పసుపులేటి బాలరాజు ఈపేరు వింటే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని గిరిజన తండాల్లోని ఒక యువ గిరిజన స్పూర్తి.. దైర్యం..తెగువ..నాయకత్వం.. గిరిజన రాజకీయాల్లో ఆరితేరిన యోధుడిగా అతి చిన్న వయసులోనే కీర్తి.. అంతేకాదు 25 ఏళ్ళకే శాసన సభకు ఎన్నికైన నాటి కాంగ్రెస్ గిరిజననాయకుడు. ఇదంతా సరిగ్గా 30 ఏళ్ళ కిందటి విశాఖమన్యం సంగతి. చింతపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికైన 3వ సంవత్సరంలోనే పీపుల్స్‌వార్ నక్సల్స్ బాలరాజును కొయ్యూరు మండలంలో కిడ్నాప్ చేసిన రోజులవి..ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నక్సల్స్ చెరలోనే 23 రోజులు.. ఓ పక్క మన్యం మొత్తం రెడ్ అలెర్ట్..కటుంబ సభ్యుల్లోనూ, ప్రభుత్వంలోనూ ఒకటే టెన్షన్.. రోజు గడిస్తే ఏం జరుగుతుందో..ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని..అలాంటి నక్సల్స్ చీకటి భయాన్ని చేధించుకొని చెక్కుచెదర కుండాతిరిగి మన్యంలోకి అడుగుపెట్టిన దైర్యం, తెగింపు పసుపులేటి బాలరాజుది. ఆ చీకటి భయం సంఘటన 1993 జనవరి 30న జరిగి నేటికి సరిగ్గా30ఏళ్లు. ఈ సందర్భంగా ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net అందిస్తున్న ప్రత్యేక కథనం..!
విశాఖ మన్యం ప్రాంతాలంటే అధికారుల నుంచి ప్రజాప్రతినిధుల వరకూ ఒకటే భయం అక్కడ పీపుల్స్ వార్ నక్సల్స్ ఉంటారని. అందులోనూ అప్పటికే చింత పల్లి, కొ య్యూరు మండలాలు పూర్తిగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు. ఆ సమయంలోనే ఎమ్మెల్యేగా ఉన్న పసుపులేటి బాలరాజు రూ.30 లక్షల వ్యయంతో గిరిజన గ్రామాల్లో నిర్మించే చెక్‌డామ్‌ల పరిశీలన కోసం 1993 జనవరి 30వ తేదీన కొయ్యూరు మండలం బూదరాళ్ళ శివారు గుడ్లపల్లి గ్రామానికి వెళ్లారు. ఆయన వెంట దాదాపు 40 మంది ప్రభుత్వ ఉద్యోగులు అప్పటి పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి దాసరి శ్రీనివాసులు కూడా బాలరాజు వెంటే ఉన్నారు. వీరి రాకను ముందుగానే తెలుసుకున్న పీపుల్స్‌వార్ నక్సల్స్ మాటువేసి మొత్తం 40 మందిని బందీలుగా చేసి అత్యధిక సంఖ్యలో ఉన్న నక్సలైట్లు ఒకేసారి అటవీ ప్రాంతంలో కిడ్నాప్ చేశారు. అప్పట్లో ఈవార్త బిబిసి లాంటి అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ, ఆలిండియా రేడియో, దూరదర్శన్ టివీ ఛానళ్లలో ప్రసారం కూడా అయ్యింది. ఒక్కసారిగా ప్రభుత్వం మన్యంలో రెడ్ అలెర్ట్ ప్రకటించింది. కొయ్యూరు మండలంలోని అన్ని అటవీ ప్రాంతాల్లో కిడ్నాప్ అయిన ఎమ్మల్యే బాలరాజు, ఇతర అధికారుల కోసం ప్రత్యేక పోలీసు బలగాలు వెతికే వేట ప్రారంభించాయి. విషయం తెలుసుకున్న నక్సక్సల్స్ ఎమ్మెల్యే బాలరాజు, ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులుతో సహా 13 మందిని తమ దగ్గరే బందీలుగా వుంచుకొని మిగిలిన వారిని విడిచి పెట్టారు.
ఇక అపుడే అసలు భయం మొదలైంది. అంతా ఆ 13 మందిని నక్సల్స్ చంపేసి ఉంటారనే వార్తలు దేశవ్యాప్తంగా సంచలనం అయ్యాయి. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ సంఘటన పెను సవాలుగా మారింది. అయిలే బాలరాజు నక్సల్స్ ఎందుకు కిడ్నాప్ చేశారో..ఆయనతోపాటు కిడ్నాప్ చేసిన కొంత మందిని ఎందుకు వదిలిపెట్టారో ప్రభుత్వంలోగానీ, పోలీసులకు గానీ ఎవరికీ అంతు చిక్కడం లేదు. రోజులు గడుస్తున్నాయి. ఒక దశలో ఎమ్మెల్యే బాలరాజుని నక్సల్స్ చంపేసి ఉంటారనే వార్త దావాలనంగా దేశమంతా వ్యాపించింది. ఆసమయంలో నక్సల్స్ ప్రభుత్వానికి ఒక పెద్ద వార్నింగ్ కూడా ఇచ్చారు. అప్పటికే వరంగల్ జైలులో వున్న పీపుల్స్‌వార్ నాయకుడు క్రాంతి రణదేవ్‌ను విడిచి పెడతేనే బాలరాజును విడుదల చేస్తామనేది దాని సారాంశం. అయితే దీనికి ప్రభుత్వం సూచన ప్రాయంగా అంగీకరించింది.
నక్సల్స్ తో మధ్యవర్తుల ద్వారా సంప్రదింపులు చేస్తూనే..ఎమ్మెల్యే బాలరాజును ఎలాగైనా ప్రాణాలతో రక్షించుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ మొదలు పెట్టింది. బాలరాజుకు అండగా ద్రోణంరాజు సత్యనారాయణ, కొణతాల రామకృష్ణ మొదలైన నాయకులు నర్సీపట్నంలోనే మకాం వేసి ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. అంతేకాకుండా ఎమ్మెల్యే బాలరాజు భార్య కూడా తన భర్తను విడిపించాలంటూ ఆమరణ నిరాహారదీక్షను చేపట్టారు. ఇదంతా దేశవ్యాప్తంగా సంచలనం అవుతున్నతరు ణంలో ప్రభుత్వం క్రాంతి రణదేవ్ ను విడిచిపెట్టాలనే నిర్ణయానికి వచ్చింది. అదే సమయంలో గిరిజన ప్రజలతో అత్యంత సన్నిహిత సంబంధాలున్న బాలరాజును చంపితే నక్సల్స్ పట్ల తీవ్ర వ్యతిరేకత పెరుగుతుందని నక్సల్స్ కూడా ముందుచూపుతో ఆలోచించి సానుకూలంగానే వ్యవహరించారు. మరొపక్క అప్పటి సీఎం కోట్లవిజయభా స్కరరెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి బాలరాజు విడుదలకు మార్గం సుగమం చేశారు. క్రాంతి రణదేవ్‌ను నక్సల్స్ కి అప్పగించడానికి వరంగల్ నుంచి విశాఖ జైలుకు ఆఘ మేఘాల మీద తరలించారు.
విషయం తెలుసుకున్న నక్సల్స్ ఈలోగానే ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసుల్ని విడుదల చేశారు. ఇపుడు ఇంకా ఉత్కంఠ అసలు బాలరాజు ప్రాణాలతో బతికేఉన్నారా లేదంటే క్రాంతి రణదేవ్ ని విడుదల చేసిన తరువాత చంపేస్తారా అనే అనుమానం వ్యక్తం చేస్తూనే ఏం జరిగినా బాలరాజుని బయటకు క్షేమంగా తీసుకు రావాలనే నిర్ణయానికి వచ్చింది ప్రభుత్వం. 23రోజులు గడిచిన తరువాత బాలరాజుని ఏమీ చేయకుండా నక్సల్స్ విడిచిపెట్టారు. అంతా ఊపిరి పీల్చుకున్నారు. భయం చీకటిని చీల్చుకొని చెక్కు చెదరకుండా వచ్చిన సూరీడు మా బాలరాజు అంటూ చింతపల్లిలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి, హారతులు పట్టి కార్యకర్తులు, కుటుంబ సభ్యులు పండుగ చేసుకున్నారు. పసుపులేటి బాలరాజు రాజకీయ ప్రయాణంలో ఒదొక కీలకఘట్టం. ఈ ఘటన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఒక చరిత్రలో కూడా నిలిచిపోయింది.
ఆ తరువాత నక్సల్స్ చెర నుంచి బయటకు వచ్చిన బాలరాజు ఆ 23 రోజులు తనను నక్సల్స్ బాగానే చూసుకున్నారని మీడియాకి తెలియజేశారు. నక్సల్స్ బాలరాజుని కిడ్నాప్ చేసింది మొదలు..మళ్లీ విడుదల చేసేవరకూ పత్రికలూ, జాతీయ మీడియా అంతా ఫోకస్ చింతపల్లి, కొయ్యూ మండలాలపైనే పెట్టింది. అయితే కుటుంబానికి, ప్రజలకు దూరంగా ఉండిపోయానని..ఒక దశలో తాను కూడా చనిపోతాననే భయం వెంటాడినా.. వారితో అన్నిరోజులు అడవిలో గడపాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు బాలరాజు. నాటి నుంచి నేటి వరకూ బాలరాజు తిరుగులేని గిరిజన రాజకీయ నాయకుడిగానే ఉన్నారు. రెండు సార్లు మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ పార్టీలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నారు. చాలా మంది నేటి యువతకు తెలియని ఈ 30ఏళ్ల సంఘటన మరోసారి ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారి క మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net ప్రజలు, పాఠకుల ముందుకి తీసుకు వచ్చింది..!