ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల విషయంలో ఒక కీలక అడుగు వేసి.. రెండు అడుగులు వెనక్కి వేసింది.. ఈ సచివాలయ వ్యవస్థకుకొత్తగా చట్టం తీసుకొస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. సచివాలయాలు ఏర్పాటై మూడేళ్లు దాటిపోతున్న తరుణంలో ఈవ్యవస్థపై చట్టబద్దత వచ్చినందు కు ఆనందపడాలో..నేటికీ తమ ఉద్యోగాలకు సర్వీసు రూల్స్ పొందు పరచకుండా తాము ఏ కేటగిరీ ఉద్యోగాల కిందకి వస్తామో చెప్పకుండా, ఈ ఉద్యోగాల్లో తమకు ఎలాంటి పదోన్నతులు వస్తాయో వివరించకుండా వదిలేసినందకు బాధపడాలో తెలియని అయోమయ పరిస్థితిలో కొట్టిమిట్టాడుతున్నారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సచివాలయ ఉద్యోగులు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే.. 2019 అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలో గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. అప్పట్లో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ నూతన వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చారు. గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికే అమలులో ఉన్న ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం, ఆంధ్రప్రదేశ్ మునిసిపాలిటీ, మునిసిపల్ కార్పొరేషన్ చట్టం తరహాలోనే సచివాలయ వ్యవస్థకు కూడా చట్ట రూపం వచ్చింది. రాజ్యాంగంలోని 11, 12 షెడ్యూళ్లలో పేర్కొన్న ప్రకారం ప్రజల కేంద్రంగా ప్రభుత్వ సేవలు, ఇతర సదుపాయాలను అందించేందుకు చట్టం ద్వారా గ్రామ/వార్డు సచివాలయాల పేరుతో వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నట్టు ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు.
చట్టంతో పూర్తిస్థాయి పటిష్టత.. ఏదీ సక్రమంగా జరగలేదు
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ప్రభుత్వం చేసిన ఆర్డినెన్సుతో చట్టబద్దత వచ్చినప్పటికీ.. సచివాలయ ఉద్యోగుల విషయంలో ఏదీ సక్రమంగా జరగలేదు. వీరి సర్వీసులను రెండేళ్లలో క్రమబద్దీకరించాల్సి ఉండగా అదనంగా 9నెలలు పనిచేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ఉద్యోగులు ఒక డీఏతోపాటు, పూర్తిస్థాయి పేస్కేలు కోల్పోయారు. పోనీ ఎట్టకేలకు ఉద్యోగాలు రెగ్యులర్ చేశారనుకుంటే.. నేటి వరకూ సచివాలయాల్లో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల సర్వీసు రూల్సు, పదోన్నతుల విషయంలో ప్రభుత్వం నేటికీ క్లారిటీ ఇవ్వలేదు. ఏఎన్ఎంలకు ఇన్ సర్వీసు స్టాఫ్ నర్స్ శిక్షణ ఇప్పిస్తున్నప్పటికీ..మిగిలిన శాఖల విషయంలో మాత్రం ప్రభుత్వం ఎలాంటి ప్రకటనా చేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు ఏ కేటగిరీలోకి వస్తారో ఆర్డినెన్సుకి ముందే ప్రభుత్వం ప్రకటించి ఉంటే బావుండేదనే వాదన బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం సచివాలయాల్లతో 545 రకాల సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చినా కొన్ని సేవలను మాత్రమే అమలు చేస్తున్నారు.. అన్ని సేవలు అమలు చేస్తే ప్రభుత్వానికి ఆదాయంతోపాటు, ప్రభుత్వ లక్ష్యం కూడా నెరవేరేది. కానీ అలా జరగడం లేదు.
ప్రతిపక్షాల తప్పుడు ప్రచారానికి చట్టబద్దతో చెక్
గ్రామ, వార్డు సచివాలయాలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఉంటాయి..ఆ తరువాత ఉద్యోగాలను ఆ వచ్చే ప్రభుత్వం తీసేస్తుందని ప్రతిపక్షాలు పనిగట్టుకొని చేసే ప్రచారానికి ప్రభుత్వం సోమవారం జారీ చేసిన ఆర్డినెన్సుతో తెరపడినట్టు అయ్యింది. రాష్ట్రంలో ప్రస్తుతం అమలులో ఉన్న పంచాయతీరాజ్, మునిసిపల్ చట్టాలకు అదనంగా గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ చట్టం ఉంటుందని ఆర్డినెన్స్‌లో ప్రభుత్వం పేర్కొంది. ఈ ఆర్డినెన్స్‌తో గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా అందజేసే ప్రభుత్వ సేవలు, గ్రామ/వార్డు సచివాలయ శాఖ ద్వారా జారీ చేసే ఉత్తర్వులు శాసనాధికారంతో కూడినవిగా ఉండనున్నాయి. ఈ చట్టం శాసనసభ, శాసన మండలిలో ఆమోదం పొందిన తరువాత ఉద్యోగుల సర్వీసు నిబంధనలు, పదోన్నతుల విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. అపుడు గానీ సచివాలయ ఉద్యోగులు ఏ కేటగిరీ ఉద్యోగులో తేలే అవకాశం లేదు. కాకపోతే భారతదేశం మొత్తం తొంగి చూసే విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మంచి ప్రశంసలు అందుతున్నప్పటికీ మూడేళ్లు దాటినా ఒక విధి విధానంలో ఈ శాఖను అమలు చేయని విషయంపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఒక కొత్త వ్యవస్థ ఏర్పాటైన మూడేళ్ల తరువాత చట్టబద్దత తీసుకొచ్చే విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక అడుగు వేసిందనే చెప్పాలి..!