పెద్ద కబుర్లాడే అధికారుల పాలిట పాసుపతాస్త్రం..!


Ens Balu
212
Tadepalle
2022-12-27 09:46:33

పేరుకే వారంతా సివిల్స్, గ్రూప్-1, గ్రూప్-2 అధికారులు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు పెద్దగా పట్టించుకోరు..పైగా ప్రభుత్వం యొక్క బాధ్యతను వారే తమ బుజాలపై తెగ మోసేస్తున్నట్టు ఇచ్చే ఫీలింగ్, కలరింగ్, బిల్డప్ మామూలుగా ఉండదు. కిందిస్థాయి ఉద్యోగులు చేసే పనిని, పడిన కష్టాన్ని వీరి ఖాతాలోకి మళ్లించుకొని ప్రభుత్వం దగ్గర చేసే హడావిడి మామూలుగా ఉండదు. ఆఫీసుకి గంట ఆలస్యంగా వచ్చి రెండు గంటలు ముందు ఇంటికి వెళ్లిపోయే అధికారులను గాడిలో పెట్టడానికి ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఫేస్ బయో మెట్రి అటెండెన్స్ ఉత్తర్వులపై(ఏస్థాయి అధికారైనా బయోమెట్రిక్ వేయాల్సిందే) క్రిందిస్థాయి సిబ్బంది, నిబద్దతలో పనిచే అధికారుల నుంచి ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తోంది. ఏ స్థాయి ఉద్యోగి అయినా ఖచ్చితంగా బయో మెట్రిక్ వేయాల్సిందేననే నిబంధనను అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు స్వాగతిస్తున్నారు. చేస్తున్నది ప్రభుత్వ ఉద్యోగమే అయినా ఏవేవో కాకమ్మ కబుర్లు చెప్పి బయట ప్రైవేటు పనులు చేసుకునేవారికి సింహ స్వప్నం లాంటి నిబంధన ఇన్నేళ్ల తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేశారంటూ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇకపై ఉద్యోగి అంటే కార్యాలయంలో ఉండి తీరాలనే నిబంధన అమలు కావడంతోపాటు, ప్రజల సమస్యలు కూడా సత్వరమే పరిష్కారం అవుతాయనే భావన ప్రతీ ఒక్కరిలోనూ వ్యక్తమవుతుంది.

75ఏళ్ళ చరిత్రలో ఒకే ఒక్క..ప్రభుత్వం
75ఏళ్ల స్వాతంత్ర్య భారత దేశంలో అటెండర్ దగ్గర నుంచి ఐఏఎస్ వరకూ బయో మెట్రిక్ వేసి విధులు నిర్వహించేలా చేసిన ప్రభుత్వంగా వైఎస్సార్సీపీ జగన్ ప్రభుత్వం నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులంటే నచ్చిన సమాయానికి వస్తాం..చిరాకొస్తే ఇంటికి వెళ్లిపోతామనే దోరణిలోనే ఇప్పటి వరకూ ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల వ్యవహారం నడిచింది. కానీ చరిత్రలో మొట్టమొదటి సారిగా..అధికారులు, సిబ్బంది విధి నిర్వహణ, కార్యాలయ సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ప్రతీ ఒక్క ప్రభుత్వ ఉద్యోగీ బయో మెట్రిక్ అటెండెన్సు(ఫేస్ రికగ్నైజేషన్ యాప్ బయో మెట్రిక్) వేయాలనే నిబంధన తీసుకురావడం ఇపుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఈ విధానం ప్రభుత్వ అధికారులకు, సిబ్బందికి ఇబ్బందిగా ఉన్నా సరైన ప్రభుత్వసేవలు సకాలం అందాలంటే ప్రతీ ఉద్యోగీ, అధికారి ప్రభుత్వ కార్యాలయాల్లో అందుబాటులో ఉండాల్సి అవసరం వుంది. దానికోసం ఏర్పాటు అన్నిశాఖల, అన్ని స్థాయి అధికారులు అటెండెన్సు వేయాలనే నిబంధన ఇపుడు ప్రజల నుంచి విశేషంగా మన్ననలు పొందుతోంది..

కల్లబొల్లి మాటలకు, డుమ్మావిధులకు ఇక చెల్లుచీటి
ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఫేస్ రికగ్నైజేషన్ యాప్ బయో మెట్రిక్ విధానం వలన ప్రతీసారి కల్లబొల్లి మాటలు చెబుతూ విధులకు డుమ్మాకొట్టేవారు, కాకమ్మ కబుర్లు చెప్పి ప్రభుత్వ విధినిర్వహణలో బయటకు వెళ్లిపోయి సొంత పనులు చూసుకునేవారు,నేనొక్కడినే తెగ కష్టపడిపోతున్నాను.. మిగిలిన వారంతా కూర్చొని జీతం తీసేసుకుంటున్నారని తెగఫీలైపోయే ప్రభుత్వ కొలువు వెలగబెడుతున్నమహానుభావులందరూ ఇక చచ్చినట్టు ప్రభుత్వ ఆదేశాలను అమలు చేసి తీరాల్సిందే. అంతేకాకుండా ఎంతసేపు ఆలస్యంగా వస్తే అంతసేపు కార్యాలయంలో విధులు నిర్వహించాలి..లేదంటే జీతంలో కోత వంటి చర్యలు కూడా అమలు చేస్తామంటున్న ప్రభుత్వ చర్యలు మంచి ఫలితాలను ఇస్తాయనే ఆశాభావాన్ని విధినర్వహణే దైవంగా బావించే ఉద్యోగులు, అధికారులు చక్కగా స్వాగతిస్తున్నారు. గతంలో ఆడుతూ, పాడుతూ, విధులకి వచ్చే వారందరికీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇపుడు గొంతులో పచ్చి వెలక్కాయ్ పడ్డట్టు తయారైంది.

అమలు చేస్తేనే అసలైన ప్రగతి..లేదంటే తిరోగమనమే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత ప్రజా ఆమోదయోగ్యమైన నిర్ణయం అన్ని స్థాయిల అధికారులు, ఉద్యోగులు బయో మెట్రిక్ వేయాలనే నిబంధన ద్వారా జవాబుదారీ తనాన్ని పెంచనుంది. అదే సమయంలో ప్రతీ ప్రభుత్వ ఉద్యోగినీ సమయానికి కార్యాలయానికి తీసుకొచ్చి పనిచేయించిన ఘనత కూడా ఏపీ సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డికి దక్కుతుంది. అదే సమయంలో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది నుంచి వ్యతిరేకత వస్తుందని ఈ నిబంధనల్లో సడలింపులు చేస్తే ప్రగతి మాట అలా ఉంచితే..ఉన్న కాస్త ప్రగతి కూడా తిరోగమనంలో పయనించే పరిస్థితి వస్తుందని మేధావులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి ఒత్తిడిలు ఎక్కడ నుంచి వచ్చినా వాటిని పట్టించుకోకుండా ఫేస్ రికగ్నైజేషన్ యాప్ బయో మెట్రిక్ ను అమలు చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చుననే వాదన సర్వత్రా వినిపిస్తోంది. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగమంటే ఎలా పనిచేసినా, వెళ్లినా, వెళ్లకపోయినా నెల అయ్యేసరికి జీతాలు వచ్చేస్తాయన్న ధీమా నుంచి నెల పూర్తయినా జీతాలు వస్తాయో రావో అనే పరిస్థితిని ప్రభుత్వ ఉద్యోగులకు రుచి చూపించిన ప్రభుత్వం, ఇపుడు అన్నిస్థాయిల అధికారుల చేత పనిచేయించాలని తీసుకున్న ఈ 

నిర్ణయం మాత్రం ప్రభుత్వం అమలుచేస్తున్న నవరత్నాల పథకాలంటే వెయ్యిరెట్లు మెరుగ్గా వుందని సాధారణ ప్రజల నుంచి పనిచేసే అధికారులందరూ తమ మద్దతును తెలియజేస్తున్నారు. చూడాలి పెద్దకబుర్లాడే అధికారులతో ఫేస్ రికగ్నైజేషన్ యాప్ బయో మెట్రిక్ అటెండెన్సు ఏ మేరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంచి పనిచేయిస్తూ ప్రజలకు సేవలు అందిస్తుందనేది..!