తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం చరిత్రను ప్రపంచానికి తెలియజేసిన శ్రీమాన్ సాధు సుబ్రమణ్య శాస్తి దేశంలోని వంద కోట్ల హిందువుల ఆస్తి అని ఎమ్మెల్యే భూమన కరుణా కర రెడ్డి అన్నారు. సుబ్రమణ్య శాస్త్రి 133వ జయంతి సందర్భంగా శనివారం శ్వేత సమావేశం మందిరంలో జరిగిన జయంతి సభకు కరుణాకర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీవారి ఆలయ చరిత్ర వెలికి తీసిన సుబ్రమణ్య శాస్త్రి స్వామివారి కి అనన్య సేవ చేశారన్నారు. రాణి సామవై భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని ఆలయానికి అందించారని శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి వెలికి తీసిన తొలి శాసనమే శ్రీవారి ఆలయ చరిత్ర బయటకు రావడానికి కారణమన్నారు. టీటీడీలో చిన్న స్థాయి అధికారిగా ఉంటూ వెయ్యి కి పైగా శాసనాలను వెలికితీసి పరిష్కరించిన గొప్ప వ్యక్తి ఆయన అని చెప్పారు. అలాంటి మహానుభావునితో తనకు పాఠశాల చదివే రోజుల్లోనే పరిచయం కావడం తన అదృష్టమని తెలిపారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి అమూల్యమైన సేవలందించిన శ్రీ సాధు సుబ్రమణ్య శాస్త్రి, వేటూరి ప్రభాకరశాస్త్రి, రాళ్ళ పల్లి ఆనంతకృష్ణ శర్మ విగ్రహాలు ప్రతిష్టించాలనే ఆలోచన శ్రీ వేంకటేశ్వర స్వామి వారే తనకు కల్పించారన్నారు. ఇలాంటి మహానుభావుల జీవితాల మీద చర్చ జరగాలని, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. సాధు సుబ్రమణ్య శాస్త్రి వెలికి తీసి పరిష్కరించిన శాసనాల పుస్తకాలను ప్రతి ఒక్కరు చదవాలన్నారు. టీటీడీ బోర్డు సభ్యులు పోకల అశోక్ కుమార్ మాట్లాడుతూ, సుబ్రమణ్య శాస్త్రి తన జీవితాన్ని స్వామి సేవకు అంకితం చేసిన మహా మనిషి అన్నారు. ఇలాంటి వారి సేవలను టీటీడీ గుర్తు చేసుకోవడం సంతోషమన్నారు. సుబ్రమణ్య శాస్త్రి కూతురు గిరిజ, మనుమడు, కడప అదనపు జిల్లా సెషన్స్ జడ్జి సి ఎస్ మూర్తి మాట్లాడుతూ, భూమన కరుణాకర రెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలోసుబ్రమణ్య శాస్త్రి విగ్రహం ప్రతిష్టించడం సంతోషమన్నారు.
శ్వేత డైరెక్టర్ ప్రశాంతి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో శాసన పరిశోధకులు కృష్ణారెడ్డి, టీటీడీ సిఏవో శేషశైలేంద్ర,
డిఈవో భాస్కర రెడ్డి, దూరదర్శన్ విశ్రాంత అదనపు డైరెక్టర్ జనరల్ అనంత పద్మనాభరావు, పుదుచ్చేరి యూనివర్సిటీ ప్రొఫెసర్ చంద్ర మౌళి, ఎస్వీ మ్యూజియం ప్రత్యేకాధికారి కృష్ణారెడ్డి, ఎస్వీ ఓరియంటల్ కళాశాల ఆచార్యులు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా
సాధు సుబ్రమణ్య శాస్త్రి జయంతి సందర్బంగా టీటీడీ ముద్రించిన సారస్వత సంవీక్షణం పుస్తకాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కరుణాకర రెడ్డి ఆవిష్కరించారు. అంతకుముందు శ్వేత భవనం ఎదురుగాగల శ్రీమాన్ సాధు సుబ్రమణ్య శాస్త్రి విగ్రహానికి అథితులందరూ పూలమాలలు వేసి నివాళులర్పించారు.