ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాష్ట్రంలోని 26జిల్లాల్లోని 38వేల జర్నలిస్టులకు పప్పుబెల్లాలు పంచే కార్యక్రమం అంటూ సోషల్ మీడియాల్లో పోస్టులు ఊదరగొట్టేస్తున్నారు. మూడున్నరేళ్లు గుర్తుకురాని జర్నలిస్టులు అకారణంగా ఎన్నికలకు ఏడాది ముందు అధికార పార్టీకి, ప్రభుత్వానికి గుర్తొచ్చాయా అంటూ ఎండగడుతూ.. ఫార్వాడింగ్ మెసేజులు క్రింద ట్యాగ్స్ యాడ్ చేస్తున్నారు. జర్నలిస్టుల ప్రధాన గుర్తింపు ప్రెస్ అక్రిడిటేషన్ల విషయంలోనూ జీఓ142తో వేలాది మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు రాకుండా చేసిందని, జీఎస్టీని నిబంధన పెట్టి చిన్న, మధ్య తరహా పత్రికల మనుగడ ప్రశ్నార్ధం చేసిందంటూ పోస్టింగులు పెడుతున్నారు. రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులు, డెస్కు జర్నలిస్టులు, ఫ్రీలాన్స్ జర్నలిస్టులు, వెటరన్ జర్నలిస్టులు ఇలా వారి కుటుంబాలతో కలిపి సుమారు లక్షా 50వేలకు పైగా ఓట్లు ఉన్నట్టు తాజా లెక్కలు పేర్కొంటున్నాయి.