గ్రామ, వార్డు సచివాలయాల్లో పేరుకుపోతున్న కాగిత చెత్త


Ens Balu
101
Tadepalli
2022-12-15 07:16:08

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయాలకు ఇపుడు కొత్త చె(చిత్తు)త్త సమస్య వచ్చిపడింది..తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు పెట్టుకునే కాగితపు అర్జీలు, ఇచ్చిన దరఖాస్తులన్నీ చెత్తగా మారి కార్యాలయాల డెస్కులు నిండిపోతుండగా, కొన్నింటిని బయట పడేస్తున్నారు. వినడానికి వింతగా ఉన్నా ఇదినిజం. రాష్ట్రప్రభుత్వం 2019లో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాలు నేటితో మూడేళ్లు  ర్తిచేసుకుంటున్నా.. ఈ శాఖలో ఈ-ఫైలింగ్ విధానాన్ని అమలు చేయలేదు. ఒక్కో సచివాలయంలో 10 నుంచి 12 ప్రభుత్వ శాఖల సిబ్బంది పనిచేస్తుండటంతో వారి పరిధిలోకి వచ్చే సమస్యల దస్త్రాలన్నీ, అభ్యర్ధన రూపంలో కార్యాలయాల్లో మేట్లుగా నిండిపోతున్నాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 14వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఎంతమేర చిత్తు పేరుకుపోతున్నదో ఒక్కసారి రాష్ట్రప్రభుత్వం గుర్తించాల్సి వుంది. వీటికితోడు సచివాలయాల్లోనే ఇచ్చే, జనణ, మరణ దృవీకరణ పత్రాల నకళ్లు కూడా ఇక్కడ భారీ ఎత్తున దొంతర్లుగా పేరుకుపోతున్నాయి. చిత్తు పెరిగిపోతుందని వాటిని పడేయలేక, ఎపుడైనా అవసరం వస్తుందని వాటిని ఉంచలేక సచివాలయ సిబ్బంది, కార్యదర్శిలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కోసారి ముఖ్యమైన దస్త్రాలు వాటిలో కలిసిపోయి సమయానికి కపించకుండాపోయి జిల్లా అధికారులతో నానా చివాట్లూ సిబ్బంది తినాల్సి వస్తున్నది.

ఈ-ఫైలింగ్ విధానం లేక పడరాని పాట్లు
ఏ ప్రభుత్వశాఖలోనూ లేనివిధంగా ఒక్క గ్రామ, వార్డు సచివాలయశాఖలోనే సుమారు 12 నుంచి 16శాఖల సిబ్బంది పనిచేస్తున్న సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ శాఖలో ఈ-ఫైలింగ్ విధానాన్ని అమలు చేయడం లేదు. ఈవిధానం అమలు చేయడం ద్వారా ప్రజలకు చెందిన వివిధ సమస్యల డేటాతోపాటు, నకలు, అసలు కూడా అన్నీ ఈ-ఫైలింగ్ లోనే నిక్షిప్తం అయి ఉంటాయి. అలా చేయకపోవడం నేటికీ దస్త్రాలు పట్టుకునే గ్రామస్థాయి నుంచి మండల, జిల్లా స్థాయి వరకూ ప్రజలు అధికారులు, సిబ్బంది చుట్టూ కాళ్లు అరిగేలా తిరగాల్సి వస్తున్నది. ఒక సారి పెట్టిన సమస్య అర్జీపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే పదే పదే పెట్టే అర్జీల వలక కూడా చిత్తు కార్యాలయాల్లో అత్యధికంగా పేరుకు పోతున్నది. పైగా సచివాలయాల్లో ఈ-ఫైలింగ్ లేకపోవడం వలన సచివాలయాల నుంచి సంబంధిత శాఖకు దస్త్రాన్ని పంపడానికి కూడా రోజుల తరబడి సమయం పడుతున్నది. ఒక్కోసారి దస్త్రం సంబంధిత మండల, జిల్లాశాఖలకు వెళ్లినా సదరు కార్యాలయ సిబ్బంది కూడా ఏదో మూల పడేస్తున్నారు తప్పితే వాటిపై ప్రత్యేక శ్రద్ద చూపించడం లేదు. ఫలితంగా ఇటు సచివాలయంతో పాటు, అక్కడ జిల్లా కార్యాలయంలోనూ దస్త్రాలు పేరుకుపోతున్నాయి. ఒకప్పుడు పంచాయతీలు ఉండే సమయంలో ఈ సమస్య పెద్దగా ఉండేదికాదు. ఇపుడు సచివాలయ వ్యవస్థ  ఏర్పాటైన తరువాత ఉద్యోగులు, పెరగడం ప్రభుత్వశాఖల వారీగా ఉద్యోగులు కూడా పెరగడతో అర్జీల దరఖాస్తు చిత్తు కూడా అదే మొత్తంలో పెరుగుతూ వస్తున్నది. ఈ-ఫైలింగ్ విధానం అమలు చేస్తే ఉపయోగం ఏమిటంటే గ్రామ, వార్డు సచివాలయశాఖలో ఈ-ఫైలింగ్ విధానాన్ని అమలు చేయడం ద్వారా ప్రజల సమస్యల దరఖాస్తుకి ఖచ్చితత్వం వస్తుంది.  గ్రామసచివాల యంలో ని కార్యదర్శి, ఇతర శాఖ సిబ్బంది లాగిన్ల నుంచి మండలంలోని ఎంపీడీఓ ఇతర మండలశాఖల అధికారుల లాగిన్లు, ఆ తరువాత జిల్లా అధికారుల లాగిన్ వరకూ ఒక స్టేజ్ వైజ్ సిస్టమ్ ఏర్పాటవుతుంది. ప్రతీ దరఖాస్తూ క్రమ సంఖ్యతో ప్రభుత్వశాఖల అధికారుల లాగిన్ లో స్పష్టంగా చూపిస్తుంది. తద్వారా సమస్య పరిష్కారానికి ఆస్కారం ఏర్పడటంతోపాటు, ఏ సమస్య పరిష్కారం కాలేదో ప్రభుత్వానికి కూడా ఖచ్చితంగా తెలుస్తుంది. ఎన్ని సమస్యలు, ఎన్ని అర్జీలకు అధికారులు పరిష్కారం చూపించారో కూడా రికార్డెడ్ గా ప్రభుత్వశాఖలు ప్రభుత్వానికి నివేదించడానికి కూడా వీలుపడుతుంది. ఒక్కోసారి అర్జీదారుడు ప్రభుత్వానికి దరఖాస్తు చేసిన సమస్య పరిష్కారానికి నోచుకోనపుడు ఎన్నిసార్లు అదే సమస్యపై అర్జీపెట్టారు.. ఏ ప్రభుత్వశాఖ సదరు సమస్యను పరిష్కరించకుండా వదిలేసింది అనే విషయం కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్లడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఒక్క ఈ-ఫైలింగ్ విధానాన్ని అమలు చేయడం ద్వారా ఇటు ప్రభుత్వశాఖ సిబ్బందికీ, అధికారులకు, ప్రజలకూ ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో మేలు జరగడంతోపాటు గో గ్రీన్ ఆఫీస్ సిస్టమ్ ను అభివృద్ధి చేయడానికి మార్గం సుగమం అవుతుంది.

ఈ-ఫైలింగ్ లేక సిబ్బందికీ తీరని ఇబ్బందులు 
గ్రామ, వార్డు సచివాలయశాఖలో ఈ-ఫైలింగ్ విధానం అమలు చేయకపోవడం వలన ఇటు సిబ్బంది కూడా రాష్ట్రవ్యాప్తంగా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ఆఖరికి ఒక సెలవు తీసుకోవాలన్నా సెలవుచీటీ రాసి సచివాలయంతోపాటు, ఎంపీడీఓ, జిల్లా కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా మహిళా ఉద్యోగులు ప్రసూతి సెలవులు పెట్టినపుడు, తిరిగి రీ జాయిన్ అయినపుడు, సాలరీ బిల్లులు పెట్టించుకునే సమయంలోనూ, తిరిగి దరఖాస్తు ద్వారా విషయాన్ని తెలియజేసే విషయంలో అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. సెలవుల అర్జీలను పోస్టుద్వారా పంపే సమయంలో జిల్లా కార్యాలయాలు, మండల కార్యాలయాల్లో అవి కనిపించకుండా పోవడం, వాటిని అధికారులు పట్టించుకోనట్టు వదిలేయడం తదితర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అలా కాకుండా ఈఫైలింగ్ విధానం అమలు చేయడం ద్వారా గ్రామసచివాలయం నుంచి ఐదంచెల విధానంలో సచివాలయం నుంచి జిల్లాశాఖ అధికారుల వరకూ దస్త్రం మొత్తం ఈ-ఫైలింగ్ విధానంలోనే చేరి అనుమతులు మంజూరు చేయడం కూడా సులభంఅవుతుంది. అర్జీ కూడా ఆన్ లైన్లో తేదీతో తహా స్పష్టంగా కనిపిస్తుంది. దానికి అధికారులు ప్రత్యేకంగా కార్యాలయంలోనే ఉండే పనికూడాలేదు. వారి విధినిర్వహణ చేసే సమయంలో ఏదో కొద్ది సమయం కేటాయిస్తే అధికారుల ప్రోటోకాల్ లాగిన్ ప్రకారం ఈ-ఫైలింగ్ పెట్టిన దస్త్రానికి అదే వేదిక ద్వారా అనుమతులు ఇవ్వడానికి మార్గం ఏర్పడుతుంది. తద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో దస్త్రాల చిత్తు పెరిగిపోకుండా వుంటుంది.

సచివాలయశాఖ కార్యదర్శి పునుకుంటేనే అడుగు పడేది
గ్రామ, వార్డు సచివాలయాల్లో పేరుకుపోతున్న చెత్తను నియంత్రించడానికి ఈ శాఖకు చెందిన ప్రత్యేక ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ ఈ-ఫైలింగ్ విధానం అమలు చేసే విషయంలో పూనుకుంటే తప్పా..సచివాలయాల్లో ఈ-ఫైలింగ్ అందుబాటులోకి రాదు. అలాగని సదరుశాఖ ముఖ్యకార్యదర్శి సచివాయాల్లోని ఇబ్బందులపై దృష్టి సారించినదీ లేదు. ఇటు జిల్లా కలెక్టర్లు, సచివాలయశాఖతో అనుసంధానంగా వున్న ఇతర ప్రభుత్వశాఖల కమిషనర్లుగానీ, ఇతర ప్రభుత్వశాఖల ముఖ్యకార్యదర్శిలు కూడా ఈ-ఫైలింగ్ విధానంలో నేటికీ నోరు మెదపడం లేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముందుకి తీసుకెళ్లనూ లేదు. సచివాలయ వ్యవస్థ ఏర్పాటై మూడేళ్లు దాటిపోతున్నా..నేటికీ ఉద్యోగులకు సంబంధించి విధివిధానాలనే ప్రభుత్వం పూర్తిస్థాయిలో రూపొందించలేదు. ఇక తాము ఎదుర్కొంటున్న సమస్యలు ఏం పట్టించుకుంటారని సచివాలయ సిబ్బంది మీడియా ముందు పెదవి విరుస్తున్నారు. ఏ ప్రభుత్వశాఖలోనైనా ఏ శాఖకు చెందిన ఉద్యోగులు,, సిబ్బంది ఆ ప్రభుత్వశాఖ విధులే నిర్వహిస్తారు. కానీ సచివాలయశాఖలో మాత్రం ప్రభుత్వంలోని అన్నిశాఖల విధులు ఇక్కడి ఉద్యోగులు నిర్వహించాల్సి వుంటుంది. ఆ తీవ్రతను, ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొనైనా ప్రభుత్వం ఇక్కడ ఈ-ఫైలింగ్ విధానాన్ని అమలు చేయడం లేదు. ఇప్పటికైనా అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించి గ్రీన్ చానల్ సచివాలయాలుగా మార్చి ప్రజలు సత్వర సేవలు అందించడానికి ఈ-ఫైలింగ్ విధానాన్ని అమలు చేస్తే మరిన్ని ఫలితాలు వస్తాయని సచివాలయ ఉద్యోగులే సూచిస్తున్నారు. చూడాలి ప్రభుత్వం ఈ-ఫైలింగ్ విధానం ఏర్పాటు చేసే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది..!