భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు తొంగిచూసేలా గ్రామంలోనే సేవలు అందేలా గ్రామ, వార్డు సచివాలయ శాఖను ఏర్పాటు చేసి ఒకేసారి 1.26లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలను కల్పించిన ప్రభుత్వం సరిగ్గా నాలుగేళ్లు పూర్తి కాకుండా ఇపుడు పదోన్నతులు కూడా ఇస్తుండటం ఎంతో శుభపరిణామం. ప్రజల సేవల కోసం, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కోసం ఇంతగా ఆలోచించిన ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఉద్యోగులకు ఇవ్వాల్సిన ప్రయోజనాల విషయంలో మాత్రం ఇంకా మీన మేషాలు లెక్కిస్తూనే ఉంది..కాదు కాదు ఆ విషయాన్ని మాట్లాడకుండా చేస్తున్నదనే అపవాదుని మూటగట్టుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ లో 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత గ్రామ, వార్డు సచివాలయాలు, అందులో ఉద్యోగాలు పొందిన సిబ్బంది కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో మరెందరో ఉద్యోగులు ప్రాణాలు కూడా కోల్పోయారు. కనీసం సాధారణ సెలవులు, 2వ శనివారాలు, ఆదివారాలు కూడా తీసుకోకుండా పనిచేసిన ఉద్యోగులకు మాత్రం రాష్ట్రప్రభుత్వం ఇవ్వాల్సిన ప్రయోజనాలను, బకాయిలను మాత్రం పూర్తిగా పెడచెవిన పెట్టింది. వాటికోసం ఏమీ మాట్లాడకుండా ఇపుడు పదోన్నతులు ఇస్తున్నామని చెబుతోంది ప్రభుత్వం. ఒకేసారి లక్షా 26వేల మంది ఉద్యోగులను నియమించి.. ఆతరువాత కారుణ్య నియామకాల్లో మిగిలి పోస్టులు భర్తీ చేయడం ద్వారా సుమారు లక్షా 34 వేల ఉద్యోగాలు భర్తీచేసిన ప్రభుత్వానికి ఉద్యోగులకు న్యాయపరంగా ఇవ్వాల్సిన ప్రయోజనాలు విషయం పెద్ద లెక్కేం కాదు. ఇక్కడ ఈశాఖను చూసే రాష్ట్ర అధికారులు ఆ విషయాన్ని ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లలేదా.. కావాలనే ప్రయోజనాలేమీ ఇవ్వకుండా వారికి పదోన్నతులు ఇచ్చేస్తే ఇవ్వాల్సిన ప్రయోజనాల మాట అడగరని అధికారులు భావించి ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని చూస్తున్నారా అనే విషయం తేలడం లేదు.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన నియామక పత్రాల్లోనే రెండేళ్లు ప్రొబేషన్ తరువాత సర్వీసులను రెగ్యులర్ చేస్తామని ప్రభుత్వం లిఖిత పూర్వ కంగా తెలియజేసింది. కానీ వీరి ఉద్యోగాలనే 2.9 ఏళ్ల తరువాత దశల వారీగా క్రమబద్దీకరణ చేస్తూ వచ్చింది అదీ కూడా వీరికి ప్రత్యేకంగా పెట్టిన పరీక్షలు పాసైన వారికి. ఇంకా నేటి వరకూ చాలా మందికి ఉద్యోగాలు కూడా రెగ్యులర్ కాలేదు. అలా తొమ్మిది నెలలు అదనంగా పనిచేయించుకున్న సమయంలో ఉద్యోగులు తొమ్మిది నెలల పేస్కేలు కోల్పోయారు. వాటితోపాటు సుమారుగా రెండు డిఏలు కూడా కోల్పోయారు. సర్వీసు రెగ్యులర్ అయిన తరువాత ఇవ్వాల్సిన తొలి రెండు ఇంక్రిమెంట్లను ప్రభుత్వం నేటి వరకూ ఉద్యోగుల బేసిక్ పేకి కలపనేలేదు. ఉద్యోగంలో చేరిన రోజు నుంచి రెండేళ్లు ప్రొభేషన్ అంటే ఉద్యోగులకు సర్వీసు నిబంధనలను అనుసరించి రెండు ఇంక్రిమెంట్లను కలిపి వారి పేస్కేలు రివైజ్డ్ చేసి సర్వీసు రెగ్యులర్ అయిన తరువాత ఇవ్వాల్సి వుంది. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చే సమయంలో సచివాలయ ఉద్యోగులకు కూడా వాటిని వర్తింపచేస్తున్నామని పేస్కేలు పెంచి వీరికి పీఆర్సీ అరియర్సు ఇవ్వ లేదు. అంతేకాదు వీరికి పీఆర్సీ ఇచ్చే ముందే ప్రభుత్వ ఉద్యోగులందరికీ హెచ్ఆర్ఏ, డిఏల్లోనే ముందుగా ప్రత్యేక జీఓని విడుదల చేసి కోత పెట్టింది. ఆ తరువాత మళ్లీ కాస్త మార్పులు చేర్పులు చేసి వాటిని పెంచుతున్నట్టు పాత వాటినే రివైజ్డ్ పీఆర్సీగా మార్పు చేసి వీరికి పీఆర్సీని అమలు చేసింది. ఈ ప్రయోజనాల బకాయిలను రాష్ట్రప్రభుత్వం నేటి వరకూ సచివాలయ ఉద్యోగులకు చెల్లించనే లేదు. ఇపుడు సర్వీసు రెగ్యులైజేషన్ పూర్తయిన వారికి ఒక ఇంక్రిమెంటు ఇస్తున్నట్టు చెబున్న ప్రభుత్వం పాత రెండు ఇంక్రిమెంట్ల విషయాన్ని ఎక్కడా ప్రస్తావించడం లేదు.
సచివాలయ ఉద్యోగులు విధుల్లోకి చేరి నాలుగేళ్లు పూర్తవుతున్న సమయంలో ఉద్యోగ ప్రవేశ పరీక్షలో టాప్ టెన్ లో నిలిచిన వారికి పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అలా తొలుత హార్టికల్చర్ విభాగంలో గ్రామీణ ఉద్యాన సహాయకులకు, విలేజ్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్లుగా పదోన్నతి కల్పించింది. అయితే ఇక్కడ పదోన్నతి కల్పించే సమయంలోనూ వారికి 2 ఇంక్రిమెంటు కలపాల్సి వుంటుంది. కానీ వాటిని వారికి కలిపిందా..? లేదా..? అనే విషయంలో మాత్రం ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. మొత్తం 19శాలఖల ఉద్యోగుల్లో నేటి వరకూ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లకు ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయనే లేదు. వారికి ప్రస్తుత ఉద్యోగాల తరువాత ఏ పదోన్నతి వస్తుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు సచివాలయ మహిళ సంరక్షణా కార్యదర్శి(మహిళా పోలీసు)లకు కోర్టుకేసుల నేపథ్యంలో వారికి పోలీస్ స్టేషన్ విధులు, బందోబస్తు డ్యూటీలు వేయమని చెబుతూ డిజిపి ఆదేశాలతో వారికి పోలీసుశాఖ విధుల నుంచే పూర్తిగా పక్కన పెట్టేశారు. మిగిలిన 17శాఖల ఉద్యోగులకు ఏ తరహా పదోన్నతులు వస్తాయో అధికారులు తెలియజేస్తున్నారు తప్పితే వారికి ఇప్పటి వరకూ ఎగ్గొట్టిన ప్రయోజనాల విషయం మాత్రం ఎక్కడా ప్రస్తావించడం లేదు. ఆ విషయాన్ని వీరికి సర్వీసు రిజిస్టర్ లో కూడా ఎక్కడా పొందు పరచలేదు. అసలు రెండేళ్ల తరువాత రెగ్యులర్ చేయాల్సిన ఉద్యోగాలను, ప్రభుత్వం ఆలస్యంగా రెగ్యులర్ చేయడంతోపాటు, వారికి న్యాయబద్దంగా రావాల్సిన, ఇవ్వాల్సిన ఇంక్రింమెంట్లు ఇవ్వకపోవడంపై సచివాలయ ఉద్యోగుల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. అయితే ఆ నిరసనను కల్పిపుచ్చడానికే పదోన్నతులను తెరపైకి తెచ్చారని ప్రచారం పెద్దఎత్తున జరుగుతుంది.
ప్రభుత్వం ప్రకటించినట్టుగా, చెప్పినట్టుగా, ఉద్యోగుల పక్షాన ప్రేమాభిమానాలు చూపిస్తున్నట్టుగా పదోన్నతులు ఇస్తే.. ఒకేసారి 1.30లక్షల మంది ఉద్యోగుల్లో సర్వీసు రెగ్యులర్ అయిన ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించాలి. అలా కల్పించిన సమయంలో వారికి ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్లను కూడా సర్వీసు రూల్స్ ప్రకారం ఎస్ఆర్ లో నమోదు చేయాలి. ‘‘మొదటి దానికి మొగుడు లేడు.. కడదానికి కళ్యాణం అన్నట్టుగా’..’ముందు ఎగ్గొట్టిన ప్రయోజనాల విషయం తేల్చకుండా.. పదోన్నతుల విషయాన్ని తెరపైకి తీసుకురావడం అంటే ఉద్యోగులను పూర్తిగా మోసం చేయడమేనని ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సాధారణ సెలవురోజుల్లో కూడా ఖాళీగా ఉంచకుండా ప్రభుత్వ విధులు ఇంటి దగ్గర నుంచే చేయిస్తూ.. జూమ్ మిటీంగులు, వివిధ రకాల సర్వేలు నిర్వహిస్తూ పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగుల విషయంలో అధికారులు ఈ విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్ధం కావడం లేదు. ఉద్యోగలకు జీతం 31రోజులకీ కలిపే ఇస్తున్నప్పుడు..ప్రభుత్వం ఎప్పుడు పనిచెబితే అపుడు చేయాలని హుకుం జారీ చేస్తున్న ప్రభుత్వం..సబార్డినేట్ సర్వీసు రూల్స్ ప్రకారం ఉద్యోగులకు ఇవ్వాల్సిన ప్రయోజనాలను ఎందుకు ఎగ్గొట్టిందనే విషయంపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఎనర్జీ అసిస్టెంట్లలో ఇప్పటి వరకూ విధినిర్వహణలో మృతిచెందిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. వారి కుటుంబాల్లో కారుణ్య నియామకాలు కూడా చేపట్టలేదు.
ఇవన్నీ సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి కి తెలిసే సచివాలయ రాష్ట్ర అధికారులు చేస్తున్నారా..? లేదంటే ప్రభుత్వంపై ఆర్ధిక భారం తగ్గించుకునేందుకు విధులు మాత్రం అధికంగా చేయించేసి.. తీరా ప్రయోజనాలు ఇచ్చే సమయానికి మాత్రం ఎక్కడలేని నొప్పులతో అధికారులే వారి సొంత డబ్బులు వీరికి జీతాలుగానూ, ప్రయోజనాలుగానూ ఇస్తున్నట్టు ఫీలైపోతున్నారా అనే విషయం మాత్రం తెలియడం లేదు. దేశం మొత్తం తొంగిచూసే విధంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల శ్రమదోపిడీ చేసి కూడా వారికి న్యాయబద్దంగా..చట్టబద్దంగా ఇవ్వాల్సిన ప్రయోజనాల ఇచ్చేందుకు సాకులు చూపడాన్ని ఏమంటారో ప్రభుత్వమే ఉద్యోగులకు సమాధానం చెప్పాల్సి వుంది. ఉద్యోగులకు ఎన్నడూ లేనివిధంగా పదోన్నతులు ఇస్తున్నామని గర్వంగా చెబుతున్న ప్రభుత్వం ఎగ్గొట్టిన ప్రయోజనాలను ఇస్తుందా..? లేదటే వాటికి ఈ పదోన్నతులను ముడిపెడుతుందా..? లేదంటే ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితిని అంటగడుతుందా..? అదీ కాదంటే ఈ శాఖకు చేయాల్సిన చట్టబద్దత.. వచ్చే ఎన్నికల నాటికి ఉద్యోగులకు ఇవ్వాల్సిన ప్రయోజనాలను ఒక హామీగా దాచుకుంటుందా అనేది కూ డా తేలాల్సి వుంది..గ్రామ, వార్డు సచివాలయశాఖకు ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ, ఒక కమిషనర్, ఇద్దరు డైరెక్టర్లు, జిల్లాల్లో కలెక్టర్లు, మండలాల్లో ఎంపీడీఓలు ప్రత్యేకంగా మానటరింగ్ చేస్తున్నా.. ప్రభుత్వంలో జరిగిన తప్పుని మాత్రం ఎక్కడా ఒప్పుచేసే పనికి పూనుకోవడం లేదు. ఇదే పద్దతి కొనసాగితే దీని ప్రభావం వచ్చే 2024 ఎన్నిల్లో తప్పని సరిగా పడుతుందనే ప్రచారం కూడా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున సాగుతోంది.. విధినిర్వహణ విషయంలో ఆంక్షలు, ఆదేశాలు, టార్టెట్లు పెట్టే ప్రభుత్వం తీరా తమకు రావాల్సిన ప్రయోజనాల విషయంలో ఏం మాట్లాడకుండా ఉండటాన్ని పరిశీలకులు కూడా రక రకాలుగా అంచనాలు వేస్తున్నారు.. ?!