ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిపిఎస్ ఉద్యోగుల కోసం ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ ను రద్దు చేసి జిపిఎస్ ను అమలు చేస్తామన్న ప్రకటనపై సిపిఎస్ ఉద్యోగులు సంఘాల నేతలకు ఎక్కడి కక్కడ ఊరమాస్ పంచ్ లు ఇచ్చేస్తున్నారు. ఇవే ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోనూ, సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి పాద యాత్ర సమయంలో ఇచ్చిన హామీని ఎన్నికలకు 9నెలల ముందు రివర్స్ లో అమలు చేయడాన్ని సిపిఎస్ ఉద్యోగులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. అదే సమయంలో ఓపిఎస్ లో ఉన్న ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నేతలు ప్రభుత్వం తీసుకు వస్తామంటున్న జిపిఎస్ ఎంతో బాగుందని ప్రభుత్వాన్ని కీర్తిస్తుండటాన్ని తప్పు బడుతున్నారు. అంతేకాదు..జిపిఎస్ మీకు అంతనచ్చిందా..అయితే ఓపిఎస్ లో ఉన్న ఉద్యోగ సంఘ నేతలందరూ.. మీ ఓపిఎస్ ను వదిలేయండి.. అందరూ జిపిఎస్ లోకి వచ్చేయండి.. అపుడు ఏది బాగుందో మీకు తెలుస్తుంది అంటూ మండి పడుతున్నారు. ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వం చర్చలకు ఉద్యోగ సంఘాల నేతలను ఆహ్వానిస్తే వారి స్వప్రయోజనాలకు సుమారు 3.50లక్షల సిపిఎస్ ఉద్యోగుల భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేస్తారా అంటూ ఆరోపిస్తున్నారు. రాజకీయపార్టీలు రాజకీయం చేయడం చూస్తున్నామని..కానీ సిపిఎస్ రద్దు విషయంలో ఉద్యోగ సంఘాల నేతలే రాజకీయం చేయడం ఇపుడే చూస్తున్నామంటూ ఉద్యోగులు మండి పడుతున్నారు.
దేశంలో సిపిఎస్ ను రద్దు చేసి చాలా రాష్ట్రాలు చత్తీస్ ఘడ్, జార్ఖాండ్ రాష్ట్రాలు ఓపిఎస్ ను అమలు చేస్తున్నాయి. మొన్నటికి మొన్న అధికారంలోకి వచ్చిన కేరళ ప్రభుత్వం ఉద్యోగుల సిపిఎస్ రద్దు చేసింది. ఇలా దేశంలోని అన్ని రాష్ట్రాలు సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ ను అమలు చేస్తుంటే..ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అన్నింటికంటే భిన్నంగా జిపిఎస్ ను తెరపైకి తీసుకు రావడాన్ని ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఓపిఎస్ కు.. జిపిఎస్ కు మధ్య వ్యత్యాసాన్ని సోషల్ మీడియా వేదికగా ఉద్యోగులందరికీ తెలిసేలా చైతన్యాన్ని తీసుకు వస్తున్నాయి. మరో వైపు పెన్షనర్లకు జరుగుతున్న అన్యాయంపైనా కూడా సామాజిక మాద్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరగుతున్నది. ప్రభుత్వం తీసుకుంటున్న ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలను మూకుమ్మడిగా తిప్పికొట్టాలంటే ఇప్పటి నుంచే సార్వత్రిక ఎన్నికల్లో చేపట్టాల్సిన వ్యూహం అవసరం ఉందంటూ సమాచాలోచనలు చేస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే సిపిఎస్ రద్దు చేస్తారనే వైఎస్సార్సీపీకి ఓటు వేశామని..తీరా మా ఉద్యోగుల ఉనికినే ప్రశ్నార్ధకం చేస్తుంటే మళ్లీ టిటిడిపి పట్టించిన గతే వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకీ పట్టిస్తామని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు బహిరంగంగానే ప్రచారాన్ని చేస్తున్నారు. కొన్ని చోట్ల ఇలా ప్రచారాలు చేసిన ఉద్యోగులపై ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదురైనా..వాటిని ఎవరూ లెక్కడచేయడం లేదు. ఉద్యోగులకు నాడు రివర్స్ పిఆర్సీ ద్వారా అన్యాయం జరిగిందని.. ఇపుడు సిపిఎస్ రద్దు విషయంలో మరో భారీ అన్యాయం జరిగిందని..ఇదే పద్దతి కొనసాగితే రానున్నరోజుల్లో ప్రభుత్వ ఉద్యోగుల మనుగడ ప్రశ్నార్ధకం అవుతుందనే ఆందోళనకు ఉద్యోగులు వచ్చేస్తున్నారు.
ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే ఉద్యోగ సంఘాలు..నేతల వలన ప్రధాన డిమాండ్లు పరిష్కారం కావనే విషయాన్ని గుర్తించిన సిపిఎస్ ఉద్యోగులు తమ ఉద్యమా న్ని ఓటుతోనే తెలియజేయాలని నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తున్నది. సాధారణ ఎన్నికలకు ఇంకా 9నెలలు సమయం ఉన్నందున..సిపిఎస్ ఉద్యోగులు.. వారి కుటుంబాలను..వారి పిల్లలను, పెన్షనర్లును కూడా చైతన్యం చేస్తే తప్పాఅన్ని వర్గాల్లో మార్పు రాదని కూడా చెబుతున్నారు. సిపిఎస్ ఉద్యోగుల ఆందోళనకు ఆర్టీసీ, పోలీసు, ఐసిడిఎస్, ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తున్నారు. సిపిఎస్ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనను, చైతన్య కార్యక్రమాలను సామాజిక మాద్యమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. సిపిఎస్ రద్దు చేసి.. జిపిఎస్ అమలు చేయడం ద్వారా ఉద్యోగులు ఏ విధంగా నష్టపోతున్నారనే విషయాన్ని ఉద్యోగులు, వివిధ సంఘాలు ఫేస్ బుక్, వాట్సప్, టెలీగ్రామ ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మరికొందరు టెక్నాలజీ తెలిసిన వారు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రిన్సిపల్ కార్యదర్శిల అఫిషియల్ ఖాతాలకు ట్యాగ్ చేస్తున్నారు. మొత్తానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న జిపిఎస్ విధానంపై సిపిఎస్ ఉద్యోగుల నుంచి పెద్ద ఎత్తున నిరసన సెగ తగులుతుంటే.. ఉద్యోగ సంఘాల నేతలకు అనుకూలంగా ఉన్న ఉద్యోగుల నుంచి మాత్రం మిశ్రమ స్పందన వస్తున్నది. చూడాలి సిపిఎస్ రద్దు పోరాటం వచ్చే 2024 ఎన్నికల్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చేస్తున్న ఉద్యోగుల ప్రచారంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందనేది..!