వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తీవ్ర అన్యాయానికి, మోసానికి గురైన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు.. ఇపుడు కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నారు. అందునా ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత మహిళ కావాడం, సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ పై మంచి పట్టుఉండటం.. సచివాలయశాఖలో మహిళాపోలీసులే అన్యాయం అయిపోవడం, వారి సమస్యల పరిష్కారానికి హోం మంత్రి మాత్రమే తమ భవితకు భరోసా అని రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని 14వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల్లోని సుమారు 12వేలకు పైగా మహిళా పోలీసులు నమ్మకం పెట్టుకున్నారు. హోం మంత్రిగా ఆమె బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి సచివాలయ శాఖలో తమకు జరిగిన అన్యాయంపై వినతిపత్రాలు సమర్పిస్తూ వస్తున్నారు. గత ప్రభుత్వంలో ఒక ప్రభుత్వశాఖను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆ శాఖకు తలా తోకా లేకుండా చేసిందని, కనీసం ప్రభుత్వశాఖకు ఐదేళ్ల కాలంలో చట్టబద్ధత కూడా తీసుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం తమ మహిళా పోలీసు ఉద్యోగాలపై హైకోర్టులో కేసులు ఉండటంతో గత ప్రభుత్వ హయాంలో పోలీసుశాఖ ద్వారానే మహిళా పోలీసులు పోలీసు సిబ్బంది కాదని ఏజితో అఫడిట్ దాఖలు చేసి చేతులు దులిపేసుకుందని వాపోతున్నారు. ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలు చేపకట్టకపోగా మహిళా పోలీసులందరినీ గాల్లోనే ఉంచి.. సచివాలయాల్లో ఖాళీగాఉన్న ప్రభుత్వశాఖల సిబ్బంది పనులన్నీ చేయించదని కన్నీరు మున్నీరవుతున్నారు. దేశంలో ఎక్కడైనా ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఆయా రాష్ట్రప్రభుత్వాలు చాలా జాగ్రత్తలు తీసుకుంటాయని.. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే.. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో అత్యంత నిర్లక్ష్య దోరణి గత ప్రభుత్వం ప్రదర్శించిందని చెబుతున్నారు. గత ప్రభుత్వ చర్యల కారణంగా సచివాలయ ఉద్యోగులంతా ప్రభుత్వ ప్రయోజనాలు కోల్పోవాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయోజనాలు కోల్పోయినా.. కనీసం ఉద్యోగమైనా నిలుస్తుందా అంటే ఇపుడు సదరు శాఖకు చట్టబద్దత లేకపోవడం, తమ ఉద్యోగులపై కోర్టుల్లో కేసులు నమోదు కావడం.. దానికి ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేసి ఉద్యోగులను కేసుల నుంచి రక్షించడం వంటివి గత ప్రభుత్వం కనీసం చేపట్టలేకపోయిందని వాపోతున్నారు. ప్రస్తుతం హోం మంత్రిగా అనిత బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి హోంశాఖ ఉద్యోగులుగా విధుల్లోకి చేరిన మహిళా పోలీసుల ప్రధాన సమస్యను ఆమె దృష్టికి తీసుకు వెళ్లడం.. అదే సమయంలో ప్రభుత్వం కూడా వీరిని ఇదే పోలీసుశాఖలో మహిళా పోలీసులను క్లరికల్ విభాగంలోకి తీసుకోవాలని యోచన చేయడం.. ఇంజనీరింగ్ చదివిన వారిని సైబర్ క్రైమ్ విభాగంలో వినియోగించుకోవాలని చూడటం.. కార్యాలయాల్లో కూడా మినిస్టీరియల్ సిబ్బంది కొరత అధికంగా ఉండటంతో ఆ ఖాళీల్లో వీరిని వినియోగించుకోవాలని పోలీసు అధికారులు మంత్రి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం వంటి వార్తలొస్తున్నాయి.
మరో వైపు ఉద్యోగులు ఎప్పటినుంచో అడుగుతున్నట్టుగా .. తాము నాలుగు పోస్టులకి పోటీ పరీక్ష రాసి మహిళా పోలీసు ఉద్యోగాలకి ఎంపిక అయ్యామని.. కనీసం ఖాళీగా ఉన్న మిగిలిన నాలుగు విభాగాల పోస్టుల్లోకి అయినాత తమను తీసుకోవాలని మహిళా పోలీసులు స్లైడింగ్ ఆప్షన్ అడుగుతున్నారు. ఇదిలా ఉండగా మరో ఏడాదిలో పెద్ద ఎత్తు పంచాయతీ కార్యదర్శిలు ఉద్యోగవిరమణలు చేస్తున్నతరుణంలో మరిన్ని ఖాళీలు రాష్ట్రంలో ఏర్పడనున్నాయి. ఇప్పటికే ఒక్కో పంచాయతీ కార్యదర్శి మూడు నాలుగు పంచాయతీలకు ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. కనీసం మహిళా పోలీసుల ఖాళీ అయిన పంచాయతీ కార్యదర్శి పోస్టులకు స్టైడింగ్ ఇచ్చినా ప్రభుత్వానికి కొత్తగా మళ్లీ ఉద్యోగాలు భర్తీచేసే ఆర్ధిక భారం తప్పుతుంది. ఖాళీగా ఉంటే విభాగాల్లో సిబ్బందిని కూడా నియమించినట్టు అవుతుంది. ఆ దిశగా కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని సమాచారం. అయితే ఇవన్నీ ఊహాగానాలు.. కొందరు అధికారులు అనధికారికంగా చెప్పడం తప్పితే నేటికీ కార్యరూపం దాల్చలేదు. ప్రభుత్వం ప్రస్తుతం 74 ప్రభుత్వశాఖల్లోని నాల్గవ తరగతి ఉద్యోగుల దగ్గర నుంచి గ్రూప్-1, 2, 4, కేటగిరీల వారీగా ఖాళీలు వివరాలు సేకరిస్తోంది.. జాబితా వస్తే ఇతర ప్రభుత్వశాఖల్లోకి జూనియర్ అసిస్టెంట్లుగానైనా స్లైడింగ్ ఇచ్చి పంపుతారనే ఆలోచన కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నట్టుగా సమాచారం అందుతోంది.
గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులు నష్టపోయిన ప్రయోజనాలు, గతప్రభుత్వ చర్యలు ఏంటో ఒక్కసారి తెలుసుకుంటే..
-గ్రామ, వార్డు సచివాలయశాఖకు చట్టబద్దత కల్పించకపోవడం, ఉద్యోగులకు సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయకపోవడం
-సచివాలయ మహిళా పోలీసులను పోలీసుశాఖకు చెందిన ఉద్యోగులు కాదని డిజిపి కార్యాలయం నుంచే కోర్టుకి అఫడవిట్ దాఖలు చేయడం
-రెండేళ్ల తరువాత చేస్తామన్న ప్రొభేషన్ డిక్లరేషన్ 9నెలలు అనంతం చేసి..ఆ 9నెలలు ఫుల్ పేస్కేలు సచివాలయ ఉద్యోగులకు రాకుండా చేయడం
-ప్రొబేషన్ పూర్తయిన సచివాలయ ఉద్యోగులకు రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వకపోవడం, వాటి గురించి కనీసం ప్రస్తావించకపోవడం
-సర్వీసు ప్రొబేషన్ పూర్తయ్యే నాటికి ప్రభుత్వ ప్రయోజనాలు ఇవ్వాల్సి వస్తుందని..ప్రొబేషన్ ఖరారుకి ముందు డిఏలు, హెచ్ఆర్ఏ కుదించేయడం
-సచివాలయ ఉద్యోగులతోనే ఖాళీగా ఉన్న విభాగాల సిబ్బంది విధులు చేయించడం, ఒక్కో సచివాలయ కార్యదర్శికి కనీసం 4 పంచాయతీలు అప్పగించడం
-ఉద్యోగుల సర్వీసు పూర్తయి మొదటి పదోన్నతికి దగ్గర పడినా సర్వీసు నిబంధనల ప్రకారం ఏ తరహా పదోన్నతి ఇస్తారో ఉద్యోగులకు చెప్పకపోవడం
-కొన్నిశాఖల సిబ్బందికే ఇన్ సర్వీసు శిక్షణ అమలు చేసి, మళ్లీ అదే జీతానికి సచివాలయశాఖలోనే పనులు అప్పగించడం(ఏఎన్ఎంలు)
- మహిళా పోలీసులకే అదనంగా బిఎల్వో విధులు అప్పగించి వారి సొంత ఖర్చులతోనే స్టేషనరీ కొనుగోలు చేయించి నేటికి బిల్లులు చెల్లించకపోవడం
-గత నాలుగేళ్లుగా బిఎల్వో విధులు నిర్వహించిన మహిళా పోలీసులకు తహశీల్దార్ కార్యాలయాల్లో అదనపు విధుల బిల్లులు పెట్టకపోవడం
-పీఆర్సీని ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు మాదిరిగా పూర్తిస్థాయిలో సచివాలయ ఉద్యోగులకు అమలు చేయకపోవడం, అరియర్స్ ఇవ్వకపోవడం
-మహిళా పోలీసుల సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ప్రకారం వీరికి 5 దశల్లో సిఐ వరకూ పదోన్నతులుగా చూపిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం
-ఆచరణలో మాత్రం అన్నిశాఖల కంటే ముందుగా ఒక్క పోలీసుశాఖ ద్వారా విధుల్లోకి చేరిన మహిళా పోలీసులనే గాల్లోనే ఉంచేసిన గత ప్రభుత్వం
-మొదటి పదోన్నతి దగ్గరపడినా..మహిళాపోలీసులకు ప్రభుత్వశాఖను కేటాయించకపోవడం, వారిపై కోర్టు కేసులకు శాఖాపరంగా సమాధానం చెప్పకపోవడం
-గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా చాలా మంది సచివాలయ ఉద్యోగులు విధులకు స్వచ్చందంగా రాజీనామాలు చేసి వేరే శాఖలకు వెళ్లిపోవడం
-ఏ ప్రభుత్వంలోనూ లేని విధంగా ఒక శాఖ ఉద్యోగి నాలుగైదుశాఖలకు చెందిన విధులు ఒక్క సచివాలయాల్లోనే సెలవురోజుల్లో కూడా పనిచేయడం