భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ కొత్తజిల్లాల్లోని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డిఎఫ్ఓలు తొలిసారిగా అద్దెఇంట్లో ఉండాల్సి వస్తోంది. ప్రభుత్వ ఉద్యోగంలో జిల్లా కలెక్టర్ ఉద్యోగం, జిల్లా ఎస్పీ, డిఎఫ్ఓ ఉద్యోగాలు అత్యున్నతంగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లు భావిస్తారు. సివిల్ సర్వీస్ కేడర్ ఉద్యోగం అంటే ఒక కలెక్టరేట్, జిల్లా ఎస్పీ ఆఫీస్, జిల్లా ఫారెస్ట్ ఆఫీస్ వాటితో పాటు క్యాంపు ఆఫీసు, నివాస సముదాయం అన్ని ఉంటాయి. కానీ ఏపీలో మాత్రం నూతనంగా ఏర్పడిన 13 జిల్లాల్లోని కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, జిల్లా అటవీశాఖ అధికారులకు మాత్రం అద్దె ఇల్లులే శరణ్యం అయ్యాయి. కొత్తగా జిల్లాల ఏర్పాటు చేయడంతో కొన్ని చోట్ల కలెక్టరేట్లు కూడా ప్రైవేటు సముదాయాల్లోనే నిర్వహిస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లంతా బయటకు చెప్పుకోలేని బాధను అనుభవించాల్సి వస్తున్నది. వీరికి హోదా గొప్ప..నివాస సముదాయం దిబ్బ అన్నట్టుగా తయారైంది.
అయితే జిల్లా కలెక్టర్, ఎస్పీ, డిఎఫ్ఓ క్యాడర్ రాకపోయినా సీనియారిటీపై సివిల్ సర్వీస్ అధికారులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ఇటీవల అమరవాతిలో కలిసిన వీరంతా తమ గోడును ఒకరికి ఒకరు చెప్పుకున్నారట. రాష్ట్రప్రభుత్వం నాడు-నేడు క్రింద ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు ఇచ్చే ప్రాధాన్యత కనీసం సివిల్ సర్వీస్ అధికారుల మైన నివాస సముదాయాలు, క్యాంపు కార్యాలయాలకు ఇవ్వడం లేదనే అసహనం కూడా వ్యక్తం చేసినట్టు సమాచారం అందుతోంది. గ్రామ, వార్డు సచివాలయాలకి సైతం నూతన భవనాలు నిర్మాణం జరుగుతోందని మనకి మాత్రం అద్దిల్లులే శరణ్యం అవుతున్నాయని కాస్త చిన్నబుచ్చుకున్నట్టు తెలిసింది. ప్రభుత్వం కొత్తగా ఇంటి గ్రేటెడ్ కలెక్టరేట్లు నిర్మించాలిని భావించినా అవీ అతీ గతీలేకుండానే ఉన్నాయని, సాధారణ రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగాప్రైవేటు అద్దె ఇళ్ల నుంచి కలెక్టరేట్లకు, జిల్లా పోలీస్, జిల్లా ఫారెస్ట్ ఆఫీసులకు వెళ్లడం కాస్త చిన్నతనంగా ఉందని చెప్పుకున్నారట.
మరికొందరు ఒక్క అడుగు ముందుకి వేసి.. కేంద్ర సర్వీసులకు వెళ్లిపోతే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చేసిన విషయం బయటకు పొక్కిందని చెబుతున్నారు. ఈ విషయం కొత్తగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డిఎఫ్ఓ లే కాకుండా, రాష్ట్ర కార్యాలయాల్లో ఉన్న సీనియర్ ఐఏఎస్ లు కూడా ఈ విధంగానే ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. ప్రభుత్వం తలచుకుంటే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు తక్షణమే నిర్మాణం చేపట్టలేకపోయినా.. కలెక్టర్లు, జెసిలు, ఎస్పీలు, డిఎఫ్ఓలకు నివాస సముదాయాలు, క్యాంపు ఆఫీసులు కట్టించగలదని..కానీ పోస్టింగులు ఇచ్చి చేతులు దులుపుకుందని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయితే పాత ఉమ్మడి 13 జిల్లాల్లో మాత్రం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డిఎఫ్ఓ లకు నివాస సముదాయాలతోపాటు, క్యాంపు ఆఫీసులు, కలెక్టరేట్లు, జిల్లా కార్యాలయాలకు సొంత భవనాలు ఉన్నాయి. కొత్త జిల్లాల్లోనే కొన్ని చోట్ల కార్యాలయాలు, క్యాంపు కార్యాలయాలు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి.
ఐపీఎస్, ఐఏఎస్, ఐఎఫ్ఎస్ లు భార్యభర్తలుగా ఉన్నవారు మాత్రం పాత ఉమ్మడి జిల్లాల్లో ఉంటే మాత్రం ఏదో ఒక ప్రాంతం నుంచి రాకపోకలు సాగిస్తున్నట్టు సమాచారం అందుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతంగా ఏర్పాటు చేసిన 13 జిల్లాల్లో బాధ్యతలు స్వీకరించిన వారంతా తమ మార్కు, నూతన జిల్లాలు తమతోనే ప్రారంభం అయ్యాయనే ఆనందంతో ఉన్నారట. అన్నీ ఉండీ అల్లుడినోట్లో శని అన్నట్టుగా పేరుకి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జిల్లా ఫారెస్టు అధికారి హోదాలు ఉన్నా..తలదాచుకోవడానికి ప్రభుత్వ వసతి సముదాయమే లేదని విషయం ఇపుడుజిల్లాశాఖల అధికారుల్లోనూ గుప్పుమంటున్నది. కాగా ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళితే వచ్చే ప్రభుత్వంలో తొలి ప్రాధాన్యతగా కొత్తజిల్లాల్లో అధికారుల నివాస సముదాయాలు, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు, క్యాంపు కార్యాలయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మాట్లాడినట్టుగా తెలుస్తున్నది. చూడాలి..కొత్త జిల్లాల కలెక్టర్లు, జెసిలు ఎస్పీలు, డిఎఫ్ఓల మనోవేధన ఎప్పటికి నయం అవుతుందో..!