పదోన్నతులతో ప్రభుత్వ ఉద్యోగులను దారిలోకి తెస్తారా..?


Ens Balu
428
Tadepalli
2023-01-12 03:47:35

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గుర్రుగా వున్న వారిని ఒకేసారి దారిలోకి తెచ్చేందుకు పదోన్నతుల అస్త్రం ప్రయోగించనుందని సమాచారం అందుతోంది. దానికోసం ప్రభుత్వంలోని 75 ప్రభుత్వశాఖల్లోని అధికారులు, ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడం ద్వారా వారిని మళ్లీ ప్రభుత్వానికి అనుకూలంగా మార్చుకోవాలన్నది ప్రభుత్వ భావనగా కనిపిస్తున్నది. అయితే ప్రభుత్వంపై ఆర్ధిక భారం పడకుండా కేడర్ సాలరీ స్కేల్ కి రీచ్ అయిన వారికి తొలుత పదోన్నతులు కల్పించడం ద్వారా వారికి హోదా పెంచినట్టు అవుతుందని చెబుతున్నారు. ఇప్పటికే పలు ఉద్యోగ సంఘాల నుంచి ఇదే విషయమై ప్రభుత్వానికి వినతులు కూడా వెళ్లాయి. తాము ఇప్పటికే కేడర్ స్కేలుకి రీచ్ అయినందున తమకు పదోన్నతులు ఇవ్వడం ద్వారా ప్రభుత్వంపై ఎలాంటి ఆర్ధిక భారం పడదని ప్రభుత్వం ముందు ఉంచాయట ఉద్యోగ సంఘాలు. అయితే దానికి సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి నుంచి సానుకూల స్పందన వచ్చినట్టు చెబుతున్నారు.



పీఆర్, పోలీస్ శాఖలో ప్రారంభమైన పదోన్నతులు
రాష్ట్రంలో ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖలో పదోన్నతులు ప్రారంభం అయ్యాయి. ఎంపీడీఓలు గా వున్నవారిని డీఎల్డీఓలు గా పదోన్నది కల్పించి.. ఆస్థానంలోకి సీనియర్ మండలపరిషత్ ఏఓలకు ఎంపీడీఓలుగా పదోన్న తులు కల్పించడం ద్వారా అధికారులకు ప్రభుత్వం న్యాయం చేసింది. దీనితో ఎన్నో ఏళ్లనుంచి పదోన్నతులు లేకుండా ఉన్నవారికి పదోన్నతులకు లైన్ క్లియర్ అయ్యింది. మరో వైపు పోలీస్ శాఖలో కూడా హెడ్ కానిస్టేబుళ్లుగా ఉన్నవారికి ఏఎస్ఐలు, సిఐలుగా ఉన్నావారికి డిఎస్పీలు, ఎస్ఐలుగా ఉన్నారికి సిఐలు, డిఎస్పీలుగా ఉన్నవారికి ఏఎస్సీలుగా ప్రభుత్వం పదోన్నతులు కల్పిస్తున్నది. దీనితో చాలా మంది ఉద్యోగులు, అధికారులకు పదోన్నతులకు లైన్ క్లియర్ అయ్యింది. ఇక్కడ ప్రభుత్వం కూడా లాజిక్ ప్రయోగించింది. ఇక్కడ కేవలం పదోన్నతులు మాత్రమే కల్పించింది. వారికి  ఎలాంటి ఆర్ధికప్రయోజనాలూ చేకూరడం లేదు. కేడర్ సాలరీ స్కేల్ రీచ్ కావడంతో వారికి పదోన్నతులు దక్కాయి. ఇలా మిగిలిన వారికి కూడా కల్పిస్తే ఉద్యోగులకు పెద్ద మొత్తంలో పదోన్నతులు ఇచ్చిన ప్రభుత్వంగా గుర్తింపుతోపాటు ఉద్యోగుల్లో వ్యతిరేకతను కూడా తగ్గించుకోవాలనే ప్రయత్నంపైనా తీవ్రమైన చర్చ జరుగుతోంది.

ఇంకా ప్రమోషన్లకు వెయిటింగ్ లో చాలా ప్రభుత్వ శాఖలు
కేవలం కొన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, అధికారులకే ప్రమోషన్లకు లైన్ క్లియర్ కాగా చాలా ప్రభుత్వ శాఖలు క్యూలో ఉన్నాయి. ముఖ్యంగా మత్స్యశాఖ, వ్యవసాయశాఖ, పశుసంవర్ధకశాఖ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం, విద్యాశాఖ, విద్యుత్ శాఖ, రెవిన్యూ, నీటిపారుదలశాఖ, వైద్యఆరోగ్యశాఖ.. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా పెద్దగానే ఉన్నది. అయితే ప్రస్తుతం అన్ని ప్రభుత్వ శాఖలకూ పదోన్నతులు కల్పిస్తే..కిందిస్థాయిలో కేడర్ లో ఖాళీలు ఏర్పడతాయి. వెను వెంటనే పదోన్నతులు కల్పించేస్తే..క్రింది క్యాడర్ ఖాళీ ఉద్యోగాలను కూడా భర్తీచేయాల్సి వస్తుందిని..ఖచ్చితంగా ఖాళీలను ప్రకటించాల్సి వస్తుందని కూడా ప్రభుత్వం 
ఆలోచిస్తున్నది. దానికోసం కేవలం కొన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగులు, అధికారులకే పదోన్నతులు కల్పించి మిగిలిన శాఖలను ముట్టుకోవడం లేదు ప్రభుత్వం. దీనితో అన్ని ప్రభుత్వశాఖల్లోని యూనియన్ నాయకులు ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలను తీసుకెళులుతన్నారు. ప్రభుత్వం పై గుర్రుగా వున్న ప్రధాన శాఖలకు ముందు పదోన్నతులు కల్పిస్తే తరువాత మిగిలిన వారి సంగతి చూడాలని కూడా ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా చెబుతున్నారు.

ఇన్ సర్వీసులకు కూడా లైన్ క్లియర్..?
రాష్ట్రప్రభుత్వంలో ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్ కు అవకాశం వున్న ప్రభుత్వ శాఖలకు వెనువెంటనే లైన్ క్లియర్ చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నది. ఇందులో భాగంగానే ఇటీవల గ్రామ, వార్డు సచివాలయశాఖలో పనిచేస్తున్న ఏఎన్ఎంలకు స్టాఫ్ నర్సులుగా ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ప్రారంభించింది. త్వరలోనే అవకాశం వున్న 
ఇతర శాఖల్లో కూడా ఇన్ సర్వీస్ శిక్షణ ఇప్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలున్నాయని రాష్ట్ర అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా  వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధకం, పట్టుపురుగుల పెంపకం, ఇంజనీరింగ్, వైద్య ఆరోగ్యం, ఇంకా ప్రాధాన్యత ఉన్న ప్రభుత్వ శాఖల్లో కూడా ఇన్ సర్వీస్ ట్రైనింగ్ అమలు చేసి పదోన్నతులు ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి కొత్తగా ఉద్యోగాలు తీసే బాధ తప్పుతుందని కూడా ఆలోచిస్తున్నదట. ఇప్పటికే కొన్ని ప్రభుత్వశాఖల్లో ఇన్ సర్వీస్ శిక్షణ అమలు జరుగుతుండగా.. ఇంకా ఏఏ ప్రభుత్వశాఖల్లో దీనిని అమలు చేయవచ్చో పరిశీలించాలని ఇటీవలే ప్రభుత్వశాఖ ముఖ్యకార్యదర్శిలకు సీఎంఓ నుంచి ఆదేశాలు వెళ్లినట్టు చెబుతున్నారు.

ఇలా పదోన్నతులు, ఇన్ సర్వీస్ ట్రైనింగ్ లు ప్రభుత్వం ద్వారా ఇప్పించడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల్లో వున్న వ్యతిరేకతను తగ్గించుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా ఇన్ సర్వీస్ అమలు చేయాలన్నా కూడా ప్రభుత్వంపై భారం పడుతుంది. దీనితో కేడర్ స్కేలు చేరుకున్నవారికి పదోన్నతులు ఇవ్వడం ద్వారానే పని సులువు అవుతుందని ప్రభుత్వం ఆలోచిస్తున్నదట. అన్నీ అనుకూలిస్తే మార్చి తరువాత పదోన్నతుల ఫైళ్లు కదిలే అవకాశం వుంది..!