సింధూ, సాత్విక్ లకు ఆర్ధిక ప్రోత్సాహం..


Ens Balu
3
Tadepalle
2021-06-23 13:35:04

టోక్యో ఒలింపిక్స్ లో రాష్ట్రం నుంచి పాల్గొనే బ్యాడ్మింటెన్ క్రీడాకారులు పీవీ సింధుకు, సాత్విక్ సాయిరాజ్, హాకీ క్రీడాకారిణి రజినికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక ప్రోత్సాహకం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్రపర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి అన్ని జిల్లాల్లో క్రీడల కోసం మౌలిక సదుపాయల కల్పనకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలో రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో అంతర్జాతీయ స్టేడియాలను నిర్మించాలని నిర్ణయించామని, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుమతితో వాటి పనులు చేపడతామని తెలిపారు. విశాఖలో చినగదిలి మండలంలో బ్యాడ్మింటెన్ అకాడమీ ఏర్పాటుకు పీవీ సింధుకు రెండు ఎకరాలు ఉచితంగా కేటాయించినట్లు ఆయన తెలిపారు. అదే మండలంలో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఏర్పాటు నిమిత్తం డాక్టర్ ఈసీ వినయ్ కుమార్ కు చెందిన సాహి హియరింగ్ కేర్ కు ఒక ఎకరా కేటాయించామన్నారు. క్రీడల ప్రోత్సాహంలో భాగంగా గతంలో 13 జిల్లాల్లో 13 రకాల క్రీడలను గుర్తించి, సీఎం కప్ నిర్వహించామన్నారు. వైఎస్సార్ క్రీడా పురస్కారాల పేరుతో  జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించిన వారికి రూ.5 లక్షలు, రజతం సాధించిన రూ.3 లక్షలు, కాంస్యం సాధించిన రూ.2 లక్షల చొప్పున అందజేశామన్నారు. ఇలా ఎంతమంది ఉన్నా అందరికీ ఆర్థిక ప్రోత్సాహాకాలు అందజేస్తామన్నారు. కుల, మతాలు, రాజకీయాలకతీతంగా క్రీడాకారులను తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో శాప్ ఎం.డి. బి.రామారావు పాల్గొన్నారు.