ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయానికి చెందిన ఒక లక్షా 21వేల మంది ఉద్యోగులు ప్రభుత్వ తేగా వైఖరితో 9నెలల పేస్కేలుతోపాటు ఒక డిఏని, నూతన పీఆర్సీలోని ఉపయోగాలను సైతం కోల్పోవాల్సి వచ్చింది. అక్టోబరు 2021 అక్టోబరు 2నాటికి సచివాలయ ఉద్యోగులకు 2ఏళ్లు సర్వీసు ప్రొబేషన్ పూర్తయ్యింది. అపుడు ఉద్యోగుల సర్వీసుని క్రమబద్దీకరించి ఉంటే ఉద్యోగులు పేస్కేలుతోపాటు.. ఆరునెలల సమయం దాటిన తరువాత డీఏ కూడా పొందేవారు. అలా కాకుండా ప్రొబేషన్ పీరియడ్ ని డిపార్ట్ మెంటల్ టెస్టుల పేరుతో 9 నెలలు పొడిగించడంతో ఉద్యోగులు పేస్కేలతోపాటు డీఏ కూడా కోల్పోయారు. తీరా ఇపుడు ఆగస్టు 2 నుంచి కొత్త పేస్కేలు జీతాలు అందుకుంటున్నప్పటికీ ఇతరశాఖల ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా సచివాలయ ఉద్యోగులకు పూర్తి పీఆర్సీతో కూడిన పేస్కేలును ప్రభుత్వం అమలు చేయలేదు. సచివాలయ ఉద్యోగుల నోటిఫికేషన్ లో ఇచ్చినట్టుగా అక్టోబర్ 2 నాటికి ఉద్యోగుల సర్వీసు రెగ్యులర్ అయి ఉంటే అందరు ఉద్యోగులు మాదిరిగానే సచివాలయ ఉద్యోగులు కూడా పూర్తిస్థాయి పీఆర్సీ, దాని ఉపయోగాలు పొందేవారు. కానీ ఇపుడు పెంచిన ఫిట్ మెంట్ తప్పా ఉద్యోగులకు మరేమీ కలవడం లేదు. దీనితో ఒక్కో ఉద్యోగి పెరిగిన పీఆర్సీలో సుమారు 7వేల రూపాయలు కోల్పోవాల్సి వచ్చింది. అంతేకాకుండా ఇపుడు వీరికి ఐఆర్(ఇంటీరియమ్ రిలీఫ్), పాత డీఏలు కూడా వర్తింపజేయడం లేదు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించనదునే ఇతర ప్రభుత్వశాఖ ఉద్యోగులకు వర్తింపజేసినట్టుగా పీఆర్సీని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అమలు చేయడం లేదని వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకి పీఆర్సీతో కూడిన పేస్కేలు అమలు చేస్తున్నామని చెప్పిన ప్రభుత్వం పాత పేస్కేలు ఎంత మొత్తం, ప్రస్తుత పేస్కేలుకి పీఆర్సీలోని ఏ మొత్తాన్ని కలిపితే పంచాయతీ గ్రేడ్-5 కార్యదర్శిలకు రూ.23120, ఇతర 18శాఖల ఉద్యోగులకు రూ.22460 వచ్చిందో సరిగ్గాలెక్కవేసి చెప్పలేదు. సాధారణంగా పీఆర్సీ అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగికి ముందుగా ఐఆర్(ఇంటీరియ్ రిలీఫ్) ప్రకటించిన తరువాత ప్రభుత్వ నిర్ణయంపై కొంతమొత్తం ఫిట్ మెంట్ తో పీఆర్సీని ఆయా ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అమలు చేస్తాయి. ఎప్పటి నుంచైతే అమలు చేస్తున్నాయో ఆ మొత్తాలకు చెందిన ఎరియర్స్ ను కూడా ఉద్యోగులకు అందిజేస్తుంది. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాత్రం వాటికి భిన్నంగా జరుగుతోంది. రెగ్యులర్ ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చినట్టుగా(ఫిట్ మెంట్ పేస్కేలు+డీఏ+హెచ్ఆర్ఏ) వాటిపై వచ్చే ఎరియర్సును సచివాలయ ఉద్యోగులకు కూడా ఇవ్వాల్సి వుంటుంది. కానీ ప్రభుత్వం ఒక్క ఫిట్ మెంట్, డీఏ, హెచ్ఆర్ఏ మాత్రమే పాత పేస్కేలుపై పెంచి ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులకు ఇస్తున్నట్టు చెబుతోందట. అంటే ఇక్కడ సచివాలయ ఉద్యోగులు ఐఆర్ తోపాటు, పీఆర్సీపై వచ్చే ఎరియర్స్, ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన డీఏలను కూడా కోల్పోయారన్నమాట. సర్వీసు ప్రొబేషన్ గడువు పెంచేయడంతో వీటికి ముందు 9 నెలలుగా రావాల్సిన పేస్కేలు కూడా కోల్పోయారు సచివాలయ ఉద్యోగులు. ప్రభుత్వం జారీ చేసిన జీఓనెంబరు-5 ద్వారా లెక్కలు వేసిన ఆర్ధిక వేత్తలు ఈ విషయాన్ని తేటతెల్లం చేశారు.
సచివాలయ ఉద్యోగులపై సవతి తల్లిప్రేమ..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019లో దేశంలోనే ఎక్కడా లేనివిధంగా గ్రామ, వార్డు సచివాలయ శాఖను ఏర్పాటు చేసి..దానిని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి మానకపుత్రికగా ప్రజల్లోకి తీసుకు వెళ్లారు. మీడియా ద్వారా కూడా అంతకంటే ఎక్కువగానే ప్రచారం కల్పించారు. ఒక మంచి వ్యవస్థను ఏర్పాటు చేసి..ఆ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగులపై సవతి తల్లిప్రేమ చూపిస్తూ..ఆదిలోనే వారికి రావాల్సిన ఉపయోగాలను హరించిన విధానాన్ని ఇపుడు ప్రతీ ఒక్కరూ తప్పు పడుతున్నారు. సచివాలయ ఉద్యోగులు విధుల్లో చేరిన దగ్గర నుంచి రెండేళ్ల పాటు ప్రాణాలకు తెగించి కరోనా సమయంలో ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించారు. అలా సేవలు అందించడానికి రెండవ శనివారాలు, ఆదివారాలు.. ఆఖరికి పండుగ సెలవుల్లో కూడా సచివాలయ ఉద్యోగులు ప్రత్యేకంగా విధులు నిర్వహించి ప్రజలకు సేవలు అందించారు. ఇలా పనిచేసిన క్రమంలో వేలాది మంది సచివాలయ ఉద్యోగులు కరోనా భారిన పడ్డారు. పదుల సంఖ్యలో సచివాలయ ఉద్యోగులు కరోనా మహమ్మారికి బలయ్యారు కూడా. ఇంతగా పనిచేసిన సచివాలయ ఉద్యోగులకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగుల మాదిరిగా కాకుండా వీరిని ప్రత్యేక ఉద్యోగులుగా గుర్తిస్తూ..వారికి రావాల్సిన అన్ని ఉపయోగాల్లోనూ కోత పెట్టేసింది. అంతేకాకుండా సచివాలయ ఉద్యోగులు ఏ తరగతికి చెందినవారో నేటికీ ప్రకటించకపోవడం విశేష. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కీలకం. కరోనాలాంటి విపత్కర సమయంలో సచివాలయ ఉద్యోగులు లేకపోతే ఎంతోప్రాణ నష్టం సంభవించి ఉండేది. కానీ అంతలా పనిచేసిన ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం మాత్రం చాలా దారుణంగా వ్యవహరించి ప్రొబేషన్ సమయంలో అదనంగా 9నెలలు అదే రూ.15వేలకే పనిచేయించింది. అప్పుడు అలా పనిచేయించినా.. కనీసం తరువాతనైనా పీఆర్సీ వర్తింపచేస్తే తాము లాసైన ఉపయోగాలు పొందవచ్చనుకుంటే..పీఆర్సీ అమలు చేసే విషయంలో అన్నీ కోతలు పెట్టింది ప్రభుత్వం. దీనితో ప్రభుత్వ తీరుతో అటు ప్రతిపక్షాలు, ఇటు సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 1వ తేదీన అందుకునే పేస్కేలు చేతికి వస్తే తప్పా, ఒక్కో సచివాలయ ఉద్యోగికి పీఆర్సీ ఉపయోగాల్లో ఎంత మేరకు రంధ్రం పడిందీ తెలిసే పరిస్థితి లేదు. ఎన్నో ఆశలతో ప్రభుత్వ ఉద్యోగం అనే ఒకే ఒక్క ఆశతో లక్షలు జీతం వచ్చే ప్రైవేటు ఉద్యోగాలను విడిచి పెట్టి.. విధుల్లోకి చేరిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ఈ విధంగా కోలుకోలేని జెల్లకాయ కొట్టడంపై ఇపుడు ఉద్యోగులంతా ఆలోచనలో పడ్డారనే ప్రచారం జరుగుతుంది. చూడాలి ముందు ముందు ఇంకెన్ని ప్రభుత్వ ఉపయోగాలు, సదుపాయాలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో రంధ్రానికి గురవుతాయో..!