క్రీడాకారులు పోటీ తత్వంతో బాగా ఆడాలని ఆయా జిల్లాలకు మంచి పేరు తీసుకురావాలని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ పేర్కొన్నారు. ముఖ్యంగా విజయనగరం జిల్లా నుంచి పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు జోనల్ స్థాయితో పాటు, రాష్ట్ర స్థాయిలో బాగా ఆడి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. సీఎం ప్రైజ్ మనీ కప్ టోర్నమెంట్ - 2022లో భాగంగా మంగళవారం విజ్జి స్టేడియం వేదికగా జోనల్ క్రికెట్ పోటీలను ఎమ్మెల్సీ సురేష్ బాబు, డిప్యూటీ మేయర్ శ్రావణిలో కలిసి జేసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడల్లో అందరూ రాణించాలని, పోటీ తత్వం అలవర్చుకోవాలని సూచించారు. ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల పరిధిలో జరిగే ఈ పోటీలను విజయవంతం చేసేందుకు అందరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. క్రీడా వసతుల కల్పనలో సమష్టి కృషి అవసరమని ఈ సందర్భంగా జేసీ పేర్కొన్నారు. ఈ క్రమంలో జేసీ క్రికెట్ ఆడి అందరినీ అలరించారు. రెండు రోజుల పాటు జరిగే క్రీడా పోటీల్లో విశాఖపట్నం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, పాడేరు, అనకాపల్లి, విజయనగరం జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురేష్ బాబు, డిప్యూటీ మేయర్ రేవతి, జిల్లా కబడ్డీ అసోషియేషన్ ప్రెసిడెంట్ కౌశిక్, డీఎస్‌డీవో అప్పలనాయుడు, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, సభ్యులు, అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు.