ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను బదిలీలు చేయడానికి సర్వీసు రూల్స్ మోకాలడ్డుతున్నాయి. 1996 ఏపీ సబార్డినేట్ సర్వీస్ రూల్సును
అనుసరించి ఉద్యోగులను సర్వీసును రెగ్యులర్ చేస్తున్న ప్రభుత్వం అదే నిబంధనల ప్రకారం చాలా విభాగాల్లోని సిబ్బందికి ప్రమోషనల్ ఛానల్ కు సంబంధించిన
సర్వీసు నిబంధనలను పొందు పరచలేదు. ఈ క్రమంలో ఉద్యోగులను బదిలీలు చేస్తే వారంతా వారి సర్వీసును కోల్పోవాల్సి వస్తుంది. సాధారణంగానే ఉద్యోగులు
అంతర్ జిల్లాలకు బదిలీలు పెట్టుకుంటే వారి సర్వీసును కోల్పోతారు. ఇపుడు ఒకే జిల్లాలో బదిలీలు జరిగినా..సచివాలయ ఉద్యోగులకు సర్వీసు నిబంధనలను
పొందు పరచకపోవడంతో ఇపుడు ఎటూ కదల్లేని పరిస్థితి ఏర్పడింది. దీనితో సచివాలయశాఖలో 19ప్రభుత్వ శాఖల సిబ్బందికి ఏఏ శాఖల వారికి సర్వీసు
నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయలేదో వారిని గుర్తిస్తున్నారు.
వీరిని సాధారణ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలా..లేదంటే ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలా అనే విషయమై శాఖాధిపతులు మల్ల గుల్లాలు పడుతున్నారు.
మరోపక్క ఏప్రిల్ తరువాత వీరికి బదిలీలు చేపట్టడానికి ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులకు ఏం చేయాలో తోచని పరిస్థితి
నెలకొంది. అంతేకాకుండా ఇటీవల మిగిలిపోయిన మరికొందరు సచివాలయ ఉద్యోగులను కూడా ప్రభుత్వం వారి సర్వీసులను రెగ్యులర్ చేయాలని అధికారులను
ఆదేశించింది. బదిలీలకు సమయం దగ్గరపడటంతో, ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ పొందుపరిచే విషయాన్ని శాఖాధిపతులు సీరియస్ గా తీసుకున్నారనేది రాష్ట్ర
సచివాలయ వర్గాల టాక్.ఫిబ్రవరిలో సచివాలయశాఖలో మిగులు ఉద్యోగాలకు నోటిఫికేషన జారీచేసే సమయానికి అన్ని శాఖల్లోని ఉద్యోగులకు సర్వీసు
నిబంధనలు పూర్తిచేయాలని సీఎస్ శాఖాధిపతులను ఆదేశించినట్టు చెబుతున్నారు.
అంతేకాకుండా ఉద్యోగుల భర్తీ జరగేనాటికి బదిలీల ప్రక్రియ పూర్తిచేసి..మిగులు ఖాళీలనను రాష్ట్రవ్యాప్తంగా ఖాళీ అయిన చోట భర్తీచేయాలని ప్రభుత్వం ఆలోచన
చేస్తున్నది. అయితే పలు దఫాలుగా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై బదిలీలకు సంబంధించిన ఒత్తిడి తీసుకురావడంతో కార్యాచరణ యుద్ద ప్రాతిపదికన
జరుగుతున్నది. బదిలీలు..జిల్లాల వారీగా జరుపుతారా..అంతర్ జిల్లాల వారీగా జరుపుతారా..అనే విషయంలో క్లారిటీ రావాల్సి వుంది. చాలా ప్రభుత్వశాఖల
ఉద్యోగులకు పదోన్నతులు, సర్వీసు నిబంధనలు ఏర్పాటు చేయకపోవడం వలన బదిలీల ప్రక్రియ ఆలస్యం జరుగుతుందనే వాదనను సచివాలయ ఉద్యోగులు
తెరపైకి తీసుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అడ్డుగా వున్న సర్వీసు నిబంధనల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే విషయంలో తీవ్ర ఉత్కంఠ
నెలకొంది. చూడాలి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల బదిలీల విషయంలో ఎలాంటి సర్వీసు నిబంధనలు అనుసరిస్తుందనేది..!