తెలుగుజాతికి, భారతదేశానికి కూడా గొప్ప స్ఫూర్తి ప్రదాత అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి కొనియాడారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో పాటు భీమవరం మహాసభలో పాల్గొన్న సీఎం అల్లూరి కీర్తిని ఏకబిగిన కొనియాడారు. అడవిబిడ్డలకు ఆరాధ్యదైవుడు. ఆయన వ్యక్తిత్వానికి, ఆయన గొప్పతనానికి, ఆయన త్యాగానికి ఈ రోజు గొప్పగా నివాళులు అర్పిస్తున్నాం. అల్లూరి సీతారామరాజు గారి ఘనతను గుండెల్లో పెట్టుకున్నాం కాబట్టే... ఆయన నడయాడిన నేల, నేలకొరిగిన ప్రదేశం ఉన్న గడ్డకు మనందరి ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో భాగంగా పాడేరుకి అల్లూరి సీతారామరాజు జిల్లా అని పేరు పెట్టామని గుర్తు చేశారు. భీమవరంలో ఏ రకంగా విగ్రహావిష్కరణ జరుగుతుందో ఆ జిల్లాలో కూడా ఆ మహానుభావుడి కాంస్య విగ్రహావిష్కరణ జరుగుతోంది. తన మరణాన్ని, తాను జీవించిన జీవితాన్ని కూడా తరతరాలకు సందేశమిచ్చేలా బతికి చిన్న వయసులోనే తన ప్రాణాలను త్యాగం చేసిన ఆ మహామనిషిని తెలుగుజాతి ఎప్పటికీ మర్చిపోదన్నారు. దేశం కోసం అడవి బిడ్డల కోసం తనను తానే త్యాగం చేసుకున్న ఆ మహావీరుడికి నా వందనం. ఎప్పటికీ కూడా ఆ మహావీరుడు చరితార్ధుడు. అతని త్యాగం ప్రతి పాప, ప్రతి బాబు, ప్రతి మనిషి గుండెల్లో చిరకాలం నిల్చిపోతుంది. అమర్ రహే అల్లూరి సీతారామరాజు, అల్లూరి సీతారామరాజు జైహింద్ అంటూ సీఎం వైఎస్ జగన్ తన ప్రసంగంలో దేశభక్తిని చాటుకున్నారు.