గాలితీసేసిన గ్రామ సచివాలయ ఉద్యోగులు..!


Ens Balu
3529
visakhapatnam
2024-06-05 07:39:40

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ ఘోరంగా ఓడిపోవడానికి ప్రభుత్వశాఖల ఉద్యోగులతోపాటు..  గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వారి కుటుంబాలు అంత్యంత కీలకం అయ్యారంటే నమ్మగలరా.. అదేంటి 1.25లక్షల మందికి రెగ్యులర్ ఉద్యోగాలు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే కదా వచ్చాయి అంటారా.. వచ్చాయి.. కానీ కంచే చేనుని మేసిన చందంగా ప్రభుత్వమే వారిని దారుణాతి దారుణంగా వినియోగించుకొని వారి ప్రభుత్వ శాఖను గాలిలోనే పెట్టేసిన పార్టీకి వాళ్లు కూడా శక్తి వంచన లేకుండా గుణపాఠం చెప్పారు. దేశమంతా తొంగిచూసిన ఏపీ గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులకు జరిగిన దారుణం, పోయిన ప్రాణాలు, ఇంకా రెగ్యులర్ కానీ ఉద్యోగాలు, వారి సర్వీసు నిబంధనలు, ప్రమోషనల్ ఛానల్, కోల్పోయిన ప్రయోజనాలే వారిలో కసిని పెంచి రివర్స్ ఓటింగ్ లో పాల్గొనేలా చేశాయి. విషయాల ధీన గాధ తెలుసుకుంటే వాళ్లు చేసింది నిజమేనని ఈ స్టోరీ చదివాళ్లంతా ఒప్పుకుంటారు.. 

వైఎస్సార్సీపీ ఓటమికి ప్రభుత్వంలోని 75వ ప్రభుత్వశాఖగా పూర్తిస్థాయిలో గుర్తింపు పొందని ఉద్యోగులు ఎవరైనా ఉన్నారా అంటే అది గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులే. రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని 15వేల4 సచివాలయాల్లోని సుమారు 1.30వేల మంది ఉద్యోగులు.. వారికి జరిగిన అన్యాయం ఏంటో సాంకేతికంగా ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులు, ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఈ గ్రామ, వార్డు సచివాలయ శాఖను ఏర్పాటు చేసింది. వారికిచ్చిన నియామక పత్రాల్లోనే రెండేళ్లు సర్వీసు ప్రొబేషన్ అనంతరం మీ ఉద్యోగాలు 2ఏళ్త తరువాత రెగ్యులర్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం కంప్యూటర్ ఎఫిషయన్సీ టెస్టు పేరుతో అదనంగా తొమ్మిది నెలలు కేవలం నెలకు రూ.15వేలతో పనిచేయించుకుంది. ఆ సమయంలోనే కరోనాతో చాలా మంది సచివాలయ ఉద్యోగులు విధి నిర్వహణలోనే ప్రాణాలు వదిలారు. అన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగులు, సిబ్బందికి వర్క్ ఫ్రం హోం ఇచ్చిన ప్రభుత్వం వీరిని మాత్రం వారంలో 7రోజులు ఆదివారాలు కూడా వదలకుండా సేవలు చేయించుకుంది. ఆ సమయంలో చాలా మంది ఉద్యోగులు కరోనా భారిన పడ్డారు. అయినా కూడా ప్రభుత్వం కనికరించలేదు. వీరితో అలానే విధినిర్వహణ చేయించింది. దానిని కొనసాగిస్తూ.. ఇప్పుడు కూడా ఏ ప్రభుత్వ సెలవు వచ్చినా ఆరోజే వీరితో ప్రత్యేకంగా పనులు చేయిస్తూ వస్తోంది. 

ఏ ప్రభుత్వమైనా ఒక ప్రభుత్వశాఖను ఏర్పాటు చేస్తే సదరు ఉద్యోగులకు ఒక క్యాడర్ ని ఏర్పాటు చేస్తుంది. కానీ సచివాల ఉద్యోగులకు మాత్రం ఏ క్యాడర్ లేకుండా చేసింది. వీరు అటెండర్లకు ఎక్కువ, జూనియర్ అసిస్టెంట్లకు తక్కువ. అంతేకాదు మొత్తం 19శాఖల ఉద్యోగాలను ఈ శాఖలో మిళితం చేసిన ప్రభుత్వం అందులో సుమారు 8 నుంచి 10శాఖలకు పైగా సర్వీసు రూల్స్ ని, ప్రమోషనల్ ఛానల్ ని ఏర్పాటు చేయలేదు. అలా చేయకపోతే వీరంతా జీవితాంతం ఇదేశాఖలో ఒకే క్యాడర్ ఉద్యోగంలో పనిచేయాలి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభుత్వంలోని 74 ప్రభుత్వశాఖలకు చట్టబద్దత ఉంది కానీ గ్రామ, వార్డు సచివాలయశాఖకి మాత్రం చట్టబద్దత లేదు. అలా చట్టబద్ధత లేని శాఖలను ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చి..వారికి ఇష్టం లేకపోతే ఉద్యోగాలు తీసేయరు కానా.. ఆ శాఖను రద్దు చేసే అవకాశం వుంటుంది. పైగా ఈశాఖలోని ఉద్యోగులకు పదోన్నతులు రాకుండా చేయడానికి ప్రమోషనల్ ఛానల్ కూడా ఏర్పాటు చేయలేదు. అదేమంటే మాతృశాఖలోని ఉద్యోగులు మాదిరిగా వీరికి కూడా అన్ని వర్తిస్తాయని నోటిమాటగా చెప్పి ఊరుకుంది. ఆ కోపం కూడా ఉద్యోగులను తీవ్రంగా ఆలోచింపజేసి ఎన్నికల్లో రివర్స్ లో ఓటు వేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలా చేసింది.

రెండేళ్ల 9 సంవత్సరాలు తరువాత ఉద్యోగాలను చచ్చీ చెడీ రెగ్యులర్ చేసిన తరువాత. అన్నిశాఖల మాదిరిగా వీరికి కూడా పూర్తిస్థాయి పేస్క.ేలు ఇవ్వాలి వాస్తవంగా అయితే..ఇక్కడే వైఎస్సార్సీపీ ప్రభుత్వం అత్యంత తెలివిగా వ్యవహరించింది. సచివాలయ ఉద్యోగుల సర్వీసును రెగ్యులర్ చేయడానికి కంటే ముందు పేస్కేలు పెరగకుండా ఉండేలా హెచ్ఆర్ఏ,డిఏలను పూర్తిగా కుదించేస్తూ జీఓ జారీ చేసింది. అలా చేయడం ద్వారా ఉద్యోగులకు పెరగాల్సిన పేస్కేలు కుదించుకుపోయింది. రెగ్యులర్ అయిన వెంటనే ప్రొబేషన్ లో సర్వీసు చేసినందకు ఇవ్వాల్సిన రెండు ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వలేదు. అలా కొంత పెరగాల్సిన పేస్కేలు మరోసారి కుదించుకుపోయింది. అవి ఇవ్వకపోగా..అదే సమయంలో ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులతోపాటు సచివాలయ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తున్నామని చెప్పి..రివర్స్ పీర్సీ అంటే..కుదించేసిన మొత్తాన్ని కలుపుతున్నట్టుగా లెక్కలు చూపించింది. అయినా కూడా వీరికి ఇవ్వాల్సిన డిఏ, అరియర్స్ నేటికీ ఇవ్వలేదు. దీనితో పెద్దమొత్తంలో ఉద్యోగులు పేస్కేలు కోల్పోవాల్సి వచ్చింది. అదనంగా పనిచేయించుకున్న 9 నెలల కాలంలో పేస్కేలు, తరువాత లెక్కల్లో జిమ్మిక్కులు చేసి మొత్తానికి ఎసరు పెట్టింది. వాస్తవానికి సచివాలయ ఉద్యోగులు పేస్కేలు, ఇతర ప్రయోజనాలు కలిపి నెలకు సుమారు 38వేల నుంచి 42 వరకూ రావాల్సిన జీతం ఇపుడు కేవలం రూ.28వేల దగ్గరే ఉండి పోయింది. అంటే ఈ రెండున్నరేళ్ల కాలంలో సచివాలయ ఉద్యోగులు ఎంతమేర నష్టపోయారో. ఈ నష్టంతో పీఆర్సీతో వచ్చే ప్రయోజనాలు కూడా వీరు పెద్దమొత్తంలో కోల్పోవాల్సి వచ్చింది. ఆ బాధ ఉద్యోగులతో రివర్స్ లో ఓటు వేయించేలా చేసింది.

ఇక ఎనర్జీ అసిస్టెంట్లు..వీరి మాతృశాఖ విద్యుత్ శాఖ. ఇందులో పనిచేసే ఎనర్జీ అసిస్టెంట్లు వ్యక్తి ప్రాణ రక్షణకు సంబంధించిన ఏ ఒక్క టూల్ కిట్ గానీ, గ్లౌజులు గానీ, సెఫ్టీ హెల్పెట్లుగానీ, బెల్టులుగానీ, ఏమీ ఇవ్వకుండా వీరితో పనిచేయిస్తోంది ప్రభుత్వం. ఫలితంగా రాష్టవ్యాప్తంగా సుమారు 50 మందికి పైనే విధినిర్వహణలో  ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది వికలాంగులై మంచాలకి పరిమితం అయిపోయారు. ఇలా ప్రాణాలు పోయిన ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి ప్రభుత్వం కారుణ్య నియామకాల క్రింద ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ ఈ విభాగంలో పనిచేస్తూ మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాలకి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. వికలాంగలు అయిన వారికి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. వీరికి కూడా ప్రభుత్వం సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ లేర్పాటు చేయలేదు. దానితో వీరి సేవలు కూడా జీవితాంతం సచివాలయంలోనే చేయాల్సి వుంది. రెండు, మూడు ప్రభుత్వశాఖలకు(అగ్రికల్చర్, హార్టికల్చర్, హెల్త్) ప్రమోషనల్ ఛానల్ అమలు చేసి. ఒకటి అరా పదోన్నతులు కల్పించి మిగిలిన శాఖలను వదిలేశారు. ఏఎన్ఎంలకు ఇన్ సర్వీసు ఇచ్చి వారికి జిఎన్ఎం శిక్షణ ఇప్పించారు. అందరూ ఒకేసారి విధుల్లో చేరినా.. కొందరికే పదోన్నతులు, ఇన్ సర్వీసు ప్రయోజనాలు రావడం మిగిలిన సచివాలయ శాఖలోని ఉద్యోగులకు రాకపోవడం, దానికి ప్రభుత్వమే ప్రధాన కారణం కావడంతో ఉద్యోగుల్లోని కోపాన్ని, కసిని మరింత పెంచేశాయి. దీనితో అంతా మూకుమ్మడిగా రివర్స్ లో గుద్దేశారు.

అన్నింటికంటే ముఖ్యమైనది..ప్రజలతోనే నిత్యం సంబంధాలు ఉండే శాఖ పోలీసు శాఖ..ఈ మాతృశాఖ ఆధారంగా నియమించబడ్డ  ఉద్యోగులు మహిళా పోలీసులు ఇపుడు ఏ ప్రభుత్వశాఖకు చెందని ఉద్యోగులగా వీరంతా మిగిలిపోయారు. కారణం సచివాలయ ఉద్యోగాలు భర్తీచేసే సమయంలో వీరిని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నిబంధనలు అమలు చేయకుండా భర్తీ చేశారని విశాఖపట్నం జిల్లాలకు చెందిన కొందరు హైకోర్టుకి కోర్టుకి వెళ్లారు. దీనితో వీరితో పోలీసుశాఖ పనులు ఏమీ చేయించుకోమని..అసలు వీరు పోలీసుశాఖలో ఎలాంటి సంబంధాలు ఉండవని చెప్పి ఏజి నుంచి హైకోర్టుకి పోలీసుశాఖ నుంచి అఫడవిట్ దాఖలు చేసి చేతులు దులిపేసుకున్నారు. వాస్తవానికి గ్రామ, వార్డు సచివాలయశాఖలో మొట్టమొదట సర్వీసు నిబంధనలు, ప్రమోషనల్ ఛానల్ ఏర్పాటు చేసింది మహిళా పోలీసులకే. అదీ కూడా అప్పటి డిజిపి గౌతం సవాంగ్ నేతృత్వంలో పనులన్నీ ఒక విధానంలో చక చకా జరిగిపోయాయి. తరువాత రాష్ట్రంలో డిజిపిలు మారడం వీరిపై అదనంగా మరో రెండు కేసులు కోర్టులలో ఉండటంతో వీరి పదోన్నతులు కూడా నిలిచిపోయాయి.

లేదంటే మహిళా పోలీసు నుంచి సీనియర్ మహిళా పోలీసు, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ, సిఐ వలరకూ వీరికి ప్రమోషనల్ ఛానల్ ఏర్పాటు చేశారు. అదీ ఎందుకు చేశారంటే దిశ మహిళా పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేసి వీరి ద్వారానే సేవలు అందించడానికి. ఇన్నిరకాలుగా ఇబ్బందులు పడిన ఉద్యోగులు అదును చూసి దెబ్బ కొట్టారు. ఉద్యోగం వచ్చినా తమ పిల్లలకు నిద్రా సుఖాలు లేకుండా పోతున్నాయని వారి తల్లిదండ్రులు కూడా రివర్స్ లో గుద్దేశారు.  ఇపుడు అర్ధమైందా సచివాలయ ఉద్యోగులు, వారి కుటుంబాలు ఎందుకు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించినా..కావాలనే తమని నిర్వీర్యం చేయాలని చూసిన వైఎస్సార్సీపీకి ఏ రకంగా రివర్స్ లో ఓటు వేశాయో. ఒక్క ఈ శాఖ ఉద్యగులే ఇలా ఉంటే.. మిగిలిన 74 ప్రభుత్వశాఖల్లోని ఉద్యోగులు, అధికారులు ఏ విధంగా ఆలోచించి వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా పనిచేశారో మీరే అర్ధం చేసుకోవచ్చు..!