విశాఖ స్టీల్ ప్లాంట్ మూడేళ్లలో మెుత్తం ఖాళీ..!


Ens Balu
236
Visakhapatnam
2023-02-07 02:19:42

విశాఖ స్టీల్ ప్రైవేట్ పరం చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటన ఒకవైపు..వచ్చే మూడేళ్లలో భారీస్థాయిలో ఉద్యోగుల ఉద్యోగ విరమణలు మరోవైపు స్టీల్ ప్లాంట్ మనుగడను ప్రశ్నార్ధకం చేసేలా ఉన్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ప్రస్తుతం 14,880 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా..  గత మూడేళ్లలో 1,987 మంది ఉద్యోగులు ఉద్యోగ విరమణ చేశారు. ఇక మరో మూడేళ్లలో భారీ ఎత్తున అంటే.. 1,170 మంది ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు, 2,039 మంది నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు సహా 3,209 మంది ఉద్యోగులు ఆర్ఐఎన్ఎల్ (RINL) రికార్డుల ప్రకారం పదవీ విరమణ చేయనున్నారట. ఈ విషయాన్ని కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి  ఫగ్గన్ సింగ్ కులస్తే పార్లమెంటు సమావేశాల్లో ప్రకటించారు. అంటే మరో ఐదేళ్లలో స్టీలుప్లాంట్ లోని అన్నివిభాగాల్లో ఇంకెంత మంది ఉద్యోగ విరమణలు చేస్తారో అర్ధం చేసుకోవచ్చు. విశాఖ స్టీలు ప్లాంట్ లో ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది ఉద్యోగ విరమణలు చేస్తున్నప్పటికీ వాటికి అనుగుణంగా ఉద్యోగాల భర్తీ మాత్రం జరగడం లేదు. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ లో ప్రతి సంవత్సరం భారీ ఎత్తున పదవీ విరమణ జరుగుతున్నా ఉద్యోగుల సమస్య వలన క్షీణిస్తున్న మానవ వనరుల పరిస్థితిని దారుణంగా ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది.


పార్లమెంటులో మంత్రి మాటలు ప్రైవేటీకరణకు ఊతం..!
పార్లమెంటులో బీజేపీ ఎంపీ జీవిఎల్ నరసింహారావు విశాఖ ఉక్కు ఉద్యోగాల్లో భారీ ఎత్తున జరుగుతున్న ఉద్యోగ విరమణలపై ప్రశ్నలేవనెత్తగా, అవసరం అయిన ఉద్యో గాలను ఔట్ సోర్సింగ్ ద్వారా తీసుకుంటామనే మాట..స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు ఊతమిచ్చినట్టు అయ్యింది. దానికి తగ్గట్టుగానే ఉద్యోగులు రిటైర్ అవుతున్నా స్టీల్ ప్లాంట్ మాత్రం ఉద్యోగాల భర్తీ జరగడం లేదు. ఇదే విషయమై ప్రశ్నించిన ఎంపీ రాబోయే రోజుల్లో స్టీలు ప్లాంటు పెద్ద ఎత్తున మానవ వనరుల కొరతను ఎదుర్కొంటుందని పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లారు. కొత్త నియామకాలపై ఎలాంటి ఆంక్షలు లేవని చెబుతూనే, గత మూడేళ్లలో 106 మంది కొత్త ఉద్యోగులను నియమించామని మంత్రి సమాధానం ఇవ్వడం ఇపుడు ప్రైవేటీకరణ నిప్పుపై నూనెపోసిసట్టు అయ్యింది. అంతగా ప్రాధాన్యత లేని కార్యకలాపాలను ఔట్ సోర్సింగ్ చేయడం ద్వారా, ప్రధాన కార్యకలాపాల్లో సిబ్బందిని పునర్ వ్యవస్థీకరణ ద్వారా మానవ వనరుల అవసరాలను తీర్చుతున్నామని కేంద్ర మంత్రి పేర్కొనడం ఇక్కడ విశేషం. అంటే ఎంత త్వరగా ఉద్యోగాలు ఖాళీ అయిపోతే అంతగా తదుపరి కార్యాచారణ ముందుకి సాగుతుందని చెప్పకనే చెప్పినట్టు అయ్యింది.


స్టీలుప్లాంటును ఖాళీచేసి ప్రైవేటీకరణ చేపడతారా..?
లాభాల్లో ఉన్న విశాఖస్టీలు ప్లాంటును ఉద్యోగులకు అన్యాయం జరగకుండా వారంతా ఉద్యోగవిరమణ చేసిన తరువాత ప్రైవేటు యాజమాన్యానికి అప్పగించే ప్రయత్నం జరగుతున్నట్టు తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. ప్లాంటులో ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్నవారంతా ఉద్యోగ విరమణ చేయాలంటే ఐదునుంచి ఏడేళ్ల సమయం పడుతుంది. ఈలోగా ప్రాధాన్యత క్రమంలోని ఉద్యోగాల్లోని వారంతా ఉద్యోగ విరమణచేస్తారు. దీనితో ప్లాంటును ప్రైవేటీకరణ చేయడం సులవుతుంది. దానికోసమే కొత్తగా ఉద్యోగాల భర్తీచేపట్టడం లేదనే వాదనకు ఈరోజు పార్లమెంటులో జరిగిన ప్రశ్నోత్తరాల్లో వచ్చిన సమాధానాలు ఊతమిస్తున్నాయి. ఆ కారణంగానే బడ్జెట్ లో కూడా స్టీల్ ప్లాంట్ విస్తరణకు ఎలాంటి నిధులు కేటాయించలేదు. అయితే దీనిపై రాష్ట్రం నుంచి ఒక్కఎంపీ కూడా పార్లమెంటులో ప్రశ్నించిన దాఖలాలు ఒకటి అరా తప్పా పెద్దగా లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో పేరుకుపోయిన ఆర్ కార్డు దారుల సమస్యలు, ఇతరత్రా ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించి నేటి వరకూ కేంద్రం ఎలాంటి నష్టపరిహారంగానీ, ఉద్యోగాలను కానీ భర్తీచేయలేదు. దీనితో స్టీల్ ప్లాంట్ ను పూర్తిగా ఖాళీ చేసిన తరువాత అయితే ప్రైవేటకరణ కు ఎలాంటి ఆటంకాలూ ఉండవని కేంద్రం భావిస్తు్నట్టుగా సమాచారం అందుతున్నది. కేంద్రం అనుకున్నట్టుగా ఖాయిలా పడ్డ పరిశ్రమగా మార్చాలంటే కొత్త సిబ్బంది నియామకాలు చేపకట్టకుండా ఉండటం, ఉత్పాదకతను సిబ్బంది లేమితో  తగ్గించేయడం తదితర అంశాలన్నీ తెరపైకి తీసుకురావాలని చూస్తున్నట్టుగా కనిపిస్తుంది

ఉద్యమాలు ఫలితాలనిస్తాయా..ఉసూరు మనిపిస్తాయా 
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించకూడదంటూ జరుగుతున్న ఉద్యమాలు ఫలితాలనిచ్చేలా అయితే కనిపించడం లేదు. ఉక్కు విషయంలో కేంద్రం అనుకున్నట్టుగా ఒక్కో అవకాశాన్ని ఉద్యోగులకు చిక్కకుండా చేస్తుందనే విషయం తేటతెల్లం అవుతుంది. భారీ ఎత్తున ఉద్యోగుల రిటైర్ మెంట్లు, కొత్త ఉద్యగాల భర్తీ లేకపోవడం, అన్ని పనులూ ఔట్ సోర్సింగ్ ద్వారా చేపట్టడం, ప్రధాన్యత కలిగిన పోస్టులను కుదించేయడం, ఆర్ కార్డుదారులకు న్యాయం చేయకపోవడం, ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని పట్టించుకోకపోవడం, తదిర అంశాలన్నీ ఉక్కు పరిరక్షణ ఉద్యమాన్ని ఉసూరు మనిపిస్తాయనే సంకేతాలను ఇస్తున్నాయి. ఇది కాకుండా త్వరలోనే వీఆర్ఎస్ స్కీము ద్వారా మరింత మంది ఉద్యోగులను ఇంటికి పంపే కార్యక్రమానికి కూడా యాజమాన్యం కేంద్రం ఆధ్వర్యంలో తెరలేపుతుందనే ప్రచారం కూడా జరుగుతంది. అదే జరిగితే మూడేళ్లలో కాకుండా అంతకంటే ముందుగానే స్టీలు ప్లాంటు ఖాళీ అయిపోవడం ఖాయంగా కనిపిస్తున్నది. ఎంతో మంది ప్రాణాలు బలితీసుకొని సాధించుకున విశాఖ ఉక్కు...పరిస్థితి ఏమవుతుందో తెలియని పరిస్థిని నెలకొంది. ఇటు రాష్ట్రప్రభుత్వం కేంద్రంపై తీసుకువచ్చే ఒత్తిడి, ఉద్యోగుల ఆందోళనలు, ఉద్యమాలు ఫలితం ఎలా ఉండబోతుందో ప్రశ్నార్ధకంగా మారింది..!