ఆంధ్రప్రదేశ్ పై కేంద్రం సవతి ప్రేమ..?! కొత్త జిల్లాలకి రాష్ట్రపతి ఆమోద ముద్ర కలేనా..?


Ens Balu
206
Visakhapatnam
2025-05-09 20:14:29

విభజన ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం ఇంకా నాన్చుడు వ్యవహారాన్నే అవలంభిస్తూ.. సవతి ప్రేమను మాత్రమే చూపిస్తోంది.. రాష్ట్రం విడిపోయి పదేళ్లు దాటిపోయినా ఇంకా నేటికీ విభజన హామీలు నెరవేర్చలేదు. కనీసం ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటైన 13 కొత్త జిల్లాలను కూడా కేంద్ర జాబితాలోకి చేర్చలేదు. ముక్కుతూ, మూలుగుతూ మొన్న జన, కులగణన చేస్తామని ప్రకటించింది కేంద్రం. వాస్తవానికి విభజన హామీలన్నీ పదేళ్లలోగానే పూర్తిచేయాలన్నది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్నారు.  కానీ అలా చేయలేదు.. ఫలితంగా ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన చాలా విలువైన ఆస్తులు, కార్యాలయాలు, ప్రభుత్వ కర్మాగారాలు తెలంగాణలోనే ఉండిపోయాయి. అంతేకాదు.. కొత్తగా ఏర్పాటైన 13 జిల్లాలకు ఇంకా చట్టబద్దత ఇవ్వలేదు ఫలితంగా కేంద్రప్రభుత్వం దృష్టిలో ఉన్నది ఉమ్మడి 13 జిల్లాలుగా మిగిలిపోయాయి... మాట్లాడితే కూటమి ప్రభుత్వం అని ప్రకటనలు గుప్పిస్తున్న కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కొత్తజిల్లాల విషయంలో మాత్రం ఇంకా సవతి ప్రేమనే అవలంభిస్తున్నా ఆంధ్రప్రదేశ్ నుంచి అడిగే నాధుడే కరువయ్యాడు..?!

కేంద్ర జాబితా పరిధిలోకి వచ్చేవిధంగా చట్టం చేయాలని..దానిని కేంద్రానికి పంపించాలని ఆంధ్రప్రదేశ్ కేబినెట్ రాజధాని అమరావతి కోసం పడుతున్న తపన.. విభజన ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం చేయాల్సిన పనుల మీద పెట్టడం లేదని.. వీళ్లు ఎలాగూ అడగరని కేంద్రం కూడా తాత్సారం చేస్తూ వస్తున్నది. వాస్తవానికి కొత్త జిల్లాల ఏర్పాటు, మండలాలు, జిల్లా పరిషత్ లు అన్నీ కేంద్ర జాబితా పరిధిలోకి వస్తాయి. అంటే కేంద్ర క్యాబినెట్ లో ఆమోదం తెలిపి, రెండు సభల్లోనూ బిల్లు పాసైన తరువాత రాష్ట్రపతి ఆమోదంతో చట్టబద్ధత తీసుకు వస్తారు. తద్వారా కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు అఖిల భారత స్థాయి అధికారులు, కేంద్ర కార్యాలయాలు, జిల్లా పరిషత్ లు, కొత్త పంచాయతీలు, మండలాలు ఏర్పాటుకి అవకాశం వుంటుంది. ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలు 26 జిల్లాలుగా మారి ఐదేళ్లు దాటుతున్నా ఇంకా కేంద్రం కొత్త జిల్లాలకు చట్టబద్దత కల్పించలేదు. దానితో జిల్లాలను విభజన చేసిన రాష్ట్రప్రభుత్వమే మా రాష్ట్రంలో 26 జిల్లాలు ఉన్నాయని చెప్పుకుంటోంది. 

ఇదంతా ఉత్తుత్తిదే అని అధికారికంగా చెప్పడానికి ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు, నియామకాలన్నీ కూడా ఉమ్మడి 13 జిల్లాలు ప్రాతిపదికన మాత్రమే చేస్తున్నది. అలాంటపుడు కొత్త జిల్లాలకు చట్టబద్దత వచ్చినట్టా..? రానట్టా..? రానప్పుడు 26 జిల్లాలు విభజన చేసుకొని రాష్ట్రప్రభుత్వం ఏం చేస్తున్నట్టు..? అంటే.. ప్రక్కరాష్ట్రం తెలంగాణలో 32 జిల్లాలు ఉన్నప్పుడు కనీసం మనకి 26 జిల్లాలు అయినా లేకపోతే ఎలా అనుకున్న గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చింది. అధికారంలో ఉండగా కేంద్రం నుంచి చట్టబద్ధత సాధించలేకపోయింది. పోనీ కూటమిలో ఉన్న ఇప్పటి ప్రభుత్వం అయినా చట్టబద్దత కోసం అడుగుతుందా..? అదీ లేదు. ఫలితంగా  కేంద్రం ఏర్పాటుచేయాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ దక్షణాది రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. కనీసం ప్రాజెక్టులు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఆందోళన చేయగా... చేయగా వచ్చిన విశాఖ రైల్వే జోన్ కి అతీగతీ లేదు అది ఎప్పుడు పూర్తవుతుంతో తెలీదు. మరెప్పుడు ప్రారంభం అవుతుందో కూడా తెలియని పరిస్థితి. 

ఇక్కడ విశాఖకు రైల్వే జోన్ ఇచ్చి.. ఇదే విశాఖ నుంచి కేంద్రప్రభుత్వ సంస్థ  స్టీల్  ప్లాంట్ ను ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నది కేంద్రం. దీనిపై కూటమిలో ఉన్నందుకు నోరెత్తడం లేదు రాష్ట్ర ఎంపీలు. అసలు ఆంధ్రప్రదేశ్ లోని ఎంపీలకు రాష్ట్రంలోని కొత్త జిల్లాలకి చట్టబద్ధత రావాలంటే కేంద్రం, రాష్ట్రపతి ఆమోద ముద్ర ఉండాలని విషయం తెలుసో తెలియదోననే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. మన ఎంపీలు అడగలేకపోవడం, రాష్ట్రప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన కొత్తజిల్లాలు ఏర్పాటు అయినా ఇంకా కొత్త జిల్లాలకి కేంద్రం ఇచ్చే నిధులు ప్రయోజనాలు తెచ్చుకోలేకపోతున్నది రాష్ట్రప్రభుత్వం.  మాట్లాడితే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి అన్ని విధాలా సహకారం అందిస్తుందని ప్రకటించే కేంద్రం ఒక చిన్న అంశాన్ని కొత్త జిల్లాలు, నియోజకవర్గాల పునర్విభజన విషయాన్ని ఎందుకు రాష్ట్రపతి ఆమోద ముద్రకు పంపలేదు అంటే.. ఆ ఒక్కటీ అడక్కు అనే సమాధానం మాత్రమే వస్తున్నది. కేంద్రానికి ఆమాత్రం తెలియదా..? రాష్ట్రానికి అన్నీ చేయాలని.. కాకపోతే ముందు రాజధాని పూర్తయిపోయితే తరువాత విభజన జిల్లా అంశం, కొత్త నియోజకవర్గాల విషయం, కొత్త జిల్లా పరిషత్తులు, మండలాల విషయం తేల్చుకోవచ్చు అన్నట్టుగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అవలంభించిన విధానం కంటే కూటమి ప్రభుత్వం మరింతగా నాన్చుడు వ్యవహారం చేస్తున్నది.

-కొత్తజిల్లాల్లో నేటికీ అద్దె కార్యాలయాలు.. అరకొర అధికారులే
రాష్ట్రప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చినా నేటికీ ఐదేళ్లుగా అద్దె కార్యాలయాలు, అరకొర జిల్లా అధికారులతోనే కాలం నెట్టుకొస్తున్నది. దానికితోడు గత ప్రభుత్వం పెంచిన రెండేళ్ల ఉద్యోగ విరమణ వయస్సు పూర్తవడంతో రాష్ట్ర వ్యాప్తంగా 75 ప్రభుత్వ శాఖల్లో వేలాదిగా ఉద్యోగులు, అధికారులు రిటైర్ అయిపోతున్నారు. అసలే అరకొర సిబ్బంది, అధికారులతోనే కాలం వెల్లదీస్తున్న కొత్త జిల్లాలకు మూలిగే నక్కపై తాడిపండు పడ్డ చందాన మరింత సిబ్బంది, అధికారుల కొరత వచ్చి పడింది. అంతేకాదు కొత్త జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు అందరూ కూడా ఉమ్మడి జిల్లాల్లో జేసి క్యాడర్, ఏఎస్పీ క్యాడర్ ఉన్నవారే. అదే రీతిన కొత్త జిల్లాల్లో కూడా కలెక్టర్లను జూనియర్లనే నియమిస్తున్నది రాష్ట్రప్రభుత్వం. ఉమ్మడి జిల్లాల్లో మాత్రం సాధారణ బదిలీల్లో వచ్చే సీనియర్లను నియమిస్తున్నది  ఈ కారణంగా అటు అఖిల భారతస్థాయి అధికారులు కూడా ఆంధ్రప్రదేశ్ లో పనిచేయడానికి అందునా ఎలాంటి వసతి సౌకర్యాలు లేని కొత్త జిల్లాల్లో పనిచేయడానికి ఇష్టం చూపించడం లేదు. 

ఈ విషయం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకి తెలిసినా.. ఎందుకులే అన్నట్టుగా వదిలేస్తున్నది తప్పితే ప్రధాన సమస్యను తీర్చే విషయంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. కొత్త జిల్లాల్లో పనిచేసే కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు నేటికీ అద్దె కార్యాలయాలు, అద్దె ఇళ్లల్లోనే ఉంటున్నారంటే అతిశయోక్తి కాదు. గత ప్రభుత్వం ఆగమేఘాలపై కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు, అఖిలభారత స్థాయి అధికారులకు క్యాంపు కార్యాలయాలు కట్టించేస్తామని హడావిడి  చేసి భూ సేకరణ చేసినా.. అది ఒక్క అంగుళం కూడా ముందుకెళ్లలేదు. అలాగని కూటమి ప్రభుత్వమైనా చేపడుతుందా అంటే.. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏం చేయడానికైనా రాష్ట్రప్రభుత్వం దగ్గర నిధులు లేవనే పాటనే పాడుతోంది రాష్ట్రప్రభుత్వం. కానీ రాష్ట్ర రాజధాని విషయంలో మాత్రం క్యాబినెట్ లో తీర్మానాలు చేసి కేంద్ర జాబితాకి చట్టసవరణ చేసి పంపాలనే విషయాన్ని ప్రత్యేకంగా ఉటంకించింది రాష్ట్రప్రభుత్వం. 

అదే విషయం కొత్త జిల్లాలు, అఖిల భారత స్థాయి అధికారులు కార్యాలయాలు, క్యాంపు ఆఫీసులు, ప్రభుత్వశాఖలకు కొత్త భవనాలు, ఉద్యోగులు, జిల్లా పరిషత్తులు, డివిజనల్ కార్యాలయాల కోసం ఎందుకు ఆలోచించలేదో అర్ధం కాని పరిస్థితి. గత ప్రభుత్వం నాన్చిన నాన్చుడకంటే దారుణంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వంలో కూడా కొత్తగా ఏర్పడ్డ 13 జిల్లాలకు చట్టబద్ధత, విభజన హామీల్లో ముఖ్యమైన నియోజకవర్గాల పునర్విభజన, జిల్లా పరిషత్తుల ఏర్పాటు జరగుతుందంటే ఖచ్చితంగా లేదనే చెబుతున్నారు విశ్లేషకులు. చూడాలి.. కనీసం జన, కుల గణన తరువాతనైనా కేంద్రం తన సవతి ప్రమ కాకుండా రాష్ట్రంలోని కొత్తజిల్లాలకు చట్టబద్ధత, నియోజవకర్గాల పునర్విభజన, కొత్త జిల్లా పరిషత్తులు, గ్రామ పంచాయతీలు, అఖిత భారత స్థాయి అధికారుల కేటాయింపు, వారికి వసతి కోసం నిధులు విడుదల చేస్తుందా..? రాష్ట్రప్రభుత్వం ఆ విధంగా  ఏర్పాటు చేస్తుందా లేదా..? అనేది..?!