కోర్టుకేసులు తొలగితేనే వారి సర్వీసు రెగ్యులర్


Ens Balu
8
Tadepalli
2022-05-31 03:50:04

అనుకున్నట్టే జరిగింది.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసుల సర్వీసు ప్రొబేషన్ విషయంలో మరో బాంబు పేల్చింది. సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించి కోర్టు కేసులు క్లియర్ అయిన శాఖల సిబ్బందికి మాత్రమే సర్వీసు రెగ్యులైజేషన్ ప్రక్రియ మొదలు పెట్టాలని, మిగిలిన శాఖల సిబ్బంది విషయంలో కోర్టు ఆదేశాలు వచ్చే వరకూ వేచి ఉండాలని ఆదేశాలు జారీచేసింది. దీనితో నియామకాల విషయంలో కోర్టు కేసులున్న సచివాలయ మహిళా పోలీసులు అంతా ఆందోళన చెందుతున్నారు. 2019లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటైన దగ్గర నుంచి సుమారు మూడు కేసులు వరకూ మహిళా పోలీసుల నియామకాలు చట్టవిరుద్దంగానూ, రాజ్యాంగ ఉల్లంగణ ద్వారా జరిగాయని కోర్టుల్లో పిల్స్ దాఖలు అయ్యాయి. దానికితోడు దేశంలో ఎక్కడా లేనివిధంగా, ఏ రాష్ట్ర ప్రభుత్వమూ చేపట్టని విధంగా ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు ప్రొబేషన్ ను ఆంధ్రప్రదేశ్ లోని కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ శాఖలో 33నెలలు చేయిస్తోంది. దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రభుత్వ ఉద్యోగుల్లోకి చేరిన రెగ్యులర్ ఉద్యోగులకు రెండేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్నవారిని రెగ్యులర్ చేసి వారికి పే స్కేలు వర్తింప చేస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఆ విధంగా జరగకపోవడం వలన రాష్ట్రవ్యాప్తంగా 15వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల్లోని సుమారు 14350పైగా మహిళా పోలీసులు డైలమాలో పడ్డారు. ప్రభుత్వానికి అనుకూలంగా సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ పీరియడ్ ను 33 నెలలకు పెంచేసిన ప్రభుత్వం, ప్రసూతి సెలవుల విషయంలో ప్రభుత్వ నిబంధన అమలు చేసింది. దానితో చాలామంది మహిళా ఉద్యోగులకు సర్వీసు ప్రొబేషన్ మరో 6నెలలు పొడిగింపు వర్తింపచేశారు. ఇప్పటికే 9నెలలు అదనంగా పొడిగించిన సర్వీస్ ప్రొభేషన్ చేస్తున్న సచివాలయ ఉద్యోగులకు, ఇపుడు కోర్టుకేసులు శాపంగా పరిణమించాయి. ఎన్నో ఆశలతో విధుల్లోకి చేరిన ఉద్యోగులకు, ప్రభుత్వం ప్రొభేషన్ ను 9నెలలు పెంచేయడం వలన సుమారు లక్ష రూపాయల వరకూ పేస్కేలు మొత్తం నష్టపోవాల్సి వచ్చింది. ప్రసూతి సెలవులు తీసుకున్నవారికి ఆరునెలలు అదనంగా పనిచేయాల్సి వచ్చింది. అంతేకాకుండా ఇపుడు కోర్టు కేసుల విషయం తెరపైకి రావడంతో అది ఇంకా ఎన్నినెలలకి ఫైనల్ హియరింగ్ కి వస్తుందో తెలియని పరిస్థితి.

ప్రస్తుత పరిస్థితుల్లో కోర్టు కేసులు తేలేవరకూ సచివాలయ మహిళా పోలీసులకు ప్రభుత్వం పేస్కేలు కూడా వర్తించే పరిస్థితి కనిపించడం లేదు. రాజ్యాంగ విరుద్ధంగా సచివాలయ మహిళా పోలీసు నియామకాలు జరిగాయని దాఖలైన వాజ్యంలో అవతలి వ్యక్తి ఆధారాలు కోర్టుకి సమర్పించినా, వాటిని కోర్టు ఏకీబవించినా.. సచివాలయ మహిళా పోలీసు పోస్టులన్నీ రద్దు అయినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. ఒకవేళ కోర్టులో కేసులు తేలకపోయినా వీరి సర్వీసును రెగ్యులర్ చేయరు సరికదా.. ఎంతకాలమైనా ప్రభుత్వం నిర్ధేశించిన రూ.15వేలకే వారంతా ఉద్యోగాలు చేయాల్సి వుంటుంది. సాధారణంగా ఈ తరహా కోర్టుకేసులంటే రెండు మూడేళ్లు సమయం పడుతుంది. ఈ తరుణంలో తమ ఉద్యోగాల పరిస్థితి ఏంటని గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరికి అదనంగా పనులు అప్పగించడం దగ్గర నుంచి 2వ శనివారం, ఆదివారాలు ఆఖరికి ప్రభుత్వ సాధారణ సెలవుల్లో సైతం దిశయాప్ లు, ప్రత్యేక కార్యక్రమాలు, సిటిజన్ ఔట్ రీచ్ అంటూ అదనపు విధులు చేయించిన ప్రభుత్వం సర్వీసు రెగ్యులర్, ఇతర కోర్టు కేసుల విషయంలో మాత్రం చాలా నెమ్మదిగా ఆచితూచి అడుగులు వేస్తూ వచ్చింది. తీరా ఉద్యోగుల సర్వీసు ప్రొభేషన్ డిక్లేర్ చేసే సమయానికి కోర్టుకేసులను తెరపైకి తీసుకువచ్చి.. కోర్టు కేసులు తేలేవరకూ వారి సర్వీసులు రెగ్యులైజేషన్ ప్రక్రియ నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేయడంతో మహిళా పోలీసులు అభద్రతా భావానికి లోనవుతున్నారు. ఈ తరుణంలోనే కోర్టు కేసులు బలపడితే వీరందరినీ..జూనియర్ అసిస్టెంట్లుగా వివిధ శాఖల్లో ఖాళీగా పోస్టుల్లో భర్తీచేస్తారనే కొత్త ప్రచారం కూడా తెరపైకి వచ్చింది. కోర్టుకేసులు, సర్వీసు ప్రొబేషన్ గడువు జూన్ నెలాఖరుతో ముగుస్తున్న వేళ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి..!