సమాచారశాఖ మొత్తం ఖాళీ.. తర్వాత ఏంటి పరిస్థితి..!


Ens Balu
172
Tadepalligudem
2023-01-28 04:31:23

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని 75 ప్రభుత్వ శాఖల్లో  పెంచిన రెండేళ్ల ఉద్యోగ విరమణ గడువు పూర్తవుతున్న తరుణంలో ప్రప్రధమంగా సమాచార, పౌర సంబంధాలశాఖ అత్యంత గడ్డు పరిస్థితి ఎదుర్కోనుంది. రాష్ట్రవ్యాప్తంగా పాత ఉమ్మడి జిల్లాల సమయంలో చాలా మంది ఉద్యోగులు రిటైర్ అయిపోయారు. ఇపుడు 13 జిల్లాలు, 26 అయిన తరువాత ఉన్నవారినే కొత్త జిల్లాలకు సర్ధుబాటు చేశారు. ఇపుడు అసలైన గడ్డు పరిస్థితి రానే వచ్చింది. ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా ఈ శాఖలో సీనియర్ అసిస్టెంట్లు, డివిజనల్ పీఆర్వోలు, డీపీఆర్వోలు, ఏపీఆర్వోలు ఒకే సారి పెద్ద మొత్తంలో ఉద్యోగ విరమణ చేయబోతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పాత ఉమ్మడి జిల్లాల్లో ఔట్ సోర్సింగ్ పద్దతిన 13 మంది ఏపీఆర్వోలను మాత్రమే నియమించింది. గతంలో ఉన్న కొందరు జూనియర్ అసిస్టెంట్లకు తాజాగా ఏపీఆర్వోలు, డివిజనల్ పీఆర్వోలుగా పదోన్నతులు కల్పించింది. అయినా ఈ శాఖలో తీవ్రంగా సిబ్బంది కొరత వెంటాడుతోంది. ఫోటో గ్రాఫర్లు లేకపోవడంతో సినిమా ఆపరేటర్లు ఫోటగ్రాఫర్లుగా పనిచేస్తున్నారు. చాలా చోట్ల వీడియో గ్రాఫర్లుకూడా లేరు. ఉన్న సాంకేతిక సిబ్బందినే ఆ అవసరాలకు వినియోగిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో వార్తా రచనపై అవగాహన ఉన్నవారికి వారిని సమాచారశాఖ ఏపీఆర్వోలుగా వినియోగించుకుంటున్నది.

కొత్తగా 4 డీపీఆర్వోలు, మరికొన్ని ఏపీఆర్వో పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు ఏర్పాటు చేసినా వాటికి ఇంకా అతీగతీ లేదు. మార్చి, ఏప్రిల్ తరువాత ప్రభుత్వం పెంచిన రెండేళ్ల కాలపరిమితి దగ్గర పడుతుంది. ఈ లోగా ఔట్ సోర్సింగ్ పద్దతిలోనైనా సమాచారశాఖలో సిబ్బంది ప్రభుత్వం నియమించాల్సి వుంటుంది. లేదంటే ఉన్నవారంతా ఉద్యోగవిరమణ పొంది ఈశాఖ మొత్తం ఖాళీ అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే కొత్త జిల్లా్ల్లో నియమించిన డీపీఆర్వోలకు సహాయకులుగా ఎవరినీ నియమించకపోవడంతో భారం మొత్తం డిపీఆర్వోలపైనే పడుతున్నది. ఫోటోలు, వీడియోలు, ప్రెస్ నోట్ ప్రిపరేషన్, దానిని మీడియా సంస్థలకు పంపే బాధ్యతలన్నీ ఒక్క డీపీఆర్వోలే చేసుకోవాల్సి వస్తున్నది. తమ ఇబ్బందులను, సాంకేతిక సమస్యలను రాష్ట్ర కమిషనరేట్ కి విన్నవించినా వినే నాధుడే కరువయ్యాడు. ఏదో కష్టపడి ఉన్న అరకొర సిబ్బందితోనే కొత్త జిల్లాల్లోని డీపీఆర్వోలు మీడియా మేనేజ్ మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. వీరికి ప్రభుత్వం పెంచిన రెండేళ్ల ఉద్యోగ విరమణ పరిమితి పూర్తయితే మాత్రం సమాచారశాఖ తీవ్ర సిబ్బంది కొరతను ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తున్నది. వాస్తవానికి ఒక్కో జిల్లాకు ఒక డీపీఆర్వో, ఒక ఏపీఆర్వో, ఒక ఫోటో గ్రాఫర్, ఒక వీడియో గ్రాఫర్, ఒక టెక్నిల్ అసిస్టెంట్లను నియమిస్తే తప్పా ప్రభుత్వ కార్యక్రమాలు సకాలంలో మీడియాకి అందించే ఏర్పాటు జరగదు. అలాంటిది అన్ని పనులు ఒక్క డీపీఆర్వోనే చేసుకోవడం అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు..

ప్రస్తుతం ప్రభుత్వం ఉద్యోగుల విరమణ వయస్సు మరో ఏడాది పెంచాలని యోచిస్తున్నతరుణంలో సమాచారశాఖ ఉద్యోగులు, అధికారుల్లో ఆందోళన మొదలైం ది. ఇప్పటి కే వయస్సు మీదపడి, సిబ్బంది లేక అన్నీ పనులు ఒక్కరొక్కరే చేసుకోవాల్సి వుస్తున్నదని, ప్రస్తుతం జరుగుతున్న 63 ఏళ్ల పెంపు నిజమైతే మాత్రం పని ఒత్తిడితోనే సర్వీసులో ఉండగానే చాలా మంది తనువు చాలించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని కొందరు అధికారులు, సిబ్బంది ఈఎన్ఎస్ ముందు వాపోయారు. తమకు అదనపు సిబ్బంది కావాలని అడిగినా చూద్దాం, చేద్దం అంటున్నారే తప్పా కార్యాచరణ మాత్రం జరగలేదని చెబుతున్నారు. గతంలో ప్రభుత్వం నియమించిన ఆ ఔట్ సోర్సింగ్ సిబ్బంది కూడా లేకపోతే తమ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి మాదిరి అయిపోయి ఉండేదని ఆవేదన చెందుతున్నారు. మరికొందరు..వయస్సు పెంచినా, పెంచపోయినా 62 ఏళ్ల తరువాత స్వచ్చందంగా నైనా రాజీనామాలు చేస్తామని చెప్పడం విశేషం. ఒక జిల్లాశాఖ కార్యాలయంలో నలుగురు సిబ్బంది చేసే పనిని ఒక్క డిపీఆర్వో చేయడం అంటే ఆ నరకం మామూలుగా ఉండదు. ఉద్యోగుల విరమణకు సమయం దగ్గర పడుతున్నవేళ సమాచార పౌర సంబంధాల శాఖ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకొని సిబ్బందిని భర్తీ చేస్తుందనేది అంతుచిక్కకుండా ఉన్నది..చూడాలి ఏం జరుగుతుందనేది..!