ఏపీలో కొత్తజిల్లాలకు ఆర్టీసీ సర్వీసులు


Ens Balu
3
Tadepalli
2022-04-30 06:49:15

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పాటు చేసిన 13 కొత్త జిల్లాలకు ప్రజలు, ఉద్యోగులు, వివిధ పను లపై  ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేందుకు వీలుగా ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. గతంలో వున్న ఆర్టీసీ డిపోల నుంచి కొత్తజిల్లాలకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను నడపే కార్యక్రమానికి తెరలేపింది. నిత్యం జిల్లా కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్ తో పాటు ఇతర 75 ప్రభుత్వ శాఖల అధికారులను కలవడానికి వెళ్లాలంటే ప్రభుత్వంలోని ఆర్టీసీ సర్వీసులు ఒక్కటే మార్గం. దానిని ద్రుష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల నుంచి కొత్త జిల్లా కేంద్రాలకు ఆర్టీసీ సర్వీసులను నడుపుతోంది. గతంలో హైవే సర్వీసుగా నడిపే బస్సులను ఇపుడు అన్ని కొత్త జిల్లా కేంద్రాల్లోని ఆర్టీసీ డిపోల మీదుగా నడిపేలా కూడా అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. అత్యవసర సమయంలో ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఆలోచనతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. దీనితో అన్ని డిపోలలోని మేనేజర్లు డిపోల నుంచి కొత్త ఆర్టీసీ ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్, నాన్- స్టాఫ్ సర్వీసులతోపాటు, ఇతర అన్ని రకాల సర్వీసులను కూడా జిల్లా కేంద్రాల్లోని బస్ స్టాప్ లకు వెళ్లే విధంగా చర్యలు తీసుకున్నారు. తద్వారా ఆర్టీసీకి ఆదాయం పెరగడంతోపాటు, ప్రజలకు కూడా పూర్తిస్థాయిలో ఆర్టీసీ సేవలను దగ్గర చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది. కొత్తగా ఆర్టీసీలో బస్సు ఛార్జీలు పెంచినప్పటికీ, ప్రజలకు, ప్రయాణీకులకు ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశ్యంతో ఆర్టీసీ చేపట్టిన ప్రత్యేక బస్సుల ద్వారా ప్రయాణీకులు, ఉద్యోగులు, సిబ్బంది ఈ సేవలను వినియోగించుకునే అవకాశం వుంది. కొత్త జిల్లాల విభజన తరువాత చాలా మంది ఉద్యోగులు జిల్లా కేంద్రాలకు దగ్గరగా వున్న వారి సొంత గ్రామాలు, పట్టణాల నుంచి అధికంగా నిత్యం ప్రయాణాలు చేస్తున్నారు. ఆ విధంగా కూడా కొత్త జిల్లా కేంద్రాలకు వెళ్లే బస్సులకు గిరాకీ, ప్రయాణీకుల సంఖ్యపెరుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. రాష్ట్రంలో ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని ఆర్టీసీ డిపోల ద్వారా కొత్త జిల్లా కేంద్రాలకు బస్సు సర్వీసులను తిప్పుతున్నారు. ఇప్పటికే వున్న సర్వీసుల సంఖ్యను మరింతగా పెంచే కార్యాచరణ చేపడుతున్నారు.