సమాచారశాఖ కమిషనర్ ను తప్పుదోవ పట్టిస్తున్నారు..


Ens Balu
259
Tadepalli
2022-12-27 10:51:39

ఆంధ్రప్రదేశ్ లో అన్నీ వింతలే జరుగుతుంటాయి.. ఏపీలో13 జిల్లాలను విభజించి 26 జిల్లా లను చేస్తూ రాష్ట్రప్రభుత్వం గెజిట్ పబ్లికేషన్ చేసినా నేటికీ కేంద్రంలోనూ, రాష్ట్రపతి వద్ద ఇంకా కొత్త జిల్లాల ఆమోద ముద్రపడలేదు. ఇది చాలదన్నట్టు కొత్త జిల్లాల ఏర్పాటైనా కొత్తజిల్లాల్లో పరిపాలన పూర్తిస్థాయిలో జరగలేదు. కనీసం మీడియా ద్వారానైనా గుర్తింపు వచ్చి చస్తుందా అంటే అదీ లేకుండా పోయింది. ఇపుడు కొత్తగా జర్నలిస్టు సంఘాల నేతలందరూ తమకు ప్రభుత్వం ఇచ్చే ఆ కొన్ని ప్రెస్ అక్రిడిటేషన్లు ఉమ్మడి జిల్లాల నుంచే ఇవ్వాలని కోరుతున్నారట. మరీ వెటకారం కాకపోతే కొత్త జిల్లాలు ఏర్పాటై..అన్నిజిల్లాలకు ప్రభుత్వం కలెక్టర్లను కూడా నియమిచింది. కొత్త జిల్లాల్లో కూడా ప్రెస్ అక్రిడిటేషన్లు కలెక్టర్లు మాత్రమే జారీచేయాలి. కారణం అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టరే కనుక. అలా కాకుండా జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల గొంతమ్మకోర్కెలు విని ఉమ్మడి జిల్లాల్లో ప్రెస్ అక్రిడిటేషన్లు మంజూరు చేస్తే..కొత్త జిల్లాల్లో కలెక్టర్లు ఎలాంటి అధికారాలు, చైర్మన్ హోదాలు లేనట్టుగానే గుర్తించాల్సి వుంటుంది. అదే జరిగితే కేవలం సమాచారశాఖ ద్వారానే కొత్తజిల్లాల్లోని సివిల్ సర్వీస్ అధికారుల స్థాయి తగ్గించిన శాఖగా గుర్తింపు కూడా పొందుతుంది.

కొత్త జిల్లాలకు మీడియా ద్వారానే అసలైన గుర్తింపు
ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటైన 13 కొత్తజిల్లాలు, పరిపాలన ప్రజలకు తెలియాలన్నా, పరిపాలన గాడిలోపడి కేంద్రప్రభుత్వ గుర్తింపు రావాలన్నా మీడియా ద్వారానే జరగాల్సి వుంటుంది. కానీ ఇపుడు అదే మీడియా ద్వారా కొత్తజిల్లాలకు, అక్కడి కొత్త కలెక్టర్లకు గుర్తింపు లేకుండా పోయే పరిస్థితి దాపురించింది. కొత్త జిల్లాలు ఏర్పాటై ఇంతకాలం అవుతున్నా నేటికీ కొత్తజిల్లాల్లోని కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఇతర 75 ప్రభుత్వశాఖల అధికారులకు సరైన గుర్తింపు లేకుండా పోయింది. సగం సమాచారశాఖ గుర్తింపు రానీయకుండా చేస్తే..మరో సగం మిగిలివున్న మీడియా బాహ్య ప్రపంచానికి తెలియనీయకుండా శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నది. అసలు సమాచారశాఖలోనే ఉమ్మడి జిల్లాల సమాచారశాఖ అధికారులు అటు రాష్ట్ర కమిషనర్ ను, సమాచారశాఖ మంత్రిని, ప్రభుత్వాన్ని కూడా తప్పుదారి పట్టిస్తున్నారు. వాస్తవానికి కొత్త జిల్లాల్లో జరిగే కార్యక్రమాలు మీడియా ద్వారా దేశవ్యాప్తం కావాలి. కానీ కొత్త జిల్లాల పేర్లు పలకడానికి సమాచారశాఖ ద్వారా విస్త్రుత మీడియా ప్రచారం చేయడానికి సమాచారశాఖలోని అధికారులు ముందుకి రావడం లేదు.

పాతజిల్లాల నుంచే అక్రిడిటేషన్లు కావాలంటే కొత్తజిల్లాలెందుకు
ప్రభుత్వ నిబంధనల కారణంగా ప్రెస్ అక్రిడిటేషన్ల జారీ భారీ మొత్తంలో పడిపోయింది. వచ్చే ఆ కొద్దపాటి ప్రెస్ అక్రిడిటేషన్లు పాత ఉమ్మడి జిల్లాల నుంచి ఇవ్వాలంటూ కొన్ని జర్నలిస్టు సంఘాల నేతలు ఏపీ సమాచారశాఖ కమిషనర్ ను తప్పుదారి పట్టిస్తున్నట్టు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధికోసం ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చి కొత్త పరిపాలనా విధానాలను అమలు చేసిన తరుణంలో కొందరు జర్నలిస్టులు, మరికొందరు జర్నలిస్టు సంఘాల నేతలు ప్రెస్ అక్రిడిటేషన్ విషయంలో సమాచారశాఖను తప్పుదారి పట్టించడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సమాచారశాఖ కారణంగానే కొత్తజిల్లాల్లోని డీపీఆర్వోలు, డీడీలు ప్రభుత్వ సమాచారం ఇవ్వకుండా సోకాల్డ్ మీడియా జర్నలిస్టులతోనే ప్రెస్ గ్రూపులు ఏర్పాటు చేసి ప్రభుత్వ అభివృద్ధిని, సమాచారాన్ని ప్రజలకు తెలియనీయకుండా సాయశక్తులా కృషిచేస్తున్నారు. ఇపుడు మళ్లీ ప్రెస్ అక్రిడిటేషన్ల విషయంలో కూడాకొత్తజిల్లాల్లో కాకుండా.. ఉమ్మడి జిల్లాల్లో ఇస్తే రాష్ట్రంలో కొత్తజిల్లాల కలెక్టర్లు అధికారం లేనట్టుగా తేటతెల్లం అయిపోతుంది. ఇప్పటికైనా సమాచారశాఖ కమిషనర్ కార్యాలయం నుంచి కొత్త అక్రిడిటేషన్ల విషయంలో నూతన జిల్లాల నుంచి మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవడం ద్వారా కొత్తజిల్లాలకు గుర్తింపు రావడంతోపాటు, మీడియా ద్వారా కొత్త జిల్లాకలెక్టర్లు కూడా ప్రత్యేక గుర్తింపు వస్తుంది. లేదంటే కేంద్రం, రాష్ట్రపతి దృష్టిలో మాదిరిగానే ఇంకా ఏపీలో 13 జిల్లాలనే భావనతోనే అధికారికంగా ఉండాల్సి వస్తుంది..!