గ్రామ సచివాలయశాఖ ఉంటుందా..? ఊడుతుందా..?


Ens Balu
307
visakhapatnam
2024-06-07 04:17:36

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పడబోయే టిడిపి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయశాఖను ఉంచుతుందా..తుంచుతుందా..? అదేంటి ఒక ప్రభుత్వశాఖను అలా ఎలా తీసేస్తా రు అనే అనుమానం రాకమానదు ఎవరికైనా.. ఈ ప్రభుత్వశాఖను తీసేయడానికి కూడా ప్రభుత్వంలో చాలా అవకాశాలే ఉన్నాయి. దానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అలా తమకి అనుకూలంగా మార్చుకొని సచివాలయ ఉద్యోగులను బెదిరించి మరీ పనిచేయించుకోవాలని చూసింది. అనూహ్యంగా ప్రతిపక్షహోదా కూడా లేకుండా ఓడిపోయి ఒక మూలన కూర్చుంది. అదే సమయంలో సచివాలయాలను తాము అధికారంలోకి వస్తే తొలగిస్తామని నాడు టిడిపి నేతలు చెప్పిన మాటలు నేడు వైరల్ అవుతున్నాయి. 1.30 లక్షల మంది ఉద్యోగులను కూడా అనేక అనేక అనుమానాలు వెంటాడేలా చేస్తున్నాయి.  రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటైన దగ్గర నుంచి ఈ శాఖలోని లోటు పాట్లను, అభివృద్ధిని, జరుగుతున్న, జరగబోయే కార్యక్రమాలను ఒక్క ఈఎన్ఎస్-ఈరోజు ద్వారా మాత్రమే తెలియజేస్తున్నాం. ఈ విషయంలో ఏ ఒక్క మీడియా దృష్టిపెట్టలేదని, వాస్తవాలను బయటకు తీయలేదని కూడా దైర్యంగా చెప్పగం. ప్రస్తుత పరిస్థిలో ఈశాఖను తొలగిస్తే వచ్చే అనర్ధాలు, ఉంచితే కలిగే ప్రయోజనాలు, ఒక ప్రభుత్వశాఖను తొలగించడానికి, లేదా ఉంచేయడానికి ప్రభుత్వం వద్ద ఎలాంటి సాంకేతిక, పరిపాలనా పరమైన కారణాలు, అవకాశాలున్నాయో కూడా ఒకసారి తెలుసుకుందాం. !

పునాధులు లేకుండా ఇల్లు కట్టడానికి ఎలాంటి ఇబ్బందులు వస్తాయో..అదేవిధంగా చట్టబద్దత లేదని ప్రభుత్వ శాఖలను కూడా ప్రభుత్వంలో కొనసాగించడానికి, వచ్చే ఇబ్బందులను కోర్టు ద్వారా తట్టుకోవడానికి కూడా సిద్దంగా ఉండాలి. సర్వీసు నిబంధనలు, పదోన్నతుల పూర్తిస్థాయిలో కల్పించని ఉద్యోగులున్న ప్రభుత్వశాఖను ఉంచడానికైనా, తుంచడానికైనా ప్రభుత్వం దగ్గర చాలా అవకాశాలే ఉంటాయి. అయితే ఇక్కడ ప్రభుత్వశాఖను తొలగించడానికి వీలుపడుతుంది కానీ, ఉద్యోగులను మాత్రం తొలగించడానికి అస్సలు కుదరదు. ఖాళీలు ఉన్న ప్రభుత్వశాఖలకు వీరిని అప్పగించేస్తే తప్పా. వైఎస్సార్సీపీ హయాంలో వైఎస్.జగన్మోహనరెడ్డి మానస పుత్రిక గ్రామ, వార్డు సచివాలయశాఖ అని భారీ ఎత్తున ప్రచారం చేసుకున్న ప్రభుత్వం ఈశాఖను ప్రస్తుతం ఉన్న 74 ప్రభుత్వశాఖల మాదిరిగా తీర్చిదిద్దలేకపోయింది. నాలుగేళ్ల కాలంలో కనీసం ఈశాఖలో పనిచేసే చాలా విభాగాల్లోని ఉద్యోగులకు సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ కూడా ఏర్పాటు చేయకుండా ఉద్యోగుల భవిష్యత్తుని గాల్లో పెట్టి.. హైకోర్టులో దాఖలైన కేసులకు అఫడవిట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. దానిపై ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి వాదనలనూ పూర్తిస్థాయిలో వినిపించకుండా ఉద్యోగుల భవిష్యత్తును కూడా అంధకారంలోకి నెట్టేసింది. అదే సమయంలో త్వరలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న టిడిపి కూడా తాము అధికారంలోకి వస్తే ఈ శాఖను తొలగించేస్తామని చెప్పడం కూడా ఇపుడు ఉద్యోగులను ఆందోళన పడేలా చేస్తుంది. 

వాస్తవానికి ఏదైనా ప్రభుత్వశాఖను రద్దు చేయాలంటే దానికి మంత్రిమండలి, గవర్నర్ ఆమోదంతో అసెంబ్లీలో చట్టం చేసి దానిని తొలగించవచ్చు. అదేవిధంగా చట్టం చేయాలన్నా అదే విధానాన్ని అమలు చేయాలి. కానీ ఉద్యోగులను తొలగించడానికి వీలుపడదు. అదే సాంకేతిక కారణాన్ని వినియోగించుకున్న నాటి ప్రభుత్వం ఉద్యోగుల భవిష్యత్తుని గాల్లోనే ఉంచేసి.. ఈ గ్రామ, వార్డు సచివాలయ శాఖకు చట్టబద్దత లేకుండా చేసింది. ప్రస్తుత్తం ఈ శాఖను తొలగించి ఉద్యోగులను మాతృ శాఖలకుతరలించాల న్నా సేవలన్నీ ఇపుడు సచివాలయాలతోనే ముడిపడి ఉన్నాయి. ఈశాఖను రద్దుచేస్తే ప్రభుత్వం చాలా ఇబ్బందుల్లో పడుతుంది. అలాగని సిబ్బందిని వారి శాఖలు పంపి పనిచేయించాలన్నా ఒక శాఖ పనులు మాత్రమే అపుడు ఉద్యోగులు చేస్తారు. అదే సచివాలయాల్లో అయితే అన్నిశాఖల సిబ్బంది అన్నిశాఖల పనులూ చేస్తారు. ఇక్కడ ఒక్క మహిళా పోలీసు పోస్టులపై కోర్టులో అఫడిట్ దాఖలైన నేపథ్యంలో వీరిని త్వరలో భారీగా ఏర్పడే పంచాయతీ కార్యదర్శి కార్యదర్శి పోస్టులకు స్లైడింగ్ ఇస్తే ప్రభుత్వంపై భారం పడకుండా ఉంటుందని గతప్రభుత్వమే ఆలోచన చేసింది. కానీ అమలు చేయలేదు. ఎందుకంటే వీరంతా డిగ్రీ అర్హతతో నాలుగు కెటగిరీ పోస్టులకు ఒకే పోటీ పరీక్ష రాసి వచ్చారు. అలాగని వీరిని మహిళా పోలీసులుగా పోలీసుశాఖలోనే ఉంచేస్తే వీరి ప్రభుత్వశాఖ ఏదో తెలియని ఉద్యోగులగానే ఉండిపోతారు. సర్వీసు మొత్తం సచివాలయాలకే పరిమితం అయిపోతారు.

ఇపుడు కొత్తగా ఏర్పాటు కాబోయే ప్రభుత్వం ముందు అవకాశం ఒక్కటే సచివాలయశాఖలోని ఖాళీలను భర్తీచేయడంతోపాటు, అర్హత ఉన్న ఉద్యోగులకు స్టైడింగ్ విధానం ద్వారా ఆప్షన్లు ఇస్తే త్వరలో భారీగా ఏర్పడే ఖాళీలను భర్తీచేసే పనుండదు. ప్రభుత్వంపై ఆర్దిక భారం పడదు. అదే సమయంలో కోర్టులో దాఖలైన కేసులకు కూడా ఒక లేఖ రాసి పూర్తిగా వాటిని కొట్టించేయడానికి ఆస్కారం వుంటుంది. మహిళా పోలీసులు, వీఆర్వోలు తదితరులపై పడ్డ  కోర్టు కేసులకు విముక్తి కలుగుతుంది. 

సచివాలయశాఖ ఏర్పాటు వెనుక దారుణమైన ఆలోచన 
రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటుతో ఇంటిముంగిటే సేవలు అందిస్తున్నామని చెప్పిన నాటి ప్రభుత్వం దారుణమైన ఆలోచన చేసి మాత్రమే ఈ శాఖను ఏర్పాటు చేసిందనే కారణాలు, అనుమానాలు ఇపుడు తెరపైకి వస్తున్నాయి. ఉద్యోగులను పూర్తిస్థాయిలో సెలవుల్లో కూడా వాడేసుకున్న గత ప్రభుత్వం వీరికి చట్టబద్ధంగా కల్పించాల్సిన ప్రయోజనాలు కల్పించకుండా అత్యంత దారుణంగా మోసం చేసింది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 14 వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమారు 1.30లక్షల మంది ఉద్యోగులు అత్యం దారుణంగా ప్రయోజనాలు నష్టపోయారు.  సుమారు 19 విభాగాలతో ఏర్పాటైన ఈశాఖలోని ఉద్యోగులు అన్నిశాఖల పనులూ చేయాల్సి వుంటుంది. సాధారణంగా అయితే ఏ ప్రభుత్వశాఖ ఉద్యోగులు ఆ శాఖ యొక్క పనులు, విధులు మాత్రమే చేస్తారు. కానీ ఈశాఖలోని ఉద్యోగులు మాత్రం అన్నిశాఖల పనులూ చేయాల్సి వచ్చింది. ఏ శాఖ ఉద్యోగి ఖాళీ ఉంటే ఆ శాఖ ఉద్యోగి సదరు సచివాలయంలో ఉన్న ఇతర ఉద్యోగులు పనిచేయాల్సి వుంటుంది. అంతేకాదు ఈ శాఖ ఏర్పాటు తర్వాత అన్నిశాఖలను ఈ శాఖకు అనుసంధానించి, ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాలను పూర్తిగా నిలిపివేయడంలో పై చేయి సాధించింది. ఉదాహరణకు తీసుకుంటే ఎడ్యుకేషన్ అండ్ వెల్పేర్ అసిస్టెంట్లు..వీరి మాత్రుశాఖ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్. కానీ వీరి విధులు విద్య, బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీశాఖలకు సంబంధించిన సంక్షేమశాఖల పనులన్నీ చేయాలి.

అంటే వీరి నియామకం వలన 5 ప్రభుత్వశాఖల్లో నియామకాలకు గండి పడిపోయింది. ఇక ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వీరి మాతృశాఖ పంచాయతీరాజ్..  వీరి నియామకంతో ఆర్అండ్బీ, హౌసింగ్, పంచాయతీరాజ్ శాఖల్లోని పనులన్నీ వీరే చేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ మూడు శాఖల్లో ఉద్యోగాలకు అడ్డుకట్టపడిపోయింది. తరువాత మహిళా పోలీసులు వీరి మాతృశాఖ హోంశాఖ.. కానీ వీరు ఐసీడిఎస్, పోలీసు, రెవిన్యూలోని(బిఎల్వో), కార్యాలయంలోని  శాఖకు సంబంధించిన పనులు, విధులు, కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ సేవలు చేయాలి. అంటే ఇక్కడ 3 ప్రభుత్వశాఖల ఉద్యోగాల్లో కోత పడిపోయింది. డిజిటల్ అసిస్టెంట్లు(గ్రేడ్-5పంచాయతకార్యదర్శిలు) వీరి మాతృశాఖ పంచాయతీరాజ్, వీరైతే మరీ దారుణం వీరు అన్ని ప్రభుత్వశాఖలకు చెందిన డేటాను మొత్తం వీరేచేయాల్సి వుంటుంది. వీరి నియమాకం వలన జూనియర్ అసిస్టెంట్, డేటా అసిస్టెంట్ పోస్టుకు మంగళం పాడేశారు. సుమారు మూడు విభాగాల్లో పోస్టులకు కోత.  అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరీకల్చర్ అసిస్టెంట్ పోస్టులు..వీరి మాతృశాఖ వ్యవసాయశాఖ వీరి నియామకాల వలన నేరుగా నియామకాలు జరిగే ఎక్సటెన్షన్ ఆఫీసర్ల పోస్టులు కనుమరుగైపోయాయి. ఆపోస్టులనే ఇపుడు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతుల పేరుతో ఇస్తున్నారు. అక్కొ ఒక కేటగిరీ పోస్టు రద్దైపోయింది.ఇక ఫిషరీష్ అసిస్టెంట్లు, యానిమల్ హజ్బండరీ అసిస్టెంట్లు.. ఇక్కడ కూడా ఒక్కో కేటగిరీ పోస్టులు కనుమరుగైపోయాయి.. ఇక్కడ కూడా అలా పోయిన పోస్టులను పదోన్నతుల పేరుతో వీరికే ఇస్తున్నారు. హెల్త్ సెక్రటరీ పేరుతో ఏఎన్ఎంలను నియమించారు.

వారి వలన గ్రామల్లో నియమించాల్సిన హెల్త్ అసిస్టెంట్ల నియామకాలు రద్దైపోయాయి. కానీ వీరికి ఇన్ సర్వీసు జిఎన్ఎం శిక్షణ ఇచ్చి వారిని జిఎన్ఎంలుగా మార్చారు. అలా చేయడం వలనే నేరుగా తీసే జిఎన్ఎం పోస్టులు రద్దు అయిపోయాయి.  ఏఎన్ఎంలకే శిక్షణ ఇచ్చి వారితో సేవలు చేయిస్తూ.. జిఎన్ఎం పోస్టులు భర్తీచేసినట్టు లెక్కల్లో చూపిస్తున్నారు. ఏఎన్ఎంలు ఉన్నట్టుగా చూపిస్తున్నారు. ఇక ఎనర్జీ అసిస్టెంట్లు వీరి మాతృశాఖ విద్యుత్ శాఖ.. వీరి నియామకాల వలన నేరుగా తీసే లైన్ మెన్ పోస్టులు భర్తీకి కనుమరుగైపోయింది. వీరికే పదోన్నతులు కల్పించి లైన్ మేన్ లను చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అలా ఇక్కడ కూడా ఒక కేడర్ నియామకాలు పోయాయి. ఒక్క సచివాలయశాఖ ఏర్పాటుతో చాలా వరకూ పనులు చేయించేయడంతో..ఇతర ప్రభుత్వశాఖల్లోని నాల్గవర తరగతి ఉద్యోగాల, ఇతర కేటగిరీ ఉద్యోగాలు తీసే అవకాశం లేకుండా చేశారు. ఇలా ప్రభుత్వంపై ఆర్ధిక భారం పడకుండా వక్రమార్గంలో ఆలోచన చేసిన నియామకాలు చేపట్టి కూడా ఈ ప్రభుత్వశాఖకు చట్టబద్దత లేకుండా చేసి ఉద్యోగుల్లో ఒక భయాన్ని మాత్రం అలాగే వదిలేసింది. కొన్ని విభాగాలనే సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ చార్ట్ ఏర్పాటు చేసిన మిగిలిన శాఖల ఉద్యోగులకు ఏర్పాటు చేయలేదు. దానికి కూడా కారణం ఉంది. ఒకేసారి ఇక్కడ నియమించిన ఉద్యోగులకు ఇతర ప్రభుత్వశాఖల మాదిరిగా సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేస్తే..వాళ్లంతా ఏడేళ్ల తరువాత వారి వారి మాతృశాఖల్లోకి పదోన్నతులపై వెళ్లిపోతారు. మళ్లీ కొత్తగా నియామకాలు చేయాల్సి 
వుంటుంది.

అదే నియామకాలు చేసిన తరువాత తాత్సారం చేస్తే కనీసం వారినే ఒక పదేళ్ల పాటు ఒకే శాఖలో ఎలాంటి పదోన్నతులు లేకుండా భయపెడుతూ ఉంచేయవచ్చుననది నాటి ప్రభుత్వ కుటిల బుద్ధి. అయితే నాటి ప్రభుత్వ తేడా ఆలోచనను గ్రహించిన ఉద్యోగులు వారి కుటుంబాలు ఓటుతోనే బుద్ధి చెప్పారు.సచివాలయాలు రద్దైతై ప్రభుత్వం తీవ్ర ఇబ్బందుల్లో పడుతుంది. త్వరలో చాలా ప్రభుత్వశాఖల్లో అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తు ఉద్యోగ విరమణలు చేయనున్నారు. అలాంటి సమయంలో ఈశాఖను రద్దుచేస్తే సంక్షేమ పథకాల అమలు గ్రామ స్థాయిలో నిలిచిపోతుంది. అలాగని ఇక్కడి ఉద్యోగులకు గత ప్రభుత్వం తమ చెప్పుచేతల్లో పెట్టుకోవడం కోసం సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఏర్పాటుచేయకుండా వదిలేసింది. దాని కోసం ప్రభుత్వం పరిపాలన పరమైన అనుమతులు, ఉత్తర్వులు ఇచ్చి ఇపుడు ఉద్యోగులకు కల్పించాల్సి వుంటుంది. అంతేకాదు సత్వరమే గ్రామ, వార్డు సచివాలయశాఖకు చట్టబద్దత కూడా కల్పించాలి. కోర్టుకేసుల విషయంలోనూ ఉద్యోగుల భవిష్యత్తు కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి వుంటుంది. ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు వివిధ కారణాలతో ఇక్కడ ఉద్యోగాలు వదిలేసి వెళ్లిపోయారు. కొన్ని ఉద్యోగాలు భర్తీ కాలేదు. వాటిని ప్రభుత్వం భర్తీచేసేస్తే చాలా కాలం వరకూ ఈ ప్రభుత్వంపై చాలా శాఖల్లో కొత్తగా ఉద్యోగాలు తీసే అశకాశం ఉండదు. సచివాలయ ఉద్యోగులకు, ఈ శాఖకు చట్టబద్దత తీసుకురావడం, మిగులు ఉద్యోగాలను భర్తీ చేయడం ద్వారా  గ్రామ, వార్డు స్థాయిలో ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందుతాయి. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కూడా లభిస్తుంది. ఈ విషయంలో త్వరలో ఏర్పాటయ్యే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి వుంటుంది. త్వరలో ఏర్పాటు కాబోయే ప్రభుత్వం సచివాలయశాఖ, ఉద్యగోల విషయంలో ఏం చేస్తుందనేది వేచి చూడాలి మరి..?!