ర‌ణ‌, ఇత‌ర చ‌ర్య‌ల గురించి వివ‌రించారు. 561 ఎక‌రాల భూమిని యూనివ‌ర్శిటీ యాజ‌మాన్యంకు అప్ప‌గించామ‌ని గుర్తు చేశారు. 42 నెల‌ల్లో గుర్తించిన ఈ ప్రాంతంలో విశ్వ‌విద్యాల‌య నిర్మాణ ప‌నులు పూర్తి అయిపోతాయ‌ని అన్నారు. గిరిజ‌న ప్రాంత ప్ర‌జ‌ల క‌ళ‌లు, సంస్కృతీ సంప్ర‌దాయాల‌కు యూనివ‌ర్శిటీ చ‌క్క‌ని వేదిక‌గా మారుతుంద‌ని పేర్కొన్నారు. విద్య‌, ప‌రిశోధ‌న‌లు మ‌రింత పెరుగుతాయ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. వ‌ల‌స‌లు ఆగిపోతాయ‌ని, చ‌క్క‌ని ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని అన్నారు. రూ.834 కోట్ల‌తో నిర్మాణాలు జ‌రుగుతాయ‌ని, మొద‌టి ద‌శ‌లో భాగంగా రూ.420 కోట్ల‌తో కొన్ని ప‌నులు ప్రారంభ‌య్యాయ‌ని చెప్పారు. ఇప్ప‌టికే ఏయూ భ‌వ‌నాల్లో తాత్కాలిక త‌ర‌గ‌తులు ప్రారంభ‌మ‌య్యాయ‌ని క‌లెక్ట‌ర్ గుర్తు చేశారు. యూనివ‌ర్శిటీ నిర్మాణంలో భాగంగా రోడ్లు, తాగునీటి స‌దుపాయం, విద్యుత్ ఇత‌ర మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు, రైతుల‌కు న‌ష్ట ప‌రిహారం చెల్లింపు నిమిత్తం రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.58.49 కోట్లు వెచ్చిస్తోంద‌ని వివ‌రించారు. అనంత‌రం కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్, రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిల‌ను డిప్యూటీ సీఎం రాజ‌న్న‌దొర‌, జిల్లా యంత్రాంగం స‌త్క‌రించి బొబ్బిలి వీణ‌ల‌ను బ‌హూక‌రించారు. వీసీ క‌ట్టిమ‌ణి

కేంద్రీయ గిరిజ‌న విశ్వ విద్యాల‌యం ఏర్పాటులో కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల స‌హ‌కారం మ‌రువ‌లేనిద‌ని వైస్ ఛాన్సలర్ క‌ట్టిమ‌ణి అన్నారు. స‌భ‌లో భాగంగా ఆయ‌న మాట్లాడుతూ, స్థానికంగా అందుతున్న స‌హ‌కారం, కేంద్రం నుంచి వ‌స్తున్న స‌హ‌కారం గురించి వివ‌రించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం అనుకున్న స‌మ‌యానికి 561 ఎక‌రాల‌ భూమిని అప్ప‌గించింద‌ని చెప్పారు. రోడ్లు, విద్యుత్‌, తాగునీటి స‌దుపాయం కోసం పూర్తి స‌హ‌కారం అందిస్తోంద‌ని గుర్తు చేశారు. భూములిచ్చిన రైతుల‌కు స‌కాలంలో న‌ష్ట ప‌రిహారం చెల్లించి ప్ర‌క్రియ‌ను స‌జావుగా నిర్వహించింద‌ని కితాబిచ్చారు. ఈ ప్రాంతంలో గిరిజ‌న యూనివ‌ర్శిటీ రావ‌టం విప్ల‌వాత్మ‌క‌మైన మార్పుకు సంకేత‌మ‌ని పేర్కొన్నారు. గిరిజ‌న ప్రాంత విద్యార్థుల‌కు ఇదొక వ‌ర‌మ‌ని, మాతృభాష‌లో విద్యాభ్యాసం చేసే విద్యార్థుల‌కు చ‌క్క‌ని అవ‌కాశ‌మ‌ని అన్నారు. యూనివ‌ర్శిటీ ఏర్పాటుతో ఈ ప్రాంతంలో విప్లవాత్మ‌క‌మైన మార్పు వ‌స్తుంద‌ని జోస్యం చెప్పారు. 

అనంత‌రం కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్, రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిల‌ను దుశ్శాలువాల‌తో స‌త్క‌రించి జ్ఞాపిక‌ల‌ను బ‌హుక‌రించారు. కార్య‌క్ర‌మంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, డిప్యూటీ సీఎం పీడిక రాజ‌న్న‌దొర‌, జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాసరావు, అర‌కు ఎంపీ గొడ్డేటి మాధ‌వి, రాష్ట్ర ఉన్న‌త విద్యాశాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ జె. శ్యామ‌ల‌రావు, వీసీ క‌ట్టిమ‌ణి, జిల్లా క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి.ఎస్, ఎమ్మెల్సీలు సురేష్ బాబు, ర‌ఘురాజు, ఎమ్మెల్యేలు అల‌జంగి జోగారావు, క‌డుబండి శ్రీ‌నివాస‌రావు, బొత్స అప్పల‌న‌ర‌స‌య్య‌, శంబంగి చిన వెంక‌ట అప్ప‌ల‌నాయుడు, పుష్ప శ్రీ‌వాణి, ఎస్టీ క‌మిష‌న్ ఛైర్ ప‌ర్శ‌న్ డా.జి.వి.జి. శంక‌ర‌రావు, ఇత‌ర అధికారులు, ప్ర‌జా ప్ర‌తినిధులు త‌దిత‌రులు పాల్గొన్నారు.